ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 7

1789 జులైలో బాస్టిల్‌ కోటపై దాడి జరిగినపుడు దానిలో ఏడుగురు ఖైదీలు మాత్రమే వున్నారు. అయినా రాజరికపు ఆధిపత్యానికి గుర్తుగా నిలిచిన ఆ కోట పతనం గురించి దేశమంతా తెలియగానే పొలాల్లో పనిచేసే బానిసలు…

1789 జులైలో బాస్టిల్‌ కోటపై దాడి జరిగినపుడు దానిలో ఏడుగురు ఖైదీలు మాత్రమే వున్నారు. అయినా రాజరికపు ఆధిపత్యానికి గుర్తుగా నిలిచిన ఆ కోట పతనం గురించి దేశమంతా తెలియగానే పొలాల్లో పనిచేసే బానిసలు తిరగబడి జమీందార్లు, మతాధికారుల భవనాలను నేలమట్టం చేశారు, వారి భూములను ఆక్రమించేశారు. ప్రతి పట్టణంలో 'నేషనల్‌ గార్డ్‌' దళాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వానికి భయపడి ప్రజాందోళనల వార్తలు ప్రచురించకుండా తొక్కిపెట్టిన పత్రికలు యిప్పుడు స్వేచ్ఛగా రాయనారంభించాయి. ఇది ప్రజలను మరింత ఉత్తేజితులను చేసింది. ఇది గమనించి చక్రవర్తి భీతిల్లాడు. నేషనల్‌ గార్డును గుర్తించాడు. మరో పక్క తన బంధువులు, అనుచరులు విప్లవాన్ని అణచివేయడానికి చేసే ప్రయత్నాలను ప్రోత్సహించాడు. ఇది గమనించిన పారిస్‌ నగరంలోని స్త్రీలు కొందరు వర్సాయి వెళ్లి భవనంపై దాడి చేసి చక్రవర్తిని, అతని భార్యను, యువరాజును పారిస్‌ తీసుకుని వచ్చారు. విప్లవవాదులపై పైచేయి కావడంతో యిక విప్లవకారుల్లో విభేదాలు పొడసూపాయి. వారిలో రాజ్యాంగ బద్ధ రాచరికం, పార్లమెంటరీ వ్యవస్థ వుండాలనే మితవాదులు, రాజును చంపి పారేసి, పార్లమెంటరీ వ్యవస్థ మాత్రమే వుండాలనేే అతివాదులు, వీరిద్దిరితో ఏకీభవించని తటస్థులు వుండేవారు. మిరాబూ అనే బలమైన నాయకుడు వున్నంతకాలం మితవాదుల మాట చెల్లింది. అతను 1791 ఏప్రిల్‌లో చనిపోవడంతో అతివాదులు మెజారిటీలోకి వచ్చారు. వారిలో జిరోండియన్లు అనే వర్గం నాయకత్వం తీసుకుంది. 1793లో వీరి ఆధిపత్యాన్ని అంతం చేసి, జాకొబిన్లు అధికారంలోకి వచ్చారు. వీరు తీవ్రభావాలున్న అతివాదులు. 

మిరాబూ బతికి వుండగా జాతీయసభ ఆధ్వర్యాన కొత్త రాజ్యాంగం తయారుచేసి, 1791 అక్టోబరు నుండి అమలు చేశారు. రాజును నామమాత్రం చేసి, శాసనాధికారం శాసనసభకు అప్పగించారు. వ్యవసాయదారుడికి భూమి మీద హక్కు యిచ్చి, మతాలయాల భూములు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూసి పక్కనున్న రాజ్యాలలోని రాజులు, చక్రవర్తులు ఉలిక్కిపడ్డారు. ఫ్రెంచి విప్లవాన్ని అణచి వేయకపోతే తమ దేశంలో కూడా అలాటి తిరుగుబాట్లు తలెత్తుతాయని భయపడ్డారు. ఆస్తులు పోగొట్టుకున్న భూస్వాములు, మతాధికారులు ఆ దేశాలకు పారిపోయి ఫ్రాన్సుపై దండెత్తమని ఆ దేశాధినేతలను బతిమాలుకున్నారు. ఫ్రాన్సులో అధికారంలో వున్న జిరోండియన్లు యుద్ధానికై సై అన్నారు. 1792 ఏప్రిల్‌ నుండి యుద్ధం ప్రారంభమైంది. తొలిదశలో ఫ్రెంచి సైన్యాలు ఓటమి చవిచూశాయి. దీనికి కారణం చక్రవర్తి, అతని బంధువులు, ఆ యా దేశాల్లో దాక్కున్న జమీందార్లు అందిస్తున్న రహస్య సమాచారమే కారణం అని విప్లవకారులు అనుమానించారు. ఈ దశలో డార్నే పారిస్‌లో అడుగుపెట్టాడు. 

1792 జులైలో రాజకుటుంబానికి ఎటువంటి హాని జరిగినా తను పారిస్‌ నగరాన్ని తగలబెట్టగలనని ఫ్రాన్సుపై దండెత్తిన ఆస్ట్రియా, ప్రష్యా, ఇంగ్లండు ఉమ్మడి సైన్యాలకు నాయకత్వం వహిస్తున్న డ్యూక్‌ ఆఫ్‌ బ్రన్స్‌విక్‌ చేసిన ప్రకటన ప్రజలను రెచ్చగొట్టింది. ఆగస్టులో వాళ్లు జాకోబిన్‌ల నాయకత్వంలో రాజభవనంపై దాడి చేశారు. రాజకుటుంబం వారు శాసనసభ ప్రాంగణంలో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. శాసనసభ వాళ్లకు ఆశ్రయం యిచ్చింది కానీ రాజు పదవిని, రాజ్యాంగాన్ని రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు జరిగేవరకు డాంటన్‌ అనే అతన్ని తాత్కాలిక పరిపాలకుడిగా నియమించింది. ఈ డాంటన్‌ పాలనలో నడుస్తున్న ప్రభుత్వం ఒక పక్క విదేశీ సైన్యంతో పోరాడుతూనే మరో పక్క అంతశ్శత్రువులైన రాజరికపు సమర్థకులను నిర్మూలించసాగింది. 

ఇలా నిర్మూలించడానికి వాళ్లు వాడిన ఆయుధం గిల్లెటిన్‌. ఎవరినైనా శిరచ్ఛేదం చేయాలంటే వారిని దీని కింద పడుక్కోబెట్టేవారు. తాడు లాగగానే పదునైన, బరువైన పొడుగాటి కత్తి పై నుంచి సరసరా  కిందకు పడి తలను, మొండాన్ని ఒక్క క్షణంలో వేరు చేసేది. ఈ రకంగా వేలాది మందిని వాళ్లు చంపిపారేశారు. గిల్లెటిన్‌ వంటి ఆయుధం యూరోప్‌లో అంతకు 500 ఏళ్లగా వుండేది కానీ ఫ్రెంచి విప్లవ సమయంలోనే దానికి ఆ పేరు స్థిరపడింది. జోసెఫ్‌ గిల్లెటిన్‌ అనే ఒక డాక్టరు విప్లవసమయంలో విద్రోహులకు మరణశిక్ష అమలు చేయడానికి బండి చక్రానికి కట్టి చంపే కౄరమైన పద్ధతి కంటే తృటిలో ప్రాణం పోయే గిల్లెటిన్‌ మంచిదని వాదించాడు. అందుకని దానికి ఆ పేరు వచ్చింది. గడ్డం గీసుకునే బ్లేళ్లను ఆ బ్రాండ్‌తో అమ్ముతున్నారు. మంచి పదునైనది అన్న అర్థం సూచిస్తుందని వారి భావం. ప్రస్తుతం పారిస్‌లో గిల్లెటిన్‌ లేదు కానీ ఒకప్పుడు అది వుండే స్థలం ఫోటో యిప్పటికే యిచ్చాను. 1792 సెప్టెంబరు నాటికి శాసనసభను అతివాదులైన జాకోబిన్లు హస్తగతం చేసుకున్నారు. వాళ్లు ఫ్రాన్సును రిపబ్లిక్‌గా ప్రకటించడంతో బాటు, విచారణ ఒకటి జరిపి రాజును, ఆయన కుటుంబసభ్యులను, అనుచరులను దేశద్రోహులుగా ముద్ర వేసిి 1793 జనవరిలో చక్రవర్తి 16 వ లూయీని, అతని భార్య మేరీ ఆంటొనెట్‌ను చంపివేశారు. శత్రువులతో కుమ్మక్కయ్యారన్న అనుమానం వస్తే చాలు గిల్లెటిన్‌ ఎక్కించేశారు. రాజుతో కానీ, జమీందారుతో కానీ బంధుత్వం వుంటే చాలు, వాళ్లు వ్యక్తిగతంగా ఎటువంటి వాళ్లు అనేది పరిగణించకుండా స్త్రీ, పురుష, బాల, వృద్ధ వ్యత్యాసం లేకుండా తలలు నరికేశారు. అలా నరకడానికి ముందు నామమాత్రపు విచారణ ఒకటి జరిపించేవారు. 

ఈ మారణకాండను విప్లవకారుల్లో ఒక వర్గమైన జిరోండియన్లు హర్షించలేదు. దాంతో జాకోబిన్లు విప్లవద్రోహులంటూ వారినీ చంపసాగారు. దీనితో ఒళ్లు మండిన ఒక విప్లవకారుడు జాకోబిన్‌ నాయకుణ్ని హత్య చేశాడు. ప్రతీకారంగా జాకోబిన్లు 1793 సెప్టెంబరు నుండి 1794 జులై వరకు వేలాదిమంది నిరపరాధులను ఉరితీసి భయంకరమైన పాలన సాగించారు. దీన్ని డాంటన్‌ వంటి యితర విప్లవకారులు అడ్డుకున్నారు. ఫలితంగా విప్లవనాయకులు ఒకరిని మరొకరు ఉరి తీయించుకున్నారు. చివరకు తటస్థులు కొందరు ''డైరక్టరీ'' పేర పాలనలోకి వచ్చి కొంతమేరకు సంస్కరణలు చేయగలిగారు. మిగిలిన తీవ్రవాదులు వారికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించేవారు. మరో పక్క రాచరిక వాదులు కూడా ప్రదర్శనలు చేస్తూండేవారు. చివరకు ప్రభుత్వాదేశాలపై నెపోలియన్‌ అనే బ్రిగేడియర్‌ అల్లరి మూకలను అదుపులోకి తెచ్చి ప్రజల ఆదరాభిమానాలు పొందాడు. అయితే డైరక్టరీలోని వ్యక్తులు తమలో తాము కలహించుకుని బలహీనపడడంతో 1799లో అన్ని అధికారాలను తన చేతిలోకి తీసుకుని డైరక్టరీని రద్దు చేశాడు. ఇంకో ఐదేళ్లకు రిపబ్లిక్‌ను రద్దు చేసి తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఆ విధంగా 1789 నాటి విప్లవం పదేళ్లలోనే విఫలమైంది. ఫ్రాన్సు మళ్లీ రాజరికంలోకి మళ్లింది. 

నెపోలియన్‌కు అంతటి ప్రజాదరణ కలగడానికి కారణం – రిపబ్లిక్‌ ప్రభుత్వం నడుస్తూండగా ఫ్రెంచి సైన్యాలు విదేశీ శక్తులపై సాధించిన విజయాలు! మొదట్లో తబ్బిబ్బు పడినా పోనుపోను ఫ్రెంచి సైన్యాలు యితర దేశాలు కలిసికట్టుగా తమపై చేసిన దండయాత్రలను తిప్పికొట్టగలిగాయి. సైన్యాధికారిగా పేరు తెచ్చుకుని ఆ తర్వాత ఫ్రాన్సు పాలకుడైన నెపోలియన్‌ గురించి చెప్పుకోవలసినది చాలా వుంది. అతన్ని గుర్తు చేసే చిహ్నాలు పారిస్‌లో చాలా వున్నాయి. అతనితో బాటు ప్రస్తావించి వదిలేస్తున్న పేరు – లాజరే హోష్‌. సామాన్య సైనికుడిగా చేరి రివల్యూషనరీ ఆర్మీకి జనరల్‌ అయ్యాడు. అతని కథలో చాలా మలుపులు వుంటాయి. (నేను చెప్పటం లేదు, మీరే చదివి తెలుసుకోవచ్చు) అతన్ని ఫ్రాన్సు ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. వర్సాయి పాలెస్‌లో అతని విగ్రహం వుంది. పారిస్‌ కల్లా ముఖ్యమైన కూడలి ఆర్క్‌ ద ట్రయంఫ్‌ (విజయతోరణం) వద్ద 12 రోడ్లు వచ్చి కలుస్తాయి. వాటిలో ఒక రోడ్డుకు ఫాష్‌ పేరు పెట్టగా (2 వ భాగంలో ప్రస్తావించాను) మరో దానికి హోష్‌ పేరు పెట్టారు.  

ఇప్పటిదాకా పారిస్‌కు సంబంధించిన కొన్ని స్థలాల పేర్లు, కొంత చరిత్ర చెప్పుకున్నాం. చక్రవర్తులు నివసించిన వర్సాయి పాలస్‌ యిప్పటికీ వుంది. నెపోలియన్‌ కథ చెప్పుకునేటప్పుడు పారిస్‌లోని అనేక స్థలాల గురించి ముచ్చటించుకోవచ్చు. ఇప్పుడు మన దృష్టి ఇంగ్లండువైపు తిప్పుదాం. అక్కడి కథలు కొన్ని చెప్పుకుందాం. ఒక పాఠకుడికి అనుమానం వచ్చింది – చరిత్ర తెలియకపోతే యూరోప్‌ రానివ్వరా అని. అలాటి భయాలేమీ వద్దు. వీసా యిచ్చేటప్పుడు వీటిపై ప్రశ్నలేమీ అడగరు. ఆయన ప్రొఫైల్‌ ఫోటోగా పెట్టుకున్న అమరావతికి వెళదామనుకునేవారందరికీ బుద్ధుడి గురించి వినాల్సిన విధాయకం ఏమీ లేదు. విమానంలో బోల్డంత కార్గో ఏ చరిత్రా తెలుసుకోకుండానే దేశదేశాలకు వెళుతుంది, మనకూ దానికీ తేడా వుండాలనుకుంటే కాస్త తెలుసుకుని వెళితే బాగుంటుంది. అఖ్కర్లేదు అనుకుంటే యీ సీరీస్‌వైపు తొంగి చూసే శ్రమ కూడా పడనక్కరలేదు. ముందే చెప్పాను – ఇది 'నా యూరోపు యాత్రాగాథ' కాదు, యూరోప్‌ చరిత్రలో కొన్ని పుటలు మాత్రమే.. అని. (సశేషం)

 ఫోటో – 1) ఇఫ్‌ కోట ప్రస్తుత ఛాయాచిత్రం 2) బాస్టిల్‌ కోటపై దాడి జరిగిన సంవత్సరంలోనే ఫ్రెంచ్‌ చిత్రకారుడు గీసిన పెయింటింగ్‌, బ్రిటిషు లైబ్రరీలో భద్రపరిచారు. విప్లవకాలంలో గిల్లెటిన్‌ పెట్టిన చోటు, వర్సాయ్‌ రాజభవనం

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)

[email protected]

Click Here For Archives

ఇప్పుడు ఫ్రెంచ్‌ విప్లవం నేపథ్యంలో రాసిన ''టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌'' నవల పరిచయం కోసం కింద క్లిక్‌ చేయండి.

Click Here For Tale Of Two Cities