ఇది ఒక పాత హిందీ సినిమా పాట. కెసియార్ తన తొలి విదేశీయానానికి సింగపూరును ఎంచుకోవడానికి ప్రేరణ యిచ్చిందేమో తెలియదు. తొలి పర్యటనతోనే ముగ్ధులై పోయారు. ఇన్నాళ్లూ చంద్రబాబు సింగపూర్ పాట పాడారు. ఇప్పుడు కెసియార్ గొంతు కలిపారు. సింగపూర్ తొలి ప్రధాని రాసిన పుస్తకాన్ని ఎప్పుడో చదివినా యిప్పుడు తెలుగులో అనువదించడానికి పూనుకున్నారు. కోదండరామ్ గారిని కలవడానికే తీరిక లేదంటున్నారట, అయినా దీనికై తీరిక చేసుకుంటున్నారంటే ఆయన సాహిత్యపిపాస మెచ్చదగినది. అంతిమంగా పుస్తకాన్ని తెలుగులోకి దించినా దించకపోయినా దానిలోని సారాంశాన్ని ఆయన గ్రహిస్తే చాలు. సింగపూర్ నిర్మాణంలో విదేశీయుల పాత్ర ఎంతో వుందని ఆ పుస్తకరచయిత ప్రముఖంగా రాశారట. కెసియార్ సొంతపౌరులకే పరాయి ముద్ర కొడుతున్నారు. వారి దగ్గరనుండి రావలసినవన్ని రాబడుతూ, సౌకర్యాల కల్పనకు వచ్చేసరికి మా వాళ్లు కాదంటున్నారు. సింగపూర్ పర్యటన తర్వాత ఆ విశేషాలు చెప్పడానికి కెసియార్ ఎంచుకున్న వేదిక అపోలో హాస్పటల్ ఫంక్షన్. అపోలో ప్రతాపరెడ్డిగారి మూలాలు ఎక్కడివో అందరికీ తెలుసు. మీరంతా పెట్టుబడులు మరిన్ని తెచ్చి మెడికల్ టూరిజం పెంచండి అంటూ ఆయనకు చెప్పిన కెసియార్ ఆయన సంతతివారిని మాత్రం స్థానికులుగా గుర్తించరట. ఇలాటి వైరుధ్యాలు ఎలా పొసుగుతాయో నాకు అర్థం కాదు.
సింగపూరు గురించి కెసియార్ ప్రశంసలు కురిపిస్తున్న సమయంలోనే ఒక పత్రికలో చుక్కా రామయ్యగారు అక్కడి విద్యావిధానం ఎంత బాగుంటుందో వ్యాసం రాశారు. చదువు స్టాండర్డ్‌స్ బాగా పాటించడం వలననే మేం అభివృద్ధి చెందాం అన్నారట అక్కడ విద్యాశాఖాధికారులు. మరి యిక్కడ..? టెన్త్ క్లాసులో ఇంటర్నల్ మార్క్‌స్ 20% అంటూ మార్పులు చేస్తున్నారు. పబ్లిక్ ఎగ్జామ్‌లో సరిగ్గా రాసినా రాకపోయినా, యీ మార్కులు వాళ్లని ఆదుకుంటాయి. విద్యార్థులు, వారి తలిదండ్రులు ఆ 20 మార్కులలో మాగ్జిమమ్ వేయాలని టీచర్లపై ఒత్తిడి తేవడం ఖాయం. ఇప్పటికే లాబ్ సౌకర్యాలు లేని కాలేజీ విద్యార్థులకు టెస్ట్ ట్యూబ్ మొహం చూడకుండానే ప్రాక్టికల్స్‌లో మార్కులు గుమ్మరిస్తున్నారు. ఈ సంగతి తెలిసే జాతీయస్థాయిలో మనవాళ్ల మార్కులకు డిస్కౌంట్ చాలా యిస్తున్నారు. మన దగ్గర విద్యాప్రమాణాలు సరిగ్గా లేవని జాతీయస్థాయిలోనే తెలిసిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే ప్రమాణాలు పెంచాలి. కానీ చేస్తున్నదేమిటి? దిగజారుస్తున్నారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పని – సౌకర్యాలు లేని, ప్రమాణాలు పాటించని కాలేజీల గుర్తింపు రద్దు చేయడానికి చూడడం. ఇలాటి కాలేజీలు కేవలం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కై నడుపుతూ, విద్యార్థులను సరిగ్గా తీర్చిదిద్దటం లేదు. అందుకే మన రాష్ట్రంలో యువతీయువకులందరూ యింజనీర్లే. వారిలో 80% మంది ఉద్యోగార్హత లేదు. గుమాస్తా వుద్యోగానికి ఎడ్వర్టయిజ్ చేసినా యింజనీర్లు అప్లయి చేస్తున్నారు. ఈ తనిఖీ దెబ్బతో కాలేజీలు మూతపడి, యింజనీరింగు కాక తక్కిన చదువులు చదువుతారని ఆశపడ్డాను. తీరా చూస్తే కోర్టు వాళ్లకు గడువు యిచ్చింది. గతంలో కూడా యిలాగే జరిగింది. కాలేజీ వాళ్లు ప్రమాణాలు పెంచుతామని హామీ యివ్వడం, ప్రభుత్వం నుండి బకాయిలు రాలేదు కాబట్టి పెంచలేకపోయామని తర్వాత చెప్పడం…! ఇంకో ఆర్నెల్లకు మళ్లీ తనిఖీ చేసి మెరుగపడని కాలేజీలను మూయించేసినపుడే ప్రభుత్వ చిత్తశుద్ధిని నమ్మగలం. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యే కాదు, ఉన్నత విద్య యిచ్చినపుడే తెలంగాణ విద్యార్థులు బాగుపడతారు. ప్రాంతీయ ప్రాతిపదికపై రిజర్వేషన్‌లు అడగనక్కరలేని స్థాయి సంతరించుకుంటారు. విద్యాప్రమాణాలు పెంచకుండా సింగపూరు స్థాయికి చేరలేమని గుర్తించాలి మన నాయకులు. ఆంధ్రలో అయితే యిలాటి కసరత్తే చేయలేదు. ఎందుకంటారు? అక్కడి కాలేజీలు ఉన్నత ప్రమాణాలతో విరాజిల్లుతున్నాయని అనుకోవడానికి లేదు. స్థాయిలేని కాలేజీలకు నిర్దాక్షిణ్యంగా స్వస్తి చెప్పిననాడే ఎక్కడి విద్యార్థులైనా బాగుపడేది. పనికి మాలిన కాలేజీలను ఫీజు రీఎంబర్స్‌మెంటు పేర పోషించడానికి ప్రజాధనం వ్యర్థం కాకుండా వుంటేనే అభివృద్ధి జరుగుతుంది.
సింగపూరు వెళ్లి కెసియార్ యిచ్చిన ఉపన్యాసాలకు, విశదీకరించిన భవిష్యత్ ప్రణాళికలకు అక్కడి వారు గుమ్మైపోయి 'ఇలా అయితే పరిశ్రమల్లో 50% మీ తెలంగాణాకే రావడం ఖాయం' అన్నారట. వాటి రాక, వచ్చాక వాటి భవిష్యత్ ఎలా వుంటుందో తెలియదు కానీ, వర్తమానం మాత్రం అంధకారబంధురంగా వుంది. హైదరాబాదు సిటీలోనే నాలుగైదు గంటలు కరంటు కోతలు అనుభవిస్తున్నాం. పల్లెల్లో దీనికి డబల్ వుండుంటుంది. పరిశ్రమలకు విద్యుత్ అందక మూతపడే ప్రమాదం వుందట. రైతులకు పై నుంచి వర్షాలూ లేవు, కింద భూమిలోంచి తోడదామంటే నీళ్లూ లేవు, కరంటూ లేదు. మూడేళ్లపాటు ఓపిక పట్టాలని ఎన్నికల ముందే చెప్పాను, ఏదీ దాచలేదు అంటున్నారు కెసియార్. పరిశ్రమలు పెడదామని వచ్చేవారికి కూడా దాపరికం లేకుండా విద్యుత్ పరిస్థితి యిది, యిష్టముంటే రండి, లేకపోతే లేదు అని చెప్తున్నారా? దేనికైనా కావలసినది కరంటు. అది లేకుండా బండి ఎలా సాగుతుంది? సింగరేణిలో కేంద్రం వాటా కొనేస్తాం, ఛత్తీస్‌గఢ్ నుండి ఎంత ధరైనా పెట్టి కొనేస్తాం, సుల్తాన్ బజార్, అసెంబ్లీల వద్ద మెట్రో ఎలైన్‌మెంట్ మార్పుకయ్యే ఖర్చు మేం భరిస్తాం అంటున్నారు. వీటన్నిటికీ డబ్బులెక్కడివి? ఋణమాఫీకే అల్లాడుతున్నారు. రిజర్వ్ బ్యాంకుగాని, బ్యాంకులు గాని ఏవీ వీళ్లు చెప్పినవాటికి తలూపటం లేదు. కడుపు మండిన రైతులు రోడ్డెక్కుతున్నారు. ఉన్న డబ్బును జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా మేనేజ్ చేయవచ్చేమో. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, దళితులకు మూడెకరాల భూములు.. యిలా అలవికాని హామీలు, ఖర్చులు నెత్తి కెత్తుకున్నారు. నిధులు ఎక్కణ్నుంచి వస్తాయని అడిగితే అక్రమ నిర్మాణాలను గుర్తించి జరిమానాలు విధిస్తే అదే వస్తాయన్నారట. హైదరాబాదులో ఒకటి రెండు చోట్ల కూల్చేసరికి కలకలం చెలరేగింది. తర్వాత ఏమైందో తెలియదు, కోర్టుల కారణమో, మరోటో.. అది ఆగిపోయింది. ఇక దానిపై ఆదాయం ఏం వస్తుంది? అంటోంది ప్రభుత్వం.
చేస్తున్న పొదుపంటూ ఎక్కడైనా వుందంటే విద్యార్థుల ఫీజు విషయంలోనే కనబడుతోంది. బోగస్ రేషన్ కార్డులు ఏరివేయడం, ఆరోగ్యశ్రీలో, ఇందిరమ్మ యిళ్లలో అవినీతి బయటపెట్టే లాటివన్నీ చేసి, వృథా ఖర్చు తగ్గిస్తే అంతకంటె యింకేం కావాలి! ఇవి ఖర్చు తగ్గించే పనులు, వీటితో బాటు ఆదాయం పెంచే పనులు కూడా చేయాలి. అంటే పరిశ్రమలు నడిచేట్లా చూడాలి. వ్యవసాయం అభివృద్ధి చెందేలా చేయాలి, చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు బాగుపడేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి రెండిటికి విద్యుత్ ఎంతో అవసరం. పొరుగున వున్న ఆంధ్రతో పేచీ పెట్టుకున్నాక విద్యుత్ విషయంలో యిబ్బందులు పెరిగాయి. అది గుర్తించి కాబోలు, కెసియార్ చంద్రబాబుతో చర్చలు ప్రారంభించారు. విద్యుత్ విషయంలో ఆయన అనుకున్నవి సాధించాక కూడా సఖ్యత కొనసాగిస్తారని ఆశిద్దాం. ఇక చిన్న వ్యాపారాల వాళ్ల గురించి – విభజన ప్రభావం హైదరాబాదుపై తీవ్రంగా పడింది. కస్టమర్లు తగ్గారని అనేక చోట్ల వినబడుతోంది. స్కూళ్లు, కాలేజీలు నిండటం లేదట, ఇళ్లకు టులెట్ బోర్డులు వేళ్లాడుతున్నాయట, హాస్టళ్లు, మెస్‌లు బోసి పోతున్నాయట, టాక్సీ ఆపరేటర్లు తగ్గారట. మరి మొన్న సమగ్ర సర్వే ప్రకారం చూస్తే హైదరాబాదు జనాభా 1.25 కోట్లు అయిందంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు. ఎక్కడో తిరకాసు వుంది. కొనుగోలు శక్తి వుండి, డైనమిక్‌గా వుండే జనాభా వెళ్లిపోయి, ఎకనమిక్ యాక్టివిటీ తగ్గిపోతే అది ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ఎవరి కోడీ కుంపటీ లేకపోయినా తెల్లవారుతుంది. వెళ్లిపోయే ఆంధ్రుల స్థానంలో మరొకరు వచ్చి వుంటారు కాబట్టే జనాభా పెరిగింది అనుకోవచ్చు. అయితే యీ పెరిగిన జనాభా ఆర్థికాభివృద్ధికి దోహదపడేదా, లేక దానిపై ఆధారపడి బతికే బిహారీలు, ఒడియాలు, బంగ్లాదేశీయులు, చైనీయులు వంటి కార్మిక జనాభాయా అన్నది తరచి చూడాలి. అది చేస్తాం, యిది చేస్తాం, సింగపూరును తలదన్నుతాం అని చెప్పడం సులభమే, కానీ దానికి తగిన వాతావరణం కల్పించాలి. అది ముఖ్యం.
ఇక ఒరిజినల్ సింగపూరు అభిమాని గురించి కూడా రెండు ముక్కలు చెప్పుకుందాం. ఆయనా ఋణమాఫీ విషయం తేల్చలేకపోతున్నాడు. రైతులను ఎలా వూరుకోబెట్టాలో తెలియదు. ఇంతలో రాజధాని గురించి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వచ్చింది. వివరాలు తెలియలేదు కానీ ఆయన టిడిపివారు ప్రతిపాదిస్తున్న విజిఎంటికి విముఖుడని మాత్రం తెలియవచ్చింది. కృష్ణా జిల్లా ప్రజానాయకులు కొందరు 'దొనకొండలో ఆస్తులు కొన్న ఐయేయస్‌లు కొందరు కమిటీని తప్పుదోవ పట్టించారు' అనేదాకా వెళ్లారు. ఆయన ఏం చెప్పినా వేస్టు, చంద్రబాబు గారు చెప్పినదే ఫైనల్ అని మంత్రులు చెప్పేస్తున్నారు. కమిటీ మొగ్గు చూపిన ప్రాంతం టిడిపి నాయకత్వానికి నచ్చదు. అక్కడ నీళ్లు లేవు, దొంగల భయం వుంది, చీకటి పడితే అటు వెళ్లడానికి పిల్లలు భయపడతారు.. యిలా చెప్తున్నారు. సింగపూరులో భూమి చాలకపోతే పరశురాముళ్లా సముద్రాన్ని వెనక్కి నెట్టేసి భూమిని బయటకు లాగారట. సింగపూరు తరహాలో రాజధాని కడతామనేవాళ్లు మార్టేరు-దొనకొండ ప్రాంతానికి నీళ్లు తెప్పించలేరా?
జనం వున్నచోట రాజధాని వుండాలి కానీ, లేనిచోట కట్టమంటే ఎలా? అంటున్నారు. జనం వుంటే యిరుకు సందులుంటాయి. రాజధాని ఎక్కడ కడితే అక్కడికే జనం వెళతారు. హైదరాబాదులో ఒకప్పుడు ఎంత జనం వున్నారని? బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ కొండలు బండలే కదా! నాలుగు పరిశ్రమలు పెడితే జనం అక్కడికే వెళతారు. అయినా అవసరం వున్నవాళ్లే వెళతారు. అంతా ఒకేచోట పోగుపడడం దేనికి? రాజధానికై కావలసిన స్థలం కొనడానికే ప్రభుత్వం నిధులు వెచ్చించివేస్తే యిక తక్కినవాటికి డబ్బులేం చాలతాయి? కేంద్రం నిధులిస్తుంది అని చెప్పి వూదరగొడుతున్నారు. కరువు సహాయనిధులు, వరద సహాయనిధులు.. యిలాటి వాటిల్లో కేంద్రం ఎంత లక్షణంగా వ్యవహరిస్తోందో చూస్తూనే వున్నాం. వాళ్లు యిస్తారు కదాని జనసమ్మర్దం వున్న ప్రాంతాల్లో రాజధానికై భూసేకరణకై నిధులు వెచ్చిస్తే మబ్బులు చూసి కుండలో నీళ్లు ఒంపుకున్నట్టే! ఉన్న వనరులను సవ్యంగా వాడుకునే సింగపూరు యీ స్థాయికి చేరుకుందని గ్రహించి తెలుగు నేలపై వున్న మానవ వనరులను, సహజవనరులను సరిగ్గా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రులిద్దరూ గ్రహిస్తే చాలు. ఎమ్మేల్యేలను, కార్పోరేటర్లను సింగపూరు వెళ్లి చూసి రమ్మనక్కరలేదు. ఏదో హిందీ పాటలో చెప్పారు కదాని వీళ్లంతా వెళ్లనూ అక్కరలేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)