Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: తెలంగాణ బిజెపి కైవసం అయ్యేనా?

ఎమ్బీయస్‍: తెలంగాణ బిజెపి కైవసం అయ్యేనా?

హైదరాబాదులో బిజెపి సభలు భూనభోంతరాళాలు దద్దరిల్లేట్లు జరిగాయి. తమ జాతీయ విధానాలను, దేశభవిష్యత్తును నిర్ణయించడానికి తీసుకోవలసిన చర్యలు చర్చించుకోవడానికి హైదరాబాదును వేదికగా ఉపయోగించుకున్నట్లు తోచలేదు. సర్వసైన్యంతో ఏకంగా తెలంగాణపై దాడికి వచ్చినట్లు వచ్చారు. 119 నియోజకవర్గాలు జాతీయ నాయకులను కేటాయించి, వాళ్లను అక్కడకు పంపి, ఎన్నికలకు సన్నాహాలు చేయమని పురమాయించారు. స్థానిక బిజెపి నాయకులే కాకుండా జాతీయ నాయకులు కూడా కెసియార్ పని అయిపోయిందంటూ రంకెలు వేశారు. ఎన్నికల రణం అప్పుడే ప్రారంభమై పోయిందన్నంత హంగామా చేశారు. ఇదంతా చూసి తెలంగాణలో రాబోయే రాష్ట్రప్రభుత్వం బిజెపిదే అని అనేసుకోవచ్చా? ఇక్కడే ఒక పోలిక తడుతుంది. బెంగాల్‌లో యింతకు మించిన హడావుడి చేశారు. మమత ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు. ఫలితాలు వచ్చాక చూస్తే ఆమె విజయదుర్గలా వెలిసిపోయింది. అందువలన కేవలం హంగు, ఆర్భాటం చూసి ఎటూ నిర్ణయించలేమని తెలుసుకోవాలి.

అదే సమయంలో దుర్గమం, అసాధ్యం అని అనుకున్న అనేక రాష్ట్రాలలో బిజెపి ముందస్తు ప్రణాళికతో, పార్టీ యంత్రాంగంతో, కార్యకర్తల బలంతో, ఆరెస్సెస్ అండదండలతో ప్రతిపక్షాల కంచుకోటలను బద్దలు కొట్టి లక్ష్యాన్ని సాధించిందని గుర్తు చేసుకోవాలి. దానికి నిధుల కొరత లేదు. ధారాపాతంగా వస్తూనే ఉంటాయి. మీడియా దాని చేతిలో ఉంది. మంచి వాగ్ధాటి ఉన్న నాయకులున్నారు. ఎదుటి పార్టీలో నెగ్గగల కాండిడేట్ ఉన్నాడంటే, నైతిక నియమాల పట్టింపు లేకుండా అదిలించో బెదిరించో ఎగరేసుకుని పోగల సత్తా ఉంది. ఎన్నికల అనంతరం కూడా ఫిరాయింపుదార్లతో ప్రభుత్వాన్ని కూర్చగలదు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కూల్చడానికి సకలయత్నాలు చేస్తూ ఎప్పటికో అప్పటికి సాధించగల ఓర్పూ ఉంది. తన అంగబలంతో, అర్థబలంతో యుద్ధానికి ముందే ప్రతికక్షి నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీయగల చాతుర్యమూ ఉంది.

ఇంతకీ అది తెలంగాణను తన ఖాతాలో వేసుకోగలదా? లేదా? వ్యాసం పూర్తిగా చదివే ఓపిక లేనివారి కోసం యీ ప్రశ్నకు సమాధానం ఒక్క ముక్కలో చెప్పేస్తాను, ‘అది కెసియార్ చేతిలో ఉంది’ అని! ఎందుకంటే బిజెపి గెలుపనేది దాని పాజిటివ్ ఓటు కంటె కెసియార్‌పై నెగటివ్ ఓటు పైనే ఆధారపడి ఉందని నా నమ్మకం. అది ఎందుకో దీనిలో వివరిస్తాను.

ప్రస్తుతం తెలంగాణలో కెసియార్ పాలన ఎలా నడుస్తోంది? ఆయన చిత్తమొచ్చినట్లు సాగుతోంది. ప్రజల చిత్తం అడిగేవాడు లేడు. ఉద్యమసమయంలో చేసిన పెద్దపెద్ద వాగ్దానాలు గాలికి పోయాయి. సమైక్యపాలకులు తెలంగాణ ప్రజల గొంతు నొక్కేశారని చెప్తూ వచ్చిన కెసియార్, తను పాలకుడయ్యాక వాళ్ల గొంతు పిసికేశారు. తెలంగాణ అంటూ ఏర్పడితే అది మామూలు రాష్ట్రంగా ఉండదని, అభ్యుదయ భావాలతో, ప్రగతిశీలక విధానాలతో నవసమాజం ఏర్పరస్తుందని మేధావులు, పాత్రికేయులు ఊరించి, ఊదరగొట్టి, ఉద్యమానికి మద్దతిచ్చారు. తీరా చూస్తే కెసియార్ నవాబులను తలదన్నే దర్జా ఒలకబోస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎవ్వరూ నోరెత్తడానికి లేదు.

ఆయన సెక్రటేరియట్‌కు రాడు. ఉన్నదాన్ని పడగొట్టించేశాడు. కారణమేమిటో ఎవరికీ చెప్పే పని లేదు. దేని మీద ఎందుకు ఖర్చు పెడుతున్నాడో, అవసరమైనవాటికి ఎందుకు ఎగ్గొడుతున్నాడో ఎవడికీ చెప్పనవసరం లేదని ఆయన భావన. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల భరతం పట్టడం జరుగుతోంది. ప్రజాస్వామ్య హక్కులనేవి గాలికి ఎగిరిపోయాయి. ఉద్యమకారులందరూ నోరు మూసుకుని సణుక్కుంటున్నారు. తెలుగు రాజకీయ నాయకులందరికీ, మీడియా ప్రతినిథులందరికీ హైదరాబాదులో ఆస్తులుండడం చేత వాళ్లు వ్యతిరేకంగా మాట్లాడడానికి హడిలిపోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికీ వ్యక్తిత్వం ఉండడానికి వీల్లేదు. ఈయన వాళ్లని సంప్రదించడు. అధికారం మొత్తం ఆయన గుప్పిట్లోనే పెట్టుకున్నాడు. ఒక్కోసారి ఆదరిస్తాడు, ఒక్కోసారి తీసి అవతలకు పారేస్తాడు. నెలల తరబడి ఎపాయింట్‌మెంటే యివ్వడు. ఆయనతో మాట్లాడాలంటేనే పార్టీ సహచరులకు భయంగా మారింది.

ఇక పాలనకు వస్తే, హైదరాబాదు వంటి సకల హంగులున్న నగరం తెలంగాణకు దక్కడం వరంగా మారింది. దానివలన పెట్టుబడులు వస్తున్నాయి. ఇరిగేషన్ వంటి వాటిల్లో కెసియార్ ప్రణాళికలు ఫలించాయి. అనేక రంగాల్లో కొంత మంచి, కొంత చెడు జరుగుతోంది. పథకాల ద్వారా క్రింది స్థాయి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతోంది కానీ ప్రజా వ్యతిరేకతకు లోటు లేదు. ఆ వ్యతిరేకత ఆలంబనగా ప్రతిపక్షాలు ఎదుగుతాయనే భయం చేత, ప్రతిపక్ష పార్టీలను కబళించడం మొదలుపెట్టాడు. ముందుగా టిడిపి స్వాహా అయిపోయింది. ఆ తర్వాత కాంగ్రెసు!

తెరాసకు బుద్ధి చెప్పాలని కాంగ్రెసు, టిడిపిలను గెలిపించినా ప్రయోజనం లేదని, వాళ్లు పార్టీ ఫిరాయించేస్తారని ఓటర్లకు అర్థమై పోయింది. బిజెపితో అయితే ఆ ప్రమాదం లేదని, తెరాస ప్రత్యామ్నాయంగా దాన్ని ఎంచుకోవడం మొదలుపెట్టారు. అదే బిజెపి ఎదుగుదలకు కారణమైంది. తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో వైసిపికి తెలంగాణలో అస్తిత్వం ఉంది. కానీ జగన్ ఆంధ్రపైనే ఫోకస్ పెట్టి తెలంగాణలో ఉపసంహరించి వేశాడు. అందువలన తెరాస ప్రత్యామ్నాయాల్లో ఒకటి తగ్గింది. ఇప్పుడు షర్మిల వచ్చి ఆ స్థానాన్ని ఆక్రమిద్దామని చూస్తోంది కానీ యిప్పటిదాకా స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఇక కమ్యూనిస్టుల సంగతికి వస్తే వాళ్ల బలం నానాటికీ క్షీణిస్తోంది. స్టేటుమెంట్లకే పరిమితమౌతున్నారు.

ఆ కారణం చేత తెరాస వ్యతిరేక ఓటుకు బిజెపి కేంద్రంగా మారే అవకాశం ఉంది. రేవంత రెడ్డి వచ్చాక కాంగ్రెసు పార్టీ ఏదో హడావుడి చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెసు, బిజెపిల మధ్య చీలిపోతుందని, తను సునాయాసంగా గెలిచేయవచ్చని కెసియార్ అనుకుంటూ వచ్చారు. కానీ కాంగ్రెసు పరిస్థితి జాతీయ స్థాయిలో కానీ, ప్రాంతీయ స్థాయిలో కానీ బాగోలేదు. సోనియా, రాహుల్ పార్టీ గురించి పట్టించుకోవడమే లేదు. ఇక రాష్ట్రస్థాయిలో కార్యకర్తలు తక్కువ, నాయకులు ఎక్కువ అయిపోయారు. కాలు కదిపి, ఉద్యమాలు, నిరసనలు చేసేవారు లేరు కానీ, అవతలివాడు ముందుకెళుతూంటే కాలు లాగే రకాలే ఉన్నారు. ఏమైనా అంటే సీనియర్ల మంటారు. సోనియా పేరు చెప్పి బెదిరిస్తారు. వీళ్లని అదిలించడానికి పైన ఎవరూ లేరు. వీళ్లలో ఎంతమంది కోవర్టులో, ఎంతమంది నిజాయితీగా పని చేస్తున్నారో తెలియదు.

దశాబ్దాలుగా తెలంగాణలో పాతుకుపోయిన కాంగ్రెసు ఈ కారణాల వలన బలహీనపడి పోయింది. అది యింకా బలహీన పడి, ఆ ఓట్లు తమకు దఖలు పడాలని బిజెపి ప్రార్థిస్తూండవచ్చు. అది పుంజుకుని, బిజెపికి పోటీగా రావాలని తెరాస ప్రార్థిస్తూ ఉండవచ్చు. కాంగ్రెసు స్థానంలో బిజెపి వచ్చేందుకు అవకాశాలున్నాయా అని ఆలోచిస్తే, బిజెపి ప్రభావం నగరానికి, జిల్లాలలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది తప్ప గ్రామగ్రామాన బలం లేదని ఒప్పుకోక తప్పదు. దశాబ్దాలుగా దాని నాయకులందరూ, నగరానికి చెందినవారే. కిషన్ రెడ్డి తప్ప దాదాపు అందరూ వయసు మీరినవారే. వెంకయ్య నాయుడు ధర్మమాని బిజెపికి ఉమ్మడి రాష్ట్రంలో ఎదుగుదల లేకుండా పోయింది. నాగం జనార్దన రెడ్డి వంటి వాళ్లు బిజెపికి వచ్చి నిరాశపడ్డారు. మోదీ వచ్చాక బిజెపి అనేక రాష్ట్రాలలో బలపడుతున్న సమయంలో యిక్కడ కిషన్ రెడ్డి ఏదైనా చేయగలడేమో అనుకుంటే కేంద్రమంత్రిగా తీసుకుని వెళ్లిపోయారు. దాని వలన తెలంగాణకు లాభం కలగలేదు, బిజెపి పార్టీకీ కలగలేదు.

సౌమ్యుడు, చతురుడు ఐన కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చారు. ఆయన చేసే ఆర్భాటం అంతా యింతా కాదు. ఆయన మంచి ఆర్గనైజర్ అయితే కావచ్చు మేధోపరమైన ఉపన్యాసాలు చేసిన దాఖలా కనబడదు. ఏం మాట్లాడతాడో పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. అది ఒక రకంగా అదృష్టం కూడా. ఎందుకంటే ఆయన విశృంఖల సుభాషితాలను తట్టుకోవడం కష్టం. ఏ మాట అనాలో, ఏ మాట అనకూడదో ఆయనకు బొత్తిగా విచక్షణ లేదు. హార్డ్‌కోర్ సంఘీయులకు తప్ప ఆయన ధోరణి నచ్చదు. తటస్థులను యిరిటేట్ చేసి పార్టీ పట్ల విముఖుల్ని చేసే ప్రమాదం ఉంది. కరీం నగర్ మునిసిపాలిటీలో కార్పోరేటర్‌గా చేశాడు. రెండు సార్లు శాసనసభకు పోటీ చేసి ఓడిపోయాడు. 2019లో తెలంగాణలో గెలిచిన నలుగురు ఎంపీలలో ఆయన ఒకడు. రెండేళ్ల క్రితం రాష్ట్రాధ్యక్షుడు అయ్యాక ఉపయెన్నికలలో, హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో బిజెపి సాధించిన విజయాలను ఆయన ఖాతాలోకి పూర్తిగా వెయ్యడం సమంజసం కాదు.

2018 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి 7.1% ఓట్లు, 1 సీటు (ఘోషా మహల్ రాజాసింగ్) వచ్చాయి. పూర్వ అసెంబ్లీలో 5 సీట్లుంటే నాలుగు తగ్గాయి. తర్వాత జరిగిన ఉపయెన్నికలలో బిజెపి గెలిచిన రెండు చోట్ల దాని అభ్యర్థులు బలమైన వారని గుర్తుంచుకోవాలి. రఘునందన్ మంచి వక్త. చక్కటి పాయింట్లతో దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని బాగా హైలైట్ చేయగలిగారు. అతని బంధువర్గంపై తెరాస చేసిన ఓవరాక్షన్ అతనికి లాభించి, వెయ్యి ఓట్ల మెజారిటీతో గట్టున పడేసింది. ఇక హుజూరాబాద్ విషయంలోనైతే ఈటల రాజేందర్‌కి వ్యక్తిగతంగా ఉన్న పలుకుబడి అపారం. కెసియార్ ఎన్ని కుయుక్తులు పన్నినా ఓటర్లు రాజేందర్‌కే కృతజ్ఞత తెలిపారు. అతను బిజెపిలో చేరకుండా స్వతంత్రుడిగా పోటీ చేసినా నెగ్గేవాడేమో కానీ, రాష్ట్రప్రభుత్వం చేసే అరాచకాన్ని తట్టుకోవడానికి కేంద్రప్రభుత్వంలో ఉన్న పార్టీని ఆశ్రయించవలసి వచ్చింది. ఇప్పుడు బిజెపికి 119 చోట్ల యిలాటి బలమైన అభ్యర్థులు దొరుకుతారా?

2019 పార్లమెంటు ఎన్నికలలో 17టిలో 4 సీట్లు బిజెపి గెలవడంతో ఆశలు చిగురించాయి. 2020 డిసెంబరు నాటి హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో 150కి 48 (గతంలో కంటె 44 ఎక్కువ) రావడంతో ఉత్సాహం ఉరకలు వేసింది. ఇక తెలంగాణ చేజిక్కినట్లే అని బీరాలు పలుకుతున్నారు. పార్లమెంటు ఎన్నికలలో అభ్యర్థి మోదీ. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థి బండి సంజయ్. అక్కడే తేడా కొట్టింది. ఇక నగరంలో పాగా వేసినంత మాత్రాన పట్టణాలలో, గ్రామాల్లో వేసినట్లు కాదు. కార్పోరేషన్ ఎన్నికల ఆరు నెలల తర్వాత నాగార్జునసాగర్ ఉపయెన్నికలో బిజెపి అభ్యర్థికి 4% ఓట్లు వచ్చాయి! రాష్ట్రమంతటా బిజెపి బలపడాలంటే దాని పాలనా సామర్థ్యంపై ప్రజలకు గురి కుదరాలి. 10 మునిసిపల్ కార్పోరేషన్లలో బిజెపి ఒకదానిలోనే అధికారంలో ఉంది. 120 మునిసిపాలిటీలలో మూడిటిలో మాత్రమే అధికారంలో ఉంది. అక్కడ వాటి పాలన ఎలా సాగుతోందో నాకు తెలియదు. హైదరాబాదు కార్పోరేషన్‌లో అధికారాన్ని పొందగలిగి వుంటే ఒక ఐడియా వచ్చేది. కానీ అది జరగలేదు.

ఇక తెలంగాణ ప్రజలను బిజెపి వైపు మళ్లించడం ఎలా? ఇప్పటికే మోదీ తెలంగాణకు కేంద్ర నిధులను యిచ్చేస్తున్నాడని, డబుల్ ఇంజన్ సర్కారు వస్తే యింకా యిచ్చేస్తాడని నచ్చచెప్పాలి. కానీ మోదీ తెలంగాణకు యివ్వవలసినవి యివ్వటం లేదు. ఆ విషయాన్ని బలంగా, ఆధారాలతో సహా చెప్పగల సామర్థ్యం తెరాస నాయకులకు ఉంది. పోనీ తెలంగాణ గెలవడానికి మోదీ యివ్వవచ్చు కదా అంటే యిస్తే ఆ ఘనతను కెసియార్ తన ఖాతాలో వేసుకుంటాడని బిజెపి భయం. ఒంటి చేత్తో, బక్కప్రాణాన్ని బలిపెట్టి తెలంగాణ తెచ్చానని కెసియార్ మొత్తం క్రెడిట్ అంతా కొట్టేయలేదా? ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మరొకరి పేరు గుర్తుకు వస్తోందా? అమరవీరుల సంఖ్య ఎంతో ఎవరికైనా తెలుసా? తిమ్మిని బమ్మి చేయగల సామర్థ్యం, వాక్పటిమ కలిగి, ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులు కెసియార్ కుటుంబంలోనే ఉన్నారు. బయటివారి సాయమే అక్కరలేదు.

‘మీరు రాష్ట్రానికి ఏమీ యివ్వటం లేదుట కదా’ అని ఓటర్లు బిజెపి వాళ్లను అడిగితే వాళ్లేమంటారు? మమ్మల్ని యిక్కడ కూడా అధికారంలో కూర్చోబెట్టి, డబుల్ ఇంజన్ సర్కారు తెచ్చుకోండి, అప్పుడిస్తాం అంటారు. జాతీయ నాయకులు ఏమైనా చెప్పవచ్చు. స్థానిక నాయకులు ఏ విధంగా సమర్థించుకోగలరు? బిజెపికి ఉన్నదల్లా రెండే రెండు - మోదీ జపం, హిందూత్వజపం! మొదటిది పార్లమెంటు ఎన్నికకు పనికి వస్తుంది. అసెంబ్లీకి పనికి రాదు. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాలలో కంటె సింగిల్ ఇంజన్ తెలంగాణలో ప్రగతి బాగుందని గణాంకాలతో సహా తెరాస నాయకులు చూపుతున్నారు. ఇక హిందూత్వ. ఉత్తరాదిన హిందూత్వకు ఉన్నంత ఎఫెక్ట్ దక్షిణాదిన లేదు. అందుకే జనసంఘ్ కానీ, బిజెపి కానీ దక్షిణాదిన పుంజుకోలేక పోయాయి. కర్ణాటక ఒక్కటే మినహాయింపు. దానికి కారణం యడియూరప్ప, కులరాజకీయాలు.

కర్ణాటకలో మొదటి నుంచీ కులరాజకీయాలు నడిచాయి. లింగాయతులు కాంగ్రెసుతో, ఒక్కళిగలు ప్రతిపక్షాలతో నడిచారు. జనసంఘ్, బిజెపి పేరు చెప్పగానే రాష్ట్రంలో యడియూరప్ప పేరే గుర్తుకు వస్తుంది. లింగాయత్ కాంగ్రెసు నాయకుల ప్రాభవం క్షీణించిన తర్వాత వారికి నాయకుడిగా అతను ఎదిగాడు. రాజీవ్ గాంధీ 1990లో అన్యాయంగా వీరేంద్ర పాటిల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో లింగాయతులు కోపగించారు. అదే అదనుగా యడియూరప్ప వాళ్లను బిజెపి వైపు మళ్లించాడు. ఆడ్వానీ రథయాత్ర తర్వాత కర్ణాటకలో కొన్ని ప్రాంతాలలో స్పందన కనబడింది. దాన్ని ఓట్ల రూపంలో తర్జుమా చేసుకుంటూ, సంకీర్ణ రాజకీయాలు నడుపుతూ బిజెపి కర్ణాటకలో నిలదొక్కుకుంది. కర్ణాటకలో జరిగినది తెలంగాణలో జరగాలంటే చాలా జరగాలి.

కర్ణాటకలో 1989 పార్లమెంటు ఎన్నికలలో 2.5% ఓట్లు తెచ్చుకున్న బిజెపి 1991 పార్లమెంటు ఎన్నికల సమయానికి 28.8% తెచ్చుకుంది. 1999 అసెంబ్లీ ఎన్నికలలో 20.7% ఓట్లు, 224లో 44 సీట్లు తెచ్చుకున్న బిజెపి 2004 నాటికి 28.3% ఓట్లు, 79 సీట్లు గెలుచుకుంది. 2006లో కుమారస్వామి కాంగ్రెసుతో నడుపుతున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి బిజెపితో పొత్తు పెట్టుకుని బిజెపిని అధికారంలోకి తొలిసారి రానిచ్చాడు. 20 నెలల తర్వాత యడియూరప్పను ముఖ్యమంత్రిని చేస్తానని మాట యిచ్చి తప్పాడు. దాంతో 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో యడియూరప్పపై సానుభూతి వెల్లువెత్తి బిజెపి 34.8% ఓట్లు 110 సీట్లు గెలిచి, ఆరుగురు స్వతంత్రుల మద్దతుతో తొలిసారి సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది.

మరి తెలంగాణలో యింత కథ నడిచిందా? ఏ కులమైనా బిజెపికి అంకితమై ఉందా? యడియూరప్ప అంత స్టేచర్ ఉన్న నాయకుడున్నాడా? కెసియార్‌పై నియంతృత్వ ముద్ర ఉంది కానీ కులతత్వ ముద్ర లేదు. వెలమలకే పనులవుతాయని ఎవరూ అనలేరు. సొంత మేనల్లుణ్ని కూడా కొంతకాలం చెత్తబుట్టలో పడేసి ఉంచగలడాయన. ఆంధ్రలో అయితే ఫలానా కులస్తులు ఫలానా పార్టీకి ఓటేస్తారని ఊహించవచ్చు, తెలంగాణలో ఆ సౌలభ్యం లేదు. కులప్రాతిపదికన ఓట్లు పడవు. అందువలన వెలమేతరులందరూ బిజెపిని ఆదరిస్తారన్న గ్యారంటీ లేదు. ఇక యడియూరప్పకు, బండి సంజయ్‌కు హస్తిమశకాంతరం. 2018లో 119 సీట్లలో ఒకే ఒక్క సీటు తెచ్చుకున్న బిజెపి 2023 కల్లా 60 తెచ్చుకుంటుందనుకోవడం అత్యాశే. పోనీ ఎవరితోనైనా పొత్తు పెట్టుకోగలదా అదీ కనబడదు. ఆంధ్రలో అయితే జనసేన, టిడిపి అంటూ చెప్పుకోవచ్చు. కానీ యిక్కడ ఉన్న పార్టీలు వేటితోనూ భావసారూప్యం లేదు. మజ్లిస్, లెఫ్ట్, కాంగ్రెస్.. యిలా అన్నీ చుక్కెదురు పార్టీలే!

ఇవన్నీ తరచి చూస్తే ఎంత హడావుడి చేసినా, బిజెపి 2013 నాటికి ప్రధాన ప్రతిపక్షం కావచ్చేమో కానీ అధికార పక్షం కాలేదు అనిపిస్తుంది. కానీ కెసియార్ తప్పులు చేసి, ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటే మాత్రం అధికారపక్షం అయినా కావచ్చు. అంతా కెసియార్ దయ, బిజెపి ప్రాప్తం. కెసియార్ ఏం చేయబోతున్నారు? ఇక్కడ మమత గుర్తుకు వస్తుంది. ఆమె కెసియార్‌ను మించిన అహంభావి. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా సీనియర్. 2019 పార్లమెంటు ఎన్నికలలో దెబ్బ తినగానే తప్పు దిద్దుకోవడం మొదలుపెట్టింది. తన చుట్టూ భజనపరులు చేరి, వాస్తవాలు కనబడకుండా చేస్తున్నారని గ్రహించి ప్రశాంత కిశోర్‌ను రప్పించి, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుంది. అవినీతి జరిగిందని ఒప్పుకుని, పొరపాట్లు దిద్దుకోవడం మొదలుపెట్టింది. పార్టీని క్షాళన చేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికలను ఒంటి చేత్తో ఎదుర్కుని విజయం సాధించింది.

అది గమనించిన కెసియార్ ఆమె మార్గాన్నే పట్టారు. హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలు, హుజూరాబాద్ ఉపయెన్నిక తర్వాత ప్రశాంత్‌ను నియమించుకున్నారు. పరిస్థితులు ఆకళింపు చేసుకుంటున్నారు. ఇక దిద్దుబాటు చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి. కెసియార్ పాలనలో మంచీ ఉంది, చెడూ ఉంది. చెడును సవరించుకుని ప్రజాభిమానాన్ని చూరగొంటే బిజెపిని దూరంలో ఆపగలరు. లేకపోతే బిజెపి తన తడాఖా చూపుతుంది. బెంగాల్‌లో లాగానే ప్రశాంత్ అప్రతిష్ఠ పాలైన కొంతమంది ఎమ్మెల్యేలను వదిలించుకోమని సలహా యివ్వవచ్చు. కెసియార్ దాన్ని అమలు చేస్తే బెంగాల్‌లో లాగానే నాయకుల కొరతతో బాధపడుతున్న బిజెపి వాళ్లను వాటేసుకుని టిక్కెట్లు యివ్వచ్చు. అది ఊహించే బిజెపి ఈటల నేతృత్వంలో ఫిరాయింపు కౌంటరు తెరవబోతోంది. ఒరిజినల్ సంఘీయుల కంటె యీ ఫిరాయింపుదారులే ఎక్కువ సందడి చేయబోతారు. కానీ వీళ్లను నమ్మడానికి లేదు. బెంగాల్‌లో ఫలితాల తర్వాత వారందరూ ఎబౌట్ టర్న్ అయిపోయారు. బిజెపి వలలో పడే చేపలు ప్రధానంగా కాంగ్రెసువే కావచ్చు. డికె అరుణ వంటివాళ్లు వస్తే తమ పాత కక్షలను వెంటపెట్టుకుని వస్తారు. కాంగ్రెసంతా చీలికలు వాలికలే కదా! బిజెపికి ఆ సంస్కృతిని అంటించే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారబోతోంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?