Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: కవిత అరెస్టు కాకపోవడానికి కారణం యిదా!?

ఎమ్బీయస్‍: కవిత అరెస్టు కాకపోవడానికి కారణం యిదా!?

తెలంగాణ ఎన్నికలలో బిజెపి స్థితి చాలామందిని అయోమయంలో పడేసింది. బండి సంజయ్ వచ్చాక తెరాసకు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడం, అది విని క్యాడర్ ఉత్సాహపడడం జరిగాయి. ఇక మీడియా కూడా బిజెపి దున్నేస్తుంది అని రాసేసింది. దున్నడానికి ఆ పార్టీకి రాష్ట్రమంతటా నిర్మాణం ఉందా లేదా? గత ఎన్నికలలో ఎన్ని ఎక్కడ సాధించింది? కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉన్నారు? ఎవరైనా కొత్త నాయకులు చేరుతున్నారా? ఇలాటివేవీ లెక్కలోకి తీసుకోలేదు. బండి వీరాలాపాలు పలుకుతున్నాడు. కేంద్రం నుంచి వచ్చిన ప్రతి బిజెపి నాయకుడు భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించాడు... యిదే న్యూసు. 2014లో టిడిపితో పొత్తు వలన బిజెపికి సిటీలో సీట్లు వచ్చాయి. గ్రామాల్లో రాలేదు. 2018లో నెగ్గినది ఒక్కటే. 2019 ఎంపీ ఎన్నికలలో 4 సీట్లు గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ ఎంపీలలో ముగ్గురు యీసారి అసెంబ్లీ స్థానాలు కూడా గెలవలేక పోయారని, కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా బిజెపి గెలవలేక పోయిందంటేనే తెలుస్తోంది ఆ విజయంలో మోదీ పాత్రే పెద్దదని!

తర్వాత కార్పోరేషన్ ఎన్నికలలో 48 డివిజన్లు గెలిచి అనూహ్యమైన విజయం సాధించడంతో బిజెపి ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకపోయాయి. ఉపయెన్నికలలో రఘునందన్, ఈటల గెలవడంతో రాబోయేది మా ప్రభుత్వమే అనుకున్నారు. ఈసారి ఎన్నికలలో వాళ్లిద్దరూ ఓడిపోయారని గమనించండి. కానీ యీ విజయాలతోనే మురిసిపోయి, అందరూ మా కేసే చూస్తున్నారని అనుకున్నారు. కానీ నాయకులు అలా అనుకోలేదు. అందుకే ఎవరూ చేరలేదు. ఫిరాయింపుదారులకు స్వాగతం అని ఈటల దుకాణం తెరిచి పెట్టుక్కూర్చున్నా ఎవరూ తొంగి చూడలేదు. బండి తన వ్యవహారశైలితో పార్టీకి యిబ్బందులు తెచ్చిపెడుతున్నాడని అనుకున్నారో ఏమో, మార్చేశారు. అది పెద్ద పొరపాటు అని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. బండి ఉండగా బిజెపిలోకి ఎవరైనా చేరారా? ఓటర్లు బండిని చూసి ఓటేస్తారా?  నాయకులు బండిని చూసి పార్టీలో చేరతారా?

బిజెపికి సంబంధించినంత వరకు అంతా పార్లమెంటు ఎన్నిక నుంచి, పంచాయితీ ఎన్నిక వరకు మోదీ పేరు మీదనే నడుస్తోంది. ముఖ్యమంత్రి ఫలానా అని చెప్పకపోయినా, మూడు రాష్ట్రాలలో బిజెపి గెలిచింది. ఇప్పుడు మోదీ ఎవరెవరినో ముఖ్యమంత్రులుగా నియమిస్తున్నారు. హరియాణాలో, గుజరాత్‌లో ఎవరూ ఊహించని వారే ముఖ్యమంత్రు లయ్యారు. ఇలాటి పరిస్తితుల్లో ఎవరైనా బిజెపిలోకి వస్తే మోదీని చూసే రావాలి. బండి సంజయ్ మొహం చూసి రారు, వెళ్లిపోరు. కానీ మీడియా మాత్రం బండి కారణంగా లోలకం యిటు నుంచి అటుకి వెళ్లిపోయిందని చెప్పేస్తోంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు అలాగే ఉన్నారు కదా. బండి పార్టీ విడిచి పోలేదు కదా! అతని స్థానంలో వచ్చిన కిషన్ రెడ్డి పార్టీకి పాత కాపే కదా! బండిని జిల్లా స్థాయి నాయకుడని కూడా అనలేము. రాష్ట్రంలో అందరితో పరిచయాలు ఉన్నాయని గట్టిగా చెప్పలేము. కిషన్ రెడ్డి ఎప్పణ్నుంచో రాష్ట్రస్థాయి నాయకుడు. అన్ని జిల్లాల బిజెపి నాయకులతోనే కాదు, యితర పార్టీ నాయకులతో సైతం సంబంధబాంధవ్యాలు ఉన్నవాడు.

కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే బండిని తీసేయడం ద్వారా బిజెపి ఆత్మహత్య చేసుకుంది, తెలంగాణను గెలిచే అవకాశాలను చేతులారా పాడు చేసుకుంది అనే  ప్రచారాన్ని మొదలుపెట్టింది మీడియా. అనేక ఎగ్జిట్ పోల్స్ కూడా బిజెపికి 3 స్థానాలకు మించి రావని జోస్యాలు చెప్పాయి. తీరా చూస్తే 8 వచ్చాయి. 2018తో పోలిస్తే ఓట్లు రెట్టింపు (14శాతం), సీట్లు 8 రెట్లు అయ్యాయి. అది గొప్ప కాదా? తెలంగాణలో బిజెపి ఎప్పుడూ బలంగా లేదు. ఆల్సో రేన్ అన్నట్లుగానే ఉంది. ఈ ఎన్నికలో భారాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెసే అనుకున్నారు ఓటర్లు. ఎందుకంటే దానికి దశాబ్దాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మంత్రులుగా, కార్పోరేషన్ చైర్మన్లగా, జిల్లా పరిషత్ చైర్మన్లగా, వివిధ హోదాల్లో పని చేసిన వారు దానిలో కోకొల్లలుగా ఉన్నారు.

కాంగ్రెసు గెలిచినంత మాత్రాన బిజెపి ప్రయత్నాలను తీసి పారేయలేము. అర్ధమనస్కంగా పోరాడిందని తీర్మానించలేము. అవకాశం, శక్తి ఉన్నంత మేరకు అది యుద్ధం చేసింది. పెద్ద నాయకులెవరూ దానిలో చేరలేదు. నిలబడితే నిధుల కొరత ఉండదని తెలిసినా, టిక్కెట్లు తీసుకోవడానికి ఉత్సాహంగా ముందుకు రాలేదు. ఒరిజినల్‌గా సంఘీయులుగా ఉన్నవారు నిల్చిపోయారు కానీ యితర పార్టీల నుంచి లబ్ధి కోసం వచ్చిన రాజగోపాల రెడ్డి వంటి వారు వెనక్కి వెళ్లిపోయారు. కాంగ్రెసు అధికారంలోకి రాబోతోందని పసిగట్టిన విజయశాంతి వంటి వలసపక్షులు అటు వెళ్లిపోయాయి. ఇలాటి పరిస్థితుల్లో అధిష్టానం ఏం చేయగలుగుతుంది? నాయకులు తక్కువై పోయారు. అందుకే ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టింది.

బండి అంత గొప్ప లీడరైతే తన పార్లమెంటు నియోజకవర్గంలోకి వచ్చే అసెంబ్లీ నియోజక వర్గాల్లో స్థానిక నాయకులను తయారు చేయలేక పోయేడేం? అరవింద్, కిషన్ రెడ్డిల మాటేమిటి? వారసులను తయారు చేయలేదుగా! బిజెపిలో కార్యకర్తల, నాయకుల లేమి ఉందని ఒప్పుకుని తీరాలి. అభ్యర్థులు ముందుకు రాకపోవడం చేతనే, టిక్కెట్టు యిచ్చినదాకా ఉండి పార్టీ ఫిరాయిస్తారేమోనన్న సందేహాలు ఉండడం చేతనే, జాబితా విడుదల చేయడం ఆలస్యమైంది. మీడియాలో కవరేజి వచ్చినంత మాత్రాన బలం పెరిగిపోయిందని ఊహించుకోవడం, ఫలితాలు చూశాక రావలసినన్ని రాలేదని వాపోవడం రెండూ అనవసరమే. ఎన్నికల సమరంలో తీవ్రంగానే పోరాడారు. మోదీ, అమిత్‌, నడ్డాలు కూడా వచ్చి సభలు నిర్వహించారు.

పవన్‌ను పిలిచి జనసేనకు 8 సీట్లు యివ్వడమెందుకో యిప్పటికీ అర్థం కావటం లేదు. కూకట్‌పల్లిలో మాత్రమే జనసేన అభ్యర్థికి 40 వేల ఓట్లు వచ్చాయి. అవి కాపుల్లో కొందరి ఓట్లు ప్లస్ బిజెపి ఓట్లు అంటున్నారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం దాకా అతను బిజెపి మనిషే. తెలంగాణలో బిజెపి కున్న బలాన్ని లెక్కలోకి తీసుకుని చూస్తే యిప్పటి ఫలితాలపై మరీ అంత అసంతృప్తి అక్కరలేదు. 8 గెలిచారు. సిటీలో రాజా సింగ్ గెలుపు తథ్యమనుకున్నా, తక్కిన ఏడూ భారాసకు గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణలో (ఆదిలాబాద్‌లో 4, నిజామాబాద్‌లో 3) వచ్చాయి. వీటికి తోడు 19 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉంది. వీటిలో పాత బస్తీ సిగ్మెంట్లు కూడా ఉన్నాయి. 32.35 లక్షల ఓట్లు వచ్చాయి.

బలమైన భారాస పతనమై, కొద్దిపాటి మెజారిటీ మాత్రమే ఉండి అంతఃకలహాల జాడ్యంతో బాధపడే కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది కాబట్టి రాబోయే ఐదేళ్లలో ఎదగడానికి బిజెపికి అవకాశముంది.

2028 నాటికి కెసియార్‌కు 73 ఏళ్లుంటాయి. భారాసలో కెటియార్, హరీశ్ ఉన్నా, కెసియార్‌ కున్న గ్లామర్ వాళ్లకు లేదు. అందువలన కార్యకర్తలను, నాయకులను తయారు చేసుకుంటే బిజెపి 2028 నాటికి బలీయమైన శక్తిగా మారవచ్చు. అదేదో యిప్పుడే జరగలేదని ఆశ్చర్యపడి, దానికి కారణాలు ఫలానా అని చేసే విశ్లేషణలు నాకు అర్థం కావటం లేదు. ఇతరులను కలుపుకుని పోకుండా తనకే ఎక్కువ ప్రొజెక్షన్ వచ్చేలా చేసుకున్న బండి సంజయ్ వ్యవహారశైలిపై తక్కిన నాయకులు ఫిర్యాదు చేయడం, అతన్ని మారుద్దామా వద్దా అని 3-4 నెలలు ఊగిసలాట, స్తబ్ధత, చివరకు మార్పు - పార్టీని దెబ్బ తీశాయి అని ఒక విశ్లేషణ. బిజెపి అనేక రాష్ట్రాలలో అధ్యక్షులను మార్చింది. దానివలన అక్కడేమీ నష్టపోలేదు. ఇక్కడ మాత్రం అయిందనుకోవడం సమంజసంగా లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టును ఎటిఎమ్ అని వర్ణించారు కానీ దర్యాప్తుకి ఆదేశించక పోవడం ఒక కారణం అంటున్నారు. ఎన్నికల సమయంలో ఆధారాల్లేకుండా లక్ష అంటారు. వాటిపై దర్యాప్తు ఆదేశిస్తే ఏ ఆధారమూ దొరక్క పరువు పోతుంది. 2019 ఆంధ్ర ఎన్నికలకు ముందు మోదీ పోలవరంను కూడా బాబుకి ఎటిఎం అన్నారు. తర్వాత దర్యాప్తుకి ఆదేశించారా? పోలవరం అథారిటీ కేంద్రం చేతిలోనే ఉంది. అవినీతి జరిగిందని తేలితే అదీ యిరుక్కుంటుంది. కాళేశ్వరం విషయంలో మేడిగడ్డ పిల్లర్లు కృంగగానే రెండు రోజుల్లో రిపోర్టు తెప్పించేసి, ఎన్నికల్లో వాడుకున్నారు. ఒక టెక్నికల్ రిపోర్టు అంత త్వరగా తయారు కావడం వింతల్లో వింత. ఆ ప్రాజెక్టుకి మార్చిన డిజైన్‌కి అనుమతులు లేవని చెప్పేవన్నీ ఎన్నికల ప్రచారమే. కేంద్ర కమిషన్ పర్మిషన్ లేకుండా అంత పెద్ద ప్రాజెక్టు కట్టడం అసంభవం. ప్రమాదం జరగగానే యిలా ఒకరి మీద మరొకరు తప్పు తోసుకోవడం సహజం. చూద్దాంగా, రేవంత్ రెడ్డి విచారణ జరిపించి ఏం తేలుస్తారో!

భారాసతో దోస్తీ గురించి, బిజెపి సందేహాలు నివృత్తి చేయకపోవడం దాని ఓటమికి కారణం అని మరో విశ్లేషణ. తమాషా ఏమిటంటే యీ ఎన్నికలో ప్రతీ పార్టీ తక్కిన రెండు పార్టీలూ తమకు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాయని ఆరోపించింది. ఫలితాల తర్వాత కాంగ్రెసును అధికారంలోకి రాకుండా చేయడానికి భారాస, బిజెపి కుమ్మక్కు అయితే కావచ్చు కానీ, ఎన్నికలకు ముందే లోపాయికారీ పొత్తు పెట్టుకుంటాయని అనుకోవడం కష్టం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి కెసియార్ బిజెపిని ప్రోత్సహించారని అని కొందరు అంటారు. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ విపక్షాలు ఎక్కువ ఉండాలని కోరుకుంటుంది. అదే సమయంలో విపక్షాలకు కూడా ‘తమలో తాము చీల్చుకుంటే అధికార పక్షం లాభపడుతుంద’నే స్పృహ ఉంటుంది. అందువలన ఎవరి ఆట వారిదే. పని గట్టుకుని లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకుంటాయని నమ్మడం కష్టం. ఏది ఏమైనా ఉత్తర తెలంగాణలో భారాసను బిజెపి దెబ్బ కొట్టింది కదా!

చివరగానైనా ముఖ్యంగా చర్చించవలసిన విషయం – కవిత అరెస్టు. కవితను అరెస్టు చేసి ఉంటే బిజెపి-భారాస పొత్తు లేదని ఓటర్లకు కచ్చితంగా నమ్మకం కుదిరి బిజెపిని ఆదరించేవారని, తద్వారా వాళ్లకు ఎక్కువ సీట్లు వచ్చేవని ఒక వాదన. ఆ అరెస్టు వలన సింపతీ కలిగి, భారాసకు కూడా సీట్లు వచ్చేవని మరి కొందరి వాదన. అరెస్టు వలన సింపతీ వస్తుందనే వాదన నాకు సమంజసంగా తోచదు. బాబు అరెస్టయినపుడు రాసిన వ్యాసంలో పలు ఉదంతాలు ఉటంకించాను. ఇక బిజెపికి లాభం కలిగేదా? చెప్పడం కష్టం. పూర్తి ఆధారాలు దొరికాయాయో లేదో తెలియదు. రాజకీయ నాయకులు అవినీతి పాల్పడ్డారంటే ఆశ్చర్యపడం. ఆధారాలు దొరికేట్లా అవినీతి చేశారంటేనే ఆశ్చర్యపడతాం. ఎక్కడా కాగితం మీద కమిట్ కాకుండా, అధికారుల చేతనే సంతకాలు చేయిస్తూ, నోటి మాటతో పని జరిపిస్తారని మన నమ్మకం.

దిల్లీ ఉప ముఖ్యమంత్రి శిశోదియా విషయంలో సుప్రీం కోర్టు ఏం చెప్పింది? డబ్బు ముట్టినట్లు ఆధారాలు చూపించగలిగితే తప్ప ఎవరో యిచ్చిన స్టేటుమెంటు పట్టుకుని కేసు నడిపితే విచారణలో ఎగిరిపోతుంది చూసుకోండి అని చెప్పింది. చంద్రబాబు స్కిల్ స్కామ్ విషయంలో కూడా అదే సమస్య. అందుకే సిఐడి విచారణ జరపాలి, బాబును ప్రశ్నలడిగి సమాచారం రాబట్టాలి అంటోంది. మనీ ట్రైల్‌ను నిరూపించడం అతి కష్టం. అప్రూవర్లు చెప్పినదాన్ని కోర్టుల్లో చాలా సందర్బాల్లో డిఫెన్సు వాళ్లు దూదిపింజల్లా ఎగర గొట్టేస్తూంటారు.

కవిత విషయంలో కేసు పకడ్బందీగా లేదనే సందేహం బిజెపి అధిష్టానానికి ఉందేమో! డబుల్ చెక్ చేసుకునే దిగుదా మనుకుందేమో! ఈ లోపున స్థానిక బిజెపి నాయకులు కవిత ఇవాళో, రేపో అరెస్టు కావడం ఖాయం అని నానా హడావుడీ చేసేశారు. తీరా చూస్తే నెలలు దాటినా ఏమీ కాలేదు. ఎందుకు కాలేదు అనే ప్రశ్న సహజంగా వచ్చింది. వ్యవహారం కోర్టులో ఉంది అని టీవీ చర్చల్లో బిజెపి నాయకులు చెప్తున్నారు. ఆ హైప్ తేవడం వలననే యీనాడు బిజెపి యిబ్బందిలో పడింది. అవసరంగా ఓవరాక్షన్ చేసి, తమను చిక్కుల్లో పెట్టినందుకే బండి సంజయ్‌ను తప్పించారేమో కూడా తెలియదు.

అయితే భారాసను ఓడించడానికి చేశారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఊహ. డిసెంబరు 5 నాటి ‘‘కొత్త పలుకు’’లో ‘...బిజెపి దీర్ఘకాలిక వ్యూహంతో ముందుగా భారాసను దెబ్బ తీసింది. కవిత జోలికి వెళ్లకుండా ఆ పార్టీతో తమకు తెరవెనుక అవగాహన ఏర్పడిందని ప్రజలు భావించడానికి ఆస్కారం కల్పించింది. ఈ ఎన్నికలో కెసియార్, భారాస బలహీనపడిపోతే ఆ గ్యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి పెద్దల వ్యూహంగా కొందరు చెప్తున్నారు...’ అని రాశారు. ఉద్యమ పార్టీగా ప్రజల్లో ఆదరణ ఉన్న భారాసను దింపేస్తే కాంగ్రెసుతో ముఖాముఖీ తలపడవచ్చని, యిప్పుడు ఓడిపోయిన భారాసను మరింత బలహీన పర్చి, ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించడం - దాని ఆలోచన అంటూ చేర్చారు. అదే నిజమైతే యిప్పుడు భారాస ద్వితీయ స్థానంలో ఉంది కాబట్టి, కవితను యిప్పటికైనా అరెస్టు చేసి, దోషిగా నిరూపించి దాన్ని తృతీయ స్థానంలోకి నెట్టేయాలి. అది పార్లమెంటు ఎన్నికలలోగా చేస్తే బిజెపి గతంలో వచ్చిన స్థానాలకు రెట్టింపు అంటే 8 వస్తాయి. అది జరగకపోతే కవితకు వ్యతిరేకంగా ఆధారాలు బలంగా లేవని సందేహించాల్సి వస్తుంది.

తృతీయ స్థానంలో ఉన్న పార్టీ ద్వితీయ స్థానంలో ఉన్న పార్టీని దెబ్బ తీసి, దాని స్థానంలో తను ఎగబాకి, తర్వాత ప్రథమస్థానం వైపు చూస్తుందనేది తర్కబద్ధమైన విషయం. కానీ యీ లాజిక్‌ను ఆంధ్ర విషయంలో అప్లయి చేయడానికి రాధాకృష్ణ యిష్టపడరు. బిజెపి టిడిపితో పొత్తు పెట్టుకుందామని చూస్తోందనే నమ్ముతారు. ఇక్కడ నిన్నటిదాకా భారాసది ప్రథమస్థానం. ఈ రోజు ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానంలో ఉన్న భారాసతో బిజెపి పొత్తు పెట్టుకుంటుందని రాధాకృష్ణ ఊహించటం లేదు కదా. ఆంధ్రలో వైసిపిది ప్రథమ స్థానం, టిడిపిది ద్వితీయ స్థానం. తృతీయ స్థానంలో ఉన్న బిజెపి ఎవరితోనైనా పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది?

తెలంగాణ రణనీతినే అక్కడ అప్లయి చేయాలంటే ప్రథమ స్థానంలో ఉన్న వైసిపిని ద్వితీయ స్థానానికి దింపుదామని చూస్తుంది తప్ప, ద్వితీయ స్థానంలో ఉన్న టిడిపిని చేతులారా ప్రథమ స్థానానికి ఎగబాకడానికి కృషి చేస్తుందని అనుకోలేము. రాధాకృష్ణ లాజిక్ ప్రకారం తెలంగాణలో భారాసతో కుమ్మక్కయినట్లుగా ఓటర్లలో అభిప్రాయం కలిగించి దాన్ని దెబ్బ తీసిన బిజెపి, ఆంధ్రలో కూడా వైసిపితో కుమ్మక్కయినట్లు ఓటర్లలో అభిప్రాయం కలిగిస్తుందా? వేచి చూడాలి. కానీ అసలీ లాజిక్కే నాకు మింగుడు పడకుండా ఉంది. ఎవరైనా ఎదుటివాడికి బురద పూయాలంటే ఎక్కణ్నుంచో బురద తెచ్చుకొచ్చి వాళ్లకు పూస్తారు. ముందుగా తనే బురదలో పొర్లాడి ఎదుటివాణ్ని కౌగలించుకుని వాడికి బురద అంటేట్లు చేయరు. కవితను అరెస్టు చేయకపోవడం ద్వారా భారాసను నష్టపరుద్దా మనేది బిజెపి వ్యూహమే అయితే యీ క్రమంలో దాని ప్రతిష్ఠ మంట కలవదా?

ఎంతటి పాపాత్ముడైనా గంగలో మునిగితే పునీతు డవుతాడన్నట్లు, ఏ నేరస్తుడైనా సరే బిజెపిలో చేరితే విముక్తు డవుతాడన్న ప్రథ యిప్పటికే ఉంది. అది చాలనట్లు యిలాటి బురద కూడా తనే పూసుకుంటుందా? తమతో కుమ్మక్కు కావడం భారాస ఓటమికి ప్రధాన కారణం అవుతుందని బిజెపి లెక్క వేసిందా? భారాస ఓడిపోవడానికి కారణాలు - అహంకారం, అవినీతి, 40 మంది స్థానిక ఎమ్మెల్యేలపై అసంతృప్తి, సంక్షేమ పథకాల అమలులో వివక్షత అని విశ్లేషణలు వస్తూండగా రాధాకృష్ణ యిలా రాశారు. భారాస అవినీతికి పాల్పడితే తాము రక్షించామని ప్రజలు అనుకోవాలని బిజెపి కోరుకుంటుందా? విచిత్రంగా లేదూ!?

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?