Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: సెక్స్‌ వివాదంలో యిరుక్కున్న వాటికన్‌ కార్డినల్‌

వాటికన్‌లో పోప్‌ సలహామండలి సభ్యులను కార్డినల్స్‌ అంటారు. వివిధ దేశాలలో ఉన్నత మతాధికారులుగా చేసినవారిని ఆ మండలిలో చేర్చుకుంటారు. ఆ మండలి నుంచే పోప్‌ను ఎన్నుకుంటారు. ఐదారు శతాబ్దాల క్రితం ఆ మండలిలో దాదాపు 30 మంది దాకా కార్డినల్స్‌ వుండేవారు. కానీ సగటు ఆయుర్దాయం పెరగడం వలన కాబోలు క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రమారమి 225 మంది వున్నారు.

ఒకసారి మండలిలో చేరాక సాధారణంగా జీవితాంతం సభ్యులుగా వుంటారు. రాజీనామా చేసిన సందర్భాలూ, డిస్మిస్‌ చేయబడిన సందర్భాలూ బహు తక్కువ. కానీ యిప్పుడు అలాటిది జరిగేట్లుంది. మూడేళ్లగా కార్డినల్‌గా వుంటూ వాటికన్‌ ఆర్థిక వ్యవహారాలు చూస్తూన్న జార్జి పెల్‌ అనే 76 యేళ్ల వ్యక్తి అతను ఆస్ట్రేలియాలో మతాధికారిగా వుండే రోజుల్లో లైంగిక నేరాలు చేశాడన్న ఆరోపణను ఎదుర్కుంటున్నాడు. నేరం రుజువైతే అతన్ని కార్డినల్‌గా తీసేయవచ్చు.

అతను రోమ్‌లో, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నాడు. రచయిత, కాలమిస్టు, వక్త, ఆటగాడు కూడా. 1973లో పూజారిగా నమోదయ్యాడు. ఆస్ట్రేలియాలో చాలా పేరుప్రఖ్యాతులు గడించుకున్నాడు. ఆర్జిబిషప్‌గా పనిచేసి 2014లో వాటికన్‌కు వచ్చాడు.  చాలా దేశాల్లో లాగానే ఆస్ట్రేలియాలో కూడా చర్చి మతాధికారులు శృంగార కార్యకలాపాల కోసం భక్తులను వాడుకోవడం, చిన్నపిల్లలపై లైంగిక అత్యాచారాలు చేయడం జరిగింది.

ఆరోపణలు రాగానే చర్చి విచారణ జరిపించేది. అలాటి విచారణల్లో ఉన్నత మతాధికారి హోదాలో పెల్‌ పాలు పంచుకునేవాడు. తప్పు చేసినవారిని వెనకేసుకుని వచ్చేవాడన్న ఆరోపణలూ వుండేవి. అలాటిది యిప్పుడు స్వయంగా అలాటి ఆరోపణల్లో చిక్కుకున్నాడు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న యిద్దరు మగవాళ్లు తమ బాల్యంలో అప్పుడు మెల్‌బోర్న్‌లో సీనియర్‌ పూజారిగా వున్న పెల్‌ తమ పట్ల అనుచితంగా వ్యవహరించాడని కేసు పెట్టారు. ఇంకా యిలాటివే కొన్ని కేసులున్నాయి.

ఆరోపణలకు తగినంత ఆధారాలున్నాయని గుర్తించిన ఆస్ట్రేలియా కోర్టు సమన్లు జారీ చేసి జులై 18కి కోర్టు ఎదుట హాజరు కమ్మనమంది. ఇవన్నీ అబద్ధాలని పెల్‌ కొట్టివేసినా పోప్‌ పెల్‌కు సెలవిచ్చి ఆస్ట్రేలియాకు వెళ్లి కోర్టులో విచారణ ఎదుర్కొనమని చెప్పాడు. 

యుక్తవయసులో బ్రహ్మచర్యం ప్రకృతివిరుద్ధం. మతపరమైన ఆంక్షల వలన బలవంతపు బ్రహ్మచర్యం పాటించవలసివస్తే స్త్రీ ఐనా, పురుషుడైనా కాలు జారడం సహజం. హిందూ సన్యాసి కావచ్చు, బౌద్ధ భిక్షువు కావచ్చు, క్రైస్తవ ఫాదిరీ కావచ్చు - విషయలోలతకు లొంగుతూంటారు. తక్కిన మతాల్లో భ్రష్టత్వం పొందినవారు వ్యక్తిగతంగా నష్టపోతారు. కానీ కాథలిక్‌ చర్చి వంటి ఆర్గనైజ్‌డ్‌ వ్యవస్థలో అలాటి నేరాలు చేసినవారి లోపాలు సరిదిద్దడానికే వాటికన్‌ ఎంతో శ్రమిస్తోంది.

చిన్నపిల్లలపై మతాధికారులు అత్యాచారాలు చేసిన కేసుల్లో బాధితులకు నష్టపరిహారం యివ్వడానికి, పూజారుల తరఫున కోర్టుల్లో కేసులు నడపడానికి భక్తులు యిచ్చిన విరాళాలు వాడవలసి వస్తోంది. ఇటువంటి కేసుల్లో ఆస్ట్రేలియా ముందు వరసలో వుంది. ఒక అధ్యయనం ప్రకారం అమెరికాలో 1950 నుంచి 2015 వరకు 5.6% మంది పూజారులు యిలాటి దుశ్చర్యలకై కేసులు ఎదుర్కుంటుకున్నారు. అమెరికాలో మొత్తం 1.16 లక్షల మంది పూజారులు వున్నారు.

అంటే 6500 మంది దోషులున్నారన్నమాట. బెదిరింపులకు భయపడో, తాయిలాలకు లోబడో కేసులు పెట్టకుండా వుండే సందర్భాలు కూడా కలుపుకుంటే యీ సంఖ్య ఎక్కడకు చేరుతుందో! ఆస్ట్రేలియా విషయానికి వస్తే 1950 నుంచి 2009 వరకు చూసుకుంటే 7% మంది మతాధికారులు యిలాటి నేరాల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఐర్లండ్‌లో మతాధికారుల కామవాంఛకు బలైన చిన్నపిల్లలు వేల సంఖ్యలో వున్నా 1975 నుంచి 2004 నుంచి డబ్లిన్‌ ఆర్చిబిషప్‌లుగా పనిచేసిన నలుగురు మతాధికారులు వీటిని పట్టించుకోలేదు. అమెరికాలో చైల్డ్‌ సెక్స్‌ స్కాండల్స్‌ బాధితులు లక్ష మంది వున్నారని మరో అంచనా. 2007లో లాస్‌ ఏంజిలిస్‌ ఆర్ట్‌డియోసెస్‌ 508 మంది బాధితులకు 660 మిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించింది. ఇదంతా భక్తులు దైవకార్యానికంటూ యిచ్చిన ముడుపులతోనే! 

పెల్‌ విషయానికి వస్తే ''కార్డినల్‌ - ద రైజ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ జార్జి పెల్‌'' అనే పుస్తకం రాసిన లూయీస్‌ మిలిగన్‌ అనే యిన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ యీ సందర్భంగా మాట్లాడుతూ ''అతనిది సంక్లిష్టమైన వ్యక్తిత్వం. స్కూలు రోజుల నుంచి చాలా తెలివైన విద్యార్థిగా, ఆల్‌రౌండరుగా పేరు పొందాడు. పెద్దయ్యాక మంచి ఎడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. చర్చిలోను, బయటా పలుకుబడి వున్న అనేకమందితో స్నేహాలు చేశాడు. అతి త్వరగా పైకి వచ్చాడు. పబ్లిసిటీ విలువ తెలిసినవాడు.

మీడియాకు డార్లింగ్‌. టివిలో మంచి ప్రసంగాలు చేసి జనాలను ఆకట్టుకోగలడు. మతవిశ్వాసాలకు వస్తే అతనిది కాథలిక్కుల్లో ఛాందసవాదం. గత పోప్‌లు జాన్‌ పాల్‌ 2, బెనెడిక్ట్‌లది అదే ఆలోచనాధోరణి. అందువలన వారికి సన్నిహితుడు కాగలిగాడు. ఆస్ట్రేలియాలో కాథలిక్కు కన్సర్వేటివ్స్‌ అతణ్ని చూసి ముగ్ధులైపోయారు. ఎంతమంది ఆస్ట్రేలియన్లు అతని గురించి ఆహా, ఓహో అన్నా ఆస్ట్రేలియాకు లేబర్‌ పార్టీ తరఫున ప్రధానిగా చేసిన జూలియా గిలార్డ్‌ మురిసిపోలేదు. చైల్డ్‌ సెక్స్‌ ఎబ్యూజ్‌ (బాలలపై లైంగిక నేరాలు) గురించి 2012లో ఒక రాయల్‌ కమిషన్‌ ప్రకటించింది.

అప్పటివరకు అలాటి విచారణ జరగకుండా పెల్‌ మేనేజ్‌ చేశాడు. ఆస్ట్రేలియాలోని కాథలిక్‌ చర్చికి 1.80 లక్షల మంది ఉద్యోగులున్నారు. దేశంలోనే అతి పెద్ద ప్రయివేటు ఎంప్లాయర్‌ అది. 76.5 బిలియన్‌ డాలర్ల ఆస్తి వుంది. విద్య, వైద్య వ్యాపారాల ద్వారా, అద్దెల ద్వారా ఏటా 11.5 బిలియన్‌ డాలర్లు సంపాదిస్తోంది. ఈ స్థాయి ఐశ్వర్యం, పలుకుబడి వుండగా తమ కార్యకలాపాలపై విచారణ ఆపుకోవడం ఏమంత కష్టం కనుక! 

అయితే ఆస్ట్రేలియా సమాజంలో కూడా మార్పులు రాసాగాయి. ప్రవాసులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో అభ్యుదయవాదం పెరిగి, పాతకాలపు కేథలిక్కు ఆలోచనాధోరణికి అడ్డుకట్ట పడింది. అందువలన మతం పేరుతో యిలాటి అత్యాచారాలను సహించే పరిస్థితి యిక లేదు. విచారణ సాగుతున్న కొద్దీ పెల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి మరింత ముందుకు రావచ్చు. పోప్‌లు చర్చిల్లో లైంగిక నేరాల సమస్య గురించి చర్చిస్తూనే వున్నారు. బాధితులకు క్షమాపణలు చెప్తున్నారు.

దీనికి దూరంగా వుండమని పూజారులను హెచ్చరిస్తున్నారు. అయినా అవి ఆగటం లేదు. అవన్నీ ఒక యెత్తు కాగా యిప్పుడు పెల్‌ వ్యవహారం చాలా తీవ్రమైనది. కార్డినల్‌ స్థాయి వ్యక్తి, పైగా వాటికన్‌లో ర్యాంకుల ప్రకారం మూడో స్థానంలో వున్న వ్యక్తి కూడా యిలాటి అత్యాచారాలకు పాల్పడ్డాడంటే వాటికన్‌ పరువు ఏం కావాలి? అలెగ్జాండర్‌ డ్యూమా అనే ఫ్రెంచ్‌ రచయిత ''కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌క్రిస్టో'' అనే నవలను 1844లో రాశాడు.

దాంట్లో డబ్బు కోసం ఒక కార్డినల్‌ ఒక మహారాజుపై విషప్రయోగం చేసినట్లు రాశాడు. కార్డినల్‌ పాత్రను అలా చిత్రీకరించినందుకు చర్చి ఆ నవలను నిషేధించింది. మరి యిప్పుడు ఆస్ట్రేలియా కోర్టు పెల్‌ను దోషిగా నిర్ధారిస్తే ఏం చేయగలదు? వాటికన్‌ యిమేజికి యీ పెల్‌ కేసు సవాలుగా నిలిచింది.  (ఫోటో - కార్డినల్‌ జార్జి పెల్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com