ఎమ్బీయస్‌: జగన్‌పై కేసులు

''రక్షకుడో? తక్షకుడో'' అనే శీర్షికతో పవన్‌ కళ్యాణ్‌తో ఒప్పందం బాబుకి మేలు చేస్తుందో, లేదో చర్చిస్తూ 4 ఎ4 సైజు పేజీల ఆర్టికల్‌ రాస్తే దాని గురించి వ్యాఖ్యానించడం మానేసి చాలామంది దమ్ముంటే జగన్‌…

''రక్షకుడో? తక్షకుడో'' అనే శీర్షికతో పవన్‌ కళ్యాణ్‌తో ఒప్పందం బాబుకి మేలు చేస్తుందో, లేదో చర్చిస్తూ 4 ఎ4 సైజు పేజీల ఆర్టికల్‌ రాస్తే దాని గురించి వ్యాఖ్యానించడం మానేసి చాలామంది దమ్ముంటే జగన్‌ కేసుల గురించి రాయమని అడిగారు. దానికి దమ్మెందుకో నా కర్థం కాదు. ఆ కేసుల గురించి గతంలో అనేకసార్లు రాశాను. అవి చదవని వారి కోసం క్లుప్తంగా మళ్లీ రాయాల్సి వస్తోంది. రాస్తాను కానీ ఓ మాట – అసలీ ప్రశ్న లక్ష్మీనారాయణ గారిని అడగాలి – 'సిబిఐ అధికారిగా మీరు జగన్‌ విషయంలో పెట్టిన కేసులు కోర్టులో నిలవడం లేదేం? ఆనాటి పాలకుల ప్రాపకం కోసం సరైన ఆధారాలు లేకుండానే ఉత్తుత్తిగా పెట్టారా? లేక ఆధారాలున్నా జగన్‌తో కుమ్మక్కయి వాటిని దాచేసి, కేసు కావాలని వీక్‌గా పెట్టారా? దమ్ముంటే వాటి గురించి మాట్లాడండి' అని. ఇప్పుడాయన ఫక్తు రాజకీయనాయకుడు. అందువలన మనం మొహమాటాలేవీ లేకుండా అడగవచ్చు.

నా వ్యాసానికి కామెంట్స్‌లోనే కాదు, సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌లలో, అధికార, సహకార పార్టీల నాయకుల ప్రసంగాలలో ఎల్లెడలా జగన్‌ కేసుల ప్రస్తావన వస్తూనే ఉంది. 2014లో కూడా యిదే గోల కదా, అయిదేళ్లగా అసెంబ్లీలో, బయటా జగన్‌ గురించి మాట వచ్చినప్పుడల్లా – లక్ష కోట్లు, ఎ2, జైలుపక్షి, శుక్రవారం కోర్టు హాజరీ – యిలాటివే అంటూ వచ్చారు. కొన్ని పదాలు మొదట్లో విన్నపుడు ఓహో అనిపిస్తాయి. కానీ కొందరు వాటిని పదేపదే వాడి అరక్కొట్టేసి, వాటికి అందం లేకుండా చేస్తారు. ఈ పదాలు అలాగే తయారయ్యాయి. వీటి మీద క్షేత్రస్థాయిలో ఉన్న ఓటరు దృక్పథమేమిటో ఎన్నికలలో తెలుస్తుంది, ఈ లోపున మనలో మనం మాట్లాడుకోవడానికే యీ వ్యాసం.

నన్నడుగుతున్న వాళ్లు జగన్‌ ముద్దాయి అనే విషయం నేను గమనించాలనే ఉద్దేశంతో ఆర్టికల్‌ రాయమంటున్నారు తప్ప, దానిపై నా అభిప్రాయం తెలుసుకుందామని కాదన్న సంగతీ నాకు తెలుసు. అయినా రాయకపోతే వాళ్లను చిన్నబుచ్చినట్లవుతుంది. చిత్రమేమిటంటే నా సుదీర్ఘవ్యాసంలోని లాజిక్‌ను ఒక్కరూ ఖండించలేదు, వాస్తవాలతో విభేదించనూ లేదు. కామెంట్స్‌లో చాలా భాగం నా వ్యాసం గురించి కాదు, నా వయసు గురించి, నా వ్యాసానికి గ్రేట్‌ ఆంధ్ర వాళ్లు యిచ్చే రెమ్యూనరేషన్‌ గురించి, నా పక్షపాత బుద్ధి గురించి, మేధావి ననుకునే నా అహంకారం గురించి..! చదివి, చదివి విసుగెత్తి పోయింది. ఎప్పుడూ అదే వ్యక్తులు, అవే వ్యాఖ్యలు.

ఈ మధ్య కొంతమంది ఓ తరహా బ్లాక్‌మెయిల్‌ మొదలెట్టారు – మీకు యిన్నాళ్లూ గౌరవం యిచ్చాను, ఇలాటివి రాసి అది పోగొట్టుకోవద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఆ గౌరవమేమిటో కానీ దాని కోసం నేనేమీ పాకులాడటం లేదు, అది పెట్టి నేనేమీ కూరొండుకోను. నా ధోరణిలో నేను రాసుకుంటూ పోతున్నాను. అంగీకరించండి, విభేదించండి, నిందించండి – మీ యిష్టం. మిమ్మల్ని నొప్పించడానికి దడిసి, నా మనసు చంపుకుని రాయడం మొదలెడితే నేను నేనుగా మిగలను. నన్ను నాలాగే ఉండనివ్వండి. నేను రాసిన దానిలో తప్పులుంటే ఎత్తి చూపితే మీకు రెట్టింపు గౌరవం యిస్తాను. ఆఫ్‌కోర్స్‌, మీరూ దానితో కూర ఒండుకోలేరనుకోండి!

పవన్‌ విషయంలో బయటకు వచ్చిన 800 కోట్ల రూమర్‌ గురించి ఎందుకు రాశారని కొందరడిగారు, అది పుకారని నేనే చెప్పాను కదా. బాబులాగ వెయ్యికోట్లు గిఫ్ట్‌గా కెసియార్‌ జగన్‌కు పంపించారని ఘంటాపథంగా చెప్పానా? లేదే! అంతిమంగా జనసేనాని టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తూండడంతో ఆ రూమరు నిజమని అనుకుంటారేమోనన్న భయం పవన్‌ అభిమానుల కున్నట్లుంది. ఒక పుకారును ప్రస్తావించినందుకే నాపై మండిపడి ఆధారాలున్నాయా అని అడుగుతున్నవారు పవన్‌ లోకేశ్‌పై అవినీతి గురించి గతంలో మాట్లాడి యిప్పుడు ఎందుకు మాట్లాడలేదో చెప్పలేదు మరి. వీళ్లెవరైనా వెళ్లి పవన్‌ను అడిగారా, – 'మీ దగ్గర లోకేశ్‌ అవినీతిపై ఆధారాలున్నాయా? ఉంటే కోర్టుకి వెళ్లారా? లేదా వాళ్ల యింటిముందు ప్రదర్శనలు నిర్వహించారా?' అని.

ఇప్పటికి కూడా పవన్‌ టిడిపి ఎమ్మెల్యేలు రౌడీలు, అవినీతిపరులు అంటూనే ఉన్నారు, వాళ్ల నాయకుణ్ని ఏమీ అనరు. దొంగల గుంపుకి నాయకుడిగా ఉండేవాడు స్వామీజీ అవుతాడా? ఈ విషయం పవన్‌ అభిమానులు ఆయనకు ఎత్తి చూపాలి. వాళ్లు పవన్‌కు సలహా కూడా యివ్వాలి – ''అధికారంలో ఉన్న వాళ్లని విమర్శించకపోతే మనకు లాభమేమిటి, బాస్‌! 'బాబు బాగానే పాలిస్తూనే ఉంటే ఆయన్నే కంటిన్యూ చేద్దాం, మార్చడమెందుకు? మీకైతే అనుభవం లేదు, ఆయన అనుభవజ్ఞుడు' అని ప్రజలంటే మన దగ్గర సమాధానమేముంది?'' అని. మీరు గమనించారో లేదో, కమ్యూనిస్టులు, వామపంథా మేధావులు మొన్నటిదాకా పవన్‌ ఒట్టి గందరగోళం మనిషని, ఏ విషయంపైన క్లారిటీ లేదని విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్లతో పొత్తు కుదరగానే పవన్‌ను మెచ్చేసుకుంటున్నారు. వైసిపిని తిట్టి, టిడిపిని వదిలేయడం వాళ్లకు ఎబ్బెట్టుగా తోచలేదు. అయితే మొన్నటి నుంచి – అంటే నూజివీడు, విజయవాడ సీట్లలో లెఫ్ట్‌ అభ్యర్థులను పవన్‌ ఏకపక్షంగా తీసేయడంతో టిడిపి చెప్పినట్లు ఆడుతున్నాడని కమ్యూనిస్టులే ఆరోపిస్తున్నారు.

జనసేనకు టిడిపికి టీమ్‌-బిగా ముద్రపడితే పవన్‌కు చేటు. బాబుకి కూడా చేటే. వైసిపి బలంగా ఉన్నచోట్ల జనసేన కాపు ఓట్లు చీల్చలేకపోతుంది. 120 సీట్లు మాత్రమే పోటీచేసినా, తను రియల్‌ కాండిడేట్‌ననీ, బాబుని నిలవరించగల రాజకీయ నైపుణ్యం తనకుందని పవన్‌ తన అభిమానులను కన్విన్స్‌ చేయాలి. ఇలాంటివన్నీ రాస్తే సమాధానం చెప్పలేక నన్ను వైసిపి అభిమాని అనేస్తారు. అదే సమయంలో కాంగ్రెసు అభిమాని అని కూడా అంటారు. ఈ రెండు స్టేటుమెంట్లకూ పొత్తెలా కుదురుతుంది? కాంగ్రెసులో సోనియా వున్నంతకాలం, వైసిపిలో జగన్‌ ఉన్నంతకాలం ఆ రెండూ ఉప్పూనిప్పే. ప్రస్తుతం వైసిపి, బిజెపి కలిసి పనిచేస్తున్నాయి. మరి నేను బిజెపికి మద్దతుగా రాయాలి కదా. రాస్తున్నానా? కాంగ్రెసుకు మద్దతుగా రాస్తే వైసిపికి మద్దతుదారు ఎలా అవుతాను? ఏదైనా ఆరోపణ చేసేముందు కాస్త తమాయించుకుని, ఆలోచించాలి. ఎవరేమనుకున్నా సరేనని కేసుల గురించి నా ఆలోచనలు మీతో పంచుకుంటాను.

ఈ 31 కేసుల్లో పరువునష్టం, ఎస్సీ అత్యాచారం, జాతీయగీతాలాపనలో అమర్యాద, 50 రూ.ల నోటుచించడం వంటి సాధారణ కేసులు కొన్ని ఉన్నాయి. సిబిఐ (11), ఈడీ (7) కేసులనే లెక్కలోకి తీసుకుని మాట్లాడాలి. గుర్తుందా? 2014 ఎన్నికల సమయంలో కూడా ఇవే కేసులున్నాయి, జగన్‌ జైల్లో గడిపి వచ్చాడు కూడా. ప్రచారంలో దీన్ని హోరెత్తించేశారు. అయినా జగన్‌కు 128 లక్షల ఓట్లుపడ్డాయి, మొత్తం ఓట్లలో 45%. తాము నిప్పులమని, తాకితే అవతలివాళ్లు భస్మమై పోతారని చెప్పుకునే బాబు, మోదీ, పవన్‌ల కూటమి కంటె కేవలం 6 లక్షల ఓట్లు (1.6%) తక్కువ మాత్రమే వచ్చాయి. ఇలా తక్కువ రావడానికి తక్కిన కారణాలు కూడా ఉన్నాయి. జగన్‌ అనుభవరాహిత్యం, ఫ్యాక్షనిస్టు అనే ప్రచారం, మైనారిటీ పక్షపాతి అనేముద్ర యిలాటివి..! అప్పటికీ యిప్పటికీ ఆ కేసుల్లో చాలా కేసులు నీరుకారిపోయాయి. ఇక యీ ఎన్నికల్లో వాటి ప్రభావం ఎంత ఉంటుంది?

కేసులను త్వరగా తెమల్చమని సిబిఐ పట్టుబట్టటంలేదు. దానికి కారణం – బిజెపితో ఒప్పందం కావచ్చు, లేదా సరైన ఆధారాలు లేకుండా కేసులు పెట్టినందుకు కోర్టు చివాట్లు వేస్తుందన్న భయం కావచ్చు. ఆ కేసుల పోకడచూస్తే నిందితులు ఒక్కోళ్లు బయటపడిపోతున్నారు, కేసులు కోర్టులో నిలవవని జెడి లక్ష్మీనారాయణకు అప్పుడే చెప్పానని మాజీ చీఫ్‌ సెక్రటరీ రమాకాంత్ రెడ్డి ఓ యింటర్వ్యూలో చెప్పారు. అదే నిజమయ్యేట్లుంది.

జగన్‌ ఆర్థిక నేరాలు చేయలేదని నేనేమీ సర్టిఫికెట్టు యివ్వటంలేదు. అతను ఎప్పటికైనా పట్టుబడితే ఈడీ, ఫెరా వంటి కేసుల్లో చిక్కుతాడు కానీ అవినీతి కేసుల్లో కాదని ఎప్పణ్నుంచో వాదిస్తున్నాను. ఎందుకంటే అవినీతి నిరూపించాలంటే అధికారంలో ఉండాలి. క్విడ్‌ ప్రోకో (నీ కది-నా కిది అంటున్నారు తెలుగులో) ఆరోపణలో కూడా నేరంలో సహకరించినవాళ్లు అప్రూవర్లుగా మారితే తప్ప వాటిని నిరూపించడంలో కష్టాల గురించే ముందు నుంచీ చెపుతూ వచ్చాను. క్విడ్‌ ప్రోకో నిరూపించగలిగినా అధికారాన్ని దుర్వినియోగం చేసిన వైయస్‌ దోషి అవుతాడు తప్ప అతని కుటుంబం కాదని కూడా వాదిస్తూ వచ్చాను. వైయస్‌ తమ మనిషే కాబట్టి, దానిలో తమకు కూడా వాటా ఉంది కాబట్టి అతనికి దెబ్బతగలకుండా, అధికారంలో లేని జగన్‌ మాత్రం దోషిగా నిలబెట్టాలని కేసులు రూపొందించింది, ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెసు. అదే కేసులు వీగిపోవడానికి కారణం కావచ్చు.

ఆ కేసులు పెట్టడంలో రాజకీయం ఉందని జగన్‌ కాంగ్రెసులో ఉండి ఉంటే కేసులు ఉండేవి కావని గులాంనబీ ఆజాద్‌ అనడంలోనే తెలిసింది. ఇప్పుడు నానబెట్టడంలోనూ రాజకీయం ఉంది – జగన్‌ మెడమీద ఆ కత్తి వేళ్లాడగట్టి ఉంచి, తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని కేంద్రంలో అధికారపార్టీ అనుకుంటుంది. మరి జైలు సంగతేమిటంటారా? ఒక్క కేసూ నిరూపితం కాకుండానే నెలల తరబడి జైల్లో పెట్టగల అధికారాన్ని మన రాజ్యాంగం యిచ్చింది మరి. తనను ధిక్కరించినందుకు సోనియా జగన్‌పై కేసులు పెట్టించింది. తనే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో యిరుక్కుంది. కొంతకాలానికి మోదీ దిగిపోయాక, దింపేసినవాళ్లు మోదీపై కూడా కేసు పెట్టవచ్చు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే వీటికి రెట్టింపు కేసులు బాబు మీద పెట్టవచ్చు.

ఇలా ఎడాపెడా కేసులు పెట్టేసినా, వాటి నడక అనేది పూర్తిగా పాలకాధీనం అనేది మొన్న సిబిఐ కంపు బయటకు వచ్చినపుడు పూర్తిగా తెలిసివచ్చింది. బాబు లాటి వాళ్లపై కేసులు వచ్చినపుడు సిబిఐ దగ్గర స్టాఫ్‌ లేదంటుంది, కోర్టులో జడ్జిలు నాట్‌ బిఫోర్‌ మీ అని పెండింగులో పెట్టేస్తారు. రాజకీయనాయకులలో 99% మంది మీద కేసులు యిలాగే ఉంటాయి. ఎటూ తేల్చకుండా వాళ్లకు 80 ఏళ్లు వచ్చేవరకూ నానుస్తారు. అప్పుడు శిక్ష వేస్తూ తీర్పు వచ్చినా వయోభారం, జాలిచూపండి, జైలుకి పంపకండి అని ప్రార్థిస్తే శిక్ష తగ్గిస్తారు, లేదా ఇంట్లో ఉండే సౌకర్యాలన్నీ జైల్లో సమకూరుస్తారు. ఇదీ మన రాజకీయ వ్యవస్థలో వున్న లోపం. ఎన్నికల ప్రచార సభల్లో మాటలు విసురుకోవడానికి తప్ప, వాటిని లాజికల్‌ కన్‌క్లూజన్‌కు తీసుకురావాలన్న శ్రద్ధ ఎవరికీ ఉండదు. గుజరాత్‌ ఎన్నికల సమయంలో చూడండి – తనను చంపడానికి మన్‌మోహన్‌తో సహా అనేకమంది కాంగ్రెసు నాయకులు పాక్‌తో కుమ్మక్కయ్యారని మోదీ ఆరోపించారు. తర్వాత విచారణ జరిపించి, వారికి శిక్షపడేట్లు చేశారా?

ఇంతకీ కేసుల్లో జైలు కెళ్లినవాణ్ని, అవినీతిపరుడిగా ముద్ర పడినవాణ్ని ఓటర్లు చీదరించుకుంటారా? చీదరించుకుని ఓడిస్తారని నేను చిన్నప్పుడు అనుకునేవాణ్ని. రాజకీయాలు గమనిస్తూ వచ్చాక తెలిసి వచ్చింది – గెలుపుకి యివేమీ ఫ్యాక్టర్లు కాదని, అయి వుంటే లాలూ, జయలలిత, కరుణానిధి, వీరభద్ర సింగ్‌, ఎడియూరప్ప వగైరాలు మళ్లీమళ్లీ నెగ్గేవారే కాదు. వీళ్లే కాదు, హత్యలు చేసి జైలుకి వెళ్లినవాళ్లు కూడా జైల్లోంచి పోటీచేసి నెగ్గిన సందర్భాలున్నాయి. ఎన్నికల సమయంలో కొందరు బాధ్యత గల పౌరులు ఏర్పరచే 'పోల్‌ వాచ్‌' అనో మరో పేరుతోనే కొన్ని సంస్థలు సమాచారం యిస్తూ ఉంటాయి. 'ఇంతమంది అభ్యర్థులపై ఫలానా ఫలానా కేసులున్నాయి, వారిలో కొందరు శిక్షపడి జైలుకి వెళ్లారు' అని. వాళ్లు నెగ్గాక కూడా మళ్లీ యిస్తారు. పార్లమెంటులో 30 లేదా 35 శాతం మంది నేరస్తులే అని. వీటి దారి వీటిదే, నెగ్గేవాళ్లు నెగ్గుతూనే ఉన్నారు. ఎందుకిలా?

మనదేశంలో కేసులు పెట్టడం అతి సులభం. వరకట్నం కేసంటూ యింటి పక్క గోడ మీద నుంచి తొంగిచూసినవాడిపై కూడా కేసు పెట్టేయవచ్చు – కొట్టు కొట్టు అంటూ మా ఆయన్ని ప్రోత్సహించాడని ఆరోపించవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ కేసులైతే చెప్పనే అక్కరలేదు – ఎవరూ వినకుండా పక్కకు పిలిచి కులం పేరుతో అవమానించాడు అని ఫిర్యాదు చేయవచ్చు. ఫలానా కథ రాసి సమాజంలో నైతిక విలువలు దెబ్బతీశాడని, ఫలానా చిత్రం గీసి ఫలానా మతస్తులు మనోభావాలను దెబ్బతీశాడని, ఫలానా నాటకం రాసి ఫలానా వృత్తిలో ఉన్నవారిని కించపరిచాడని, ఫలానా సినిమా తీసి, ఫలానా ప్రాంతీయుల గౌరవానికి హాని కలిగించాడని… యిలా కేసులే కేసులు.

నాకు స్వయంగా తెలిసిన ఓ కేసు సంగతి చెప్తాను వినండి. ఒక స్థలంలో ముగ్గురు అన్నదమ్ములకు వాటాలున్నాయి. ముగ్గురూ కలిసి సంతకాలు పెట్టి, ఒక బిల్డర్‌కు డెవలప్‌మెంట్‌కు యిచ్చారు.  అతను యిద్దరన్నదమ్ముల స్థలాల్లో ఫ్లాట్లు కట్టి అమ్మాడు. మూడో అతను స్థలంగానే అట్టిపెట్టుకున్నాడు. పోనుపోను రేటు పెరిగాక ఫ్లాట్లు కడితే మరింత లాభం వస్తుందని లెక్కవేశాడు. అయితే రియల్‌ ఎస్టేటు పడిపోయింది. తను నష్టపోయాడు కాబట్టి తక్కిన యిద్దరూ గతంలో అనుకున్నదాని కంటె ఎక్కువ వాటా యివ్వాలని పేచీ పెట్టాడు. వీళ్లు ఒప్పుకోలేదు. పదేళ్ల క్రితం డెవలప్‌మెంట్‌కై యిచ్చిన అగ్రిమెంటుపై తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సోదరులపై కేసు పడేశాడు. ఇంతవరకూ అర్థం చేసుకోవచ్చు. వారితో పాటు ఫ్లాట్లు కొన్నవారిని కూడా పార్టీలుగా చేర్చాడు. వాళ్ల మీదా ఫోర్జరీ కేసు కత్తి వేళ్లాడుతోంది. నాలుగేళ్లు దాటినా ఆ కేసు విచారణకు రాలేదు. కేసు ఎడ్మిట్‌ చేసేటప్పుడే, అసలు వాళ్లకేం సంబంధం, వాళ్ల పేర్లు తీసేయ్‌ అనే న్యాయవ్యవస్థ మనకులేదు.

ఇలాటి వ్యవస్థ రాజ్యమేలుతున్నపుడు యిన్ని కేసులున్నాయి, అన్ని కేసులున్నాయి అని చెప్తే విలువేముంటుంది? కానీ కేసులు, కేసులే, వాటి గురించి మాట్లాడవలసినదే. జగన్‌పై కింది కోర్టుల్లో ఉన్న 13 కేసులు ప్రాధాన్యత కలవని తోచదు. సిబిఐ కేసుల్లో 11టిల్లోనూ అభియోగం నమోదు కాలేదు అని ''ఈనాడు'' (మార్చి 23) రాసింది. వీటిలో 2011, 2012, 2013కి చెందిన కేసులు కూడా ఉన్నాయి. అభియోగం కూడా నమోదు కానప్పుడు దోషి అని ఎలా అనగలరు? ఇక ఈడి 2011లో నమోదు చేసిన కేసు పది ఫిర్యాదులు దాఖలు చేసింది. ఇందులో ఆరు ఫిర్యాదులను ఈడి ప్రత్యేకహోదా కలిగిన సిబిఐ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంది. మరో నాలుగు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. వీటిల్లో కూడా 'అభియోగం నమోదు కాలేదు' అనే ''ఈనాడు'' రాసింది. కింది కోర్టుల్లోని కేసుల్లో కూడా కొన్నిటిలో అభియోగాల నమోదు ప్రక్రియ కాలేదు, కొన్నిటిలో విచారణ నిమిత్తం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు అనే రిమార్కు ఉంది. 8 ఏళ్ల క్రితం నమోదు చేసిన కేసులు కూడా కదలటం లేదంటే, అభియోగాలు నమోదు కూడా కాలేదంటే వాటిలో పస ఉన్నట్లే అనుకోవాలా? నాకు తెలియదు. న్యాయకోవిదులు చెప్పాలి.

బాబు కానీ, పవన్‌ కానీ వైయస్‌ హయాం నాటి అవినీతిని జగన్‌ నెత్తిన రుద్దుదామని ప్రయత్నిస్తున్నారు. వైయస్‌ కాంగ్రెసు ముఖ్యమంత్రి. ఆ అవినీతి సహించడంలో కాంగ్రెసు అధిష్టానంకు కూడా బాధ్యత వుంది. మరి ఆ విషయం గురించి బాబు కాంగ్రెసును నిలదీయగలరా? వైయస్‌ వేరే, జగన్‌ వేరే. ఎవరి చేష్టలకు వారిని నిలదీయాలి. లోకేశ్‌ తడబాటులకు బాబుని తప్పుపట్ట్టగలమా? అధికార దుర్వినియోగం చేశాడనడానికి జగన్‌ యిప్పటిదాకా మంత్రి కూడా కాదు. డొల్ల కంపెనీలు పెట్టాడు వంటి ఆరోపణలున్న వ్యాపారస్తులు వేల సంఖ్యలో ఉన్నారు. వారిలో కొందరు టిడిపిలో కూడా ఉన్నారు. జగన్‌ ఎంపీగా కొంతకాలం ఉన్నాడు కాబట్టి  అది అధికారమే కదా అందామంటే, ఆ ముచ్చట చాలా తక్కువకాలమే సాగింది. పైగా సోనియాకు జగన్‌ అంటే 2005 నుంచే మంట అని ''ఆంధ్రజ్యోతి''లో జర్నలిస్టు కృష్ణారావుగారు వివేకానంద రెడ్డి గురించి యీ మధ్య రాసిన ఆర్టికల్‌ చదివితే తెలుస్తుంది. దాని ప్రకారం 2004లో వైయస్‌ సిఎం కాగానే జగన్‌ తన తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు – కడప ఎంపీగా బాబాయ్‌ చేత రాజీనామా చేయించి, ఉపయెన్నికలో తనను గెలిపించి పంపాలని.

వైయస్‌ తల వూపడంతో వివేకాపై యింట్లో ఒత్తిడి పెరిగింది. (జగన్‌ దురుసుగా ప్రవర్తించాడన్న పుకారు అప్పటిదే) అది భరించలేక, యిష్టం లేకపోయినా రాజీనామా లేఖ రాసి స్పీకరుకి యిస్తే, ఆయన సోనియాతో ఒకమాట చెప్పు అన్నాడు. సోనియా ఎపాయింట్‌మెంట్‌ దొరికే లోపున కృష్ణారావు తారసిల్లితే వివేకా తన గోడు చెప్పుకున్నారు. మర్నాటికల్లా యీయన పేపర్లో రాసేశాడు. దాంతో సోనియా భగ్గుమంది. వివేకాను రాజీనామా వెనక్కి తీసుకోమని చెప్పి, వైయస్‌ తరఫున కలిసిన ఉండవల్లితో ''అంతా మీ వైయస్‌ యిష్టమేనా? ఎవర్ని అభ్యర్థిగా నిలపాలో అధిష్టానం చూసుకుంటుంది.'' అని చివాట్లేసింది. అందువలన జగన్‌ అత్యాశ గురించి సోనియాకు 2005 నుంచీ మంట. అలాటప్పుడు ఎంపీగా అతను అధికారం చెలాయిస్తే ఊరుకునేదా? జగన్‌ ఎంపీ అయిన కొద్ది నెలలకే తండ్రి చనిపోవడం, అప్పణ్నుంచి సోనియాతో వైరుధ్యం ప్రారంభమై పోయాయి. ఇక అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి చేసే అవకాశం జగన్‌కు ఎక్కడిది?

నేతల అవినీతి జాబితాలే కాదు, వాళ్ల ఆస్తుల పట్టీ, ఐదేళ్లలో యింత పెరిగాయి చూశారా లాటి వ్యాఖ్యలూ కూడా ఓటర్ల మీద ప్రభావం చూపించటం లేదని గ్రహించాను. ఓటుకి వేల రూపాయలు వెదజల్లే వాళ్ల దగ్గర డబ్బు లేదని అనుకునేటంత చవటలు కారు వారు. నాయకుల పేర ఉందో, వాళ్ల కుటుంబసభ్యుల పేర ఉందో, బినామీల పేర ఉందో అవన్నీ లోతుగా పరిశీలించరు. గమనిస్తే ఒక వాస్తవం బోధపడుతుంది. నైతిక ప్రవర్తన పట్ల మధ్యతరగతి పట్టణ ప్రజలు స్పందించినంత యిదిగా గ్రామీణులు, పేదలు స్పందించరు.

దానికి మూలం గిరిజనుల్లో కనబడుతుంది. ఎవరైనా తప్పు పని చేస్తే, ఊరికే సాగదీయరు. కాస్త పంచాయితీ నడిపి, జరిమానా విధించి, ఆ డబ్బుతో అందరూ తాగేసి, మాఫ్‌ చేసేస్తారు. పట్టణ మధ్యతరగతి జనాభాలోనే అలాటి విషయాలపై రగడ జరగడాలు, పరువు కోసం ఆత్మహత్యలు చేసుకోవడాలు కనబడతాయి. గ్రామాల్లో అనేక విషయాల్లో అందరికీ సంగతి తెలిసినా, గుంభనగా ఉంటారు. ఒక రకమైన లీనియంట్‌ వ్యూ ఉంటుంది. భారత జనాభాలో గ్రామీణులు, పేదలు ఎక్కువ కాబట్టే యీ అవినీతి, అక్రమసంబంధాలు వంటి విషయాలపై స్పందన తీవ్రంగా ఉండటం లేదనుకుంటా. వీటిపై సోషల్‌ మీడియాలో గుండెలు బాదుకునేది మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాళ్లే. మళ్లీ వీళ్లంతా సవ్యంగా టాక్స్‌ కడుతున్నారా అంటే అదీ ఉండదు. టాక్స్‌ హేవెన్‌ ఏదైనా దొరికితే అక్కడికి నిధులు మళ్లిస్తారు, బినామీ ఆస్తులు కొంటారు, లంచాలిచ్చి పని చేయించుకుంటారు. ఇదేమిటంటే నాయకులు లక్షల కోట్లు తినేస్తున్నారు, నాదేముంది, పిసరంత అంటారు. మళ్లీ అన్నా హజారే రావాలి, అవినీతి నశించాలి అంటూ ఫార్వార్డ్‌లు పంపుతారు.

నేను బొత్తిగా సినికల్‌గా రాస్తున్నానని అనుకోవచ్చు మీరు. అవినీతికి వ్యతిరేకంగా ఓటర్లు తిరగబడిన సందర్భాలు లేవా అంటే అవీ కొన్ని ఉన్నాయి. అవినీతి కానీ, అధికార జులుం కానీ తమ దైనందిన జీవితాలను స్పృశించినప్పుడు రియాక్టవుతారు. అదీ ఒక హద్దు దాటినప్పుడు మాత్రమే! కాస్త లంచం యిస్తే ప్రభుత్వాఫీసులో పని అయిపోతున్నంత సేపు ఊరుకుంటారు, భారతీయుడిలా కత్తి తీసుకుని పొడిచేయరు, పై అధికారులకు పిటిషన్లు రాయడం టైము దండగ అనుకుంటారు. కానీ అధికారి హద్దు మీరి పీడించినప్పుడు, ఫలానా వాళ్లు సిఫార్సు చేస్తే తప్ప రేషన్‌ కార్డు యివ్వం అన్నప్పుడే రగులుతారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. అదే ఆ ప్రభుత్వ పెద్దలు కార్పోరేట్లతో కుమ్మక్కయి భూములిచ్చేశారుట, కాంట్రాక్టర్లతో కమిషన్లు పంచుకున్నారట అంటే ఓహో అలాగా అనుకుంటారు కానీ రక్తపు పోటు తెచ్చుకోరు ఎందుకంటే అది వారి దైనందిన జీవితాన్ని ప్రభావితం చేయవు.

ఏతావతా జగన్‌పై కేసులనేవి మన మధ్య చర్చకే పనికి వస్తాయి తప్ప పోలింగుపై ఎఫెక్ట్‌ పడదని నా అభిప్రాయం. పడి వుంటే 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి కోటీ 28 లక్షల మంది ఓట్లేసేవారు కాదని నా వాదన.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2019)
[email protected]

ఎమ్బీయస్‌: రక్షకుడో? తక్షకుడో? – 1/2

ఎమ్బీయస్‌: రక్షకుడో? తక్షకుడో? – 2/2