cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సిబిఐ - ఆస్థానా ఆ స్థానానికి వచ్చిన వైనం

ఎమ్బీయస్‌: సిబిఐ - ఆస్థానా ఆ స్థానానికి వచ్చిన వైనం

సిబిఐలో వచ్చిన సంక్షోభం గురించి వినే వుంటారు. గత ప్రభుత్వాల హయాంలో సిబిఐ డైరక్టర్లపై కేసులూ అవీ విన్నవే. ఈసారి ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య ఒకరిపై మరొకరు కక్షతో రచ్చ కెక్కి ఒకళ్ల పరువు మరొకరు, యిద్దరూ జమిలిగా సంస్థ పరువు తీసుకున్నారు. వీరిద్దరూ యీ ప్రభుత్వ హయాంలో నియమితులైనవారే, ఇద్దరూ మోదీకి కావలసినవారే. అయితే యిద్దరిలో ఆస్థానా కాస్త ఎక్కువ 'కావలసినవాడు'. తమ మధ్య పోరాటంలో అతనికి ఎక్కువ మద్దతు లభిస్తూండడం చూసి అలోక్‌ వర్మ మోదీని ధిక్కరించసాగాడు. ఇద్దరూ యిలా తయారవడంతో ప్రభుత్వానికి తలనొప్పి వచ్చి పడింది, యింతకుముందు ఎన్నడూ కనీవిని ఎరుగని చర్యలు తీసుకుంది. వివాదం యింకా నడుస్తోంది. ఈ సందర్భంగా యితర ఇన్వెస్టిగేటింగ్‌ ఏజన్సీలలోని అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా బయటకు వచ్చింది. దీన్ని మూడు వ్యాసాల్లో కవర్‌ చేద్దామని ప్రయత్నం. మొదటిదానిలో ఆస్థానా ప్రస్థానం గురించి రాస్తున్నాను.

57 ఏళ్ల రాకేశ్‌ ఆస్థానా యిప్పటి ఝార్‌ఖండ్‌లో పుట్టాడు. తండ్రి సైన్సు టీచరు. ఇతను రాంచీలో చదువుకుని, మొదటి ప్రయత్నంలోనే 1984లో ఐపిఎస్‌కు సెలక్టయ్యాడు. గుజరాత్‌కు కేటాయించబడ్డాడు. ఆనంద్‌ జిల్లాలో పెట్లాడ్‌లో సబ్‌డివిజనల్‌ పోలీసు ఆఫీసురుగా నియమితుడయ్యాడు. పదేళ్లపాటు అంచెలంచెలుగా ప్రమోషన్లు వచ్చి జామ్‌నగర్‌, పాటన్‌లలో ఎస్పీగా, అహ్మదాబాద్‌లో డిసిపిగా పని చేశాడు. 1995లో సిబిఐకు డెప్యుటేషన్‌పై వెళ్లాడు. బిహార్‌లోని ధన్‌బాద్‌లో ఎస్పీగా పోస్టింగు యిచ్చారు. 1996లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ యిరుక్కున్న రూ. 950 కోట్ల పశుగ్రాసం కుంభకోణం సిబిఐకు అప్పగించారు. సిబిఐలో జాయింట్‌ డైరక్టరు (ఈస్ట్‌)గా పని చేస్తున్న యుఎన్‌ బిశ్వాస్‌ దాని విచారణ చేపట్టాడు. ప్రశ్నించవలసినది మాజీ ముఖ్యమంత్రియైన జగన్నాథ్‌ మిశ్రాను, ముఖ్యమంత్రి ఐన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను! 

లాలూ 1995 ఎన్నికలలో నెగ్గి ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా వెలుగుతున్నాడు. అతన్ని స్టేషన్‌కు రప్పించాలంటే చాలా గట్స్‌ ఉండాలి. ఆస్థానాకు ధైర్యవంతుడిగా, నిజాయితీపరుడిగా ఉన్న పేరు చూసి బిశ్వాస్‌ ఆ పని అతనికి అప్పగించాడు. తన మూకబలంతో లాలూ ఆస్థానాను బెదరగొట్టబోయాడు కానీ అతను జంకలేదు. ముఖ్యమంత్రి యింటిపై దాడి జరిపి సోదాలు చేయించాడు కూడా. కేసు ఎంత పకడ్బందీగా తయారు చేశాడంటే లాలూ దానిలోంచి బయటపడలేక పోయాడు. 1997లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జైలుకి వెళ్లాడు.

ఇది అప్పటి బిజెపి అధ్యక్షుడు ఆడ్వాణీని ఎంతగానో మెప్పించింది. ఎందుకంటే రథయాత్ర చేస్తున్న ఆడ్వాణీని అరెస్టు చేయించి, 'సెక్యులర్‌' వీరుడిగా వెలిగిపోతున్న లాలూపై అవినీతిపరుడి ముద్ర బలంగా కొట్టగలిగాడు ఆస్థానా! దాణా కేసు పూర్తయ్యాక అప్పటి కేంద్ర హోం మంత్రిగా ఉన్న ఆడ్వాణీ అతన్ని గుజరాత్‌కు బదిలీ చేయించాడు. ఈ విధమైన గుర్తింపు రావడం అతనిలో మార్పు తెచ్చిందని తెలిసినవాళ్లు అంటారు. అప్పటివరకు బిడియస్తుడిగా, ప్రచారం గిట్టనివాడిగా, ముక్కుకు సూటిగా పోయేవాడిగా ఉన్నతను, రాజకీయనాయకులతో సన్నిహితంగా మెలగేవాడిగా హై ప్రొఫైల్‌ పోలీస్‌మన్‌గా మారాడట. గతంలో ఎంతో మొహమాటస్తుడిగా ఉన్న ఆస్థానా నాలుగేళ్ల క్రితం తనను ఆకాశానికి ఎత్తివేయించుకుంటూ, పటేల్‌, బోసులతో పోల్చుకుంటూ ఓ ఎన్‌జిఓతో వీడియో చేయించుకున్నాడు. అతనిలో వచ్చిన మార్పుకి యిదో ఉదాహరణ అంటారు అతని స్నేహితులు. 

2002లో గోధ్రా రైల్వే స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులున్న బోగీ తగలబడడం, దానిలో 59 మంది కాలిచచ్చిపోవడం అతని జీవితాన్ని మార్చివేసింది. అది ఎందుకు, ఎలా తగలబడిందో నిర్ద్వంద్వంగా చెప్పినవాళ్లు లేరు. దాని మీద వేసిన విచారణ కమిటీలు కూడా పలు రకాలుగా చెప్పాయి. అయితే ఆస్థానా నేర్పు ఎక్కడుందంటే ఆ సంఘటనలోంచి ఒక కుట్రను తయారుచేయగలిగాడు. ఇది కరసేవకులకు వ్యతిరేకంగా పన్నబడిన కుట్ర, మౌల్వీ సయీద్‌ ఉమర్జీ అనే అతను ప్రధాన కుట్రదారు అని కేసు తయారుచేశాడు. ఇది అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి మోదీకిి బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. దుర్ఘటన కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది అని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉమేశ్‌ బెనర్జీ యిచ్చిన రిపోర్టును గుజరాత్‌ ప్రభుత్వం పక్కన పడేసి ఆస్థానా తయారుచేసినదాన్నే స్వీకరించింది. 100 మంది ముస్లిములను అరెస్టు చేసింది. వారిలో కొందరు కస్టడీలో చనిపోయారు. 2011లో గుజరాత్‌ హైకోర్టు ఆ కేసు విచారించి, మౌల్వీతో సహా 63 మందిని వదిలేసింది. తక్కినవారికి శిక్షలు పడ్డాయి. 

గోధ్రా విచారణ తర్వాత మోదీకి ఆస్థానా తెగ నచ్చేశాడు. సూరత్‌, వడోదరలలో పోస్టింగులు యిచ్చాడు. వడోదరలో ఉండగానే ఆస్థానాకు అక్కడి వాణిజ్యవర్గాలతో స్నేహం ఏర్పడింది. స్టెర్లింగ్‌ బయోటెక్‌ కంపెనీ సొంతదారులైన సందేశరా సోదరులు - చేతన్‌, నితిన్‌ ఆత్మీయులయ్యారు. అతని గాంధీనగర్‌ యింటిని వాళ్ల కంపెనీకి అద్దెకు యిచ్చాడు. ఆ స్నేహమే యిప్పుడు పీకకి చుట్టుకుంది. 2017లో వాళ్లు రూ. 5,000 కోట్ల బ్యాంకింగ్‌, మనీ లాండరింగ్‌ ఫ్రాడ్స్‌లో యిరుక్కున్నారు. అరెస్టు కాకుండా దుబాయి పారిపోయారు. వాళ్ల డాక్యుమెంట్లలో దొరికిన డైరీల్లో ఆర్‌ఏకు యిచ్చిన లంచాలు అనే 4 ఎంట్రీలు ఉన్నాయి. వాటి మొత్తం రూ. 3.80 కోట్లు. ఆర్‌ఏ అంటే రాకేశ్‌ ఆస్థానా అని అతని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కాదు, 'రన్నింగ్‌ ఎక్కౌంట్‌' అంటాడితను. అతని కూతురు పెళ్లి తాలూకు సంగీత్‌ 2016 నవంబరు లో సందేశరాలకు చెందిన ఫామ్‌హౌస్‌లో జరిగింది. పెళ్లి అత్యంత విలాసమైన భవనం 'లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌'లో జరిగింది. ఆ సందర్భంగా వచ్చిన అతిథులకు సందేశరాలే హోటల్‌ రూములు బుక్‌ చేశారని వినికిడి. ఇప్పుడు సిబిఐ అధికారులు వెళ్లి ఆ హోటల్‌ వాళ్లను చెల్లింపులు ఎలా వచ్చాయని అడుగుతున్నారు. ఒక సాధారణ పోలీసు అధికారి స్థాయికి అనేక రెట్లు ఎక్కువగా కుమార్తె పెళ్లి జరిగిందట. 

ఇది కాక యింకా అతనిపై ఐదు కేసులు ఉన్నాయి. దీపేశ్‌ చండక్‌ అనే కలకత్తా వ్యాపారి లాలూ దాణా కేసులో అప్రూవరుగా మారి ఆస్థానాకు చాలా ఉపయోగపడ్డాడు. ఈ ఆగస్టులో ఓ కేసు విషయంలో అతని మీద సిబిఐ ఓ ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టరు చేసింది. అతను పారిపోయాడు. గత పరిచయాలతో ఆస్థానాయే అతనికి సహకరించాడని అభియోగం. ఒక ఐఆర్‌ఎస్‌ అధికారిపై అధిక ఆస్తులున్న కేసు నమోదు చేయబడింది. దాన్ని విచారణ చేస్తున్న సిబిఐ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడని మరో మరో ఆరోపణ. సిబిఐ, ఈడి అనుమానిస్తున్న కొందరు వ్యక్తులతో సన్నిహితంగా ఉంటున్నాడని యింకో ఆరోపణ.

గుజరాత్‌లో ఏ కష్టం వచ్చినా మోదీ ఆస్థానాను నమ్ముకున్నాడు. 2008లో అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. గుజరాత్‌ను శాంతిభద్రతలకు నిలయంగా చూపిద్దామనుకున్న మోదీకి యిది యిబ్బందిగా మారింది. ఆస్థానాను పురమాయించాడు. అతను వెంటనే ఇండియన్‌ ముజాహిదీన్‌ను, లష్కరె తొయిబాను దీనిలోకి లాక్కుని వచ్చాడు. 22 రోజుల్లో విచారణ ముగించేశాడు. స్థానిక ముస్లిములు అనేకమంది అరెస్టయిపోయారు. ఆ సంస్థలు గుజరాత్‌లో ఎలా అడుగుపెట్టాయి, దానికి ముందూ తర్వాత ఏం చేశాయ్‌ అనేది నిరూపించవలసిన పనే లేకపోయింది. సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు కూడా 'ఆస్థాన' పరిశోధకుడు చేపట్టినదే! ఆశారామ్‌ బాపూ మోదీ ఆదరణలోనే ఎదిగాడు. కానీ అతను అత్యాచారాలు పూర్తిగా వెలుగులోకి రాగానే, మోదీ అతనికి దూరం జరిగాడు. అతని పట్ల, అతని కొడుకు నారాయణ సాయి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నానన్న సందేశం పంపడానికి ఆస్థానాను నియోగించాడు. అతను వెంటనే వాళ్లను అరెస్టు చేసి, కేసులు తయారుచేశాడు. 

అలాగే హార్దిక్‌ పటేల్‌ పటేల్‌ ఉద్యమం నడుపుతున్నపుడు, ఆస్థానా అతనిపై ఏకంగా దేశద్రోహం కేసు తయారుచేసి, నెలల తరబడి జైల్లో ఉండేట్లు చేసి, ఆ ఉద్యమానికి బ్రేకులు వేశాడు. ఇలా గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వానికి ఆపద్రక్షకుడిగా ఉంటూ వచ్చిన ఆస్థానాను మోదీ సిబిఐకు తీసుకుని వచ్చి అత్యున్నత పదవి యిచ్చి సత్కరిద్దామనుకున్నాడు. దానికి తయారీగా కేబినెట్‌ కమిటీ నిర్ణయం ద్వారా 2016 అక్టోబరులో ప్రమోషన్‌ యిచ్చి సిబిఐలో అదనపు డైరక్టరుగా నియమించి అతని ద్వారా వ్యవహారాలు చక్కబెట్టబోయాడు. కానీ అప్పటి సిబిఐ డైరక్టర్‌ అనిల్‌ సిన్హా కొరకరాని కొయ్యలా ఉండి, ఆస్థానాకు ముకుతాడు వేశాడు. 2016 డిసెంబరు 2 న అనిల్‌ రిటైర్‌ కాగానే అతని స్థానంలో ఆస్థానాను వేద్దామనుకున్నాడు మోదీ. 

గతంలో అయితే ప్రధాని ఒక్కడే నియమించగలడు. కానీ లోక్‌పాల్‌ చట్టం వచ్చాక ప్రధాని, చీఫ్‌ జస్టిస్‌, ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ నిర్ణయించాలి. అప్పటికే ఆస్థానాపై ఆరోపణలున్నాయి. చీఫ్‌ జస్టిస్‌ ఆమోదముద్ర వేయకపోవచ్చు. ముఖ్యంగా అందరి కంటె సీనియర్‌గా ఉండి, 2 జి, కోల్‌ గేట్‌, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వంటి ముఖ్యమైన కేసుల్లో తన ప్రతిభ కనబరచి అప్పటికి స్పెషల్‌ డైరక్టరుగా ఉన్న రూపక్‌ కుమార్‌ దత్తాను ఎందుకు పక్కకు పెడుతున్నావన్న ప్రశ్న రావచ్చు. దత్తా 1981 బ్యాచ్‌ వాడు. సిబిఐలో 18 ఏళ్లగా పని చేస్తున్నాడు. 2017 అక్టోబరు వరకు సర్వీసు ఉంది. అందువలన డిసెంబరు 2కు 48 గంటల ముందు నవంబరు 29 రాత్రి 8 గం.లకు దత్తాను హోమ్‌ ఎఫయిర్స్‌ (ఇంటర్నల్‌ సెక్యూరిటీ)లో సెక్రటరీగా బదిలీ చేసేశారు. 

అలా దత్తా అడ్డు తొలగించి ఆస్థానాను 2016 డిసెంబరులో తాత్కాలిక డైరక్టరుగా నియమించారు. ఆ నిర్ణయాన్ని కాంగ్రెసు విమర్శించింది. ప్రత్యామ్నాయం వెతకవలసిన అవసరం పడింది. మోదీకి కన్నూ, ముక్కూ, చెవీ ఐన అజిత్‌ దోవల్‌ తనకు అత్యంత సన్నిహితుడైన అలోక్‌ వర్మ పేరు సూచించాడు. అలోక్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 1979 ఐపిఎస్‌ బ్యాచ్‌కు చెందిన వాడు. చీఫ్‌ జస్టిస్‌ జెఎస్‌ ఖేహర్‌, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలకు అతనిపై అభ్యంతరాలు లేవు. దాంతో ఆస్థానా నెలన్నరలోనే 2017 జనవరిలో డైరక్టరు గద్దె నించి దిగిపోయి అలోక్‌కు అప్పగించవలసి వచ్చింది. ఇది అతన్ని బాధించింది. ఇక అప్పణ్నుంచి అలోక్‌ పై కత్తి కట్టాడు. సిబిఐలో సమాంతర అధికార కేంద్రం నడపసాగాడు. దానికి ప్రధాని ఆశీస్సులున్నాయి. రైల్వే మంత్రిగా లాలూ హోటళ్ల కేటాయింపులో చేసిన అవినీతి కేసు, కాంగ్రెసు నాయకులు యిరుక్కున్న 2013 నాటి అగస్టావెస్ట్‌ల్యాండ్‌ డిఫెన్స్‌ కేసు, బొగ్గుగనుల కేటాయింపు కేసు, చిదంబరంకు, కార్తీకి వ్యతిరేకంగా ఉన్న ఐఎన్‌ఎక్స్‌, కేసు, విజయ్‌ మాల్యా కేసు... యిత్యాది ముఖ్యమైన కేసులన్నీ ఆస్థానాకే అప్పగించారు. 

అంతేకాదు, 2017 అక్టోబరులో అతన్ని స్పెషల్‌ డైరక్టరుగా చేసి అలోక్‌కు పోటీగా నిలబెట్టారు. అలోక్‌ మరింత మండిపడ్డాడు. 20 నెలల పాటు సాగిన వారి ప్రచ్ఛన్నయుద్ధం యీ అక్టోబరులో వీధిన పడింది. సిబిఐ నియామకాలను పర్యవేక్షించవలసిన సివిసి (సెంట్రల్‌ విజిలెన్సు కమిషన్‌) ప్రధాని కార్యాలయం చెప్పినట్లు ఆడింది. డైరక్టరుగా ప్రమోషన్‌ యివ్వవలసిన దత్తాను ఎందుకు  బదిలీ చేశారని కానీ, అవినీతి ఆరోపణలు పెండింగులో ఉన్న ఆస్థానాను తాత్కాలిక డైరక్టరుగా, దరిమిలా స్పెషల్‌ డైరక్టరుగా ఎలా నియమించారని కానీ అడగలేదు. పైగా ఆ నియామకాన్ని ప్రశ్నించిన అలోక్‌నే వేధించింది. దాంతో అతను సివిసితో కూడా శత్రుత్వం వహించాడు. ఇప్పుడు సుప్రీం కోర్టు సివిసిని కూడా నమ్మటం లేదు. ఆ వివరాలన్నీ రెండవ, మూడవ వ్యాసాలలో వస్తాయి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2018)
mbsprasad@gmail.com