''రాముని మించిన రాముడు'' అని ఎన్టీయార్ డబుల్ రోల్ సినిమాకు మూలం ''హమ్ దోనో'' అనే హిందీ సినిమా. రెండింటికీ మధ్య దశాబ్దంన్నర గ్యాప్ వుంది. మిలటరీలో పనిచేసే యిద్దరు వ్యక్తులు ఒకేలాగ వుంటారు. ఇద్దరిదీ ఒకే వూరు. ఒకతను చావుబతుకుల్లో వున్నపుడు అవతలివాణ్ని ఓ కోరిక కోరతాడు. అతనిమీద గౌరవం కొద్దీ యితను సరేనంటాడు. దానితో చాలా చిక్కుల్లో పడతాడు. ఈ కథను హిందీలో సింపుల్‌గా తీస్తే, తెలుగులో కథను చాలా మెలికలు తిప్పి డ్రామా పెంచారు.
హిందీ సినిమాలో ఆర్మీలో మేజర్ వర్మ అనే అతను కెప్టెన్ ఆనంద్ ఒకేలా వుంటారు. వర్మ వివాహితుడు. ఓ రోజు అతని భార్య ఫోటో వున్న పర్సు పోతే అది వెతికి పట్టుకుని యిచ్చాడు కెప్టెన్ ఆనంద్. ఆ విధంగా యిద్దరికీ స్నేహం కుదిరింది. ఇద్దరూ ఒకే బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఒకరి కథలు మరొకరికి చెప్పుకున్నారు. కెప్టెన్ ఆనంద్ సైన్యంలో చేరడానికి కారణం అతని ప్రేమ ఫలించకపోవడం. నిరుద్యోగి ఐన ఆనంద్‌కు సాధన ప్రేయసిగా వుంది. ఇతనికి తల్లి తప్ప వేరే ఆస్తి లేదు. ఆమెకు తండ్రితో బాటు బోల్డు ఆస్తి వుంది. ఇతన్ని వచ్చి తండ్రితో మాట్లాడమని పోరింది. ఉద్యోగమైనా లేదు కదా అని యితని బాధ. కాదూ కూడదంది సాధన. ఇక తప్పక వెళ్లాడు. ఆయన కూచోబెట్టి క్లాసు తీసుకున్నాడు. డబ్బు లేనివాడివి కదా, నా కూతుర్ని ఎలా పోషిస్తావన్నాడు. ఇల్లరికం వుండమంటే నొచ్చుకుంటావ్. ఇంతటి సౌఖ్యాల్లో బతికిన నా కూతురు నీ యింట్లో వుండగలదా? అని అడిగాడు. కాస్సేపు బాధపడి సర్లే చేసుకో అన్నాడు. కానీ అప్పటికే యితను యింట్లోంచి బయటకు వచ్చేశాడు
అప్పటికప్పుడు ఉద్యోగం యిచ్చేవాడెవడు? ఆర్మీలో చేరదామనుకున్నాడు. విని తల్లి గొల్లుమంది. నువ్వు తిరిగి రాకుండానే కన్నుమూస్తానేమో నంది. అయినా వచ్చేశాడు. ఆర్మీలో వచ్చి కెప్టెన్ అయ్యాడు కానీ ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాడు. ఆ అమ్మాయి తనను మర్చిపోయి వేరే వాళ్లను పెళ్లి చేసుకుందేమోననుకున్నాడు. కానీ ఆ అమ్మాయి అలాటిది కాదు. ఆనంద్‌తో పెళ్లయిపోయినట్టే భావించుకుని వచ్చి అత్తగారిని సేవించుకుంటోంది. తండ్రి వచ్చి యింటికి రమ్మనమని అడిగినా రానంది. ఇవన్నీ యితనికి తెలియవు. అతని గాథ విని వర్మ ఆనంద్‌తో నీ ప్రేమ నిజమైనదైతే ఫలిస్తుందిలే అన్నాడు. ఇంతలో యుద్ధం వచ్చింది. యుద్ధంలో మేజర్ కాలు దెబ్బతింది. ఆనంద్ అతన్ని పంపించేసి తనే శత్రువులను ఎదుర్కొంటానన్నాడు. కానీ వర్మ ''నేను సగం చచ్చినట్టే యిక్కడే వుంటాను, చాలామంది వున్నట్టు శత్రువును భ్రమింపజేస్తాను. మీరెళ్లిపోండి. ఇది నా ఆర్డర్'' అని బెటాలియన్‌కు చెప్పాడు. ఆనంద్‌ను విడిగా పిలిచి 'నా చావు కబురు మా యింట్లో చెప్పు. నా తల్లిని నీ తల్లిగా చూసుకో. నా భార్యను నీ వదినగా చూసుకో.' అన్నాడు. ఇతను సరేనన్నాడు.
తెలుగులో కెప్టెన్ ఆనంద్ పాత్రలో చాలా మార్పులు తీసుకొచ్చారు. అతను నిరుద్యోగం వలన ఆర్మీలో చేరలేదు. అతను ఓ డాక్టర్. పేరు డాక్టర్ రామచంద్ర. మనసున్న డాక్టర్. స్వంత డబ్బు పెట్టి రోగులకు మందులు కొనే రకం. డబ్బున్నవాడికే ముందుగా వైద్యం చేయాలని అని చీఫ్ ఒత్తిడి చేస్తే గవర్నమెంట్ ఆస్పత్రి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే అతని అదృష్టం. ఓ డబ్బున్నతని కూతురు వాణిశ్రీ అతనంటే యిష్టపడింది. అతనివద్ద పేషెంటుగా చేరి, ఆతని వైద్యం వలన బాగుపడింది. ఆమె తండ్రి ప్రభాకరరెడ్డి యితనికోసం ఓ ఆస్పత్రి కట్టి యిచ్చాడు. అతనికి ఉద్యోగం యిచ్చాడు. ఆ కొంటె అమ్మాయి అంతటితో ఆగలేదు. పెళ్లి ప్రపోజలు తనే తెచ్చింది. తండ్రి రాసినట్టు ప్రియుడికి, ప్రియుడు రాసినట్టు తండ్రికి ఉత్తరాలు రాసి యిద్దరిచేతా ఔననిపించింది. హిందీలో అమ్మాయి తండ్రి అబ్బాయికి డబ్బు లేదని వీళ్ల ప్రేమను ఒప్పుకోలేదు. తెలుగు తండ్రి ఒప్పేసుకుని కథ యింత సాఫీగా వెళిపోతే ఎలా? ఇక్కడో మెలిక పెట్టారు మనవాళ్లు. నిజానికి మన హీరో ఓ అనాథ. అతన్ని పసిబిడ్డగా వున్నపుడే తీసుకుని ఓ వేశ్య పెంచి పెద్ద చేసింది. అతనికి యివేమీ చెప్పకుండా అక్క అని చెప్పుకుంటూ ఒళ్లు అమ్ముకుని యితన్ని డాక్టరీ చదివించింది. ఇప్పుడవన్నీ మానేసింది. హీరో యీమెను దేవతలా ఆరాధిస్తాడు.
హీరోయిన్ అనుకోకుండా ఊరెళ్లినపుడు పెళ్లి మాటలు మాట్లాడదామని వీళ్ల యింటికి వచ్చిన ప్రభాకరరెడ్డిి ఈ అక్కను గుర్తు పట్టాడు. ఎందుకంటే అతను ఒకప్పుడు ఈమె క్లయింట్. నీలాటి దాని పెంపకంలో పెరిగిన వాణ్ని అల్లుడిగా చేసుకోను అన్నాడు. సమయానికి వచ్చిన హీరో కాబోయే మావగారిని తిట్టిపోశాడు. దీనికి ప్రతీకారంగా హీరోయిన్ తండ్రి అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు. ఆసుపత్రిలో అడుగుపెట్టవద్దన్నాడు. ఆ విధంగా బీదసాదలకు సాయం చేసే అవకాశం పోయింది కదాని బాధపడుతూ యిల్లు చేరిన హీరోకి మరో దుర్వార్త. ఇంతకాలం తనను అభిమానంతో పెంచిన అక్క ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. 'నిన్ను డాక్టర్‌ను చేయాలన్న నా లక్ష్యం మంచిదే అయినా దానికి అవలంబించిన మార్గం మంచిది కాకపోవడం వలన ఈ అవస్థ వచ్చింది. నేను వెళ్లిపోతున్నాను. నా నీడ పడకుండా నీ జీవితాన్ని మలచుకో' అని వుత్తరం రాసింది. హతాశుడైన హీరో ఒంటరియై ఆర్మీలో డాక్టర్‌గా చేరాడు. హీరోయిన్ ఊరినుండి తిరిగి వచ్చాక విషయం తెలిసి తండ్రిమీద మండిపడి ఆత్మహత్య చేసుకుంటానంది. ఆర్మీలోకి వెళ్లిన డాక్టర్ రాముకి, మేజర్ రఘు తారసిల్లాడు. ఇద్దరిదీ ఒకే పోలిక. నా తల్లి నాకోసం తల్లడిల్లుతుంది అంటాడు మేజర్. అంతలో బాంబ్ ఎటాక్. మేజర్ చావుబతుకుల్లో వుండగా హిందీలో లాగే ఓ బాధ్యత అప్పగించాడు.
ఇప్పుడు హిందీ సినిమాకు వద్దాం. కెప్టెన్ ఆనంద్ ఆర్మీలో వుండగానే అతని తల్లి సాధన చేతుల్లో పోయింది. సాధన అక్కడే ఆ యింటికే అంకితమై పోయి వుండిపోయింది. ఆనంద్ తిరిగి వచ్చాడు. తలుపు తాళం వేసివుండడం చూసి తల్లి ఎక్కడికో వెళ్లిందనుకుని మంచం మీద విశ్రమించాడు. ఇంతలో సాధన వచ్చి అతని పక్కన కూచుంది. నిద్ర లేచి చూసిన ఆనంద్ సాధన అదే మొదటిసారి వచ్చిందనుకుని నిష్ఠూరంగా మాట్లాడాడు. ఆ తర్వాత ఆమె తనకోసం చేసిన త్యాగం అర్థమయ్యాక ఆనంద్ ఆమెను పొగిడి, మేజర్ వర్మ తనకు అప్పగించిన పని పూర్తి చేయడానికి వెళ్లాడు. వర్మ యిల్లు కూడా ఆ వూళ్లోనే. అప్పటికే వాళ్లకి ఆర్మీవాళ్లు అతను కనబడటం లేదని టెలిగ్రాం పంపారు. దాంతో మేజర్ భార్యకు హార్ట్ ఎటాక్ వచ్చేసింది. ముసలితల్లికి ముందే అనారోగ్యం. ఆ సమయంలో యితను వెళ్లి మేజర్ పోయాడని చెప్పాలి. చెప్పబోయేంతలో మేజర్ తల్లి యితన్ని బేటా అంటూ వాటేసుకుంది. అప్పుడే తల్లిని పోగొట్టుకున్న ఆనంద్‌కు యీ తల్లిని చూస్తే జాలి వేసింది. నిదానంగా నిజం చెపుదామను కుందామనుకుంటూ వుంటే మేజర్ భార్య నందా వచ్చి ఆనందంతో స్పృహ కోల్పోయింది.
ఆమెను చూడడానికి వచ్చిన డాక్టర్‌తో ఆనంద్ నిజం చెప్పేశాడు. డాక్టర్ ఉలిక్కిపడ్డాడు. కానీ యీ నిజం చెపితే మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చి నందా చనిపోవడం ఖాయం అన్నాడు. మేజర్ నన్ను మరిదిగా వుండమన్నాడు. ఆమె భర్తగా ఎలా నటించగలను? అన్నాడితను. మేజర్‌కి మాట యిచ్చినపుడు యీ విషయం ఆలోచించాల్సింది అన్నాడు డాక్టర్. ఈ విషయం సాధనకు చెప్పడానికి ఆనంద్‌కు నోరు రాలేదు. కాస్త సర్దుకున్నాక చెప్దాంలే అనుకున్నాడు. అప్పుడప్పుడు యింటికి వచ్చి వెళుతున్నాడు. నేను నీ వెంటనే వున్నాను అంటోంది సాధన. అవతల మేజర్ భార్య నందా అతనిలో ఏదో తేడా గమనిస్తోంది. దేహం మారలేదు కానీ ఆత్మ మారింది అంటోంది. అతని స్నేహితులు వచ్చి మీసం తీసేసావేమిటని వేళాకోళం చేస్తున్నారు. ఎందుకంటే వర్మకు మీసం వుండేది. ఆనంద్‌కు లేదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)