Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఈ బ్రాండింగ్ హానికరం

ఎమ్బీయస్‍: ఈ బ్రాండింగ్ హానికరం

టిడిపిని కమ్మలకు పరిమితం చేయడం టిడిపి వ్యతిరేకులు చేయడానికి ప్రయత్నిస్తూంటే అర్థం చేసుకోవచ్చు. కానీ టిడిపి హితైషులు కూడా అలా చేయడం అర్థం కావటం లేదు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన ‘‘కొత్త పలుకు’’ ద్వారా ముందుకు తెచ్చిన వాదన కమ్మల్లో కొందరికి జీర్ణం కావటం లేదు. ఇది కమ్మ కులస్తులందరికీ యిబ్బంది తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని బహిరంగంగా విమర్శిస్తున్నారు కూడా. ఆయనకానీ వేరెవరుకానీ టిడిపికి కమ్మ రంగు పులిమేయడం మాత్రం అభ్యంతరకరం. అలాటి కులపరమైన బ్రాండింగు హానికరం అని చెప్పడమే యీ వ్యాసోద్దేశం.

రాధాకృష్ణ ఏం రాశారో చెప్పబోయే ముందు దానికి దారి తీసిన పరిస్థితులేమిటో గుర్తు చేసుకుందాం. ఆంధ్రలో టిడిపి, జనసేన కలిసినా సరిపోదని, ఆ కూటమిలోకి బిజెపిని ఎలాగైనా తీసుకు రావాలని టిడిపి, దానికి సంబంధించిన మీడియా తెగ ప్రయత్నిస్తున్నాయి. బిజెపి ఎటూ చెప్పకపోవడంతో తెలంగాణ ఆశ పెట్టి, ఆంధ్రలో ఒప్పిద్దామనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణలో అధికారంలోకి వద్దామని బిజెపికి ప్రయత్నిస్తోందని తెలిసి, అలా రావాలంటే తెలంగాణలో టిడిపిని కలుపుకుని పోక తప్పదని వాదించసాగారు. ఆ వాదనకు బలం చేకూర్చడానికి తెలంగాణలో టిడిపికి యిప్పటికీ బలం ఉందని నిరూపించాలని మహా ప్రయత్నించారు. ఖమ్మం సభ విజయవంతమయ్యాక ‘చూశారా, టిడిపి తడాఖా, తెలంగాణలో టిడిపి యిప్పటికీ అనేక చోట్ల బలంగా ఉంది, అందుకని దానితో పొత్తు పెట్టుకోండి’ అని హితోక్తులు చెప్పారు.

బిజెపి తెలంగాణను గెలుస్తుందా లేదా అన్నది టిడిపికి అక్కరలేదు. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆంధ్రలో కూడా పొత్తు పెట్టుకోవాలి అని ఒత్తిడి తెద్దామని వాళ్ల ప్లాను. దాని కోసమే తెలంగాణలో యీ బలప్రదర్శన! ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వేరే రాష్ట్రంలో కూడా పెట్టుకోవాలన్న రూలు లేదన్న మాట ఎలా మర్చిపోతారో అర్థం కాదు. కేంద్రంలో మద్దతిచ్చినా, రాష్ట్రంలో విభేదించిన పార్టీలున్నాయి. మొన్న టివి చర్చలో తెలంగాణ బిజెపి నాయకుడు డా. ప్రకాశరెడ్డి బిజెపి గురించే చెప్పారు.

‘మాకు అకాలీ దళ్‌తో పంజాబ్‌లో పొత్తు ఉండేది, హరియాణాలో లేదు, శివసేనతో మహారాష్ట్రలో ఉండేది, గోవాలో లేదు, ఆంధ్రలో జనసేనతో పొత్తు ఉంది, తెలంగాణలో లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాకు మద్దతివ్వలేదు, అయినా మేం ఆంధ్రలో వారితో పొత్తు తెంపుకోలేదు.’ అని క్లారిఫై చేశారు. ఎక్కడైనా బావ కానీ, వంగతోట దగ్గర కాదు అని మనకు ఎప్పణ్నుంచో సామెత ఉంది.

ఈ విషయం అర్థం చేసుకోకుండా తెలంగాణలో టిడిపితో పొత్తు పెట్టుకోకపోతే బిజెపి నష్టపోతుందని దాన్ని భయపెడుతూ వచ్చింది టిడిపి అనుకూల మీడియా. అయినా బిజెపి బెదరలేదు. టిడిపికి తెలంగాణలో బలం మిగిలి ఉందని క్షేత్రస్థాయిలో ఎక్కడా రుజువులు కనబడలేదు. కూకట్‌పల్లిలో సుహాసిని ఓటమి ఓ పెద్ద ఉదాహరణ. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకై తెరాస, కాంగ్రెసు పార్టీల్లో పోటీ పడుతూండగా టిడిపి తరఫున పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. బలం ఉంటే అలా జరగదు కదా!

ఇంకో విషయం ఏమిటంటే వెంకయ్య నాయుడి ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో బిజెపి బలపడకుండా చేశాడని చంద్రబాబుపై తెలంగాణ బిజెపి నాయకులకు గుర్రు ఉంది. 2014 ఎన్నికలలో పొత్తు పెట్టుకుని టిడిపి పుణ్యాన నగరంలో కొన్ని సీట్లు తెచ్చుకున్నా, ఆ కోపం తగ్గలేదు. 2018 నాటికి టిడిపి బిజెపిని తోసి పారేసి, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంది. దానివలన తాము చాలా దెబ్బ తిన్నామని కాంగ్రెసు యిప్పటికీ బాధపడుతూంటుంది. ఇది కళ్ల ముందు ఆడుతోంది కాబట్టి బిజెపి తెలంగాణ యూనిట్ టిడిపి పట్ల ఏ ఉత్సాహమూ చూపటం లేదు. అందువలన ఆంధ్రజ్యోతి ఎంత ఊదరగొట్టినా అడుగు ముందుకు పడలేదు.

బాబు అరెస్టుతో కథలో కొత్త కోణం వచ్చి చేరింది. ఇన్నాళ్లూ బిజెపి టిడిపి పట్ల ఉదాసీనంగా మాత్రమే ఉంటోందనుకుంటూ వచ్చిన తెలుగు మీడియా ‘అబ్బే కక్ష కట్టింది’ అని అనుకోసాగింది. కేంద్ర బిజెపి మద్దతు లేనిదే జగన్ యింత సాహసానికి ఒడిగట్టడనే నమ్మకం ఎల్లెడలా ఉండటంతో బిజెపిపై కోపం తెచ్చుకున్నారు టిడిపి అభిమానులు. బిజెపిని శిక్షించాలంటే ఆంధ్రలో లాభం లేదు. ఎందుకంటే పోగొట్టుకోవడానికి దానికి అక్కడ ఏమీ లేదు. తెలంగాణలో ద్వితీయ స్థానంలో ఉండి, యిప్పుడు తృతీయ స్థానానికి జారింది కాబట్టి, చూస్కో ఏం చేస్తామో అని అడలగొట్టడానికి పూనుకున్నారు.

బిజెపికి ప్రధాన శత్రువు కాంగ్రెసు కాబట్టి, అది తెరాసను ఓడించడమూ, లేక బలమైన ప్రతిపక్షంగా అవతరించడమూ బిజెపికి రుచించని, సహించలేని విషయం కాబట్టి, మేం చెప్పినట్లు వినకపోతే టిడిపి ఓటర్లు కాంగ్రెసుకు ఓటేస్తారు జాగ్రత్త అని బెదరగొట్ట దలిచింది తెలుగు మీడియా. దీనికి గాను అది నిరూపించ దలచిన పాయింట్లు ఏమిటంటే, తెలంగాణలో టిడిపికి యింకా బలం ఉంది, ఆ బలం ఆంధ్రమూలాల వారిది, వారు కనీసం 30-40 స్థానాల్లో జయాపజయాలను నిర్ణయించగలరు, వారందరూ టిడిపి సమర్థకులే, వారిలో చాలామంది కమ్మవారు. చంద్రబాబు కమ్మ కాబట్టి వారంతా ఆయన అరెస్టును నిరసిస్తున్నారు, బిజెపిపై పగ తీర్చుకోవడానికి పరితపిస్తున్నారు.

ఈ నేరేటివ్‌లో అన్నీ కన్నాలే. టిడిపిపై అభిమానం ఉండడం వేరు, ఓటు వేయడం వేరు. స్థానిక నాయకుడు, తమ అవసరాలు, రాజకీయపరమైన అభిమానాలు, బయటి పార్టీకి ఓటేస్తే కలిగే పరిణామాల గురించి ఆందోళన.. యిలాటి అనేక విషయాలు ఆలోచించి మరీ ఓటేస్తారు. రెండోది - ఆంధ్రమూలాల వారి ఓటు బ్యాంకు అంటూ వేరే కనబడటం లేదు. 2014 ఎన్నికలలో మాత్రమే అది కనబడింది. కెసియార్ అధికారంలోకి వచ్చి తమ దుంప తెంపుతాడేమోనన్న భయంతో, అలాటి పరిస్థితుల్లో టిడిపి తమకు అండగా నిలుస్తుందనే భావనతో, ముఖ్యంగా నగరంలోని ఆంధ్రమూలాల వారు టిడిపికి ఓటేశారు. ఉమ్మడి రాజధాని అవకాశాన్ని వదులుకుని బాబు ఆంధ్రకు తరలిపోవడంతో యిక ఆ ఆశలు యిగిరిపోయాయి. పైగా కెసియార్ అప్పుడప్పుడు తప్ప, పెద్దగా వివక్షత చూపకపోవడంతో ఆంధ్ర ఫీలింగు ఫ్యాక్టర్ బలహీనపడింది.  మూకుమ్మడి ఓటింగు అనేది బలహీనవర్గాల్లో చూస్తాం. టిడిపి అభిమానుల్లో మధ్యతరగతి వారు ఎక్కువ కాబట్టి వారు మూకుమ్మడిగా ఓటు వేస్తారనే అంచనాకు రాలేము.

మూడోది – ఆంధ్రమూలాల వారందరూ టిడిపి అభిమానులు కారు. ఆంధ్రలో వైసిపి, టిడిపి బలాబలాలు 2019లో 50-40గా ఉన్నాయి. ఇక్కడా అలాగే ఉండవచ్చు. మహా అయితే 50-50 ఉండవచ్చు. నాలుగోది, ముఖ్యమైనది – ఆంధ్రమూలాల వారు అనగానే కమ్మలు అని ఎలా అనగలరు? ఆంధ్రలో కమ్మలు 4-5శాతం ఉంటే, యిక్కడా అంతే ఉంటారు. అంతకంటె ముఖ్యమైనది కమ్మలందరూ టిడిపి సమర్థకులే అని ఎలా చెప్పగలరు? 2019 ఆంధ్ర ఎన్నికలలోనే 65 శాతం మంది కమ్మలే టిడిపికి ఓటేశారని ఓ సర్వే చెప్పింది. అది తప్పు అనుకుంటే పోనీ 75శాతం అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో కమ్మలు టిడిపికి ఎందుకు ఓటేయాలి? స్థానిక కమ్మ నాయకులు తెరాస ప్రభుత్వంలో పదవులతో, కాంట్రాక్టులతో వర్ధిల్లుతున్నారు. తమ ఓటర్లను తెరాసకు వ్యతిరేకంగా మళ్లించి తమకు తాము హాని చేసుకుంటారా? కులాభిమానం ఉంటే నిధులు పంపిస్తారు తప్ప స్థానికంగా బలమైన పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసి, వారి ఆగ్రహానికి గురై ప్రమాదంలో పడతారా?

ఇవేమీ లెక్కలోకి తీసుకోకుండా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన అక్టోబరు 15 నాటి ‘కొత్త పలుకు’లో ‘సెటిలర్ల సెంటిమెంటు’ అనే పేరుతో పెద్ద వ్యాసం రాశారు. అసలు సెటిలర్ పదమే నాకు చికాకు. తమ రాష్ట్రంలో నివసిస్తూ వచ్చిన ఆంధ్రులు హఠాత్తుగా సెటిలర్లు ఎలా అవుతారు? వాళ్లు ఎక్కణ్నుంచో వచ్చిపడ్డారా? కేంద్రం గీతలు గీసేసి రాష్ట్రాన్ని విడగొట్టినంత మాత్రాన వారు పరాయివారు అయిపోతారా? ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా మంది ఆంధ్ర ప్రాంతీయులు ఉద్యోగావకాశాల కోసం మద్రాసులో స్థిరపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినా వాళ్లని సెటిలర్లు అన్నారా? ఉమ్మడి బొంబాయి రాష్ట్రం ఉన్నపుడు ఎందరో గుజరాతీలు బొంబాయిలో స్థిరపడ్డారు. వారిని సెటిలర్లు అన్నారా? ఇక్కడ తెలంగాణాలో మాత్రం ఎందుకా పదం? దురదృష్టవశాత్తూ అందరూ ఆ పదాన్ని వాడుతున్నారు. నేను మాత్రం ఆంధ్రమూలాల వారు అని వర్ణించడానికే యిష్టపడతాను. రాధాకృష్ణ గారి వాదన యిలా సాగింది – ..సరైన ఆధారాలు లేకపోయినా బాబును అరెస్టు చేసి, జైల్లో ఉంచిన తీరుపై తెలంగాణలోని సెటిలర్లలో, ముఖ్యంగా కమ్మవారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. బాబు ప్రస్తుత దుస్థితికి జగన్‌తో పాటు, కేంద్ర బిజెపి ప్రభుత్వం, కెసియార్ కారణమని వారి అభిప్రాయం. దాంతో వారు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుకి ఓటేయాలని అనుకుంటున్నారు. ఇది గ్రహించి టిడిపితో పొత్తు పెట్టుకోవడాన్ని గతంలో వ్యతిరేకించిన కిషన్ రెడ్డి కూడా నష్టనివారణకై అమిత్ షాకు చెప్పి లోకేశ్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. బిజెపి-టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తే కనీసం 20 స్థానాలు గెలుచుకోవచ్చని బిజెపి పెద్దలనుకుంటున్నారు...

అమిత్ షా, లోకేశ్‌ను కలవడానికి కారణమిది అని రాధాకృష్ణ కనిపెట్టారు. సమావేశం జరిగి రెండు వారాలు దాటినా నాటకీయ పరిణామాలేవీ సంభవించ లేదు. బాబు యింకా జైల్లోనే ఉన్నారు. తెలంగాణలో బిజెపి, టిడిపి పొత్తు యింకా కుదరలేదు. ఇప్పుడు అనారోగ్య కారణాలపై బెయిలు వచ్చినా సోకాల్డ్ సెటిలర్లు, కమ్మలు అంతటితో సంతృప్తి చెందుతారా? కేసులో ఏమీ లేదని మొత్తంగా కొట్టేయాలని వాళ్ల కోరిక. ఇదొకటే కాదు, దీనితో పాటు పెట్టిన, పెట్టబోయే నాలుగైదు కేసుల్లో కూడా సరుకేమీ లేదని కోర్టులు క్వాష్ చేయాలని, బిజెపి ఆ మేరకు కోర్టులను మేనేజ్ చేయాలని వారి కోరిక. వారు బిజెపిపై తమ అలక చూపడానికై తెరాసకు ఓడించడానికి బిజెపికి బదులుగా కాంగ్రెసును ఎంచుకున్నారని రాధాకృష్ణ మనకు వెల్లడించారు. బాబుకి యిప్పటికీ ఆత్మీయుడైన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెసు పోటీ చేస్తూండడం చేత వారు కాంగ్రెసును తమదిగా భావిస్తున్నారట. అందుకే కమ్మ నాయకులనేక మంది తెరాస నుంచి కాంగ్రెసులోకి గెంతుతున్నారట.

తాము కాంగ్రెసును బలపరిచి బిజెపికి గుణపాఠం చెప్పే వేళ టిడిపి కూడా బరిలోకి ఉంటే కమ్మ ఓట్లు చీలిపోయి, మధ్యలో తెరాసో, బిజెపియో లాభపడే ప్రమాదం ఉంది కాబట్టి తెలంగాణ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకూడదని ‘సెటిలర్లు’ ఒత్తిడి తెస్తున్నారని రాధాకృష్ణ రాశారు. టిడిపి తెలంగాణ ఎన్నికలలో 87 స్థానాల్లో చేస్తుందో, 119టిలో చేస్తుందో, అసలు పోటీ చేస్తుందో లేదో తెలియని అయోమయం ఉన్న యీ రోజుల్లో అంతిమంగా టిడిపి పోటీ చేయకపోతే దానికి కారణం యిది అని అనుకునేట్లా రాధాకృష్ణ రాశారు. దీనిలో ఏ మాత్రం నిజం ఉన్నా, యిదొక విచిత్ర పరిస్థితి. ఆంధ్రలో బిజెపి తమతో కలిసి రావాలని టిడిపి కోరుకుంటూనే, తెలంగాణలో దానికి బద్ధ శత్రువైన కాంగ్రెసు విజయానికి దోహదపడితే అంతకంటె విరోధాభాసం మరొకటి ఉండదు. పొత్తు లేదు అనుకోవడం వరకు ఓకే, కానీ బొత్తిగా శత్రువును గెలిపించడానికి తను బరిలో నుంచి తప్పుకోవడమా!? అసలే బాబు విశ్వసనీయత అంతంత మాత్రమని, కాంగ్రెసుతో చేతులు కలపడానికి ఏ మాత్రం వెనకాడరని బిజెపికి సందేహమనే ప్రచారం ఉంది. జగన్‌ విషయంలో అయితే అతను కాంగ్రెసుతో ఛస్తే కలవడన్న గట్టి నమ్మకం ఉంది కాబట్టి బాబు కంటె జగన్‌కు ఎక్కువ ప్రాధాన్యత యిస్తోందంటారు. ఇప్పుడీ తెలంగాణ ఎన్నికలలో టిడిపి నిలబడకపోయినా,  నిలబడి గట్టిగా పోరాటం చేయకపోయినా బిజెపి టిడిపిపై మరింత కక్ష కట్టడం ఖాయం. రాధాకృష్ణ టిడిపికి మేలు చేస్తున్నట్లా? కీడు చేస్తున్నట్లా?

అది టిడిపి-బిజెపి యాంగిల్ నుంచి లాభనష్టాల చర్చ కాగా, అసలు టిడిపిని నడిపిస్తున్నదే కమ్మలే అనే బ్రాండింగ్ మరింత నష్టదాయకమని నా అభిప్రాయం. ఏ పార్టీ కూడా ఒక కులం వారి సంక్షేమం కోసమే పని చేస్తున్నానని చెప్పుకోదు. టిక్కెట్లు, మంత్రి పదవులు, కాంట్రాక్టులు, ప్రమోషన్లు అన్నీ ఆ కులం వారికే యివ్వదు. మాకు అందరి సంక్షేమమూ కావాలి, అందరూ మాకు సమానమే అని పైకి చెప్తూనే ఆ కులం వార్ని కాస్త ఎక్కువ సమానంగా చూస్తారు. బయటకు కనబడేది బిసి, ఎస్సీ, మైనారిటీలే అయినా పగ్గాలు మాత్రం ఆ కులం చేతిలో ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ఒక కుటుంబం చుట్టూనే తిరుగుతాయి కాబట్టి యిది జరుగుతోంది. ఇక జాతీయ పార్టీలైతే ఒక్కో టైములో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో కులం వారి డామినేషన్ ఉంటుంది. అంతమాత్రం చేత తక్కిన కులాలకు అస్సలేమీ లేకుండా పోతుందని లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం 1983లో వచ్చేందుకు ముందు కమ్మ కులస్తులు వాణిజ్యవ్యాపారాల్లో,  రాజకీయాల్లో ఎదగలేదా?

కాంగ్రెసు హయాంలో రెడ్లకు ప్రాధాన్యత ఉండేది కానీ ముఖ్యమంత్రులుగా, రెడ్లే కాక హరిజన, బ్రాహ్మణ, వైశ్య, వెలమ కులస్తులు, క్రైస్తవ మతస్తుడు కూడా అయ్యారు. టిడిపి అధికారంలోకి వస్తే మాత్రం కమ్మ కులస్తుడే ముఖ్యమంత్రి అవుతాడు, వైసిపి వస్తే క్రైస్తవుడే! తెలంగాణలో తెరాస వస్తే వెలమ కులస్తుడే! దీన్ని ఆమోదించే ఓటర్లు ఓటేస్తున్నారు. టిడిపి ఆవిర్భవించినపుడు అప్పటిదాకా రాజకీయాధికారం పెద్దగా దక్కని బిసి వర్గాలపై ఫోకస్ పెట్టి వారిని ఆకట్టుకున్నారు. ద్రవిడ రాజకీయాలను చూసి సంక్షేమ పథకాలతో పాటు ఎన్టీయార్ నేర్చుకున్న ఓటు బ్యాంకు వ్యూహమిది. ఆర్థిక పటుత్వం లేదు కదాని తటపటాయిస్తున్న బిసిలకు టిక్కెట్లిచ్చి. తన గ్లామరుపై గెలిచేట్లు చేశారు. అది మొదటిసారికే. తర్వాతి ఎన్నికలు వచ్చేసరికి వాళ్లు ఆర్థికపరిపుష్టి తెచ్చేసుకున్నారు. బిసిలలో టిడిపికి బలమైన ఓటు బ్యాంకు ఏర్పడింది. రెడ్ల ఆధ్వర్యంలో కాంగ్రెసు, కమ్మల ఆధ్వర్యంలో టిడిపి నడవడం, బిసిల్లో ఎక్కువమంది టిడిపికి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలో ఎక్కువమంది కాంగ్రెసుకు, యితర అగ్ర కులస్తుల్లో సమయసందర్భాల బట్టి అటూయిటూ ఓటేయడం.. యిది చాలా దశాబ్దాల పాటు నడిచింది.

రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణలో వెలమ కులానికి ప్రాధాన్యత పెరిగింది. దాంతో కాంగ్రెసు రెడ్ల చుట్టూ తిరుగుతోంది. బిజెపి స్కీములో కులప్రాధాన్యత లేదు. ఆంధ్రలో కాంగ్రెసు ఓటు బ్యాంకంతా వైసిపికి వెళ్లిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో కంటె ఆంధ్ర జనాభాలో కమ్మల శాతం ఎక్కువ కాబట్టి టిడిపిలో కమ్మ ప్రాధాన్యత పెరిగింది. 2014-19 మధ్య ధనిక కమ్మలకే అన్నీ కట్టబెడుతున్నారన్న ఫీలింగు కలగడంతో 2019 ఎన్నికలు కమ్మ-నాన్ కమ్మ రంగు పులుముకుని, టిడిపి తీవ్రంగా నష్టపోయింది. ఓటమి తర్వాత నష్టనివారణలో భాగంగా బాబు ఏ బిసినో తనకు వారసుడిగానో, కనీసం తన డిప్యూటీగానో ప్రకటించి పార్టీని విస్తరిస్తారేమో ననుకుంటే అది చేయలేదు. బిసి ఐన అచ్చెన్నాయుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి యిచ్చారు కానీ అది అలంకార ప్రాయంగానే ఉంది. బాబు అరెస్టు తర్వాత ఆ విషయం మరింత స్పష్టంగా తెలియవచ్చింది.

బాబు అరెస్టు తర్వాత టిడిపి నాయకత్వం అంటే బాబు, ఆయన ఫ్యామిలీ (దానిలో బాలకృష్ణ లేరు) అనే భావం బలపడుతోంది. ఇక ఓటర్ల విషయానికి వస్తే నిరసన ప్రదర్శనలు చేసినవారిలో ఐటీ వారే ప్రముఖంగా ఉండడంతో ఐటీ రంగంలోని మధ్యతరగతి, ఉన్నత వర్గాలలోనే టిడిపికి ఆదరణ ఎక్కువగా ఉంది అనే భావనా కలిగింది. ఇతర వర్గాలలోని వారు, ఆంధ్రలో నివసిస్తున్నవారు పెద్దగా స్పందించటం లేదన్న విషయం తేటతెల్లమౌతోంది. ఇంతవరకూ ఓకే అనుకున్నా, టిడిపి అంటే కమ్మ వారి పార్టీ మాత్రమే అనే ముద్ర కొట్టడానికి ప్రయత్నాలు జరగడం శోచనీయం. ఐటీ రంగపు ప్రదర్శకుల్లో కమ్మలే ఉన్నారని కొందరు అంటూ ఉంటే, కమ్మలు ఎక్కువగా ఉన్నా తక్కిన కులాల వారు కూడా ఉన్నారని కొంతమంది పరిశీలకులు క్లారిఫై చేశారు. ఇప్పుడు రాధాకృష్ణ ఆంధ్రమూలాల వారిలో చాలామంది కమ్మలనీ, కనీసం కమ్మలు చెప్పినట్లే విని ఓటేసేవారనీ థియరైజ్ చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి యీ కాంపెయిన్ మొదలుపెట్టిన వేళనే కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి తెలంగాణ కమ్మల రాజకీయ శక్తిసామర్థ్యాల గురించి క్లెయిమ్స్ మొదలుపెట్టడం చేత యిద్దరూ కూడబలుక్కుని చేస్తున్నారా అనే అనుమానం కలిగిస్తోంది. ఆవిడ కూడా ఆంధ్రమూలాల వారందరినీ కమ్మల ఖాతాలోకి వేసేశారు. 40 నియోజకవర్గాల్లో గణనీయంగా ఉన్నారట, 30టిలో ఫలితాలను ప్రభావితం చేయగలరట, 10టిలో గెలవగలరట, అందుకని 12 సీట్లు యివ్వాలట. కమ్మలు ఆర్థికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎంతో ఎదిగి ఉండవచ్చు. అయినంత మాత్రాన రాజకీయంగా అంతటి బలమైన శక్తిగా ఉన్నారా? మూకుమ్మడిగా ఓటేస్తారా? అనేవి ప్రశ్నలు.

‘‘సాక్షి’’లో ‘రేణుకమ్మల పోలరైజ్ పాలిటిక్స్’ పేర రాసిన వ్యాసంలో కొమ్మినేని శ్రీనివాసరావు 1978 నుంచి తెలంగాణలో గెలిచిన కమ్మ ఎమ్మెల్యేల గణాంకాలు యిచ్చారు. 1978లో 5, 1983లో (తెలుగుదేశం ఏర్పడినప్పుడు) 7, 1985 (నాదెండ్ల ఉదంతం తర్వాత) 8, 1989లో (ఎన్టీయార్ ఓడిపోయినప్పుడు) 3, 1994లో (ఎన్టీయార్ ఘనవిజయం సాధించినప్పుడు) 6, 1999లో (బాబు బిజెపితో పొత్తు పెట్టుకుని గెలిచినపుడు) 3, 2004 (బాబు ఓడిపోయినప్పుడు) 3, 2009లో 3, 2014లో (తెలంగాణ ఏర్పడ్డాక) 5, 2018లో (లేటెస్టుగా) 5! వీళ్లందరూ ఒకే పార్టీ నుంచి గెలవలేదు. 1983లో, 1985లో అందరూ టిడిపి, లేదా దానితో పొత్తు పెట్టుకున్న పార్టీల వారే. 1989లో టిడిపి నుంచి ఒకరే, యిద్దరు యితరులు. 1994లో టిడిపి 4, కాంగ్రెసు 1, యితరులు 1. 1999లో గెలిచిన ముగ్గురూ టిడిపి. 2004లో కాంగ్రెసు 1, ఇతరులు 2, టిడిపి నుంచి ఎవరూ లేరు. 2009లో టిడిపి 2, లోకసత్తా 1, 2014లో టిడిపి 2, కాంగ్రెసు 2, బిఎస్‌పి 1 (తర్వాత యీ 5గురు తెరాసలోకి వెళ్లిపోయారు), 2018లో గెలిచిన ఐదుగురూ తెరాస నుంచే గెలిచారు.

దీని అర్థమేమిటి? తాజాగా చూసుకుంటే తెలంగాణలో కమ్మ ఎమ్మెల్యేలు 5గురికి మించి గెలవడానికి ఛాన్సు లేదు. ఇంకొకటి గమనించాల్సినది ఏమిటంటే కమ్మలందరూ టిడిపి నుంచే గెలవటం లేదు. అందువలన కమ్మ, టిడిపి సమానార్థకాలని వాదించడానికి కుదరదు. వాస్తవాలిలా ఉండగా కమ్మవారు చెప్పినట్లే టిడిపి ఆడుతుందని, వారు నిలబడమంటే నిలబడుతుందని, వద్దు మానేయమంటే మానేస్తుందనే యింప్రెషన్ కలిగించడం ఏమంత సబబు? టిడిపిలో కమ్మల ప్రాబల్యం ఉందని అందరూ అంగీకరించే వాస్తవమైనా, కేవలం వారి ప్రయోజనాల కోసమే పని చేస్తుందని, వారు చెప్పినట్లే ఆడుతుందని ఆ పార్టీ హితైషులే ప్రచారం చేయడం ఎంత హానికరం? నిజానికి టిడిపి కమ్మల కోసమే నిలబడి ఉంటే యిన్నాళ్లు మనగలిగేదా? ఆంధ్ర జనాభాలో కమ్మల శాతం 4-5 అయితే దానికి 2019లో కూడా 39శాతం ఓట్లెలా వచ్చేవి?

ఇక్కడొక విషయం గుర్తించాలి. ఎన్టీయార్‌కు కులాల పరంగా కమ్మలు, బిసిల మద్దతుతో పాటు వర్గపరంగా సంక్షేమ పథకాల కారణంగా పేదల మద్దతు బాగా ఉండేది. పేదలకు దోచి పెడుతున్నాడనే కోపంతో మధ్య తరగతి ప్రజలు, అగ్రవర్ణాలలో చాలామంది కాంగ్రెసుకు మద్దతిచ్చేవారు. ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు తగ్గించడం, వారి గురించి హీనంగా మాట్లాడడం చేత ఆ కుటుంబాల వారందరూ టిడిపికి వ్యతిరేకమే. ఎన్టీయార్‌వి పగటి వేషాలంటూ చదువుకున్నవారు చాలామంది యీసడించేవారు. 1989లో టిడిపిని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు తప్పిదాలు, అంతఃకలహాల వలననే ఎన్టీయార్ 1994లో మళ్లీ గెలిచారు. మరుసటి ఏడాదికే టిడిపి బాబు ఆధ్వర్యంలోకి వెళ్లిపోయింది. బాబు తనను తాను ముఖ్యమంత్రిగా కాక కార్పోరేటు సిఇఓగా చూపుకుంటూ, ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు చేస్తూ, సంక్షేమ పథకాలు బాగా తగ్గించి వేశారు. ఆ విధంగా మధ్యతరగతి జీవుల, విద్యావంతుల ఫేవరేట్ అయిపోయారు.

ఓటర్లలో వీళ్ల ఓట్ల శాతం కంటె సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసే శ్రామిక జనం ఓట్ల శాతం ఎక్కువ కాబట్టి బాబు 2004, 2009లో ఓడిపోయారు. 2014లో వైసిపి కంటె కొద్ది శాతం ఓట్లే ఎక్కువ తెచ్చుకున్నారు. 2019లో 23 సీట్లు మాత్రమే వచ్చినా 39శాతం ఓట్లు వచ్చాయంటే యీ మధ్యతరగతి ఓటు బ్యాంకు, అగ్రకులాల మద్దతే కారణం. గతంలో కాంగ్రెసు వలె యిప్పుడు వైసిపి ఆర్థికపరంగా, కులపరంగా బలహీనవర్గాల ఓట్ల మీద ఆధారపడుతోంది. దానితో తలపడాలంటే టిడిపికి పైన చెప్పిన వర్గాలే శరణ్యం. రెడ్లలో చాలా శాతం మంది వైసిపి పక్షాన ఉండగా, తక్కిన అగ్రవర్ణాలలో చాలా శాతం మంది టిడిపి వైపు ఉన్నారని నా అంచనా. అలాంటప్పుడు దీన్ని కమ్మల పార్టీగా ప్రొజెక్టు చేసి, వారందరినీ దూరం చేసుకోవడం తెలివితక్కువ కాదా? తక్కిన రాజకీయ నాయకులందరూ మొరటుగా కనిపించగా, బాబు మాత్రం ఒక సోఫిస్టికేటెడ్ పొలిటీషియన్‌గా, విజనరీగా ప్రొజెక్టు చేసుకుంటూ వచ్చారు. అందుకే ఆయన అన్ని కులాలలోని విద్యావంతులకు ఫేవరేట్‌గా అయ్యారు. నా చుట్టూ ఉన్నవారిలో బాబు అభిమానులు కోకొల్లలు. ఎన్ని పొరపాట్లు చేసినా బాబు తప్ప ఆంధ్రకు వేరే దిక్కు లేదని నమ్మేవారు. వారందరూ కమ్మలు కారు.

నా మట్టుకు నేను టిడిపి ఆవిర్భావం నుంచి దానికి అభిమానిని. అప్పట్లో ప్రవాసాంధ్రుణ్ని. 1995లో సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చాక టిడిపికి ఓటేసే అవకాశం వచ్చింది. ఎన్టీయార్ నుంచి పార్టీ గుంజుకున్నాక కూడా బాబుకి ఓటేస్తూ వచ్చాను. 2002 నుంచి 2004 వరకు ‘‘హాసం’’ మార్కెటింగు కోసం 23 జిల్లాలూ తిరిగినప్పుడు బాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనబడేది. అయినా 2004లో బాబుకే ఓటేశాను. మీడియాలో ఆయన డెవలప్ చేసిన యిమేజ్ అలాటిది! ఆయన ఓటమి తర్వాతనే ఆయన పాలనలో డొల్లతనం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరు అన్నీ బయటపడ్డాయి. 2009 నాటికి బాబు చాలా తప్పటడుగులు వేశారు. సమైక్యవాదానికి త్రికరణశుద్ధిగా కట్టుబడిన ఎన్టీయార్‌ సిద్ధాంతానికి విరుద్ధంగా బాబు విభజన వాదాన్ని తలకెత్తుకున్నారు. మరో పక్క తన అధిష్టానం అభీష్టాన్ని ధిక్కరించి వైయస్ సమైక్యవాదిగా చూపుకున్నారు. ఇది నన్ను మెప్పించింది. వైయస్‌ పాలనలో చాలా లోపాలున్నా మొత్తం మీద ఫర్వాలేదనిపించింది. వ్యవసాయరంగం, సాగునీటి రంగం, ఐటీ రంగం అభివృద్ధి కొనసాగింపు..  యీ కారణాలతో 2009లో మొట్టమొదటి సారిగా కాంగ్రెసుకు ఓటేశాను. 2014 నుంచి నోటాయే శరణ్యమైంది.

అనేక వర్గాల ఆదరణ పొందుతూ వచ్చిన బాబును స్వల్పకాలిక ప్రయోజనాలకై కమ్మలకే పరిమితం చేస్తే తక్కిన వారందరూ నొచ్చుకుంటారు, ఎలీయనేట్ అవుతారు. తెలంగాణలో కమ్మలందరూ తమ మద్దతుతో బాబుకి ఆత్మీయుడైన రేవంత్ రెడ్డి సిఎం అవుతాడని, యిక తాము చక్రం తిప్పేయవచ్చని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఇప్పటివరకు చూస్తే తెరాసకు సీట్లు తగ్గవచ్చు కానీ ఓడిపోయే పరిస్థితి వస్తుందని అనిపించటం లేదు. కాంగ్రెసుకు సీట్లు పెరగవచ్చు కానీ దాని అంతఃకలహాలు చూస్తే గెలిచేటన్ని సీట్లు రావని తోస్తోంది. ఒకవేళ గెలిచినా రేవంత్‌ను సిఎం చేస్తారన్న గ్యారంటీ ఏముంది? కాంగ్రెసు ఏదైనా చేయవచ్చు. కర్ణాటకలో ఎంతో విధేయుడిగా ఉండి, కష్టపడి పని చేసిన శివకుమార్‌ను పక్కన పెట్టేయలేదా? కాంగ్రెసుకు బిసి పార్టీగా యిమేజి అవసరం అంటూ ఏ హనుమంతరావునో ముఖ్యమంత్రి చేసినా చేయగలదా పార్టీ!

రేవంత్‌కు ఉన్న పెద్ద మైనస్, అతని ఓటుకు నోటు కేసు! దేశంలో ఏ రాజకీయ నాయకుడూ దొరకనంత యిదిగా అతను లంచం యిస్తూ వీడియో కెమెరాలకు దొరికాడు. కెసియార్-బాబు మధ్య రాజీ కారణంగా అది ఒక కొలిక్కి రాకపోయి ఉండవచ్చు. కానీ సిఎం రేసు నుంచి రేవంత్‌ను తప్పించడానికి అతని ప్రత్యర్థులకు అది అక్కరకు వస్తుంది. ఇంకోటి, రేవంత్ కాంగ్రెసులో ఉన్నా బాబు మనిషే అన్న ముద్ర. ఇప్పుడీ ఆంధ్రజ్యోతి కాంపెయిన్ వలన ఆ ముద్ర మరింత బలంగా పడుతోంది. కమ్మలకు అతను ఆత్మీయుడైతే కావచ్చేమో కానీ యితర కులాల ఆంధ్రమూలాల వారికి అతనేమీ ఆప్తుడు కాడు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు, తర్వాత కూడా అతను ఆంధ్రద్వేషం కక్కుతూనే ఉన్నాడు. కెసియార్, కెటియార్ ఆంధ్ర కాంట్రాక్టర్లకే పనులు అప్పజెపుతున్నారని యాగీ చేస్తూనే ఉంటాడు. షర్మిల కాంగ్రెసులో చేరతానన్నపుడు పెట్టిన ఆంధ్ర పేరుతో పెట్టిన అభ్యంతరాలు తాజాగానే ఉన్నాయి.

కమ్మలే కాక యావన్మంది ఆంధ్రమూలాల వారూ టిడిపి సమర్థకులే అని నిర్ధారించి, వారు ఒత్తిడి చేస్తే బిజెపి అధిష్టానం లొంగిపోతుంది అని తీర్మానించడం ఎంతవరకు కరక్టు? తాము గెలుపుకి అంగుళం దూరంలో ఉండి, వీళ్ల కారణంగా వ్యవహారం చెడిపోతుంది అనుకుంటే భయపడవచ్చేమో కానీ పరిస్థితి అలా లేదు కదా! బిజెపి-టిడిపి-జనసేన కలిస్తే 20 సీట్లు వస్తాయని బిజెపి పెద్దలు అంచనా వేస్తున్నారని ఆంధ్రజ్యోతిలోనే రాశారు. ఆ భాగ్యానికి బిజెపి ఆంధ్రమూలాల వారి బ్లాక్‌మెయిల్‌కు లొంగుతుందా? కాంగ్రెసును ఎలాగైనా గెలవ నీయకూడదనే పట్టుదల ఉంటే తెరాసకే రహస్యంగా మద్దతివ్వవచ్చు. ఎందుకంటే తెరాస, వైసిపి రెండూ కాంగ్రెసు వైపు వెళ్లవు కాబట్టి తాము బలపడేదాకా యీ రెండిటికి పరోక్షంగానైనా సాయపడడానికి బిజెపికి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇంకో పచ్చి నిజం ఏమిటంటే ప్రస్తుతం బిజెపి ఎవరినైనా సరే భయపెట్టే స్థితిలో ఉంది తప్ప, భయపడే స్థితిలో లేదు.

ఇది తెలిసి కూడా కమ్మలు బిజెపిని బెదిరిస్తున్నారని రాయడం నమ్మదగిన విషయం కాదు. జనరలైజ్ చేసి చెప్పాలంటే కమ్మలు కార్యసాధకులు. వారిలో గల కష్టపడే స్వభావం, ముందుచూపు, తెగింపు వగైరా వగైరా లక్షణాలు మిగతా కులాల్లో కూడా చూడవచ్చు కానీ కమ్మలలో ప్రధానంగా కనబడే లక్షణం మెత్తగా మాట్లాడి, పని సాధించుకోవడం. అహంకార ప్రదర్శన, బెదిరింపులు వారి లక్షణాలు కావు. ఇటీవలి కాలంలో విదేశాల్లో స్థిరపడిన కమ్మ కుర్రవాళ్లు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు పట్టించుకోనక్కర్లేదు. ఏ రాష్ట్రంలో ఉన్నా, అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా వారితో మంచిగా మెలుగుతూ, తమ పనులు చక్కబెట్టుకునే కమ్మ కులస్తులు, యీనాడు బాబు అరెస్టు తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారంటే అది సత్యదూరం. 2018లో నెగ్గిన 5గురు కమ్మ ఎమ్మెల్యేలూ తెరాస వారే అయినపుడు వారు అర్జంటుగా కెసియార్‌తో కలహం పెట్టుకుంటారా? కావాలంటే బాబు తరఫున పోరాటం చేసే వారికి నిధులు పంపి తమ అభిమానాన్ని చాటుకుంటారు కానీ, రాజకీయంగా రిస్కులు తీసుకోరు.

రాజకీయాలు వేరు, కులం వేరు. బాబుకు మద్దతుగా నిర్వహించే సభలను కమ్మ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం, కొందరు ‘కమ్మల ఆత్మగౌరవం’ పేర సమావేశాలు పెట్టి రాజకీయంగా బాబుకి అండగా నిలవడం టిడిపిపై కమ్మ బ్రాండింగ్ కొట్టే ప్రయత్నమే. అది ఆ పార్టీ ప్రయోజనాలకే హానికరం. అందరివాడు అనిపించుకోవడమే బాబుకి హాయి. లేకపోతే టిడిపి ఓటు బ్యాంకు క్షీణించిపోతుంది.

ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?