Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: నష్టాల్‌, కష్టాల్‌ వస్తే రానీ...

రెండవ ప్రపంచయుద్ధసమయంలో జపాను సైన్యం చైనాను ఆక్రమించింది. షాంఘై నగరాన్ని తన అదుపులోకి తీసుకుని, అక్కడ శత్రువుల ఆస్తులను స్వాధీనం  చేసుకోసాగింది. ఎవరైనా సరే సహకరించటం లేదని అనుమానం వస్తే షాంఘైలోని బ్రిజ్‌హౌస్‌ భవంతికి పంపేది. అక్కడ జపాన్‌ వారి మిలటరీ గూఢచారి సంస్థ కెర్పీతాయ్‌ అధికారులు వుండేవారు. ఇంటరాగేషన్‌ పేరుతో వారు పెట్టే చిత్రహింసలు ఎలా వుండేవంటే అక్కడకు పంపుతారని తెలియగానే కొందరు ఆత్మహత్యలు చేసేసుకునేవారు.

ధైర్యం చేసి వెళ్లినవారు పది రోజుల్లో పరలోకానికి పయనమయ్యేవారు. ఇలాటి భీకర పరిస్థితుల్లో యిరుక్కున్నాడు గాలెన్‌ లిచ్‌ఫీల్డ్‌ అనే అమెరికన్‌ ఉద్యోగి. అతను అమెరికా కంపెనీ ఐన ఏసియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి మేనేజరుగా షాంఘైలో పని చేస్తూ వుండేవాడు. జపాన్‌ జర్మనీ, ఇటలీలతో కలిసి ఇంగ్లండు, రష్యా, అమెరికాలతో యుద్ధం చేస్తోంది. వీళ్లది అమెరికన్‌ కంపెనీ కాబట్టి కంపెనీ ఆస్తులను హస్తగతం చేసుకోవడానికి జపాన్‌ సైన్యం ఒక ఆర్మీ లిక్విడేటర్‌ను పంపింది. అతను జపాన్‌ సైన్యంలో అడ్మిరల్‌. షాంఘైలో వున్న మీ స్థిర, చరాస్తుల వివరాలు, మీకు తనఖా పెట్టిన ఆస్తుల జాబితా వగైరాలన్నీ తయారు చేసి ఇయ్యి అన్నాడు. 

ఇతనికి గత్యంతరం ఏముంది? తిట్టుకుంటూనే అన్నీ వివరంగా రాశాడు. అయితే 7.50 లక్షల డాలర్ల విలువైన సెక్యూరిటీలున్న ఒక ఎంట్రీని విడిచిపెట్టాడు. అవి వాళ్ల హాంగ్‌కాంగ్‌ ఆర్గనైజేషన్‌కు చెందినవి. హాంగ్‌కాంగ్‌ అప్పుడు చైనా ఏలుబడిలో లేదు. అందువలన సాంకేతికంగా అతను చేసినది కరక్టే. కానీ అది ముందుగానే చెప్పాలి. చెపితే 'ఏడిశావులే, అదీ రాయి' అంటాడేమో తెలియదు. వదిలేద్దాం, చూడకపోతే మహబాగు, చూస్తే హాంగ్‌కాంగ్‌ది కదా అందాం అనుకుని అది లేకుండా జాబితా తయారుచేసి యిచ్చేశాడు. వాళ్లు యితని ఆఫీసులోనే తిష్ట వేసి ఆస్తులన్నీ వెరిఫై చేసుకోసాగారు.

కొద్ది రోజులకే జపాన్‌ వాళ్లు ఆ సెక్యూరిటీల విషయం ఓ శనివారం నాడు కనిపెట్టేశారు. ఆ సమయానికి యితను ఆఫీసులో లేడు. ఆ జపాన్‌ ఎడ్మిరల్‌ వీళ్ల చీఫ్‌ ఎక్కౌంటెంట్‌ను పిలిచి 'మీ మేనేజరు దొంగ, దేశద్రోహి, ఇంకా ఎన్ని దాచాడో, బ్రిజ్‌హౌస్‌కు పంపితే అన్నీ కక్కుతాడు' అంటూ చిందులు తొక్కాడు. అందరకీ భయం వేసింది. చీఫ్‌ ఎక్కౌంటెంట్‌ ఆదివారం ఉదయమే యితని యింటికి వచ్చి సంగతి చెప్పి 'రేపు అతని మొహం ఎలా చూస్తారో ఏమో' అనేసి వెళ్లిపోయాడు. 

గాలెన్‌కు గుండెల్లో రాయి పడింది. రేపు ఏమౌతుందాని వర్రీ అయ్యాడు. ఆలోచించిన కొద్దీ అవే భయాలు సుళ్లు తిరుగుతున్నాయి. తలపుల సుడిగుండంలోంచి బయటపడి విడిగా ఆలోచిస్తే తప్ప ఎటూ తేలదనిపించింది. లేచి కూర్చుని 'నేను దేని గురించి వర్రీ అవుతున్నాను?' అని రాసుకుని చూసుకున్నాడు. పక్కనే జవాబు కూడా రాశాడు - 'బ్రిజ్‌హౌస్‌లో తేలతానని..' అని. రెండో ప్రశ్న రాసుకున్నాడు. 'ఇప్పుడు నా ఎదుట వున్న మార్గాలేమిటి?' అని. జవాబులు రాశాడు.

1. 'ఎడ్మిరల్‌కు జరిగినది యిది, నాకు దురుద్దేశం ఏమీ లేదని చెప్తాను' అని. దాని పక్కనే వ్యాఖ్యానం కూడా రాశాడు - వాడికి ఇంగ్లీషు రాదు. దుబాసీ ద్వారా చెప్పినపుడు నా భావాలు సరిగ్గా వ్యక్తం కాకపోతే, వాడికి మరింత కోపం రావచ్చు. 2. పారిపోవాలి. వ్యాఖ్యానం - అసంభవం. పట్టుకుని విచారణ లేకుండా కాల్చేస్తారు. 3. రేపు ఆఫీసు మానేసి, యింట్లోనే కదలకుండా కూర్చోవాలి. వ్యాఖ్యానం - ఎడ్మిరల్‌ సైన్యాన్ని పంపి రప్పిస్తాడు. నేనేం మొత్తుకున్నా వినడు. 4. ఏమీ జరగనట్లు రేపు మామూలుగా ఆఫీసుకి వెళ్లాలి. వ్యాఖ్యానం - ఈ ధీమా ఎందుకంటే ఎడ్మిరల్‌ బిజీగా వుండవచ్చు. దీని గురించి మర్చిపోయి వుండవచ్చు. గుర్తు వచ్చినా, తర్వాత అడుగుదాంలే అనుకుని ఊరుకోవచ్చు. శనివారం నాటి కోపం చల్లారి నా సమాధానంతో కన్విన్స్‌ కావచ్చు. కన్విన్స్‌ కాకపోతే...? కాకపోయినా మనం చేసేదేమీ లేదు. నందో రాజా భవిష్యతి అనుకుని ఆశ పెట్టుకుని రేపటిదాకా బతకడం మేలు. లేకపోతే భయంతో యీ రోజే చచ్చేట్లున్నాను.

ఇలా రాసుకుని చూసుకున్నాక, నష్టాల్‌, కష్టాల్‌ వస్తే రానీ.. అనే నిబ్బరం కలిగాక అతను నిశ్చింతగా నిద్ర పోయాడు. మర్నాడు ఆఫీసుకి వెళ్లేసరికి అతని మొహం ప్రసన్నంగా వుంది. ఎడ్మిరల్‌ సిగరెట్టు కాలుస్తూ ఓరగా చూశాడు. భయాందోళనలతో యితను సరిగ్గా నిద్ర పోయి వుండకపోతే మొహం పీక్కుపోయి వుండేది. ఎందుకిలా వున్నాడా అని ఆలోచించి వుంటే శనివారం విషయం గుర్తుకు వచ్చేది.

అదేమీ లేకుండా ఎప్పటిలాగా కనబడడంతో అతను తన ఆలోచనల్లోంచి బయట పడలేదు. వేరే చోట్ల జరుగుతున్న యుద్ధంలో గెలుపోటముల వార్తలు అతనికి ఉదయాన్నే చేరి, వాటి గురించిన ఆలోచనల్లో నిమగ్నమై వున్నాడు. ఇతను తన పనిలో పడ్డాడు. ఇంకో ఆరువారాల్లో అడ్మిరల్‌కు బదిలీ అయిపోయింది. ఆ సెక్యూరిటీల విషయం ఎవరూ పట్టించుకోలేదు. ఇది 1942 నాటి ముచ్చట. మూడేళ్ల తర్వాత యుద్ధం ముగిసింది. జపాన్‌ ఓడిపోయింది. ఇతను క్షేమంగా బయటపడి, సొంతంగా యిన్సూరెన్సు, ఫైనాన్సు వ్యాపారాలు పెట్టి విజయవంతమయ్యాడు.

మనలో చాలామంది రేపు గురించిన అనవసర భయాలతో సతమతమవుతాము. చాలా సందర్భాల్లో ఫలానా విధంగా జరుగుతుందేమోనని మనం చేసే వూహలే వాస్తవాల కంటె భయానకంగా వుంటాయి. మనం హడిలి చచ్చినంత అక్కడేమీ వుండదు. గాలెన్‌లాగ మనమూ సమస్య స్వరూపం గురించి, తరణోపాయాల గురించి రాసి చూసుకుంటే ఆ భయాలు తగ్గుతాయి. రాసుకోవడంతో ఆగకుండా దాన్ని మనసుకు పట్టించుకుని అమలు చేయాలి కూడా. అప్పుడే సమస్యను ఎదుర్కొనే నిబ్బరం వస్తుంది.

(ఫోటో - యుద్ధోత్సాహంలో జపాన్‌ నౌకాసైన్యం, ఇన్‌సెట్‌- బ్రిజ్‌హౌస్‌ భవనం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
-mbsprasad@gmail.com