cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: కర్ణుడి స్వభావం

ఎమ్బీయస్‍:  కర్ణుడి స్వభావం

మహాభారతంలోని కర్ణుడు ఎలాటివాడు? మామూలుగా అయితే దుష్టచతుష్టయంలో అతను ఒకడు. అయితే యిటీవల కొంతకాలంగా అతన్ని ఆకాశానికి ఎత్తివేయడం జరుగుతోంది. కులవివక్షతకు గురైనవాడిగా, జన్మరహస్యం తెలియకపోవడం ఎంతో కోల్పోయినవాడిగా, మహావీరుడైనా మోసానికి గురైనవాడిగా, ఒక అండర్‌డాగ్‌గా ప్రొజెక్టు చేస్తున్నారు. ఇవి అతనిలో కొన్ని కోణాలు మాత్రమే. సమగ్రరూపం రావాలంటే అతనిలో ఉన్న మంచీ, చెడూ రెండూ తెలుసుకోవాలి. చెప్పాలంటే కర్ణుడిలో రెండూ పుష్కలంగా వున్నాయి. దానగుణం వంటి ఉత్తమగుణం వున్నా కర్ణుడు ఎందుకు రాణించ లేకపోయాడనేది పూర్తి కథ తెలుసుకున్నపుడే అర్థమవుతుంది.

కర్ణుడి జీవితంలో హై పాయింటు, కృష్ణుడు చేసిన ఆఫర్ తిరస్కరించినప్పుడు తెలుస్తుంది. నేను ఫలానా అని తెలుసు, అది బయటకు తెలిస్తే ధర్మరాజు తన ఆధిపత్యాన్ని అంగీకరిస్తాడని తెలుసు. అయినా, నన్ను యిన్నాళ్లూ ఆదరించిన దుర్యోధనుడికి అన్యాయం చేయలేను అని చెప్పాడు. తర్వాత కుంతి వచ్చి అడిగినపుడు కూడా అర్జునుణ్ని తప్ప తక్కిన పాండవులను యుద్ధంలో చంపనని మాట యిచ్చాడు. పాండుకుమారులను చంపనని మాట యివ్వలేదు కాబట్టి అభిమన్యుణ్ని చంపాడు. సూర్యుడు హెచ్చరించినా ఇంద్రుడికి తన ప్రాణరక్షకాలైన సహజ కవచకుండలాలు యివ్వడమూ గొప్పదే కానీ, అక్కడ ప్రతిఫలంగా నాకు శక్తి ఆయుధానియ్యి అని బేరాలాడాడం వలన ఉత్తమదానం కాలేకపోయింది.

లో పాయింట్లూ కర్ణుడిలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా తను అర్జునుణ్ని చంపగలనని దుర్యోధనుడిలో విశ్వాసం కల్పించి పోషించడం! పాండవులలో భీమార్జునులే డేంజరని, భీముణ్ని తను చంపగలడని, అర్జునుణ్ని చంపడానికి కర్ణుడు దొరికాడని దుర్యోధనుడు లెక్క వేసి కర్ణుణ్ని చేరదీశాడు. అసలు వాళ్ల మధ్య స్నేహం ఎప్పుడు కుదిరిందో గుర్తుకు తెచ్చుకోండి. కురుకుమారుల విద్యాప్రదర్శన జరిగినపుడు అందరూ అర్జునుడి విలువిద్యను మెచ్చుకుంటూ వుంటే, అప్పుడు కర్ణుడు నేను కూడా యివన్నీ చేయగలనంటూ వచ్చి ప్రదర్శించడంతో దుర్యోధనుడికి అమితంగా నచ్చేశాడు. అలా అతని వైపు నుంచి స్నేహంలో ఒక స్వార్థం వుంది. అతని లెక్క తెలిసి, కర్ణుడు కూడా దానికి అనువుగానే ప్రవర్తించాడు. అతను అర్జునుడి చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయాడు. తను అర్జునుడికి సాటిరాడని తెలుసు. అయినా దుర్యోధనుడి వద్ద మాటిమాటికి దంబాలు పలుకుతూ అతనికి తనపై గల విశ్వాసం చెదిరిపోకుండా చూసుకున్నాడు. లేకపోతే అంగరాజ్యాన్ని వెనక్కి తీసేసుకునేవాడేమో! ఇలా అతనివైపు నుంచి కూడా స్నేహంలో స్వార్థం వుంది.

కర్ణుడిలో ఎన్నో సద్గుణాలున్నాయి. కానీ తన బలపరాక్రమాల పట్ల అహంకారం వుంది. దానికి తోడు అర్జునుడి పట్ల మత్సరం వుంది. రెండోదే అతని పాలిట వినాశహేతువైంది. దుర్యోధనుడు ప్రజారంజకంగా గొప్పగా పాలించాడట. కానీ పాండవుల పట్ల అసూయ చేతనే దుష్కార్యాలు చేసి, కులనాశకుడయ్యాడు. ఆ విధంగా అసూయ అనే కామన్ క్వాలిటీయే యిద్దర్నీ దగ్గరకు చేర్చింది. ద్రోణకృపుల వద్దనే అర్జునుడు, కర్ణుడు విలువిద్యను అభ్యసించారు. అర్జునుడు గురువులను ఎప్పుడూ సంభావిస్తూనే వచ్చాడు కానీ కర్ణుడు గురువుల పట్ల గౌరవం చూపకుండా తూలనాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు అంటే గురువు అర్జున పక్షపాతి అనుకున్నాడు.

ద్రోణుడు గొప్ప గురువు. శిష్యుడి ప్రతిభతో పాటు వ్యక్తిత్వం కూడా లెక్కలోకి తీసుకుని విద్య నేర్పే వ్యక్తి. అశ్వత్థామ తన కొడుకే అయినా, అతని స్వభావరీత్యా కొన్ని అస్త్రాలు అతనికి నేర్పితే డేంజరనుకున్నాడు. యుద్ధానంతరం అశ్వత్థామ ప్రవర్తనంత హేయమైన ప్రవర్తన మరెవ్వరి దగ్గరా చూడం. అందుకే అతను అపారమైన దుర్గంధం వెదజల్లుతూ చిరంజీవిగా మిగిలిపోయాడు. అతని విషయంలో చిరంజీవిత్వం వరం కాదు, శాపం! కొడుక్కి కూడా నేర్పని అస్త్రాలు అర్జునుడికి నేర్పాడు ద్రోణుడు, అర్జునుడికైతే విచక్షణ వుందని నమ్మాడు కాబట్టి! కర్ణుడి స్వభావం చూసి కాబోలు బ్రహ్మాస్త్రం నేర్పనన్నాడు ద్రోణుడు. ఏకలవ్యుడి విషయంలో కూడా అదే జరిగింది. తన ధనుర్విద్యా నైపుణ్యం చూపడానికి నోరు లేని మూగజంతువును ఎంచుకోవడంలో కనబడిన క్రౌర్యం ద్రోణుణ్ని అతని పట్ల విముఖుణ్ని చేసి వుంటుంది.

అప్పుడు కర్ణుడు పరశురాముణ్ని ఆశ్రయించాడు. తను భృగువంశ బ్రాహ్మణుడనని అబద్ధం చెప్పాడు. కర్ణుడికి తను దైవాంశ వలన క్షత్రియ స్త్రీకి పుట్టినవాడనని అప్పటికే తెలిస్తే అదే చెప్పివుండేవాడేమో! ఇంతకీ అది ఎప్పుడు తెలిసింది? నాకు క్లారిటీ రాలేదు. జరిగిన కథ గురించి మనకు తెలుసు. దుర్వాసుడిచ్చిన వరాన్ని పరీక్షిద్దామని కన్య ఐన కుంతి (ఆమె అసలు పేరు పృథ) సూర్యుణ్ని ఆహ్వానించింది. వచ్చాక సూర్యుడు సంగమించబోతే భయపడి వద్దంది. ‘నాతో సంగమించినా అధర్మం కాదు, నీ కన్యాత్వం చెడదు. మహాబాహువు, మహాయశస్వి ఐన కొడుకు నీకు పుడతాడు. అదితి నాకు కుండలాలు యిచ్చింది. వాటినీ, ఉత్తమ కవచాన్నీ నీ కొడుక్కి యిస్తాను.’ అని ధైర్యం చెప్పి సూర్యుడు ఆమెలో తన వీర్యాన్ని నింపాడు. కుంతి నవమాసాలూ గర్భం మోస్తూ దాదికి తప్ప వేరెవరికీ యీ విషయం తెలియకుండా దాచిపెట్టింది. కర్ణుడు పుట్టాక, ఒక పెట్టెలో పెట్టి అశ్వనదీ జలాల్లో వదిలిపెట్టింది.

అశ్వనది చర్మణ్వతీనదిలోకి, అది యమునలోకి, యమున నుండి గంగలోకి ప్రవేశించడంతో గంగాతీరంలోని చంపాపురికి దగ్గరగా వున్న సూతరాజ్యానికి ఆ పెట్టె చేరింది. ధృతరాష్ట్రుడి మిత్రుడైన సూతుడు అధిరథుడు భార్యతో కలిసి గంగకు వెళ్లి ఆ పెట్టెను చూసి, తెరిచి, దేవుడిచ్చిన బిడ్డ అనుకుని భార్య రాధకు యిచ్చాడు. అతనికి వసుషేణుడు అనే పేరు పెట్టారు. అతను పరాక్రమశాలియై అంగదేశంలో వృద్ధి పొందాడు. దివ్యకవచధారి అయిన అతని గురించి చారుల ద్వారా కుంతి తెలుసుకుంది. ఎక్కడో చక్కగా పెరుగుతున్నాడని తెలిసి ఆనందించింది. అధిరథుడు తన కొడుకుని తగిన సమయంలో హస్తినాపురికి పంపాడు. అక్కడ కర్ణుడు ద్రోణుడి వద్ద, కృపుని వద్ద, అస్త్రవిద్యాశిక్షణ పొందాడు. విలువిద్యా ప్రదర్శన సమయంలో దుర్యోధనుడి కంటపడ్డాడు. సూతపుత్రుడిగానే చలామణీ అయ్యాడు.

ఇంద్రుడి రాకను కర్ణుడికి ముందుగా తెలపడానికి కలలోకి వచ్చిన సూర్యుడు ‘నువ్వు నా భక్తుడివి కాబట్టి చెపుతున్నాను’ అన్నాడు తప్ప, నువ్వు నా కొడుకువే అని చెప్పలేదు. రాయబారం విఫలమయ్యాక కృష్ణుడు కర్ణుడి వద్దకు వచ్చి ‘కుంతి కన్యగా వుండగా పుట్టిన కానీనుడివి నీవు. కానీనుడికి తల్లి భర్తయే తండ్రి అని ధర్మశాస్త్రం చెపుతోంది. అలా నువ్వు పాండుపుత్రుడివి.’ అని చెప్పాడు. అప్పుడు కర్ణుడు ‘అంతా నేను ఎరుగుదును. కన్యయైన కుంతి సూర్యుని వల్ల గర్భం దాల్చింది. తానీ నా క్షేమం చూడకుండా విడిచిపెట్టింది. సూతదంపతులే నన్ను సొంత కొడుకుగా పెంచారు.’ అని చెప్పాడు. కర్ణుడికి తన జన్మరహస్యం ఎలా తెలిసిందో నాకు తారసపడలేదు.

ఏది ఏమైనా అబద్ధం ఆడడం తప్పే కాబట్టి నేర్చుకున్న విద్య నిరర్ధకం కావాలని పరశురాముడు కర్ణుడికి శాపం యిచ్చాడు. ఆ విద్యార్జన సమయంలోనే తన ఆవుదూడను పోగొట్టుకొన్న బ్రాహ్మణుడు యిచ్చిన శాపం ఒకటి తోడైంది. అర్జునుడికి ఊర్వశి యిచ్చిన శాపం, అజ్ఞాతవాసంలో వరంగా మారింది. కానీ కర్ణుడి విషయంలో శాపాలు అసలైన సమయంలో దెబ్బ తీశాయి. విద్యాప్రదర్శన సమయానికి కర్ణుడు, అర్జునుడితో సమానస్థాయిలో వున్నాడు. కానీ దాని తర్వాత అర్జునుడు కొత్తకొత్త అస్త్రశస్త్రాలు సంపాదిస్తూ పోయాడు. సాక్షాత్తూ శివుణ్ని మెప్పించి, పాశుపతాన్ని పొందాడు. మరి కర్ణుడు చూస్తే సంపాదించిన అస్త్రాల కంటె శాపాలు ఎక్కువ. ఇవన్నీ దుర్యోధనుడితో నిజాయితీగా చర్చించి వుంటే దుర్యోధనుడు పాండవులతో రాజీకి వచ్చేవాడేమో, కురుక్షేత్రం జరిగేది కాదేమో! కానీ కర్ణుడు చివరి నిమిషం దాకా దుర్యోధనుణ్ని దగా చేస్తూనే వచ్చాడు. ‘ఎక్కడా తగ్గద్దు’ అంటూ రెచ్చగొట్టి మహాసంగ్రామానికి కారణభూతుడయ్యాడు.

కర్ణుడిలోని అర్జునద్వేషం ఎటువంటిదంటే అతను ఉచితానుచితాలు పాటించలేదు. కురువంశీకుల విద్యాప్రదర్శన సమయంలో అతను తనంతట తానే ప్రవేశించి అర్జునుడికి సవాలు విసిరాడు. అతని ఉత్సాహం చూసి ద్రోణుడు అతని విద్యాప్రదర్శనకు అనుమతిచ్చాడు. చూసినవారందరూ శభాష్ అన్నారు. దుర్యోధనుడు మరీ మెచ్చుకున్నాడు. అదే అదనని కర్ణుడు ‘అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేయాలి. అనుమతించు.’ అన్నాడు దుర్యోధనుడికి. దుర్యోధనుడు వెంటనే సరే అన్నాడు. వెంటనే యితను అర్జునుడిపై పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆనాటి ప్రదర్శన గురువుల ఆధ్వర్యంలో జరుగుతోంది. మధ్యలో దుర్యోధనుడు అనుమతి యివ్వడం, కర్ణుడి రెచ్చిపోవడం ఆశ్చర్యకరం. అప్పుడు కృపుడు ద్వంద్వయుద్ధ నియమాలను తెలియచెప్పి, సుక్షత్రియుడైన అర్జునుడితో పోరాడాలంటే నీ పుట్టుపూర్వోత్తరాలు చెప్పాలన్నాడు.

కృపుడు అలా అడగడం కర్ణుడికి లాభించింది. దుర్యోధనుడు అతనికి అంగరాజ్యాన్ని యిచ్చి క్షణంలో రాజుగా మార్చేశాడు. రాజు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు యువరాజు కూడా కాదు. హక్కు లేకపోయినా అతను యీ పని చేశాడు. అతను చేసినదానిని ధృతరాష్ట్రుడు ఎలాగూ ఆమోదిస్తాడని తెలిసి కాబోలు, సదస్యులెవరూ హక్కుల గురించి ప్రశ్నించలేదు. ఈ పట్టాభిషేకానికి కర్ణుడి పెంపుడు తండ్రి అధిరథుడు రావడం, కర్ణుడు అతనికి తండ్రీ అంటూ నమస్కరించడంతో, అందరికీ అతను సూతపుత్రుడని తెలిసింది. భీముడు ఆ విషయమై ఎద్దేవా చేస్తూండగానే సూర్యాస్తమయం అయిపోయింది. ఇక దానితో కార్యక్రమాలన్నీ ముగిసిపోయాయి. ఏ ద్వంద్వయుద్ధం కోసం కర్ణుడికి రాజ్యప్రాప్తి జరిగిందో, చివరకు అది జరగనే లేదు. అందువలన కర్ణుడు ‘అవేళ జరిగివుంటేనా...’ అని చెప్పుకుంటూ బతకడానికి వీలు కలిగింది.

తర్వాతి కథ చూస్తే కర్ణుడు, అర్జునుడు అనేకసార్లు తలపడ్డారు. ప్రతీసారీ కర్ణుడు ఓడిపోయాడు. అయినా ఆ విషయం దుర్యోధనుడికి అర్థం కాకుండా అతని ఉబ్బేస్తూ తన పబ్బం గడుపుకున్నాడు. అర్జునుణ్ని చంపడానికి దుర్యోధనుణ్ని వాడుకున్నాడు. శకుని దుర్యోధనుడి మేలు కోరేవాడే. అయితే అతనికి పాండవుల మీద ప్రత్యేకమైన పగ ఏమీ లేదు. దుశ్శాసనుడు అన్న చెప్పినది చేసేవాడే తప్ప, సొంతంగా ఆలోచన లేనివాడు. అందువలన కర్ణుడొక్కడే దుర్యోధనుడికి ఆప్తుడయ్యాడు. పాండవులు తనకెప్పుడూ ద్రోహం చేయకపోయినా, వారిపై ద్వేషంతో ఎప్పటికప్పుడు తప్పుడు సలహాలిచ్చి దుర్యోధనుణ్ని ఎగదోశాడు.

లాక్షాగృహదహనం తర్వాత, పాండవులు అజ్ఞాతంగా బతికి, చివరకి ద్రౌపదీ వివాహంతో బయటపడ్డారు. పాంచాలరాజు మద్దతు దొరికింది, కృష్ణుడు కూడా వచ్చి కలిశాడు. వీళ్లంతా మావగారి యింట ఉంటూ బలపడడం చూసి దుర్యోధనుడు భయపడుతూంటే, కర్ణుడు ద్రుపదుడి మీదకు దండయాత్రకు వెళదాం పద అన్నాడు. భీష్మద్రోణులు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చి, కురుపాండవులు కలిసి వుంటే మంచిదని హితవు పలికారు. కలిసి వుంటే అర్జునుణ్ని చంపే ఛాన్సు రాకుండా పోతుందన్న భయం కర్ణుడిది. అందుకని ముసలాళ్లు చెప్పవచ్చారా? అంటూ వాళ్లపై విరుచుకుపడ్డాడు. భీష్ముడు మహావీరుడు, కురువృద్ధుడు. ద్రోణుడు మహాయోధ, తనకు గురువు. అయినా కర్ణుడు తిట్టాడు, యిప్పుడే కాదు, మాటిమాటికీ తిడుతూనే వున్నాడు.

ద్రౌపదీ మానభంగ ఘట్టంలో ద్రౌపదిని జుట్టుపట్టి సభకు యీడ్చుకుని రా అని దుశ్శాసనుడికి ఆజ్ఞాపించినపుడు అభ్యంతరం చెప్పినవాడు విదురుడు. ఆమెను దాసి అనడానికి వీల్లేదని వాదించినవాడు దుర్యోధనుడి తమ్ముల్లో ఒకడైన వికర్ణుడు. అతనలా అనగానే అతనిపై విరుచుకుపడినవాడు కర్ణుడే. వృద్ధజనాలందరూ వున్నచోట నువ్వొక్కడివీ ధర్మం చెప్పవచ్చావా? అని అతని నోరు మూయించి, ‘దుశ్శాసనా, ఈ వికర్ణుడు రోగం లాటివాడు. మనలోనే వుంటూ మనల్ని నాశనం చేద్దామని చూస్తున్నాడు. నువ్వు ద్రౌపది వస్త్రాలను తీసిపారేయ్.’ అని సలహా యిచ్చాడు.  ద్రౌపదీ స్వయంవరానికి కర్ణుడు వెళ్లి మత్స్యయంత్రాన్ని ఛేదించబోతే, ద్రౌపది ‘నేను యితన్ని వరించను’ అని చెప్పి తిరస్కరించి, అవమానించింది. ఆ కసితో యిప్పుడీ సలహా యిచ్చివుంటాడు. దుర్యోధనుడికి కూడా కలగని ఆలోచనను కర్ణుడికే కలిగింది. దుశ్శాసనుడు అతని మాటనే పాలించాడు. ఇదీ కర్ణుడి దౌష్ట్యం.

‘పండు కథ’ అనే స్త్రీల పాటల్లో వున్న కథను ఎన్టీయార్ ‘కర్ణ’ సినిమాలో పెట్టారు. దానిలో ద్రౌపది కర్ణుణ్ని ఆరో భర్తగా కోరుకుందని చూపించారు. ఇతన్ని పెళ్లాడనని సభాముఖంగా చెప్పి, సభలో తన బట్టలూడదీయమని ప్రేరేపించిన కర్ణుణ్ని ద్రౌపది కోరుకుంటుందా? పూర్తి అసంబద్ధమైన సంగతి. కానీ కర్ణుడు హైలైట్ అవుతున్నాడు కదాని ఎన్టీయార్ పెట్టేశారు. అలాగే మాటిమాటికి దుర్యోధనుణ్ని ప్రేరేపించి, ఓటమిపాలు చేసిన సంగతి కూడా ఎన్టీయార్ తన సినిమాలో చూపలేదు. శాపగ్రస్తుడయ్యాడు కాబట్టి ఎప్పుడూ విషాదంగా మొహం పెట్టుకున్నట్లే చూపించారు. పాండవులు జూదంలో ఓడి, అరణ్యవాసం చేసే రోజుల్లో వాళ్లపై దండయాత్ర చేసి మట్టుపెట్టేద్దాం అని సలహా యిచ్చాడు కర్ణుడు. దుర్యోధనుడు సై అన్నాడు. వేదవ్యాసుడు వచ్చి వారించాడు. అప్పుడు దాన్ని ఘోషయాత్రగా అని చెప్పి వెళదామని సలహా యిచ్చాడు కర్ణుడు.

ఘోషయాత్ర అంటే రాజ్యంలోని పశుపాలకుల ఆవాసాలకు రాజు మందీమార్బలంతో వెళ్లడం. ‘ద్వైతవన ప్రాంతంలో గోపల్లెల్లో వున్న గోసంపద గణాంకాలు సేకరించడానికి వెళుతున్నామని మీ నాన్నగారికి చెప్పి, ఒప్పిద్దాం. అక్కడకు వెళ్లి మన వైభవాన్ని ప్రదర్శించి, పాండవులను ఉడికిద్దాం. మవ రాణులు సర్వాభరణభూషితలై తిరుగుతూంటే అది చూసి ద్రౌపది కుళ్లుకుని ఏడుస్తుంది.’ అని కర్ణుడి సలహా. దుర్యోధనుడితో బాటు తన అట్టహాసాన్ని కూడా చూపాలని కర్ణుడి కోరిక. ఎందుకంటే అతను అంగరాజు. పాండవులు రాజ్యభ్రష్టులు. పాండవులు వున్నవైపు వెళ్ళం అని ధృతరాష్ట్రుడికి హామీ యిచ్చి మరీ వెళ్లారు. కానీ అక్కడికే వెళ్లారు.

వెళ్లాక వేరేలా జరిగింది. చిత్రసేనుడనే గంధర్వరాజు చేతిలో చావుదెబ్బలు తిన్న కర్ణుడు దుర్యోధనుడి కర్మానికి దుర్యోధనుణ్ని వదిలేసి వికర్ణుడి రథంలో పారిపోయాడు. చివరకు భీమార్జునులే వచ్చి దుర్యోధనుణ్ని విడిపించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అర్జునుడి బాణనైపుణ్యాన్ని దుర్యోధనుడు కళ్లారా చూశాడు. ఇటు కర్ణుడు చూస్తే పారిపోయాడు. ఇక నాకు దిక్కు లేదనుకుని ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ‘మాయాయుద్ధం చేశాడు కాబట్టి పారిపోవాల్సి వచ్చింది కానీ పాండవులు వనవాసం నుంచి తిరిగి వచ్చాక జరిగే యుద్ధంలో అర్జునుణ్ని చంపితీరతాను చూడు’ అని హామీలు గుప్పించి, కర్ణుడు దుర్యోధనుణ్ని ఊరడించాడు. వాళ్లు రాజధానికి తిరిగి వచ్చాక, భీష్ముడు అందరి ముందూ ఘోషయాత్ర ప్రహసనాన్ని ప్రస్తావించి ‘చూశావుగా వాళ్ల పరాక్రమం, ఇప్పటికైనా వాళ్లతో పొత్తు కుదుర్చుకో’ అని హితబోధ చెప్పాడు. కర్ణుడికి తలకొట్టేసినట్లయింది.

తనను నమ్మి దుస్సాహసానికి దిగిన రాజుకి తలవంపులు తెచ్చానని బాధపడి, అతనిలో ఆత్మస్థయిర్యం పెంపొందించడానికి దిగ్విజయయాత్రకు బయలుదేరాడు. అనేక రాజ్యాలను జయించి, దుర్యోధనుడి రాజ్యాన్ని విస్తరింపచేశాడు. కృష్ణుడు ధర్మరాజు చేత అప్పటికే రాజసూయ యాగం చేయించాడు కాబట్టి, కుటుంబంలోనే మరో వ్యక్తి అది చేయకూడదు కాబట్టి, దానితో సమానమైన నారాయణయాగాన్ని తను దుర్యోధనుడి చేత చేయించాడు. దీని తర్వాత తనవైపు భీష్మద్రోణులు లేకపోయినా కర్ణుడొక్కడు వుంటే చాలు అనే ధైర్యం వచ్చేసింది దుర్యోధనుడికి.

ఈ యాగసమయంలోనే కర్ణుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు – ‘అర్జునుణ్ని సంహరించేవరకు అసురీవ్రతం చేస్తాను, జలసంజాతమైనది భుజించను. నన్ను ఏ విప్రుడు ఏది అడిగినా కాదనకుండా దానం చేస్తాను’ అని. అందుకే ఇంద్రుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలు అడిగితే కాదనలేకపోయాడు. అరణ్యవాసం పూర్తయే సమయానికి ధర్మరాజుకి యీ కవచకుండలాల గురించి చింత పట్టుకుంది. అవి వున్నంతకాలం అతన్ని ఓడించవచ్చు కానీ చంపడం అసాధ్యం. ఈ చింతను ఇంద్రుడు గ్రహించి, కర్ణుడి నుంచి భూసురవేషంలో సంగ్రహించాలనుకున్నాడు. ఆ సంగతి సూర్యుడు పసిగట్టి, కర్ణుడిని హెచ్చరించడానికి కలలోకి వచ్చాడు. ఇంద్రుడు వరం అడిగితే శక్తి అనే మహా ఆయుధాన్ని యిమ్మనమని పట్టుబట్టమని సలహా చెప్పాడు. కర్ణుడు అదే చేశాడు. కవచదానం నిరాపేక్షగా యిచ్చిన దానం కాదు. పైగా హెచ్చరించిన సూర్యుడితో ‘నా దగ్గర యితర అస్త్రాలు చాలా వున్నాయి, వాటితో అర్జునుణ్ని చంపగలను.’ అంటూ గొప్పలు చెప్పుకోవడం కూడా గమనార్హం.

అజ్ఞాతవాసం చివరి ఘట్టంలో ఉత్తరగోగ్రహణానికి దుర్యోధనుడు బయలుదేరాడు. ‘వచ్చెడివాడు ఫల్గుణుడు, అవశ్యము గెల్తుమనంగ రాదు’ అని భీష్ముడు, ‘మనం అందరం కలిసి ఎదిరించకపోతే కష్టం’ అని కృపుడు అంటే, ‘నేనొక్కణ్ని చాలు, నా పరాక్రమంలో పదహారో వంతు కూడా అర్జునుడికి లేదు.’ అంటూ కర్ణుడు అర్జునుడితో ద్వంద్వయుద్ధానికి దిగాడు. అతని కళ్లముందే అతని తమ్ముడు సంగ్రామజిత్తుని అర్జునుడు చంపాడు. చివరకు అర్జునుడి ధాటికి ఓర్వలేక కర్ణుడు పారిపోయాడు. దీని తర్వాత కూడా దుర్యోధనుడికి కర్ణుడిపై నమ్మకం సడలలేదు. అవేళ భీష్మద్రోణకృపులు కూడా భంగపడ్డారు కదా అని అనుకుని వుంటాడు. యుద్ధానికి సిద్ధపడ్డాడు. (సశేషం) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు