విభజన జరిగాక మిగిలిన భాగాన్ని ఇంగ్లీషులో 'రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్' అని ఇంగ్లీషులో, 'అవశేష ఆంధ్రప్రదేశ్' అని తెలుగులో అన్నారు. వ్యాసాల్లో 'అవశేష' పదాన్ని వుపయోగిస్తూంటే అదేదో అవమానకరమైన పదం అన్నట్టు కొందరు చాలా ఫీలై పోయారు. నవ్యాంధ్ర అనరాదా, స్వర్ణాంధ్ర అనరాదా అని చివాట్లు వేశారు. మీరు ముద్దుపేరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ అసలు పేరు అదే కదా అంటే వినలేదు. ఇక్కడ బాబు, అక్కడ మోదీ కలిసి ఆంధ్రను మిరుమిట్లు గొల్పిస్తారని, గొల్పించకపోతే జనసేనానాయకుడు కల్పించుకుని యిద్దర్నీ ప్రశ్నిస్తాడనీ వాళ్లు ప్రగాఢంగా నమ్మారు. ఇది 2014 జూన్ నాటి కథ. 9 నెలలైంది. ఈ రోజు స్వర్ణాంధ్ర కాదు కదా, రోల్డుగోల్డు ఆంధ్ర కూడా వచ్చినట్లు కనబడటం లేదు. బాబు అంటే ఆషామాషీ మనిషి కాదని, జాతీయస్థాయిలో చక్రం తిప్పగల సమర్థుడని ఆంధ్రప్రజలకు బలే నమ్మకం. రాష్ట్రం సమైక్యంగా వుండకపోతే ఆంధ్ర, తెలంగాణ రెండూ నష్టపోతాయని సమైక్యవాదులు నెత్తినోరు కొట్టుకుని చెప్పినా వాళ్లు వినలేదు. సమైక్యనినాదంతో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే ఓట్లేసినవాడు కాదు కదా, టిక్కెట్టు పుచ్చుకున్నవాడు కూడా లేకపోయాడు. ప్రజల్లో స్పందన కరువు కావడంతో నాయకులు పారిపోయారు, పార్టీ హారతి కర్పూరంలా యిగిరిపోయింది.
ప్రకృతివైపరీత్యాలలో సర్వం నాశనం అయినప్పుడే కాసులు విదల్చని కేంద్రం మీరు సింగపూర్లు కట్టుకోండి, టోక్యోలు కట్టుకోండి మేం నిధులిచ్చి కళ్లప్పగించి చూస్తూ వుంటాం అంటుందా? పదవీకాలం చివర్లో దీన్ని తలపెట్టిన కాంగ్రెసు బాధ్యత వహించదు కదా? కొత్తగా వచ్చే పార్టీకి బాధ్యత వుండదు కదా? గతంలో చీల్చిన మూడు రాష్ట్రాలకు పుష్కరం గడిచినా రాజధానులు ఏర్పడలేదు కదా? చీల్చాలని మేమేమీ అనలేదు కదా, మీలో మీరు కొట్టుకుని చచ్చి విడిపోతే మిమ్మల్ని నిలబెట్టడానికి యితర రాష్ట్రాల పొట్ట కొట్టి మీకెందుకు యివ్వాలి అని కేంద్రం అడిగితే మన దగ్గర సమాధానం ఏమిటి? – యిలాటి ప్రశ్నలు ఎన్ని అడిగినా సమాధానం యిచ్చినవాడు లేడు. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అనే రామదాసు కీర్తనలా బాబుండగా మనకు ఢోకా లేదు అనే ఆవేశంలో ఉర్రూతలూగిపోయారు. తిరుపతి సభలో మోదీ ఏ వాగ్దానమూ చేయకుండా మీకు తూర్పున సముద్రం వుంది, దాన్ని వుపయోగించుకుని మీ అంతట మీరే బాగుపడండి అని చెప్పి వెళ్లాడు. అది విని 'తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టమన్న మోదీ' అని నేను రాస్తే నాపై ఎందరు విరుచుకుపడ్డారో చెప్పలేను. ఆ తర్వాత సముద్రతీరాన్న వున్న వైజాగ్‌పై హుదూద్ విరుచుకుపడడం, 30 వేల కోట్ల నష్టం జరిగిందని వీళ్లు లెక్కలేస్తే మోదీ వెయ్యికోట్లు మాత్రం ప్రకటించి, అది కూడా యిప్పటిదాకా పూర్తిగా యివ్వకపోవడం గమనించాక కూడా యీ రోజుకీ వారందరికీ మోదీపై నమ్మకం యింకా అలాగే మిగిలుందని అంటే వారి వైపు తిరిగి మనం దణ్ణం పెట్టాలి.
ఎందుకంటే బాబుగారికే కేంద్రంపై నమ్మకం సడలిపోయింది. ఫైనాన్సు కమిషన్ సిఫార్సుల తర్వాత మోదీని వ్యక్తిగతంగా ఏమీ అనకపోయినా 'ఏపీకి న్యాయం జరగలేదు, రాష్ట్రాభివృద్ధి కోసమే కేంద్రంలో చేరాం అయినా నా మొర కేంద్రం ఆలకించలేదు, రెండు కాళ్లూ కట్టేసి పరిగెట్టమంటే ఎలా?' అని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తపరిచారు. ఇవాళ రైల్వే బజెట్ తర్వాత అసంతృప్తి డోసు పెంచారు. ప్రత్యేక రైల్వే జోను లేదు, వైజాగ్‌ను సౌత్ సెంట్రల్‌లో కలపలేదు (కొత్త లైన్లు లేకపోతే లేకపోయాయి లెండి, అవి ప్రకటించడమే తప్ప ఓ పదికోట్లో విదిలిస్తారు, ఎటూ సరిపోదు, పాతవి పూర్తి చేస్తే అంతే చాలు), వైజాగ్ మెట్రో లేదు, ఆంధ్ర రాజధాని మెట్రో లేదు, కోస్తా ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి యిచ్చిన దాంట్లో ఆంధ్ర కోస్తాకు ఎంత యిస్తారో స్పష్టత లేదు. ప్రత్యేక జోన్ గురించి విభజన చట్టంలో పేర్కొన్నారని టిడిపి నాయకులు వూరిస్తూ వచ్చారు. పేర్కొనడం వేరు, యిస్తామని కమిట్ కావడం వేరు.
ఇదే కాదు, యింకా అనేకవాటికి 'సాధ్యతలు పరిశీలిస్తాం' అనే మాటతో సరిపెట్టారు. ఐఐఎం ఒక్కటే కచ్చితమైన హామీ. అది అమలవుతోంది. తక్కినవన్నీ పరిగణించి తృణీకరించారని అనుకోవాలి. ఆంధ్రలో కొత్త జోన్ ప్రతిపాదన ఏదీ తన వద్ద లేదని రైల్వే బోర్డు చైర్మన్ ఏకె మిట్టల్ కుండ బద్దలు కొట్టి చెప్పాక, మన నాయకులు యింకా ఏం చెప్పి ఆశపెడతారు? అసలు రైల్వే మంత్రి బజెట్ ఉపన్యాసంలో ఆంధ్ర పేరే ఉచ్చరించలేదు కదా! అన్నిటి కన్నా ముఖ్యమైనది ప్రత్యేక హోదా! మన్‌మోహన్ స్వయంగా చెప్పాక కూడా దాన్ని అమలు చేయించుకోలేక పోతున్నారేమని కాంగ్రెసు పార్టీ కవ్విస్తూ వుంటే తప్పక తెచ్చుకుంటాం అని యిన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన టిడిపి యిక చేతులు ఎత్తేసింది. హోదా గురించి వెంకయ్య నాయుడు మార్చి మార్చి చెపుతున్న కబుర్లు జోకుల స్థాయికి చేరుకున్నాయి. దాంతో ఆయనను కాస్సేపు వూరుకోమని చెప్పి, ఢిల్లీలో వున్న టిడిపి అధికార ప్రతినిథి ఆంధ్రకు ప్రత్యేక హోదా తేలేకపోయినా, హోదాతో సమానమైన సదుపాయాలు పొందుతాం అని కొత్త పల్లవి మొదలుపెట్టారు. ఏవీ ఆ రాయితీలు అని అడిగితే అబ్బే, శాఖల పరంగా నిధులు సంపాదించడానికి చూస్తున్నాం అని జవాబు. శాఖలవారీ కేటాయింపుల్లో కొత్తేముంది? విభజన వలన జరిగిన నష్టాన్ని పూడ్చడానికి చేస్తున్న ప్రత్యేక కృషి ఏముంది?
కేంద్రపన్నుల వాటాలో రాష్ట్రాల వాటా పెంచడమనేది చాలా మంచి అడుగు. అయితే రాష్ట్రాలు వాటిని సంక్షేమ పథకాలకై ఖర్చు పెట్టేయకుండా అభివృద్ధి పనులపై వెచ్చించేట్లు కొన్ని షరతులు విధిస్తే బాగుంటుంది. ఆంధ్రకు వచ్చేసరికి వచ్చే ఏడాది బజెట్ లోటు గురించి చెప్తున్నారు. ఈ ఏడాది లోటు 9 వేల కోట్లుంటే రూ. 500 కోట్లు యిచ్చి వూరుకున్నారు. మిగిలిన దాని గురించి ఊసెత్తడం లేదు. కమిషన్ అంచనాల ప్రకారం ఐదేళ్ల తర్వాత కూడా రాష్ట్రం రెవెన్యూ లోటులోనే కొట్టుమిట్టులాడుతుంది. ఇటు బాబు ప్రభుత్వం చూస్తే లక్ష కోట్ల బజెట్ రూపొందించేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ బజెట్‌లు వచ్చినపుడు తెలుస్తుంది – అంచనాలకు, వాస్తవాలకు అంతరం ఎంత తీవ్రంగా వుందో! 2020 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు మిగులు బజెట్ స్థితికి చేరితే ఆంధ్ర మాత్రం జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల సరసన లోటు బజెట్‌లో వుంటుంది. అది రూ. 2500 కోట్లు వుంటుంది. ఇది చూసైనా ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలి లేకపోతే చరిత్ర క్షమించదు (చరిత్ర దాకా ఎందుకు, టిడిపి క్షమిస్తుందో లేదో చెప్తే చాలు) అని ఆంధ్ర ప్రణాళికా మండలి ఉపాధ్యకక్షుడు, టిడిపి ఆర్థిక సలహాదారు కుటుంబరావుగారు అంటున్నారు. పరిస్థితి యింత దీనంగా వున్నపుడు సంక్రాంతికి చంద్రన్న పప్పుబెల్లాలు పంచమన్న సలహా ఎవరిచ్చారో మరి! తెలంగాణతో పోటీ పడి ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్ యిమ్మన్నదెవరో మరి! (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)