Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: బ్రెజిల్‌ రాజకీయ సంక్షోభం

ఎమ్బీయస్‌: బ్రెజిల్‌ రాజకీయ సంక్షోభం

ఉత్తర అమెరికా కార్యకలాపాలు ఆకర్షించినంతగా దక్షిణ అమెరికా సంఘటనలు మన దృష్టిని ఆకట్టుకోవు. మన తెలుగు మీడియా వాటి గురించి తక్కువగా రాయడం ఒక ప్రధాన కారణం. బ్రెజిల్‌లో అధ్యక్షురాలిని అభిశంసించడం గురించి మనవాళ్లు చర్చించకపోవడం విశేషమేమీ కాదు కానీ బ్రిక్స్‌ దేశాల్లో బ్రెజిల్‌ ఒక దేశం కాబట్టి దాని రాజకీయ పరిణామాలు గమనించవలసిన అవసరం వుందని నాకు తోస్తుంది. పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని ఎదిరించి స్వతంత్రంగా ఎదిగే అవకాశాలున్న దేశాలుగా బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనాలను ఎకనమిస్టులు పేర్కొన్నారు. అప్పట్లో యీ గ్రూపును బ్రిక్‌ అనేవారు. ఇటీవల సౌత్‌ ఆఫ్రికా కూడా వచ్చి చేరి అది బ్రిక్స్‌ అయింది. ఈ దేశాలు ఒకరితో మరొకరు ఆర్థికంగా సహకరించుకోవాలనే ఉద్దేశంతో బ్రిక్స్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు అని ఒకటి నెలకొల్పి ఆ దేశాల్లో పబ్లిక్‌, ప్రయివేటు ప్రాజెక్టులకు ఋణాలు, గ్యారంటీలు, పెట్టుబడులు పెట్టడానికి వుపయోగపడాలనే ఆలోచనను 2012 నాటి బ్రిక్స్‌ సమావేశంలో ప్రతిపాదించారు. చివరకు అది 2014లో ఏర్పడి 2015 నుండి అమలులో వుంది. దానికి న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ అని పేరు మార్చారు. ఇలా మనతో భాగస్వామ్యం వున్న బ్రెజిల్‌ గత కొద్దికాలంలో ఆర్థిక సంక్షోభానికి గురవుతూ వచ్చి యిప్పుడు రాజకీయ సంక్షోభంలో మునిగింది. దీనికి కేంద్రంగా వున్నది - ఆ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన దిల్మా రూసెఫ్‌ అనే 68 ఏళ్ల మహిళ. 

బల్గేరియా నుండి బ్రెజిల్‌కు వచ్చి స్థిరపడి బాగా సంపాదించిన కుటుంబంలో పుట్టిన దిల్మా యువతిగా వుండగా సోషలిస్టు భావాల పట్ల ఆకర్షితురాలైంది. బ్రెజిల్‌లో రెండవ ప్రపంచయుద్ధం తర్వాత 1946లో వామపక్ష-ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి 18 ఏళ్ల పాటు నడిచింది. 1964లో దాన్ని కూలదోయడానికి అమెరికా ప్రభుత్వం సిఐఏ ద్వారా బ్రెజిల్‌ సైన్యం చేత కుట్ర చేయించింది. సైన్యాధికారులు అధికారంలోకి వచ్చి కమ్యూనిజం వ్యతిరేకత, ఆర్థిక పరిపుష్టి, జాతీయవాదం తమకు మార్గదర్శక సూత్రాలని ప్రకటించారు. (నియంతలెప్పుడూ జాతీయవాదం పేరు చెప్పి ప్రజలను రెచ్చగొడుతూ తమ అధికారానికి అడ్డు లేకుండా చూసుకోవడం అన్ని చోట్లా జరిగేదే)  ప్రజాస్వామ్యం తిరిగి తెస్తామంటూనే మూడేళ్ల తర్వాత రెండు పార్టీల విధానాన్ని తెచ్చారు. ఒకటి ప్రభుత్వానికి మద్దతిచ్చే నేషనల్‌ రెన్యూవల్‌ ఎలయన్స్‌ పార్టీ, మరొకటి బ్రెజిలియన్‌ డెమోక్రాటిక్‌ మూవ్‌మెంట్‌ (ఎండిబి) పార్టీ. తక్కిన పార్టీల నాయకులందరినీ అరెస్టు చేసి జైళ్లల్లో కుక్కారు. ప్రెస్‌ సెన్సార్‌షిప్‌ విధించి బ్రెజిల్‌ ఆర్థికంగా వెలిగిపోతోందన్న ప్రచారం చేసి లోకాన్ని, దేశప్రజలను మభ్యపెట్టారు. ఆ పరిస్థితుల్లో సైనిక పాలన ఎదిరించడానికి దిల్మా గెరిల్లా పోరాటవీరులతో చేరింది. 1970లో పట్టుబడి మూడేళ్లపాటు జైలుపాలై అక్కడ చిత్రహింసలకు గురైంది. చివరకు 1985లో సైనిక పాలన అంతమై ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది. 

అప్పటికే ద్రవ్యోల్బణం పెరగడంతో ధరలు నియంత్రించడానికి జీతాలు తగ్గించడం వంటి చర్యలు చేపట్టడంతో, నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడి ఆ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయింది. తర్వాత జరిగిన అనేక రాజకీయ పరిణామాల్లో దిల్మా తన భర్తతో కలిసి వామపక్ష విధానాలతో డెమోక్రాటిక్‌ లేబర్‌ పార్టీ (పిడిటి) స్థాపించి ఎన్నికలలో నెగ్గుతూ వచ్చింది. 2000లో ఆ పార్టీ వదిలేసి వర్కర్స్‌ పార్టీ (పిటి)లో చేరింది. 2002లో అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న లూలా సిల్వా నెలకొల్పిన ఎనర్జీ కమిటీలో చేరింది. ఆమె మేధస్సును, చురుకుతనాన్ని గ్రహించిన సిల్వా ఎన్నికల్లో నెగ్గాక ఆమెకు ఎనర్జీ మంత్రి పదవి అప్పగించాడు. 2005లో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పని చేసే వ్యక్తి అవినీతి ఆరోపణల కారణంగా రాజీనామా చేయవలసి వచ్చినపుడు ఆమె కా పదవి అప్పగించాడు. 2010 వరకు ఆమె ఆ పదవిలో వుంది.

2010 అక్టోబరులో ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేసి సోషల్‌ డెమాక్రాటిక్‌ పార్టీ (పిఎస్‌డిబి)కి చెందిన ప్రత్యర్థి  జోస్‌ సెర్రాపై 56% ఓట్లతో ఘనవిజయం సాధించింది. నాలుగేళ్ల తర్వాత 2014 అక్టోబరులో మళ్లీ అధ్యక్షపదవికి నిలబడినప్పుడు ప్రజాదరణ తగ్గినా 51% ఓట్లతో సెంటర్‌-రైట్‌ భావాలున్న పిఎస్‌డిబి అభ్యర్థి నెవెస్‌పై గెలిచింది. దిల్మా తెలివైనది, కష్టపడేస్వభావం కలిగినది, నిజాయితీపరురాలే కానీ ఆమెలో రాజకీయచతురత లేదు. ఆగ్రహావేశాలను అణచుకోలేక పోవడంతో అనేకమంది శత్రువులు ఏర్పడ్డారు. బ్రెజిల్‌ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటుకి చాలా అధికారాలుంటాయి. పార్లమెంటు సభ్యులు (డిప్యూటీ అంటారు) అధ్యక్షుడి విధానాలను ఎదిరించగలరు. అనేక పార్టీలు వుండడం చేత ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు. 1995 నుంచి అధికారంలో వున్న ఏ పార్టీకి 20%కు మించి ఓట్లు రాలేదు. వారు అధికారంలో కొనసాగడానికై పార్లమెంటు సభ్యుల అవినీతిని చూసీ చూడనట్లు వదిలేస్తూ వచ్చారు. బ్రెజిల్‌ రాజ్యాంగం ప్రకారం మొత్తం పార్లమెంటు సభ్యుల్లో 10% మంది మాత్రమే ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. తక్కినవారందరూ తమతమ పార్టీల చేత నామినేట్‌ చేయబడినవారే. ఎన్నికలలో తమకు దక్కిన ఓటింగు శాతానికి అనుగుణంగా ప్రతి పార్టీ కొందరు నాయకులను నామినేట్‌ చేస్తుంది. అవినీతికి పాల్పడినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమకు ఓటేయరన్న భయం 90% మంది సభ్యులకు వుండదు. అందువలన అధికార, విపక్ష సభ్యులందరూ అవినీతిలో మునిగి తేలే పరిస్థితి వచ్చింది. స్వయంగా అవినీతికి దూరంగా వుండే దిల్మా వీరందరికీ ముకుతాడు వేస్తుందని సామాన్యప్రజలు ఆశించారు కానీ ఆమె విఫలం కావడంతో నిస్పృహ చెందారు. దిల్మా స్వయంగా లంచాలేమీ తీసుకోకపోయినా 2003 నుండి 2010 వరకు పెట్రోబ్రాస్‌ బోర్డు ఆఫ్‌ డైరక్టర్లలో ఒకరిగా దిల్మా వుంది కాబట్టి ప్రజలు ఆమెనూ దోషిగా చూశారు. ఆమె నాకేమీ తెలియదన్నా సర్వేలో పాల్గొన్నవారిలో 44% మంది ఆమె వ్యతిరేక మయ్యారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె వ్యతిరేకులు 64% అయ్యారు.

పెట్రోబ్రాస్‌ (పెట్రోలియం కార్పోరేషన్‌) కుంభకోణం బయటపడ్డాక ప్రభుత్వ, ప్రతిపక్ష రాజకీయ నాయకుల అవినీతికి వ్యతిరేకంగా 2015 మార్చిలోి బ్రెజిల్‌లో లక్షలాది మందితో నిరసన ప్రదర్శనలు జరిగాయి.  బ్రెజిల్‌లో మీడియా ధనవంతుల చేతుల్లో వుంది. వారు వర్కర్స్‌ పార్టీకి పూర్తిగా వ్యతిరేకం. అందువలన ప్రజల ఆందోళనలను వారు బాగా హైలైట్‌ చేశారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అవినీతి వ్యతిరేక చట్టం చేసి, అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభించింది. ఇటీవల ''ఆపరేషన్‌ లావా జాటో'' (కార్‌ వాష్‌) పేరుతో వారి అవినీతిపై విచారణలు చేపట్టింది. రాజకీయ, ఆర్థిక నేరాలపై విచారణ చేసే సత్తాను దిల్మా కోర్టులకు కలగచేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె కాబినెట్‌లో ఆరుగురు మంత్రులు కితం ఏడాది రాజీనామా చేయవలసి వచ్చింది. ప్రస్తుతం పార్లమెంటులో 513 మంది సభ్యులుంటే 299 మందిపై అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై విచారణ జరుగుతోందంటే పరిస్థితి తీవ్రత అర్థమౌతుంది. దిల్మా తమను రక్షించటం లేదని అవినీతిపరులైన ఆమె పార్టీ సభ్యులే మండిపడసాగారు. 

ఆమె వామపక్షానికి చెందినదైనా తన తరహా మార్చుకుని ఆర్థిక ఆచరణవాదం వైపు మొగ్గింది. ప్రయివేటీకరణను వ్యతిరేకించలేదు. పెద్ద ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల విషయంలో ప్రైవేటు పెట్టుబడి తప్పదని వాదించింది. 2014 ఫిఫా వరల్డ్‌ కప్‌ ఉత్సవ సందర్భంగా బ్రెజిల్‌లో ఎయిర్‌ పోర్టు కట్టడానికి అనుమతించింది. ఇది శ్రామికవర్గాలకు నమ్మకద్రోహంగా తోచింది. కానీ ఆమె విద్యుత్‌ బిల్లుపై, నిత్యావసర వస్తువులపై పన్నులు తగ్గించి తన పాప్యులారిటీని కాపాడుకుంది. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టాక ఆమె పాప్యులారిటీ తగ్గసాగింది. 2013 మార్చిలో జరిగిన సర్వేలో ఆమె ప్రభుత్వానికి 63% మంది ఆమోదం తెలిపినా ఆమెకు వ్యక్తిగతంగా 79% వచ్చాయి. 2014 వచ్చేసరికి ఆమె అధ్యక్ష పదవికి తగినది అని 58% మాత్రమే అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు తగ్గడంతో, పెట్రోలు ఎగుమతులపై ఆధారపడిన బ్రెజిల్‌ ఆర్థికవ్యవస్థ దెబ్బ తింది. ప్రభుత్వవ్యయం తగ్గించడానికి సంక్షేమ పథకాలకు కోత విధించడంతో దిల్మా పార్టీకి అండగా నిలిచిన పేదలు దానికి ఎదురు తిరిగారు. 

దిల్మాపై కత్తి కట్టిన వివిధ రాజకీయపక్షాలది ఒక్కోరిది ఒక్కో కారణం. రోమన్‌ కాథలిక్‌ చర్చి అబార్షన్లను వ్యతిరేకిస్తుంది. అబార్షన్లను చట్టబద్ధం చేయాలని వాదించినందుకు దిల్మాపై చర్చికి ఆగ్రహం కలిగింది. దిల్మా తన వాదనను సవరించుకుని తల్లికి ప్రాణాపాయం వున్న కేసుల్లో, బలాత్కారానికి గురై గర్భం దాల్చిన సందర్భంలో అబార్షన్లను అనుమతించాలంది. అయినా ఆమె ప్రత్యర్థి జోస్‌ సెర్రా యిది క్రైస్తవ వ్యతిరేకమంటూ ఆమెపై ధ్వజమెత్తాడు. మీడియా కూడా అతన్ని సమర్థించింది. చివరకు అతని భార్య  యవ్వనంలో వుండగా అబార్షన్‌ చేయించుకుందన్న విషయం బయటపడ్డాక అతను నోరు మూశాడు. అమెజాన్‌ నదిపై హైడ్రో ఎలక్ట్రిక్‌ డామ్‌ కట్టడానికి దిల్మా అనుమతి యివ్వడం పర్యావరణ వేత్తలను, నిర్వాసితులు కాబోయే గిరిజనులను మండించింది. ఈ ప్రతికూల పరిస్థితులను రాజకీయంగా వుపయోగించుకోవాలని, ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి సహకారంతో ఆమె ప్రత్యర్థులు పథకాలు రచించారు. అలాటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యక్షుడు మైకేల్‌ టెమెర్‌ కూడా వారితో చేతులు కలిపాడు. అతను దిల్మాకు చెందిన వర్కర్స్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న ఎండిబి పార్టీకి చెందినవాడు. ఇప్పుడతన్ని దిల్మా నమ్మకద్రోహిగా అభివర్ణించింది. 

ఈ అసంతృప్తికి ఒక రూపం కల్పించి, రాజకీయపరమైన కుట్రకు సూత్రధారిగా దిగువ సభ ఐన చాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌కి ప్రెసిడెంటుగా రాజ్యాంగం ప్రకారం మూడో స్థానంలో వున్న్న వర్కర్స్‌ పార్టీకే చెందిన ఎడ్యురాండో కన్హా అవతరించాడు. అతనిపై చాలా అవినీతి ఆరోపణలున్నాయి. స్విస్‌ బ్యాంకులో లక్షలాది డాలర్లు దాచిన ఆరోపణలు రావడంతో స్విస్‌ అధికారులు విచారిస్తున్నారు. పెట్రోబ్రాస్‌లో 40 మిలియన్‌ డాలర్ల లంచం తీసుకున్న ఆరోపణపై పార్లమెంటు ఎథిక్స్‌ కమిటీ విచారణ జరుపుతోంది. దొంగసాక్ష్యం చెప్పినందుకు మరో కేసు నడుస్తోంది. పనామా పేపర్లలో కూడా అతని పేరు బయటకు వచ్చింది. ఇలాటి కష్టకాలంలో తన వర్కర్స్‌ పార్టీ తనకు అండగా నిలవలేదని దానికి దిల్మాయే కారణమని ఆతని ఆగ్రహం. ప్రత్యర్థులకు దిల్మాపై చేయడానికి అవినీతి ఆరోపణలేమీ దొరక్కపోవడంతో 2014లో బడ్జెట్‌ అంకెలను తారుమారు చేసిందన్న నేరం మోపారు. ప్రభుత్వవ్యయం ఎక్కువ కావడంతో 2014లో బజెట్‌లో లోటు చూపవలసి వచ్చింది. అక్టోబరులో ఎన్నికలకు వెళ్లబోతూ యిలాటి బజెట్‌ చూపిస్తే ఓట్లు రావన్న భయంతో ఆమె పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల నుంచి ఋణాలు తీసుకుని ఆ విషయాన్ని మరుగు పరచి, దేశ ఆర్థిక పరిస్థితి బాగా వుందని చూపించి ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ విధంగా నిజాన్ని మరుగు పరచినందుకు దిల్మాపై పార్లమెంటు అభిశంసన ప్రకటించింది. 

ఆ ప్రక్రియే పరిశీలకులకు వింతగా తోస్తోంది. 2016 ఏప్రిల్‌ 17 న పార్లమెంటు దిగువ సభలో చర్చ జరిగి 367 మంది అభిశంసన తీర్మానికి మద్దతు తెలపగా, 137 మంది వ్యతిరేకించారు. ఆ సభలో రైట్‌, సెంటర్‌-రైట్‌ పార్టీ సభ్యులదే మెజారిటీ. వారంతా దిల్మాకు వ్యతిరేకంగా ఓటేశారు. వర్గర్స్‌ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, డెమోక్రాటిక్‌ లేబర్‌ పార్టీ, సోషలిజం అండ్‌ ఫ్రీడమ్‌ పార్టీ దిల్మాకు అనుకూలంగా ఓటేశారు. టెమెర్‌ పార్టీకి చెందిన ఏడుగురు కూడా దిల్మా వైపే ఓటేశారు. ఆ సందర్భంగా పార్లమెంటు దిగువ సభ ప్రెసిడెంటు హోదాలో కన్హా ఒక్కో సభ్యుణ్ని ప్రసంగించడానికి ఆహ్వానించాడు. దిల్మాకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి కొందరు చెప్పిన కారణాలు - ''జెరూసలేంలో శాంతి కోసం..'', ''కమ్యూనిజం నుంచి దేశాన్ని రక్షించడానికి...'', ''జైల్లో వుండగా దిల్మాను చిత్రహింసలు పెట్టిన కల్నల్‌ బ్రిల్‌హంటే ఉస్త్రా గౌరవార్థం..'', ''1964 సైనిక కుట్ర జరిపిన అధికారుల గౌరవార్థం..''.. యిలా. ఇలా మాట్లాడినవారిలో ఇంటర్‌ పోల్‌ రెడ్‌ లిస్టులో వున్నవారు, మనీ లాండరింగ్‌ కేసుల్లో వున్నవారు, డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో వున్నవారు, ప్రభుత్వ ధనాన్ని గోల్‌మాల్‌ చేసినవారు వున్నారు. ఇప్పుడు వీరందరూ అమెరికాకు వెళ్లి దిల్మా దిగిపోతే అమెరికన్‌ వ్యాపారస్తులకు తమ దేశంలో ఎఱ్ఱ తివాచీ పరుస్తామని చెప్పి వస్తున్నారు. 23 గంటల పాటు సాగిన చర్చ తర్వాత జవాబిస్తూ దిల్మా ఆపరేషన్‌ లావా జాటోలో తనకు వ్యతిరేకంగా ఏ సాక్షీ సాక్ష్యం చెప్పలేదని, మహా అయితే తను పాలనాపరంగా తప్పులు చేసి వుండవచ్చునని అంది. 

దిగువ సభలో జరిగినట్లే మే 12 న సెనేటులో కూడా జరిగింది. 11 క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కుంటున్న రేనాన్‌ కాలహీరాస్‌ ఆమెపై దాడికి నాయకత్వం వహించాడు. అభిశంసన తీర్మానాన్ని 55 మంది బలపరచగా, 22 మంది వ్యతిరేకించారు. పార్లమెంటు ఆర్నెల్లపాటు ఆమెను అధికారానికి దూరంగా వుంచింది. ఈ లోగా సెనేట్‌ విచారణ జరిపి ఆమెను క్షమించాలో లేదో తేలుస్తుంది. ఈ అభిశంసనపై ఆమె కోర్టుకి వెళ్లినా ప్రయోజనం లేకపోవచ్చు. దేశంలోని అన్ని వ్యవస్థల వలె సుప్రీం కోర్టు కూడా సిద్ధాంతపరంగా రైటు, లెఫ్టుగా చీలిపోయింది. దిల్మా గద్దె దిగాక, ఆమె స్థానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న, ప్రజల్లో కేవలం 2% మంది మాత్రమే ఆమోదించే ఉపాధ్యక్షుడు మైకేల్‌ టెమెర్‌  అధ్యక్ష పదవి అధిష్టించాడు. అతన్నీ అభిశంసించాలని హైకోర్టు సూచించింది. ఇదే జరిగితే సూత్రధారి ఐన కన్హా త్వరలోనే టెమర్‌ను తప్పించి తనే ముందుకు రావచ్చు. ఈ గందరగోళాన్ని నివారించడానికి నవంబరులో జరిగే మునిసపల్‌ ఎన్నికలతో బాటు కొత్తగా అధ్యక్ష ఎన్నికలు జరపాలని కొందరు సెనేటర్లు సూచిస్తున్నారు. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?