Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం- శ్రీరంగనీతులు- 1

ఎమ్బీయస్‌: సినీమూలం-  శ్రీరంగనీతులు- 1

కథలను అరువు తెచ్చుకోవడంలో మనకు అత్యంత అనువుగా వుండేవి తమిళకథలు. వాటిలో కొన్ని డబ్బింగ్‌ చేయడం జరుగుతుంది. మరి కొన్నిటిని రీమేక్‌ చేయడం జరుగుతుంది. రీమేక్‌ చేసినపుడు యథాతథంగా దింపేసినవే ఎక్కువ. అయితే కథకు కాస్త మెరుగులు దిద్దిన సందర్భాలు కూడా లేకపోలేదు. అలాటి సందర్భమే 'శ్రీరంగనీతులు' అనే 1983 నాటి సినిమా. అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, చంద్రమోహన్‌, విజయశాంతి, సత్యనారాయణ నటించిన యీ సినిమాకు ఆధారం అంతకు 16 యేళ్ల క్రితం వచ్చిన 'ఊట్టీ వరై ఉరవు' అనే తమిళ సినిమా. తమిళ సినిమాకు కథ, డైలాగ్స్‌, డైరక్షన్‌ తెలుగువాడైన శ్రీధర్‌వి కాగా హీరోహీరోయిన్లుగా శివాజీ గణేశన్‌, కె ఆర్‌ విజయ నటించారు. టియస్‌ బాలయ్య హీరో తండ్రి వేషం వేయగా, ముత్తురామన్‌, ఎల్‌ విజయలక్ష్మి సహాయపాత్రల్లో నటించారు. మొదట తమిళ సినిమాను గమనిద్దాం.

హీరో శివాజీ ఊటీలో వుంటాడు. అతని తండ్రి బాలయ్య డబ్బున్నవాడు. ఊళ్లో పెద్దమనిషిగా, దైవభక్తుడిగా పేరుపొందాడు. ప్రస్తుతం బిజినెస్‌ కొడుక్కి అప్పగించాడు. అతను బిజినెస్‌ పనిమీద వేరే వూరు వెళుతున్నాడు. కారులో బయలుదేరాడు. కె ఆర్‌ విజయ హీరోయిన్‌. ఇంటినుండి పారిపోయి వస్తోంది. ఆమె ఎక్కిన టాక్సీ కింద ఒకమ్మాయి  (ఎల్‌ విజయలక్ష్మి) పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళదామని అనుకుని ఆమె పెట్టెను తన టాక్సీలో పెట్టుకుంది. తీరా చూస్తే డ్రైవర్‌ యివన్నీ పెద్ద తలకాయనొప్పి అని వాదించడంతో ఆమెను రోడ్డు పక్కగా పడుక్కోబెట్టి తన దారిన తాను వెళ్లిపోయింది. అదే రోడ్డుమీద శివాజీ టాక్సీలో వస్తూ విజయలక్ష్మిని చూశాడు. ఆసుపత్రిలో చేర్చి రైల్వే స్టేషన్‌కి వచ్చాడు. రైల్లో అతనెక్కిన బోగీలోనే హీరోయిన్‌ ఎక్కింది. ఆమె తప్పిపోయిందని పేపర్లో యిచ్చిన ప్రకటన హీరో కంటపడింది. అది చూసి చైను లాగి రైలు ఆపబోతే ఆమె వద్దని బతిమాలింది. అదేమంటే వివరాలు అడగవద్దని కోరింది. రాత్రివేళ పై బెర్త్‌ మీదనుండి పెట్టె కింద పడింది. దానిలోంచి ఫోటో, ఉత్తరాలు బయటపడ్డాయి. అవి తీసి హీరో చదివాడు. అప్పుడు  అర్థమైంది - తన తండ్రి యీ అమ్మాయి తల్లితో రహస్యంగా కాపురం చేశాడని! ఇంతలో నిద్ర లేచిన హీరోయిన్‌ చెప్పింది - నేను నా తండ్రివద్దకు వెళుతున్నానని. హీరో నీ తండ్రే నా తండ్రి అని చెప్పలేదు. 

నిజానికి ఈ పెట్టె ఆ యాక్సిడెంటు అయిన ఎల్‌ విజయలక్ష్మిది. ఆమె హీరోకి సవతి చెల్లెలు అవుతుంది. కానీ అనుకోకుండా ఆ పెట్టె హీరోయిన్‌ చేత చిక్కడంతో యింటినుండి పారిపోయి వస్తూన్న ఆమె ఆశ్రయం కోసం తనే ఆ అమ్మాయిని అని బుకాయించ దలచుకుంది. వెళ్లి బాలయ్యను బుకాయించింది. ఫోటోలు, ఉత్తరాలు చూపడంతో ఆమెను ఎన్నడూ చూడని బాలయ్య గత్యంతరం లేక ఆమెకు ఆశ్రయం యిచ్చాడు. అయితే ఆమె ధనికుడైన తన స్నేహితుడి కూతురని, తల్లిని పోగొట్టుకుందని, తండ్రి యాత్రలకు వెళుతూ తన వద్ద వదలి వెళ్లాడనీ భార్యకు చెప్పాడు. ఊరి నుంచి తిరిగివచ్చిన కొడుక్కీ అదే కథ చెప్పాడు. అతన్ని ఆ యింట్లో చూసిన హీరోయిన్‌ వణికింది. హీరో ఆమె గదికి వచ్చి తణిఖీ చేశాడు. హీరోయిన్‌ తన స్నేహితురాలికి రాసిన ఉత్తరం హీరో కంటపడింది. దాంతో అతను ఆమెను నిలదీశాడు, నువ్వెవరో చెప్పమన్నాడు. అప్పుడు హీరోయిన్‌ తన కథ చెప్పింది. ఆమె తండ్రి పదిలక్షల ఆసామీ. ఈ మధ్యే పోయాడు. తల్లి చిన్నపుడే పోయింది. మేనమామ వేరే వాళ్లకిచ్చి పెళ్లి చేసి యీమెను గుప్పిట్లో పెట్టుకుందామని చూస్తున్నాడు. దాంతో యీమె పారిపోయి వస్తూ హీరో చెల్లెలి పెట్టె దొరకడంతో యీ నాటకం ఆడుతోంది. ఈ కథంతా విని హీరో ఆమెను తనింట్లోనే వుండమన్నాడు. ఎక్కడికీ వెళ్లవద్దన్నాడు. ఎందుకు? తండ్రి చేసిన నిర్వాకాన్ని అతని నోటిద్వారానే బయటపెట్టించి తన యింట్లో జరుగుతున్న గందరగోళాన్ని తొలగిద్దామని. అంటే తన సవతి చెల్లెల్ని ఆమోదింపజేసేట్టు చేద్దామని. 

ఈ సినిమాను తెలుగులో తీసినప్పుడు కమెడియన్ల పోర్షన్‌ కాస్త తగ్గించి, హీరోయిజం మరింత పెంచాలని అనుకున్నారు. అందువలన హీరోయిన్‌ను తన యింట్లో వుంచుకోవడానికి మరింత బలమైన కారణం చూపడానికి హీరోకి మరో చెల్లెలి పాత్ర కల్పించారు. హీరో నాగేశ్వరరావు తండ్రి సత్యనారాయణ శ్రీరంగనీతులు వల్లిస్తూ సాక్షాత్తూ దైవస్వరూపుడిగా మన్ననలు అందుకుంటున్నాడు. అతని కూతురు జాన్‌ అనే ఓ క్రైస్తవుణ్ని ప్రేమించి రిజిస్టర్డ్‌ మారేజ్‌ చేసుకుని గర్భవతి అయింది. విషయం బయటపడగానే తండ్రి మండిపడి ఆమెను యింట్లోంచి గెంటేశాడు. నాగేశ్వరరావు ఆ చెల్లెలి కాపురాన్ని పర్యవేక్షిస్తూ వాళ్లకు సాయపడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఒరిజినల్‌లో లాగానే యీ అమ్మాయి తటస్థపడడం, విషయమంతా తెలియడం జరిగింది. తన తండ్రిని యిరకాటంలో పెట్టి అతని తప్పు ఒప్పుకునేట్లా చేసి తన చెల్లెలి పెళ్లిని ఆమోదింప చేసేట్లా చేయాలని నాగేశ్వరరావు ప్లాన్‌ చేసినట్టు చూపించారు. హీరో హీరోయిన్ల కథతో బాటు హీరో సవతి చెల్లెలు ప్రేమగాథ కూడా సైమల్టేనియస్‌గా చూపించారు. ముందుగా తమిళంలో ఎలా చూపించారో చూద్దాం. 

హీరో సవతి చెల్లి ఎల్‌. విజయలక్ష్మి డబ్బున్న ముత్తురామన్‌ను ప్రేమించింది. అతను హీరోకి ఫ్రెండు కూడా. తల్లి పోగానే యితన్ని కలుద్దామనే ఆమె బయలుదేరి దారిలో ప్రమాదం జరిగి పెట్టె పోగొట్టుకుంది. హీరో శివాజీ ఆసుపత్రిలో చేర్చాడు కదా, నయం కాగానే తన ఎడ్రసు వాళ్లకు చెప్పకుండా తన ప్రియుడి వద్దకు చేరింది. ఈ ప్రియుడు మంచివాడే కానీ తండ్రి వికె రామస్వామి అంటే భయం. రామస్వామికి డబ్బున్నవాడు. డబ్బున్న అమ్మాయినే కోడలిగా చేసుకోవాలని పట్టుదల. తండ్రి భయం చేత ముత్తురామన్‌ విజయలక్ష్మిని ఓ హోటల్లో పెట్టి ఆమెతో ప్రేమ సాగిస్తున్నాడు. ఓ రోజు హీరో శివాజీ కంటపడ్డాడు. హీరో విజయలక్ష్మిని చూస్తూనే గుర్తుపట్టాడు. యాక్సిడెంటునుండి తను రక్షించిన సవతిచెల్లెలు ఆమెయే అని. ఏమీ తెలియనట్టు ఫ్రెండుని నిలదీశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట యిచ్చాడు ముత్తురామన్‌. నువ్వు నీ తండ్రి వద్దకు వెళ్లవచ్చు కదా అని హీరో అడిగితే విజయలక్ష్మి అలా అయితే మా నాన్న పరువు పోతుంది అందామె. హీరో ఆమె సహనాన్ని, సౌశీల్యాన్ని మెచ్చుకుని ఆమెకు సహాయపడదలచుకున్నాడు. 

అతను చెప్పిన ఐడియా ప్రకారం ముత్తురామన్‌ రక్తం ఓడుతున్నట్టు విజయలక్ష్మికి ఎఱ్ఱ రంగు పూసి యింటికి మోసుకెళ్లి, ఆమెను తన కారు గుద్దేసిందని, అలా వదిలేస్తే పోలీసు కేసు అయి తను జైలుకి వెళ్లవలసి వస్తుంది కాబట్టి యింటికి తీసుకువచ్చానని తండ్రిని హడలుగొట్టాడు. కాస్సేపటికి హీరో డాక్టర్లా వచ్చి హంగామా చేశాడు. కాస్త తేరుకున్నాక విజయలక్ష్మి పిచ్చిదానిలా నటించింది. ఆమె తండ్రి బాగా డబ్బున్నవాడని, ఆమె గతి యిలా అయిందని తెలిస్తే మీమీద కేసు పెట్టి ఆస్తి లాక్కుంటాడని హీరో రామస్వామిని బెదరగొట్టాడు. కొడుకుతో తిరగనిస్తే ప్రేమలో పడి ఆమె పిచ్చి తగ్గుతుందని చెప్పి ఒప్పించాడు. గత్యంతరం లేక రామస్వామి సరేనన్నాడు. వాళ్ల ప్రేమను అనుమతించాడు. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?