Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : జాతీయతావాదంలో తప్పేముంది? - 1/2

యూరోప్‌లో, యితర దేశాల్లో యిటీవల పెరుగుతున్న విదేశీ వ్యతిరేక విధానాల గురించి, భూమిపుత్ర వాదం గురించి, విదేశీ జాతీయతావాదం గురించి నేను కొన్ని వ్యాసాలు రాశాను, యింకా రాయబోతున్నాను. వాటిలో జాతీయవాదం గురించి ప్రస్తావన రాగానే కొందరు పాఠకులు అడుగుతూంటారు - జాతీయవాదంలో తప్పేముంది? అని. చాలా సహజమైన ప్రశ్న. కానీ అది పాత్రికేయ రంగంలో ఏ అర్థంలో వాడబడుతోందో దాని గురించి వివరణ యిచ్చే అవసరం పడుతోంది. మొదటగా గ్రహించవలసినది ప్రతి వ్యక్తికి జాతిగౌరవం, దేశభక్తి సహజమైనవి. ఆ భావం ఎక్కణ్నుంచి వస్తుంది? ప్రతివాడికి అహంకారం  పుట్టుకతో వుంటుంది. దాన్ని మన కుటుంబసభ్యులు పెంచి పోషిస్తారు. మనకు మనం గొప్పవాళ్లం. మన వూరు, మన ప్రాంతం, మన దేశం, మన భాష, మన కుటుంబం, మన ఉపకులం, మన కులం, మన మతం, మళ్లీ మతంలో మన వర్గం, అన్నీ గొప్పవే.  చిన్నప్పటినుంచి యివే మనకు నేర్పుతారు, మనమూ నమ్ముతాం. మన పాఠ్యపుస్తకాలలోనూ దేశభక్తి నూరిపోస్తారు. జాతివీరుల గురించి చెప్తారు. అందువలన జాతీయతావాదం సహజంగానే వుంటుంది. మన విషయంలో ఇండియా, మరొకరి విషయంలో ఇంగ్లండు లేదా హాలండు - ప్రతివాడికీ వాడి దేశం గొప్పదే. తన జాతి గొప్పదే. మరి కొన్ని పాలకవర్గాలు జాతీయవాదం పేర కొత్తగా నూరిపోసేదేమిటి? 

'నేను గొప్ప' అనే ఫీలింగు నుంచి 'నేనే గొప్ప, అవతలివాడు నీచం' అనుకోవడంతో చిక్కు వస్తుంది. 'నేను ఎలాగూ గొప్ప, పక్కవాడూ పాపం గొప్పవాడేమోలే' అనే సందేహంతో వున్నా చాలా చిక్కులు వుండవు. అలాటి సందేహం వున్నా లేకపోయినా పక్కవాళ్లను పట్టించుకోకుండా తమ పని తాము చూసుకుంటూ వుంటారు చాలామంది ప్రజలు. అందుకే ఏదోలా సమాజం నడిచిపోతూ వుంటుంది. ఏదో ఒక జండా పట్టుకుని అధికారంలోకి వద్దామనుకున్నవాడికి యిది గిట్టదు. అందువలన వర్గీకరణ మొదలుపెడతాడు. 'మన జాతి, మన వర్గం, మన ప్రాంతం... గొప్పది, కానీ మనం మంచితనానికి పోయి యితరులను సహిస్తున్నాం. అది అలుసుగా తీసుకుని వాళ్లు పేట్రేగిపోతున్నారు. మనతో అడుకుంటున్నారు. మన కష్టాలకు మూలం వారే' అంటూ నూరిపోస్తూ వుంటాడు. గతంలో అయితే రాజులు ఎవరికీ జవాబుదారీగా వుండేవారు కారు. వాళ్లకి అధికారం వంశానుగతంగా వచ్చేది, ప్రజల ఆమోదంతో కాదు. జాతీయత, సమసమాజ స్థాపన వంటి మాటలు వుపయోగించి ప్రజలను ఉబ్బేయాల్సిన అవసరం వారికి పడేది కాదు.  కానీ రోజులు మారుతూ వచ్చాక ప్రజల్లోంచి నాయకులు రావడం మొదలయ్యాక వారిని ఎలా మెస్మరైజ్‌ చేసి పైకి రావాలా అని అనేక ఉపాయాలు ఆలోచించవలసిన అవసరం పడింది. 

చరిత్ర చూస్తే ఏ నియంతైనా సరే తొలిదశలో శ్రామికవర్గాన్ని ధనికవర్గం దోచుకుంటోంది అనే నినాదంతో మొదలుపెడతాడు. నెపోలియన్‌ విప్లవసేనానిగా మొదలై చివరకు తనే రాజరికం నెలకొల్పి, చక్రవర్తిగా తేలాడు. ఆధునిక యుగంలో ప్రజల్లోంచి పైకి వద్దామనుకున్న ప్రతి నాయకుడు సోషలిజం అనే మాట వాడి తీరతాడు. లేదా ఆ భావాన్ని మరోలా వ్యక్తం చేస్తాడు. ధనికులను దోచి ఆ డబ్బంతా తమకు పంచుతాడనే ఆశతో పేదలంతా అతని పక్షాన నిలుస్తారు. ముస్సోలినీ, హిట్లర్‌ అందరూ సోషలిస్టులుగా మొదలుపెట్టినవారే.  వీళ్లు పైకి రావడానికి కారణం - ప్రజాస్వామ్యవాదుల వైఫల్యం. ఇలాటి వర్గీకరణలు చేయని, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించని సాధారణ రాజకీయవాదులు చాలామందే వుంటారు. అయితే  వ్యక్తిగత స్వార్థాలుండడం చేత వాళ్లల్లో వాళ్లకు పొసగదు. ఎన్నికలలో ఎవరికీ పూర్తి బలం రాదు. కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చేస్తారు. కానీ అంతఃకలహాల వలన ప్రభుత్వం నడవదు. ప్రజలు విసిగిపోతారు. ఎవడో గట్టివాడు వచ్చి అందరికీ బుద్ధి చెప్పాలి అని మనసులో అనుకుంటూ వుంటారు. 

అలాటి సమయంలో యిలాటి ఫాసిస్టు నాయకులు ముందుకు వస్తాడు. వీళ్లకు మంచి వక్తృత్వకౌశలం వుంటుంది. వ్యవస్థను దుయ్యబట్టగలరు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడగలరు. మెజారిటీ జనాల్ని మెప్పించి వాళ్లను తన మాట వినేట్లా చేసుకోగలరు. సహజంగా పేద ప్రజలే ఎక్కువమంది వుంటారు కాబట్టి ధనికుల బూచి చూపించి, తనను నమ్ముకుంటే  వాళ్ల జీవితాలు బాగుపడతాయని నమ్మిస్తారు. ఈ విధంగా ఓ మేరకు అధికారాన్ని కైవసం చేసుకుంటారు. అప్పుడు ప్రజాస్వామ్యవాదులు మేల్కొంటారు. తాము సంఘటితంగా లేకపోవడం చేతనే యిలా జరిగిందని తెలుసుకుని వారిలో కొందరు కూటమిగా ఏర్పడి యీ నాయకుణ్ని విమర్శించడం మొదలుపెడతారు. అప్పుడు యీ నాయకుడు కొత్త ఎత్తు ఎత్తుతాడు. తాను అచ్చమైన దేశభక్తుణ్నని, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తానని, తనను ఎదిరించేవారిలో విదేశాల్లో పుట్టినవారో, విదేశాల మద్దతు వున్నవారో, విదేశీ సిద్ధాంతాలతో ప్రభావితమైన వారో వున్నారని ప్రచారం మొదలుపెడతాడు. సాధారణంగా ఒక దేశపు రాజకీయాలపై పొరుగుదేశానికి ఆసక్తి వుంటుంది. తమకు అనుకూలంగా వుండేవారు, తమతో సఖ్యంగా వుండేవారు అధికారంలోకి వస్తే మంచిదని భావిస్తూ, ఆ భావజాలం వున్నవారికి సహకారం అందిస్తూ వుంటుంది. అలాటి సహాయం అందుకున్నవారు దేశానికి ద్రోహం చేస్తారని, దేశప్రయోజనాలను తాకట్టు పెడతారని అనుకోవడానికి లేదు. కానీ వాళ్లనలా చూపిస్తారు వీళ్లు. అలాటి సహకారం అందుకోనివాళ్లపై సైతం ఆరోపణలు చేయడానికి వెనుకాడరు. 

కొన్ని విషయాల్లో ప్రజల్ని నమ్మించగలిగితే చాలు, యిక రుజువులు అడిగే ప్రజలెవరూ వుండరు. అసలు నీ మూలాలేమిటి అని కూడా అడగరు. హిట్లర్‌ పుట్టినది జర్మనీలో కాదు, ఆస్ట్రియాలో. అయినా జర్మనీ పేర జనాల్ని కూడగట్టి వారిలో నేషనలిజం - జాతీయతావాదం రెచ్చగొట్టాడు. అతని పార్టీ పేరేమిటో తెలుసా? ''నేషనల్‌ సోషలిస్టు జర్మన్‌ వర్కర్స్‌ పార్టీ'' నేషనలిజం, సోషలిజం రెండూ కలిపాడు. అతని కంటె సీనియరైన ముస్సోలినీని చూద్దాం. అతని పార్టీ పేరు ''నేషనల్‌ ఫాసిస్టు పార్టీ''. సిద్ధాంతరీత్యా - అది ఉదారవాదానికి విరోధి, మార్క్సిస్ట్‌ సోషలిజానికి వ్యతిరేకి, అలా అని మార్క్సిజానికి విరుద్ధమైన రియాక్షనరీ (విప్లవాన్ని విఫలం చేసే శక్తులు - ప్రతీప శక్తులు అంటారు తెలుగులో) సిద్ధాంతానికీి వ్యతిరేకమే. సమాజంలో వర్గవిభేదాలు వున్నాయని ఒప్పుకుంటూనే వాటిని ఘర్షణ ద్వారా కాక, చర్చల ద్వారా పరిష్కరించాలి అని ఫాసిజం ప్రతిపాదిస్తుంది. దాంతో బాటు ఇటలీ జాతీయత ఔన్నత్యాన్ని బోధిస్తుంది. తరతరాల ఇటాలియన్‌ సంప్రదాయాన్ని గౌరవిస్తున్నానంది. గతంలో ఈజిప్టును కూడా గెలిచిన ఇటాలియన్‌ పౌరుషం స్ఫూర్తిగా ఆ దేశాలను మళ్లీ గెలిచి ఘనతను తిరిగి తెస్తానంది. ముస్సోలినీ, హిట్లర్‌ యిద్దరూ తమ దేశాలకు వున్న చోటు సరిపోవటం లేదని, కాస్త చేయిచాచుకునే వీలుండాలని (ఎల్బో రూమ్‌) అంటూ పక్క దేశాలపై దాడి చేశారు. దీనికి వారి దేశప్రజలు అడ్డు చెప్పలేదు. పోనుపోను యుద్ధంలో ఓటమి ఎదురయ్యాక, అప్పుడు ప్రతిఘటన (రెసిస్టెన్స్‌) పుట్టుకువచ్చింది. 

ఈ నియంతలు సోషలిజం పాఠాలు వల్లించినా, ఆచరణలో వాళ్లు ధనికులను దోచనూ లేదు, పేదలకు పెట్టనూ లేదు. ప్రతి నియంత మొదట్లో విదేశీ సంస్థలను జాతీయం చేస్తాడు, డబ్బున్నవాళ్ల కోరలు పీకుతానంటాడు. ప్రజలు చప్పట్లు కొట్టి మాయలో పడిపోయాక మళ్లీ వాళ్ల జోలికి వెళ్లడు. పేదల బతుకులు అలాగే అఘోరిస్తాయి. ఎవరైనా ఎదిరిస్తే నీకు దేశభక్తి లేదంటూ హుంకరిస్తాడు. వీళ్లు జాతీయతావాదాన్ని ఏ అర్థంలో ప్రయోగిస్తున్నారో జాగ్రత్తగా గమనించాలి. దేశంలోని కొందరు ప్రజలకు వ్యతిరేకంగా వారిని విడగొట్టి అధికసంఖ్యాకులను దేశభక్తి పేరుతో సంఘటితం చేయడానికి జాతీయతావాదం పేరు వాడుకుంటారు. తాము ఏం చేసినా దేశభక్తితోనే చేశామంటారు. ఒకసారి దేశం పేరుతో రెచ్చగొట్టాక ప్రజలతో ఆడుకోవచ్చు. తను చేసిన ప్రతీ అకృత్యాన్ని సమర్థించుకోవచ్చు. దేశం పేరు చెపుతున్నాడు కాబట్టి ప్రజలు కిక్కురుమనరు. అధికాంశం ప్రజలు ఆరాధించడం మొదలుపెట్టడంతో, అది తలకెక్కి, అపరిమిత అధికారం ఉపయోగించి నియంతలుగా మారారు. ప్రజల్లో తమను వ్యతిరేకులను అణిచివేశారు. హిట్లర్‌ యూదులను, మరి కొన్ని జాతులను భూమిపై వుండడానికి అర్హత లేనివారిగా తీర్మానించి నిర్మూలిస్తున్నపుడు, రాజకీయంగా తనను వ్యతిరేకించినవారిని చంపిపారేస్తున్నపుడు జర్మన్‌ ప్రజలందరూ ఏం చేశారనే ప్రశ్న సహజంగా వస్తుంది. 'మన జర్మనీ, మన ఆర్యన్‌ జాతి, ప్రపంచాన్ని పాలించే హక్కు మనకే ఉంది' అంటూ నూరిపోసిన నియంతకు తమ మెదళ్లను అప్పగించేసి గుడ్డిగా అతన్ని అనుసరిస్తూ పోయారు. అందుకే యుద్ధానంతరం జర్మనీ కోలుకోవడానికి దశాబ్దాలు పట్టింది. ఇటలీ అయితే యింకా కోలుకోలేదనే చెప్పాలి. 

ఇంకోరకం నేతలున్నారు - సైనికనియంతలు! వారు ప్రజల్లోంచి రారు, ప్రజలకు జవాబుదారీ కాదు. ఏ ఆకర్షణీయమైన పదాలూ వుపయోగించవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికయిన ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయక, నాయకులు తమలో తాము కలహించుకుంటూ వుంటే దేశం కుక్కలు చింపిన విస్తరి కాకుండా కాపాడడానికి గోదాలోకి దిగాం అని చెప్పుకుని, సైన్యాధిపతి సైన్యబలంతో గద్దెను ఆక్రమిస్తాడు. నాయకులందరినీ ఉరి తీయడమో, జైల్లో పడేయడమో చేస్తాడు. ఎమర్జన్సీ విధించి, సెన్సార్‌షిప్‌ పెట్టి, రాత్రికి రాత్రి విపరీతంగా నిబంధనలు మార్చేస్తాడు. అయితే యిదంతా తనకోసం చేయడం లేదని, ప్రజల కోసం, ముఖ్యంగా పేదల కోసం చేస్తున్నానని చెప్పుకుంటాడు. తమ పాలన తాత్కాలికమైన ఏర్పాటేనని, సైన్యం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపి అసలైన ప్రజాప్రతినిథులకు అధికారం అప్పగించి తమపాటికి తాము మళ్లీ బారక్స్‌కు వెళ్లిపోతామని చెప్పుకుంటాడు. అప్పణ్నుంచి విదేశీ శక్తులతో, ధనికవర్గాలతో కలిసి వూరేగుతాడు. సైన్యం అత్యాచారాలకు తెగబడుతుంది. నోరెత్తితే పీక నొక్కుతారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చాడనే మాట పడకుండా కొంతకాలానికి ఎన్నికలు పెడతాడు కూడా. అప్పుడు ప్రజాదరణ వున్న పార్టీపై ఆంక్షలు పెట్టడమో, దాని నాయకుడిపై అవినీతి ఆరోపణలు చేసి, విధేయులైన న్యాయాధీశుల చేత ఔననిపించడమో చేస్తాడు. పోటీ ఎవరూ లేకుండా చేసుకుని తనూ అభ్యర్థిగా నిలబడతాడు. ఎన్నికలు రిగ్గింగ్‌ చేయిస్తాడు. ఏం చేసినా ప్రజల్లో కొంతయినా మద్దతు సంపాదించకపోతే సైన్యపాలన ఎక్కువకాలం సాగదు. అలాటి పరిస్థితుల్లో వాళ్లు చాలా సందర్భాల్లో ఆశ్రయించేది - మతాన్ని!

మతం అనేది వ్యక్తిగతం. మతాచారాలు, సంప్రదాయాలు వున్నా వాటిని ఏ మేరకు ఆచరించాలనేది వ్యక్తి యిష్టం. మధ్యయుగాల్లో సమాజంపై మతం పట్టు బాగా వుండేట్లు, మతాధికారుల మాట చెల్లేట్లు రాజులు చూశారు. దానికి ప్రత్యుపకారంగా మతాధికారులు రాజును దైవాంశసంభూతుడని, అతన్ని అధికారాన్ని ధిక్కరించరాదని, ధిక్కరిస్తే నరకంలో పడతారని ప్రజలకు నూరిపోశారు, మతం పేరుతో బెదిరించారు. పారిశ్రామికీకరణ తర్వాత మతం పట్టు తగ్గసాగింది. దేశాల మధ్య, వివిధ జాతుల మధ్య సంపర్కం పెరిగింది. పరమతసహనం పెరిగింది. మతాచరణలో కూడా వెసులుబాట్లు, సంస్కరణలు వచ్చాయి. విద్యార్జన, జ్ఞానం పెరిగిన కొద్దీ మతఛాందసత్వం తగ్గింది. మతాధికారుల మాటలు పట్టించుకోవడం మానేశారు. ఇది మిలటరీ పాలకుడికి రుచించే విషయం కాదు. పాతకాలపు రాజులా అతను మతాధికారుల ద్వారా ప్రజలను అదుపులో తెద్దామని చూస్తాడు. నిజానికి సైన్యంలోకి వెళ్లినవాణ్ని ప్రగాఢ మతావలంబి అనుకోలేం. కానీ సైనికనియంతగా మారినవాడు మాత్రం హఠాత్తుగా మతఛాందసత్వం ప్రదర్శించడం మొదలుపెడతాడు. పాకిస్తాన్‌ ఉదాహరణ తీసుకుంటే బాగా అర్థమవుతుంది. అక్కడ అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న సైన్యాధిపతులందరూ ముల్లా వేషాలు కట్టారు, షరియత్‌ అమలు చేశారు. ఇస్లాం పరిరక్షణే తమ ధ్యేయం అని చెప్పుకున్నారు. ఆధునికతవైపు మళ్లిన పాకిస్తాన్‌ సమాజపు గడియారాన్ని వెనక్కి తిప్పి మధ్యయుగాల్లోకి నడిపించబోయారు. ఎందుకిలా అంటే ప్రజల్లో ముస్లిములు అధికంగా వున్నారు కాబట్టి 'మన ఇస్లాం మనం పరిరక్షించుకోకపోతే ఎలా?' అనే మెజారిటీవాదంతో ప్రజలను కొంతకాలమైన ఆకట్టుకున్నారు. సాగినంతకాలం పాలించారు. (సశేషం)

(ఫోటో -  జాతీయవాదం, సోషలిజం కలగలపి నియంతృత్వానికి బాట వేసిన హిట్లర్‌ )

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
- mbsprasad@gmail.com