Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథలు - 71 - ఆఖరి క్షణాలు

అడవిలో రాజభటులు బండమీద తమ కత్తులు నూరుకుంటున్నారు. మఱ్ఱిచెట్టు కింద కొత్వాలు అసహనంగా నిలబడ్డాడు, వధ్యకార్యం చప్పున ముగించాలని ఆరాటపడుతూ. కొద్దిక్షణాల్లో తన తల తెగుతుందన్న ఆలోచనే తలకెక్కనట్టు కవి చెట్టు నానుకుని ఆకాశంకేసి చూస్తున్నాడు. బందీనీ, కొత్వాలునీ, భటుల్నీ మోసుకొచ్చిన గుఱ్ఱాలు అక్కడ జరగబోయే ఘాెరాన్ని కళ్లారా చూడలేక కాబోలు చూపులు తిప్పుకుంటున్నాయి. చేస్తున్న పని ఆపి, చెమట తుడుచుకొని కత్తి పదును చూసుకుంటున్నాడొక భటుడు. తృప్తి పడలేదు కాబోలు, మళ్లీ నూరడం మొదలెట్టాడు.

కొత్వాలు బందీకేసి  చూసాడు, ''ఇవిగో కవీ, చావు దగ్గిరపడింది. నీ ఇష్టదైవాన్ని స్మరించుకో. ప్రాణం తీసేముందు ప్రార్థించుకొనే అవకాశం ఇవ్వడం ఆనవాయితీ కదా. చప్పున కానీయ్‌'' అన్నాడు దర్పం ఉట్టిపడే స్వరంతో.

కవి కొత్వాలు కేసి సాలోచనగా చూసాడు. నవ్వుకున్నాడు. 'ఇష్టదేవతను తలచుకోవాలిట. తన ఇష్టదేవత, రసాధిదేవత, ఆనందదాయిని, ముక్తి ప్రదాయిని అన్నీ యామినియే. తలపులలోంచి ఆమె తప్పుకుంటే కదా స్మరించుకొనే అవసరం పడేది! రాజుగారు తమను విడదీసేవరకూ తాము కౌగిలిలో కలిసేవున్నారు. విడదీసిన తర్వాత కలల్లో కలిసివున్నారు. ఆమె రాకుమారి కాకుంటే ఈ కష్టాలు వచ్చేవే కావు. ఆ మాటకొస్తే తను కవి కాకున్నా వచ్చేవి కావు. వలపు, వగపు రెండూ ఉండే ఉండేవి కావు.

**

రాజుగారు తమ కుమార్తెను సాహిత్యంలో నిష్ణాతురాలను చేయాలనుకోవడంతోనే ప్రారంభమయింది కథ. రాజ్యంలో మేటి పండితుడు, కవి ఎవరిని విచారించబోతే తన గురించే చెప్పారు నిలయ విద్వాంసులు. రాజుగారు సంతోషించారు, తనను కళ్లారా చూసేదాకా. ఆయన కళ్లల్లో కనబడ్డ అయోమయం తనను తికమక పెట్టింది. ఇటీవలే తెలియవచ్చింది, ఆయనకొచ్చిన విూమాంస ఏమిటో.ఆ రాత్రే మంత్రి గారితో అన్నారట - ''కవిగారి పాండితీ ప్రకర్ష చూస్తే మా అమ్మాయికి గురువు కావాల్సిన మహానుభావుడితనే అనిపిస్తోంది. కానీ రూపం చూడబోతే సమ్మోహనకరం. నా కుమార్తె కూడా అతిలోకసుందరి. ఒకరినొకరు చూసుకుంటే - చదువు మాట ఎలాగవున్నా, ప్రేమలో పడడం నిశ్చయం. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.''

మంత్రిగారు చెప్పిన ఉపాయమే కాబోలు, మర్నాడు తనను రప్పించి, అంతఃపురంలోనే ఉండి రాకుమారికి సాహిత్యకళ నేర్పమని కోరుతూ రాజుగారు ఒక విషయం చెప్పారు - ''కవివర్యా, ఒక చిన్న విషయం. అమ్మాయి చర్మవ్యాధితో బాధపడుతోంది. అందువల్ల ఎవరికంటా పడడానికి ఆమె ఇచ్చగించదు. మీ మధ్య తెర కట్టిస్తాను. తెర కిటువైపు వున్న గదిలో మీ నివాసం, అటువైపు భాగంలో ఆమె గది. మీకు అందువల్ల చదువుకి అంతరాయం ఉండదు. మీకు అభ్యంతరం ఉండదనే భావిస్తున్నాం.'' రోగపీడితుల మానసిక స్థితిని సహృదయంతో అర్థం చేసుకోలేనివాడా తను? సరేనన్నాడు.

ఆ రోజే యామినికి కూడా చెప్పారట. ''అమ్మాయీ, నీకు పాఠాలు చెప్పడానికి కుదిర్చిన విద్వాంసుడు పుట్టుగుడ్డి. తన కన్నులు లొత్తలు పడివుండటం వల్ల ముఖం ఎవరికీ చూపించడానికి ఇష్టపడడు. మధ్య తెరగట్టి విద్య గరపమని ఒప్పించాల్సి వచ్చింది'' అని. విద్యాభ్యాసం మొదలుపెట్టిన ఆరు నెలల వరకు ఆ తెరచాటు భామిని యామినిని తను చూడనేలేదు. ఒకరోజు కిటికీలోంచి కనబడుతున్న పున్నమి చంద్రుడిని చూసి తను పరవశించిపోయాడు. ఆ చందమామలో కనబడే మచ్చను కొంతమంది కుందేలంటారు, కొంతమంది లేడి అంటారు కానీ ప్రియురాలి అధరంలో నింపడానికి అమృతాన్ని వెలికిదీసినప్పుడు ఏర్పడిన గుంటే అది అనిపించింది తన కానాడు. ఆ ఆలోచన మనసులో పుట్టగానే తన ప్రమేయం లేకుండానే ఆశువుగా కవిత రూపంలో వెలువడింది తన పెదాలపై.

తెర కవతలవున్న రాకుమారి ఆ పద్యాన్ని వింది. జాత్యంధుడికి చందమామ అందాలెలా తెలిసాయా అని అబ్బురపడి తెర తొలగించి చూసింది. తను ఆమె కంట పడినప్పుడు, ఆమె తన కంటపడకుండా ఉంటుందా? తనవంటి సౌందర్యపిపాసి తలమునకలుగా ప్రేమలో పడకుండా ఉంటాడా? ఆమె మాత్రం? అంతరాలు గణించకుండా అంతరంగంతో బాటు సర్వస్వాన్నీ తనకు అర్పించుకొంది.

ఇలాటి విషయాలు అంతఃపురంలోనే అణిగిపోవుగా. తమ వ్యవహారం పెదవులుదాటి ముందుకు సాగిందన్న విషయం పృథివి దాటదా? పృథ్వీపతికి చెవులు దాటిపోగలదా? కూతురు కాబట్టి యామినిని క్షమించి తనకు మాత్రం దండన విధించారు రాజుగారు.'

''ఏమయ్యా, ప్రార్థన ముగిసిందా, కళ్లు మూసుకుంటే దేవీదర్శనం అవుతోందా?'' అని అడిగాడు కొత్వాలు.

నిజంగా దేవీ దర్శనమే. అలకమానిన యామినీదేవి దర్శనమే. ఆ రోజు ప్రణయకలహంతో ఆమె రగిలిపోతూండగా తను తుమ్మాడు. 'చిరంజీవ' అందామంటే ఆమె పట్టుదల చెడిపోదూ, అయినా ఊరికే ఉండడానికి మనసు రాలేదు పాపం. అమంగళం ప్రతిహతం కావడానికి సువర్ణాభరణం తొడగాలని నమ్మకం. ఆమె చెవి కమ్మ తీసి, తన చెవికి తొడగబోయింది. అదే అదనని తను ఆమె కలశాలను చేబట్టాడు. పాపం అడ్డు పెడదామంటే రెండు చేతులూ చెవి కమ్మ పెట్టే పనిలో ఉన్నాయి.

వక్షాన్ని కాపాడుకోవాలంటే ఆభరణాన్ని జార్చివేయాలి, అమంగళమేమోనన్న భయం. అందువల్ల ఆ పని పూర్తయ్యేవరకూ సహించి ఆ తరువాత ఇనుమడించిన కోపంతో చేయి తోసేసింది. తెల్లారేసరికి ఆమెకు కోపం తగ్గింది, కానీ తనకు తెలపడం ఎలా? నిద్రలో తెలియనట్టుగా ఒక చేయి తనపై పడేసింది. తను గ్రహించాడు. లేచి ఆమె ముఖంకేసి చూసాడు. కొంటెతనం, కోరిక దోబూచులాడుతున్నాయి. ఆ ముఖమే తన ఆఖరిక్షణాల్లో కళ్లముందు నిలుస్తోంది. ముఖంపై చిరునవ్వు వెలుస్తోంది.'

**

''కవీ, సిద్ధమేనా?'' అంటున్నారు భటులు.

కవికి హఠాత్తుగా బిల్హణుడి చరిత్ర గుర్తుకు వచ్చింది. 'తనలాటి కథే అతనిది. ఇటువంటి ఘట్టంలో అతను చిరునవ్వు నవ్వితే భటులు అడుగుతారు ఏమిటయ్యా కారణం అని. అతను తన కళ్లముందు కదలాడే ప్రియురాలి చేష్టల గురించి అనేక శ్లోకాలలో వివరిస్తాడు. భటుల మనసు కరిగి, రాజుగారికి విన్నవించి బిల్హణుడు, ప్రియురాలూ వివాహం చేసుకోడానికి దోహదపడతారు. తనూ అలాగే చేసి చూస్తే?'

'వద్దు, తన ప్రియురాలి అంగాంగ వర్ణన వీళ్లెందుకు వినాలి? ఆమె తనది. ఆమెతో అనుభవాలు తనవి. పరాయివారితో పంచుకోదగిన అనుభూతులు కావవి. ఆమె శరీరాన్ని బట్టబయలు చేసేకంటే  మృత్యువును ఆహ్వానించడం మేలు. ఆమె రూపాన్ని కళ్లముందు నిలుపుకొని పరలోకానికి పయనం కావడం మేలు'' అనుకున్నాడు కవి.

''మీ పని కానివ్వండి నాయనా'' అన్నాడతను మోకరిల్లుతూ.

(ఆంధ్రజ్యోతి వీక్లీ జులై 1998లో ప్రచురితం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
mbsprasad@gmail.com