ఎమ్బీయస్‌ :మోదీకి మద్దతుగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు – 02

విధానాలు చేసిన మేలు కంటె కీడు ఎక్కువని ఒప్పుకోక తప్పదు. లాభాల్లో వున్న పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లను కూడా అమ్మేశారు. ప్రయివేటు సెక్టార్‌కు లాభాపేక్ష తప్ప సమాజం పట్ల బాధ్యత వుండదు. పర్యావరణం పట్ల…

విధానాలు చేసిన మేలు కంటె కీడు ఎక్కువని ఒప్పుకోక తప్పదు. లాభాల్లో వున్న పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లను కూడా అమ్మేశారు. ప్రయివేటు సెక్టార్‌కు లాభాపేక్ష తప్ప సమాజం పట్ల బాధ్యత వుండదు. పర్యావరణం పట్ల స్పృహ వుండదు. ఉద్యోగులకు ఉద్యోగభద్రత వుండదు. పన్నులు సరిగ్గా కట్టరు. ఫ్యాక్టరీల్లో రక్షణ ఏర్పాట్లు వుండవు. వాటి నుండి వెలువడే కాలుష్యాలను దగ్గరున్న నదుల్లో, చెఱువుల్లో కలిపేస్తారు. తనిఖీ చేయడానికి వచ్చిన ప్రభుత్వాధికారులను బెదిరించో, లంచాలిచ్చో లోబరుచుకుంటారు. అంతా దేనికంటె యింకాయింకా లాభాలు ఆర్జించడానికి! ప్రభుత్వ యూనిట్లలో లాభం ప్రధానం కాదు కాబట్టి, చాలాభాగం రూల్సు పాటిస్తారు. ప్రభుత్వ విధానాలను తమకు అనుకూలంగా రూపొందించుకోవడానికి ప్రయివేటు సెక్టార్‌ నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. ఆంగ్లప్రభుత్వంలో వ్యాపారాలు చేసుకుంటూ వచ్చిన బిర్లాలు ఎటుపోయి ఎటు వచ్చినా మంచిదని కాంగ్రెసుకు కూడా విరాళాలిచ్చి మద్దతు పలికేవారు. కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడ్డాక నెహ్రూ కాపిటలిస్టులకు వ్యతిరేకి అని తెలిసి పటేల్‌ను, మొరార్జీ దేశాయ్‌ను, యితర నాయకులను దువ్వేవారు. తాము పెట్టుబడి పెట్టి కొందరు ఎంపీలను గెలిపించి తమకు అనుకూలంగా పార్లమెంటులో మాట్లాడించేవారు. అదే అదనుగా కాంగ్రెసు కాపిటలిస్టుల పార్టీ అని, రైటిస్టు పార్టీ అని కమ్యూనిస్టులు, సోషలిస్టులు యాగీ చేసేవారు. పోనుపోను మాజీ రాజులు, పారిశ్రామికవేత్తలు రాజకీయనాయకులుగా అవతారమెత్తి ప్రభుత్వ విధానాలను తమకు అనుగుణంగా మార్చుకోసాగారు. ఈ ధోరణి యిటీవలి కాలంలో విపరీతమై పోయింది. వ్యాపారస్తులే రాజకీయనాయకులుగా డబుల్‌ రోల్‌ వేస్తున్నారు. ప్రభుత్వంలో ఏ పార్టీ వున్నా వీరి హవా నడుస్తోంది. తమ ప్రభుత్వం చేత తమకే కాంట్రాక్టులు యిప్పించుకుంటారు. అలా సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో నెగ్గి మళ్లీ డబ్బు సంపాదిస్తున్నారు. ప్రజాసేవ రూటు ద్వారా టిక్కెట్టు సంపాదించే రోజులు పోయాయి.

యుపిఏ ప్రభుత్వం వున్నా, ఎన్‌డిఏ ప్రభుత్వం వున్నా రిలయన్సు వారే వెనకనుండి అధికారం చలాయిస్తూ వచ్చారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో ప్రత్యక్షజోక్యం చేసుకోబోతున్నట్లే తోస్తోంది. పెట్టుబడిదారులందరూ మోదీకి రక్షణగా నిలబడ్డారు. నిజానికి గ్లోబలైజేషన్‌ కారణంగా దెబ్బ తిన్న మన దేశం ఈ సోకాల్డ్‌ సంస్కరణలకు కళ్లెం వేసి, మిక్సెడ్‌ ఎకానమీని మళ్లీ తెరపైకి తెచ్చే అవసరం ఏర్పడింది. అయితే యీ కార్పోరేట్‌  దిగ్గజాలు దేశాన్ని దక్షిణమార్గంలోనే నడిపించదలచుకున్నారు. వీరిది ఒక చిత్రమైన పాలసీ. ఇందిర హయాంలో స్మాల్‌ స్కేల్‌ సెక్టార్‌కు కొన్ని పరిశ్రమలు కేటాయించి, వాటిలో పెద్ద కార్పోరేట్లు దిగకూడదని ఆంక్షలు విధిస్తే 'ఇది ప్రొటెక్షనిజం, యిలాటి ఆంక్షలు ఆర్థికప్రగతికి అవరోధాలు' అని వాదించేవారు. రాజీవ్‌ వచ్చి విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం అన్నాడు. వాళ్లు వచ్చి యిక్కడ పరిశ్రమలు పెడతారేమో అనుకుంటే ఎన్నారై అయిన స్వరాజ్‌ పాల్‌ వచ్చి ఎస్కార్ట్‌ వంటి కంపెనీల షేర్లు కొనేసి, యాజమాన్యం తన చేతిలోకి తీసుకోబోయాడు. దాంతో యీ కార్పోరేట్‌ దిగ్గజాలు గజగజ వణికి, 'ప్రొటెక్షనిజం వుండాలి' అంటూ హాహాకారాలు చేశారు. విదేశీ పెట్టుబడులు వుండాలి అని మీడియా తెగ ప్రచారం చేస్తుంది. 'ఓకే ప్రింటు మీడియాలో విదేశీ పెట్టుబడులు అనుమతిస్తున్నాం' అని ప్రభుత్వం అనగానే వీళ్లు 'అన్యాయం, ఆ రంగంలో మాత్రం అనుమతించకూడదు' అని ఆందోళన చేస్తారు. ఎందుకంటే వాళ్ల పోటీ ముందు వీళ్లు తాళలేరు. ప్రపంచ బ్యాంకు, విదేశీ శక్తులు అన్నీ ప్రభుత్వం ఏ నియమాలు పెట్టకూడదనీ, మార్కెట్‌ శక్తులకే అన్ని అధికారాలు వుండాలని వాదిస్తాయి. ఫారిన్‌ పెట్టుబడులను ఎక్కడపడితే అక్కడ అనుమతించాలని వాదిస్తాయి. యుపిఏ 1 ప్రభుత్వానికి కమ్యూనిస్టుల అండ అవసరమైంది. ఈ రైటిస్టు విధానాలు మరీ హద్దు మీరకుండా కమ్యూనిస్టులు చూశారు. ఇన్సూరెన్సు రంగంలో ఎఫ్‌డిఐలను వ్యతిరేకించి దేశాన్ని మెల్ట్‌డౌన్‌ నుండి కాపాడారు. యుపిఏ 2కి సొంతంగా మెజారిటీ రావడంతో కమ్యూనిస్టులు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఎన్‌డిఏకు అంతకంటె పెద్ద మెజారిటీ వచ్చింది. వాళ్లు ఏ మార్గం పట్టినా ఎవరూ వాళ్లను నిరోధించలేరు. 

ప్రయివేటు రంగం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఉదాహరణ చెప్పాలంటే – మన రాష్ట్రాలలో విద్యారంగం తీసుకోండి చాలు. ప్రయివేటు ఇంజనీరింగు కాలేజీలు, మెడికల్‌ కాలేజీలు తామరతంపరగా పుట్టుకుని వచ్చాయి. ఇవి విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కానీ వాటికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏమీ వుండటం లేదు. సరైన ఫాకల్టీ లేదు. ఉన్నవాళ్లకి సరిగ్గా జీతాలు యివ్వరు. ప్లే గ్రౌండ్‌ వుండదు, లాబ్‌ వుండదు, కేంద్రం నుంచి టీము వచ్చి యీ లోపాలు కనిపెట్టి గుర్తింపు రద్దు చేస్తామంటే వీళ్లు రాజకీయంగా మేనేజ్‌ చేసి కాలేజీని నిలుపుకుంటారు. నేను చదివినది గవర్నమెంటు హైస్కూలులోనే, గవర్నమెంటు కాలేజీలోనే. మాకు తొమ్మిదో క్లాసు నుండి ప్రాక్టికల్స్‌ వుండేవి. ఈ రోజు యింటర్‌ విద్యార్థులకు టెస్ట్‌ ట్యూబ్‌ కూడా చూపించటం లేదు. ప్రాక్టికల్స్‌ పేర వేసే మార్కులన్నీ బోగస్సే. ఏ ఎక్విప్‌మెంట్‌ కళ్లతో కూడా చూడకుండా బియస్సీ, ఎమ్మెస్సీ చేసేస్తున్నారు. ఫ్యాక్టరీలో మెషినరీతో సంబంధం వున్న ఉద్యోగానికి వెళితే వాళ్లు చేర్చుకోవటం లేదు. వీళ్లు తీసుకునే ఫీజుకి, చెప్పే చదువుకి తూకం లేదు. గవర్నమెంటు స్కూళ్లు, కాలేజీలో బలోపేతం చేస్తే వీళ్ల మొహం ఎవరూ చూడరు. కానీ ప్రభుత్వం ఆ పని చేయకుండా వీళ్లు అడ్డుపడతారు. వాళ్లే డబ్బిచ్చి ఎమ్మెల్యేలను నిలబెడతారు. కొన్ని సందర్భాల్లో వాళ్లే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. వైద్యరంగంలో కూడా అదే కథ. ఆరోగ్యశ్రీ అంటూ కార్పోరేట్‌ హాస్పటల్స్‌లో వైద్యం చేయించనేల? వారికి ప్రభుత్వం డబ్బు కట్టనేల? ఆ నిధులను ప్రాథమిక వైద్యశాలలపై (ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌) వెచ్చిస్తే కార్పోరేట్‌ హాస్పటల్‌కు మధ్యతరగతివాడు వెళ్ల నవసరమే లేదు. కానీ యీ కార్పోరేట్‌ హాస్పటల్స్‌ వాళ్లు ఆ పని జరగనివ్వరు.  ప్రభుత్వం వాటికి నిధులు కేటాయించకుండా చేసి, ప్రభుత్వాసుపత్రికి వెళితే ఆత్మహత్య చేసుకున్నట్లే అనే ఫీలింగ్‌ ప్రజల్లో కలిగేలా చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి రూలింగ్‌ పార్టీకి నిధులు యిస్తారు, అదీ చాలదనుకుంటే రాజ్యసభలోకో, లోకసభలోకో ఎంపీలుగా దూరి విధానాలు మార్చేస్తారు కూడా. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2014)

[email protected]

Click Here for Part-1