Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : పాలస్తీనా సమస్య - 01

ఈ మధ్య గాజాలో ఘర్షణలు తలెత్తిన దగ్గర్నుంచి పాలస్తీనా-ఇజ్రాయేలు పేచీల గురించి రాయమని చాలామంది అడుగుతున్నారు. అది సుమారు వందేళ్ల చరిత్ర. క్లుప్తంగా చెప్పడం కష్టం. ఈ వివాదంలో ఎవరు ఎవరిపై ఎప్పుడు దాడి చేశారో వివరాలు యిస్తూ పోతే ఎన్ని పేజీలూ చాలవు. సమస్యకు మూలం ఏమిటి, పొరబాటు ఎవరిది అని అర్థం చేసుకుంటే చాలు. భారత్‌-పాకిస్తాన్‌ గొడవల్లో కొన్ని అరబ్‌ దేశాలు ముస్లిం ఫీలింగ్‌తో పాకిస్తాన్‌ను సమర్థిస్తున్నాయి కాబట్టి, ఇజ్రాయేలు మనల్ని సమర్థిస్తోంది కాబట్టి ఇజ్రాయేలు ఏం చేసినా మనం మెచ్చుకోవాలి, అదే దేశభక్తి అనే భావనలో కొందరున్నారు. 'మన విషయంలో ఎలా వ్యవహరించారన్నది లెక్కలోకి తీసుకుని పక్షపాతంతో మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకోకూడదు. మన శత్రువుకు స్నేహితుడు కదాని వారికి అన్యాయం చేసినా ఖండించకుండా వుండకూడదు.' అనే భావనతో నేనుంటాను. మీకు వేరే భావం వుంటే యీ సీరీస్‌ చదవడం అనవసరం. 

జరుగుతున్నదేమిటంటే - ఇజ్రాయేల్‌ ఏర్పడినప్పటినుండి పక్కనున్న పాలస్తీనాను కొద్దికొద్దిగా కబళిస్తూ వస్తోంది. ప్రపంచంలో ఎవరి మాటా లెక్క చేయటం లేదు. అది ఏం చేసినా సమర్థించడానికి అమెరికా వుంది. అమెరికాను శాసించే ధనికవర్గం, పాలకవర్గం యూదులే. వాళ్లు తమ మాతృభూమిగా భావించే ఇజ్రాయేలుకు ఎప్పుడూ మద్దతు పలికేట్లా అమెరికా ప్రభుత్వం మెడలు వంచుతూ వుంటారు. పొరుగున వున్న ఇజ్రాయేలు ఉనికిని భరించలేకపోయినా దాన్ని తరిమివేయడం కాదు కదా, అదుపులో పెట్టడానికి కూడా అరబ్‌ దేశాలకు చేతకావటం లేదు. ఎందుకంటే వారిలో రకరకాల కారణాల చేత అనైక్యత విపరీతంగా వుంది. పైగా ఇజ్రాయేల్‌ పౌరులు కానీ, సైనికులు కానీ, టెర్రరిస్టులు కానీ అరబ్‌ దేశాల వారి కంటె చాలా నైపుణ్యం కలవారు, తెలివైనవారు, తమ దేశాన్ని తీర్చుదిద్దుకోవడంలో ఘనులు. వారితో యుద్ధంలో అరబ్‌ దేశాల వారు ఎప్పుడూ ఓడిపోతూనే వున్నారు. బలహీనుల పక్షాన నిలవవలసిన ఐక్యరాజ్య సమితి అమెరికాకు దాసోహమంటోంది. ఇజ్రాయేలు పోకిరీ (రోగ్‌) దేశంగా వ్యవహరిస్తున్నా దానికి ముకుతాడు వేసే నాథుడే కరువయ్యాడు. ఇదీ యీ సీరీస్‌ యొక్క సారాంశం. దీని నేపథ్యం కూడా చెపుతాను. ఓపిక వుంటే చదవండి. 

ఇజ్రాయేలు ఎలా ఏర్పడింది అని అడిగితే చాలామంది చెప్పేది - 'రెండవ ప్రపంచయుద్ధంలో అక్షరాజ్యాలు ఓడిపోయి మిత్రదేశాలు గెలిచాయి. హిట్లర్‌ పాలనలో చిత్రహింసల పాలయిన యూదుల పట్ల ప్రపంచ పౌరులందరకూ జాలి వేసింది. వారి కంటూ ఏమైనా చేయాలని అనుకున్నారు. యూదుల రాజ్యం బైబిల్‌లోని ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ కాలం నాటిది. చరిత్ర ప్రకారం చూస్తే క్రీ.పూ.11 వ శతాబ్దంలో యూదు రాజ్యం ఏర్పడింది. క్రీ.పూ. 8 వ శతాబ్దం వచ్చేసరికి ఉత్తరభాగం, 6 వ శతాబ్దం వచ్చేసరికి మిగతా భాగం గ్రీకుల, రోమన్ల వశమయ్యాయి. రోమన్ల పాలనలో చాలాకాలం వున్నారు. కొన్నాళ్లకు క్రైస్తవం వెలిసింది, బలపడింది. అరబ్బులు జెరూసలెం ఆక్రమించి శతాబ్దాలపాటు పాలించారు. యూదులు  పొట్టకూటికై అనేక దేశాలకు తరలి వెళ్లిపోయారు. వెళ్లిన ప్రతీ చోటా కష్టపడి, తెలివితేటలతో వ్యాపారం చేసి, ఆర్థికంగా బలపడి స్థానికులకు అసూయ పుట్టించారు. దాంతో వాళ్లు యూదులను తమ దేశాల నుండి బహిష్కరించేవారు. ఇలా యూదులు అనేక దేశాలలో వ్యాపించారు. ప్రతీ చోటా మైనారిటీగానే వున్నారు. రెండు ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో జర్మనీలోనే కాదు, నాజీల పాలన సాగిన ప్రతిదేశంలో యూదుల అష్టకష్టాల పాలయ్యారు. వారికి సొంతదేశమంటూ లేదు కాబట్టే కదా యిన్ని కష్టాలు పడ్డారు అనుకుని వారి కోసం ఒక ప్రత్యేక దేశం తయారుచేసి, ప్రపంచంలోని యూదులందరూ అక్కడకు వచ్చి నివాసం ఏర్పడేట్లు చేసి, వివక్షతకు గురి కాకుండా చూడవచ్చు అనుకున్నారు మిత్రదేశాల వారు. అందుకే పాలస్తీనాను చీల్చి కొంత భాగంలో అరబ్‌ దేశాల మధ్య యూదు దేశాన్ని సృష్టించాయి. అది అరబ్‌ వాళ్లకు నచ్చక ఇజ్రాయేలును నాశనం చేద్దామని చూస్తూంటారు. కానీ ఇజ్రాయేలు గట్టి పిండం కాబట్టి నిలదొక్కుకుని అరబ్బులకు బుద్ధి చెపుతూ వుంటుంది. పాపం సొంతదేశం కాపాడుకోవడానికి ఆత్మరక్షణకోసం చేస్తున్న యుద్ధాన్ని మనం సానుభూతితో చూడాలి.'

 ఇది పాక్షికంగా మాత్రమే నిజం. అయినా దీనిలోనే వివాదాస్పద అంశాలున్నాయి. యూదులకు ఏదో చేద్దామన్న మిత్రదేశాల ఐడియా బాగానే వుంది కానీ దానికి ఏం చేయాలి? బోల్డు చోటు వున్న ఉత్తర అమెరికాలో జనావాసం తక్కువున్న చోటు చూపించి, యిక్కడ వుండండి అనాలి. కానీ మిత్రదేశాలు ఏం చేశాయి? తీసుకెళ్లి అరబ్‌ దేశాల మధ్య ఏర్పాటు చేశాయి. అదేమిటని అడిగితే - వారు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న దేశాన్ని వాళ్లకు కట్టబెట్టాం అన్నారు. వాళ్లకు పవిత్రస్థలమైన జెరూసలెం అక్కడే వుంది కదా అన్నారు. ఆ జెరూసలెం యూదులకే కాదు, ముస్లిములకు, క్రైస్తవులకు కూడా పవిత్ర స్థలమే. దానికోసం క్రైస్తవులు, ముస్లిముల మధ్య మతయుద్ధాలు (క్రూసేడ్స్‌) కూడా జరిగాయి. ఇప్పుడు వీళ్ల కొక్కరికే కట్టబెట్టడమేం? ఇదెక్కడి లాజిక్‌? పది జన్మల క్రితం మా పూర్వీకులు వుండే చోటు యిది అని వైట్‌ హౌస్‌ని చూపిస్తే దాన్ని నాకు యిస్తారా? ఈజిప్టు వదిలేసిన మనుష్యులు వేరు, 1946లో వున్న మనుష్యులు వేరు. ఒకే జాతి అనే పేర మీద వీళ్లకు కట్టబెట్టడమేమిటి? భారతజాతి వారు యిదివరకు అఫ్గనిస్తాన్‌ (గాంధారం), నేపాల్‌ (నేపాళం) పాలించారు, మేమూ భారతీయ సంతతి వారమే అంటూ అక్కడకి వెళ్లి తిష్ట వేస్తే అక్కడివాళ్లు వూరుకుంటారా? నిజానికి ఇజ్రాయేలు ఏర్పాటుకి వెనుక చాలా కథ జరిగింది. ఈనాడు అమెరికాలాగ అప్పట్లో బ్రిటన్‌, ఫ్రాన్సు వంటి సామ్రాజ్యవాద దేశాల కుట్ర వుంది. డబ్బు మూటలున్నాయి. అది కాస్త చెప్పాలి. 

అరేబియా, ఆఫ్రికా తదితర దేశాలలో తెగల మధ్య కలహాలు ఎక్కువగా వుంటాయి. ఇతర తెగ వాళ్లని నమ్మరు. ఇస్లాం లేదా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా మనమంతా ఒకటే అనే ఫీలింగు వారిలో రాలేదు. అందువలన వారిని యితర దేశస్తులు సులభంగా ఓడించగలిగారు. అరబ్‌ విషయానికి వస్తే ఆ దేశాలన్నీ టర్కీ సాౖమాజ్యం కింద సామంత రాజ్యాలుగా వుండేవి. టర్కీ సామ్రాజ్యాన్ని 14 వ శతాబ్దంలో ఓథ్మాన్‌ (ఓస్మాన్‌ అని కూడా అంటారు) స్థాపించాడు. ఇంగ్లీషు వాళ్లు అతని పేరును ఓటోమాన్‌ అని పలుకుతారు. అందుకే మన చరిత్ర పుస్తకాల్లో ఓటోమాన్‌ సామ్రాజ్యము అని కనబడుతుంది. 'తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ నగరాన్ని 1453లో స్వాధీనం చేసుకోవడంతో యూరోపులోని దేశాలకు భారతదేశానికి వచ్చే భూమార్గం మూసుకుపోయి, సముద్రమార్గాలు అన్వేషించారు. ఇండియా చేరిన వారిలో వాస్కోడా గామా ప్రథముడు. కొలంబస్‌ ఇండియా అనుకుని అమెరికా చేరాడు.' అని చదువుకున్నాం. ఆ కాన్‌స్టాంటినోపుల్‌  యిప్పటి ఇస్తాంబుల్‌. ఆ తురుష్కులు ఓటోమాన్‌ వారసులు. వీళ్లు యూరప్‌లోని బాల్కన్‌ రాజ్యాలను, పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలోని అరబ్‌ రాజ్యాలను జయించారు. కాలక్రమంలో వారి ప్రాబల్యం క్షీణించింది. 19 వ శతాబ్దం నాటికి బాగా బలహీనపడింది. ఇది అవకాశంగా తీసుకుని రష్యన్‌ చక్రవర్తులు వాళ్లపై యుద్ధాలు చేస్తూ వుండేవారు. టర్కీ రష్యా చేతిలోకి వెళ్లిపోతే దక్షిణాసియాలోని తమ వలస రాజ్యాలకు ముప్పు వస్తుందని బ్రిటన్‌కు భయం. అందువలన టర్కీ ప్రభుత్వానికి దన్నుగా నిలబడింది. సుల్తాన్‌ను తన చెప్పుచేతల్లో పెట్టుకుంది. కానీ టర్కీ అధీనంలో వున్న దేశాలన్నీ స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూ వుండడంతో బలహీనుడైన సుల్తాన్‌ వాళ్లకు స్వాతంత్య్రం యిచ్చేయసాగాడు. అది దేశభక్తులైన కొందరు యువకులకు నచ్చలేదు. 1909లో 'యంగ్‌ టర్క్‌'లనే పేరుతో ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుని సుల్తాన్‌ను నామమాత్రుణ్ని చేశారు. ఇంతలో మొదటి ప్రపంచయుద్ధం వచ్చింది. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?