Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : ఫలితాల విశ్లేషణ - పంజాబ్‌

పంజాబ్‌లో గెలుపు కాంగ్రెసుది కాదు. అమరీందర్‌ సింగ్‌ది. ఉత్తరాఖండ్‌లో చేసినదే పంజాబ్‌లోనూ చేద్దామని సోనియా, రాహుల్‌ ఎంత ముచ్చటపడినా అమరీందర్‌ సాగనిచ్చాడు కాడు. అక్కడైతే పాలకపక్షం కాబట్టి అసమ్మతి వర్గం గోడు వినిపించుకోకుండా తిరుక్షవరం చేసుకున్నారు. ఇక్కడ ప్రతిపక్షంలో వున్న అమరీందర్‌ తనను బలోపేతం చేస్తే అకాలీదళ్‌ పని పడతానని ఎంత మొత్తుకున్నా వినిపించుకున్నారు కారు. కానీ అమరీందర్‌ అధిష్టానాన్ని ఖాతరు చేయకుండా తన పాటికి తను ముందుకు వెళ్లిపోయాడు. అధిష్టానం దాన్ని మెచ్చలేదు. చివరకు ఆప్‌ చేతికి పంజాబ్‌ వెళ్లిపోతుందని సర్వత్రా నమ్మకం కుదిరాక అప్పుడు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లో లేక అమరీందర్‌ తిక్క కుదురుద్దాంలే అనుకునో అతి లేటుగా పగ్గాలు అప్పగించారు. అయితే ఆప్‌ తప్పుడు వ్యూహాలతో దెబ్బ తినిపోయింది, అమరీందర్‌ విజేతగా నిలిచాడు. అందుకే తన 75 వ ఏట మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. 

ఒకలా చెప్పాలంటే యుపిలో బిజెపికి జరిగినది యీసారి పంజాబ్‌లో కాంగ్రెసుకు జరిగింది. 2012లో ఆకాలీ-బిజెపి కూటమి 42% ఓట్లతో 68 సీట్లు గెలిస్తే కాంగ్రెసు 2% తక్కువ ఓట్లతో 40% ఓట్లు తెచ్చుకున్నా 46 సీట్లే వచ్చాయి. ఈ సారి కాంగ్రెసుకు 38.5% ఓట్లు రాగా తక్కిన 61.5% ఓట్లను అకాలీ దళ్‌ కూటమి 30%తో, ఆప్‌ 25%తో యితరులు 6% తో పంచుకున్నారు. రెండు చోట్లా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా వుండి బలమైన ప్రత్యామ్నాయం వైపే జనాలు చూశారు. ఆ ప్రత్యామ్నాయానికి ప్రత్యర్థులుగా నిలిచినవారి ఓట్లు చీలిపోయాయి. గతంలో ముఖాముఖీ పోటీలో ఓడిపోయిన కాంగ్రెసు యీ సారి ముక్కోణపు పోటీలో ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. గత 50 ఏళ్లల్లో యీ స్థాయిలో రావడం రెండో సారి. చండీగఢ్‌ మునిసిపల్‌ ఎన్నికలలో అధికారపక్షం గెలిచిన గెలుపు దీనికి సూచిక కాలేకపోయింది. యుపిలో అన్ని ప్రాంతాల్లో బిజెపి గెలిచినట్లే పంజాబ్‌లో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెసు గెలిచింది. దాని గెలుపుకు కారణం అమరీందర్‌ యిమేజి, పడిన కష్టం, ఫలించిన ప్రశాంత్‌ కిశోర్‌ టీము ఐడియాలు!

అమరీందర్‌ సింగ్‌ మూడేళ్ల క్రితమే తన ప్రయత్నాలు ప్రారంభించాడు. అకాలీదళ్‌ నాయకులు చేసే ఘోరాలపై ఫిర్యాదు చేయడానికి పంజాబీ జనాలకు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అతను తప్ప వేరే నాయకుడు కనబడలేదు. అమరీందర్‌ తన యింటికి గొప్పా, బీదా భేదం లేకుండా ఎవరినైనా రానిచ్చే రకం. అతనింటికి వెళ్లి బాదల్‌ కుటుంబీకులు తమ బిజినెస్‌ లాక్కున్నారని, తమకు అన్యాయం చేశారని వెళ్లి వాపోయేవారు. 2012లో గెలిచేస్తామని నానా హడావుడి చేసి భంగపడ్డాక అమరీందర్‌ కూల్‌గానే వున్నాడు. కానీ ప్రజల్లో అకాలీ వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించి గట్టిగా ప్రయత్నిద్దామని నిశ్చయించుకున్నాడు. కానీ కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్షుడిగా వున్న ప్రతాప్‌ సింగ్‌ బాజ్వాకు చురుకు పుట్టలేదు. 2014లో అమరీందర్‌ అధిష్టానం దగ్గర కెళ్లి బాజ్వాను తీసేయమని చెప్పివచ్చాడు. కానీ మాతాసుతద్వయం వినిపించుకోలేదు. '2007, 2012లలో పార్టీ గెలవాల్సిందే కానీ అమరీందర్‌ కారణంగానే ఓడిపోయింది' అని పంజాబ్‌ కాంగ్రెసు నాయకులు కొందరు చెప్పినది వాళ్ల తలకెక్కింది. నిజానికి 2012 ఎన్నికలలో అమరీందర్‌కు అభీష్టానికి వ్యతిరేకంగా 46 మందికి సోనియా టిక్కెట్లిచ్చింది. వాళ్లు ఓడిపోయారు. అమరీందర్‌ అనుయాయులైన 36 మంది నెగ్గారు.

అధిష్టానంపై తన అలక చూపడానికి అమరీందర్‌ బాజ్వా హాజరైన మీటింగులకి వెళ్లడం మానేశాడు. తనను తాను లీడరుగా చూపుకోవడానికి తనకు విధేయులుగా వున్న 36 మంది నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించసాగాడు. వాటికి జనం బాగా హాజరు కాసాగారు. అకాలీలను దుమ్ము దులుపుతూ అతను చేసిన ప్రసంగాలకు జయజయధ్వానాలు పలికారు. ఇలా వుండగా సోనియా అమరీందర్‌ను పిలిచి 2014 పార్లమెంటు ఎన్నికలలో అమృతసర్‌ నుంచి పోటీ చేస్తున్న అరుణ్‌ జేట్లేకు వ్యతిరేకంగా నిలబడమంది. తనను రాష్ట్ర రాజకీయాలకు దూరం చేసే ప్రయత్నమిది అని గ్రహించిన అమరీందర్‌ 'అమృతసర్‌ నా ప్రాంతం కాదు, స్వర్ణదేవాలయానికి వెళ్లాను, ఏవో ఫంక్షన్లకు హాజరయ్యాను తప్ప నా కా ప్రాంతంతో పరిచయం లేదు, నన్ను వదిలేయండి' అన్నాడు. 'గతంలో ముఖ్యమంత్రిగా చేసినవాడికి ఏ ప్రాంతమూ కొత్త కాదు, పోటీ చేయాల్సిందే' అని సోనియా పట్టుబట్టింది. విధిలేక నిలబడ్డా జేట్లేని లక్షకు పైగా మెజారిటీతో ఓడించాడు. సోనియా అతన్ని పార్లమెంటులో వుంచేయడానికి లోకసభలో పార్టీ డిప్యూటీ లీడరు చేసింది. బాజ్వాను కదల్చలేదు. అమరీందర్‌ పార్లమెంటుకి వెళ్లడం మానేసి పంజాబ్‌లోనే వుంటూ ర్యాలీలు నిర్వహిస్తూ, రాష్ట్ర రాజకీయాల్లోనే మునిగి తేలాడు. 

ఈ లోగా 2014 పార్లమెంటు ఎన్నికలలో ఆప్‌ పంజాబ్‌లో 24% ఓట్లతో 4 సీట్లు గెలుచుకుని అకాలీలకు ప్రధాన ప్రతిపక్షంగా రూపు దిద్దుకోసాగింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ తరచుగా పంజాబ్‌ వచ్చి ర్యాలీలు నిర్వహించసాగాడు. అయినా సోనియా, రాహుల్‌ చలించలేదు. బాజ్వాను దింపడం కానీ, అమరీందర్‌ను నాయకుడిగా గుర్తించడం కానీ చేయలేదు. 2015 జులైలో అమరీందర్‌ బాదల్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి 12 రోజుల మాస్‌ కాంటాక్ట్‌ ప్రోగ్రాం నిర్వహించాడు. బాజ్వా 'ఈ కార్యక్రమం ఒక వ్యక్తి ప్రయోజనాలకు ఉపయోగపడుతుందేమో కానీ పార్టీకి నష్టం చేకూరుస్తుంది.' అని ప్రకటించి కార్యక్రమం ప్రారంభించడానికి మూడు రోజుల ముందు అమరీందర్‌ అనుయాయులైన ముగ్గురికి నోటీసులు యిచ్చాడు. అంతేకాక 'అమరీందర్‌ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. దాని పేరు 'పంజాబ్‌ వికాస్‌ పార్టీ' అని ఆరోపించాడు. దీనిపై స్పందన కోరినప్పుడు అమరీందర్‌ 'ఈ ఐడియా ఏదో బాగానే వున్నట్టుందే, పేరు కూడా బాగుంది. నిజానికి ప్రజలు నాకు సూచించిన 49 పేర్లలో అదొకటి' అని చమత్కరించాడు. అప్పుడు హై కమాండ్‌కు తత్త్వం బోధపడింది - వదిలేస్తే అమరీందర్‌ అంత పనీ చేసేట్టున్నాడని. 2015 నవంబరు ప్రాంతంలో బాజ్వాను తీసివేశారు. అమరీందర్‌కు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. కానీ అతనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించడానికి ఎన్నికలకు వారం రోజుల ముందు దాకా నోరు రాలేదు. 

అమరీందర్‌ కాంగ్రెసు పగ్గాలు అప్పగించిన సమయానికి మధ్యందిన మార్తాండుడిలా వెలుగుతోంది. ఒక ఏడాదిలో అది తన ప్రాభవం కోల్పోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా దెబ్బ తిన్నది ఆప్‌. మాది ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ అని చూపించుకోవాలని గోవా, పంజాబ్‌లలో పోటీ చేసింది. గోవాలో 6% ఓట్లతో 39 చోట్ల పోటీ చేస్తే 38 చోట్ల డిపాజిట్‌ కోల్పోయింది. పంజాబ్‌లో కూడా నెగ్గినవారి కంటె డిపాజిట్లు పోగొట్టుకున్నవారు ఎక్కువ మంది. పంజాబ్‌ ఎసెంబ్లీలో గతంలో మాకు ఏ సీట్లూ లేవు, యీసారి 20 వచ్చాయి కదా, అది గొప్పే అని వారు వాదించవచ్చు. 2014 పార్లమెంటు ఎన్నికల దగ్గర్నుంచి అది పంజాబ్‌ గెలుస్తుందనే ఆశలు రేకెత్తించింది. 2 కోట్ల మంది ఓటర్లలో 18-40 మధ్య వున్నవాళ్లు సగానికి పైగానే వున్నారు కాబట్టి వాళ్లు అకాలీ, కాంగ్రెసులతో విసుగెత్తి మార్పు కోసం ఆప్‌కు వేస్తారని అనుకోవడంతో ఒక దశలో గెలుపు తథ్యం అని అందరి చేత అనిపించుకుని క్రమేపీ దిగజారిపోయింది. ఎందుకలా జరిగింది అనేదే ఆసక్తి కలిగించే చర్చ. 'మేం అకాలీదళ్‌ మీదే మా ఆయుధాలన్నీ ప్రయోగించాం. దాంతో అది నేలకూలింది కానీ దాని వలన అమరీందర్‌ లాభపడ్డాడు' అని వాపోయాడు ఆప్‌ ఇంటలెక్చువల్‌ వింగ్‌కు నాయకత్వం వహించిన బిఆర్‌ భరద్వాజ్‌. ఆయన ఐయేయస్‌ ఆఫీసరుగా పనిచేశాడు. అమరీందర్‌ ముఖ్యమంత్రిగా వున్నపుడు ఆయనకు సన్నిహితుడు. కాంగ్రెసుపై విరక్తితో ఆప్‌లో చేరి కొందరు వాలంటీర్లతో కలిసి టీముగా ఏర్పరచాడు. అనేకమంది యూనివర్శిటీ గ్రాజువేట్స్‌, స్టాన్‌ఫోర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌లో చదివిన విద్యాధికులు సెలవులు పెట్టి ఆ టీములో పనిచేశారు. అందరూ కలిసి పంజాబ్‌కై ఆప్‌ మానిఫెస్టో తయారు చేశారు. ఆప్‌ పతనానికి కారణం ఢిల్లీ వచ్చిన నాయకులకు పంజాబ్‌ గురించిన సరైన అవగాహన లేకపోవడమే అని భరద్వాజ్‌ తేల్చారు. 

బయటివాళ్లకు పంజాబ్‌ అనగానే శిఖ్కులే గుర్తుకు వస్తారు. తలకు గుడ్డ కట్టుకుని గురుద్వారాకు వెళ్లి ప్రార్థిస్తే చాలు, శిఖ్కుల్లో మతపరమైన భావనలు రెచ్చగొడితే చాలు, శిఖ్కులు సంతోషించి ఓట్లేసేస్తారు, వాటితో గెలిచేయవచ్చు అనుకుంటారు. ఆప్‌ నాయకులు కూడా అదే పొరపాటు చేశారు. పంజాబ్‌లో హిందువులు 40% మంది వుంటారు. వాళ్లకు శిఖ్కుల్లో అతి పోకడలు నచ్చవు. శిఖ్కుల్లో కూడా చాలామందికి సైతం అతి పోకడలు నచ్చవు. అందుకే వాళ్లు విదేశాల్లో స్థిరపడిన శిఖ్కులు ఖలిస్తాన్‌ ఏర్పాటుకి మద్దతు యిచ్చినపుడు ఏవగించుకున్నారు. ఇప్పుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆ విదేశీ ఖలిస్తానీ శిఖ్కులనే అక్కున చేర్చుకున్నాడు. ఎందుకంటే వాళ్లే నిధులు కుమ్మరించారు. డబ్బులిచ్చి టిక్కెట్లు కొనుక్కున్నారు. వాళ్లకు టిక్కెట్లు యిచ్చే సందడిలో నిజాయితీగా పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు టిక్కెట్లు లేకుండా పోయాయి. ఆప్‌కు తక్కిన పార్టీలకు తేడా లేదు, డబ్బున్నవాళ్లకే టిక్కెట్లు యిస్తుంది అనే ముద్ర పడిపోయింది. దాంతో మార్పు తీసుకురావడం దాని వలన కాదు, అని మార్పు కోరుకున్న వారందరూ అనుకున్నారు. తెలిసిన దయ్యాలైన (నోన్‌ డెవిల్‌) అకాలీ, కాంగ్రెసుల మధ్య ఓట్లు చీలాయి. 

కొత్తగా దోస్తులైన ఖలిస్తానీల ప్రేరణ చేత కాబోలు ఆప్‌ 1984 ఢిల్లీ అల్లర్ల గురించి, ఆపరేషన్‌ బ్లూస్టార్‌ గురించి మాట్లాడసాగింది. సాధారణ పంజాబీకి అదంతా గతం. జరిగిపోయినదాన్ని మళ్లీ తవ్వుకుని, తలకెత్తుకుని మరో ఖలిస్తానీ ఉద్యమాన్ని ఎదుర్కునే ఉద్దేశాలు అతనికి లేవు. ఖలిస్తానీ అనగానే బాంబులు, మారణాయుధాలు, టెర్రరిజం. అరవింద్‌ వాళ్లకు కొమ్ము కాస్తున్నాడు అనే అభిప్రాయం రాగానే అతన్ని పక్కకు పెట్టనారంభించారు. దానికి తోడు అరవింద్‌ మోగాలో ఒక టెర్రరిస్టు యింట్లో బస చేశాడు. జనవరి 31 న మౌరులో జరిగిన కాంగ్రెసు ర్యాలీలో రెండు బాంబులు పేలి ముగ్గురు చచ్చిపోయారు. దాంతో ఖలిస్తాన్‌ రోజులు అందరికీ గుర్తుకు వచ్చాయి. అమరీందర్‌ వెంటనే దాన్ని చక్కగా తనకు అనువుగా మలచుకుని ఆప్‌-ఖలిస్తానీలు భుజంభుజం కలిపి పనిచేస్తున్నారని అందరి కంటె ముందుగా ప్రకటన చేసి అరవింద్‌ను డిఫెన్సులో పడేశాడు. అది జరిగిన మూడు రోజులకే పోలింగ్‌ తేదీ కావడంతో ఆప్‌-ఖలిస్తానీ లింకు లేదని నచ్చచెప్పడానికి అరవింద్‌కు సమయం చాలలేదు. అయినా అరవింద్‌ పాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా తమ పార్టీ తరఫున 1984 అల్లర్లపై దశాబ్దాలుగా ప్రశ్నలు లేవనెత్తుతూనే వున్న ఎచ్‌ ఎస్‌ ఫూల్కాను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేశాడు. 

నిజానికి ఆప్‌ పంజాబ్‌లో వేళ్లూనుకోవడానికి, 2014లో గెలుపు సాధించడానికి కారణం - ఆప్‌ పంజాబ్‌ కన్వీనరుగా పనిచేసిన సూచా సింగ్‌ ఛోటేపూర్‌ అనే స్థానిక నాయకుడు. అతను లంచం తీసుకున్నాడన్న ఆరోపణ రావడంతో తమ సచ్ఛీలత చాటుకోవడానికి ఆప్‌ అతన్ని పార్టీలోంచి బహిష్కరించింది. దానికి గాను భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. అతనితో పాటు అనేకమంది కార్యకర్తలు బయటకు వెళ్లిపోయారు. అప్పణ్నుంచి ఆప్‌ కిందకు జారసాగింది. పైగా ఆప్‌ ముఖ్యమంత్రి అని ప్రకటించకుండా తప్పు చేసింది. ఢిల్లీలో అరటిక్కెట్టు ముఖ్యమంత్రిగా వుండడం కంటె పంజాబ్‌కు పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా వుంటే ఏదైనా చేసి చూపించవచ్చనే లెక్కతో అరవిందే ముఖ్యమంత్రిగా వచ్చేస్తాడని కొన్నాళ్లు అన్నారు. పరాయివాడు, పైగా హరియాణావాడు ముఖ్యమంత్రి అంటే పంజాబీలు అస్సలు ఒప్పరన్న భయంతో ఎటూ చెప్పకుండా కాలక్షేపం చేస్తూ తమ ఎంపీ భగవంత్‌ మాన్‌ను ముందుకు తోశారు. అతను కమెడియన్‌ కాబట్టి జనాల్ని సభలకు బాగానే రప్పించగలిగాడు కానీ ప్రజలు అతన్ని ముఖ్యమంత్రిగా వూహించలేక పోయారు. నవ్‌జోత్‌ సిద్దూతో ఆప్‌కు బేరాలు కుదరలేదు. అతను తనకు ఉపముఖ్యమంత్రి పదవితో బాటు తనతో బాటు వచ్చిన భైన్స్‌ సోదరులకు టిక్కెట్లు అడిగాడట. 'మా పార్టీ సిద్ధాంతాల ప్రకారం బంధువులకు యివ్వలేం. కుటుంబం నుంచి ఒక్కరికే' అన్నాడట అరవింద్‌. సిద్దూ కాంగ్రెసుకు వెళ్లి తను గెలవడమే కాక, భైన్స్‌ సోదరులను కూడా గెలిపించుకోగలిగాడు. తన ఉపన్యాసాల ద్వారా ప్రజలను బాగా ఆకట్టుకున్నాడు.  ఆప్‌కు స్థానికంగా బలమైన నేత లేకపోయాడు. ఢిల్లీ పెత్తనం అంటూ తక్కినవాళ్లు యాగీ చేశారు. తన ఎంపీలలో యిద్దర్ని సస్పెండ్‌ చేస్తే వారిని కాంగ్రెసు చేర్చుకుంది. వారి పరిధిలో వున్న 18 సీట్లలో ఆప్‌ 4 మాత్రమే గెలిచింది. మూడో ఎంపీ అనారోగ్యం అంటూ యింట్లోంచి బయటకు రాలేదు. ఏం మంత్రం వేశారో ఏమో!

2016 నవంబరు నుంచి ఆప్‌ కిందకు జారసాగింది, అప్పుడే అమరీందర్‌ తన ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. మాళ్వాలో ఆప్‌ బలంగా వుందని అరవింద్‌ మాటిమాటికి చెప్పుకోవడంతో దానిపై గట్టిగా దృష్టి పెట్టి అక్కడి 69 సీట్లలో 40 సంపాదించాడు. మాఝా ప్రాంతంలో 25 సీట్లలో 22, దోఆబా ప్రాంతంలో 23 సీట్లలో 15 గెలిచాడు. దీని వెనుక ప్రశాంత్‌ కిశోర్‌ ఆధ్వర్యంలో నడిచిన 250 మంది సభ్యుల ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ పాత్ర కూడా వుంది. మూడోసారి వరుసగా ఓటమి ఎదురైతే పార్టీ ఖతమై పోయినట్లే అని కార్యకర్తలను హెచ్చరించడంతో వారు విపరీతంగా శ్రమించారు. ఇక వాగ్దానాలకు కూడా లోటు చేయలేదు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే దాకా మొదటి వంద రోజులు 2500 రూ.ల నిరుద్యోగ భృతి యిస్తామనడంతో 40 లక్షల మంది నిరుద్యోగులు దానికై పేర్లు నమోదు చేసుకున్నారు. రైతులకు ఋణమాఫీ చేస్తామన్నారు, యువతకు స్మార్ట్‌ ఫోన్లు యిస్తామన్నారు. 

పంజాబ్‌ రాజకీయాల్లో డేరాల ప్రభావాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఒక మతగురువు కేంద్రంగా ఏర్పడే సమూహాన్ని డేరా అంటారు. సమాజంలో దిగువ వర్గాల్లో వారు ఏదో ఒక డేరాలో చేరడం కద్దు. ఓటర్లలో 23% మంది ఏదో ఒక డేరాకు అనుబంధంగా వున్నట్టు సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ చెప్పింది. దేశ్‌ సేవక్‌ అనే పంజాబీ దినపత్రిక చేసిన సర్వే ప్రకారం 2007లో రాష్ట్రంలో 9 వేల డేరాలున్నాయి. వాటిలో డేరా రాధాస్వామి, డేరా సచ్చా సౌదా, డేరా నూర్‌మహల్‌, డేరా నిరంకారీ, డేరా సచ్‌ఖండ్‌ బాలన్‌, డేరా నామ్‌ధారీ వంటి వాటికి పెద్ద సంఖ్యలో అనుయాయులున్నారు. వీటిలో కొంతమంది ఒక్కో పార్టీకి మద్దతు యిస్తారు కానీ బాహాటంగా కాదు. ఎన్నికలకు ముందు యిచ్చే ప్రవచనాల్లో అంతర్లీనంగా ఫలానావారికి ఓటేస్తే మంచిదని ఉద్బోధిస్తారు. అలా చెప్పిన పార్టీకి ఓటేస్తారా అని డేరా సభ్యులను సర్వేలో అడిగితే 45% మంది వేయం అన్నారు. 30% మంది సమాధానం యివ్వలేదు. 13% మంది వేస్తాం అంటే 12% మంది  వేస్తే వేస్తాం అన్నారు. రవిదాసియా కులస్తులు బహుళంగా వున్న డేరా సచ్‌ఖండ్‌ బాలన్‌ 2012 ఎన్నికలలో బియస్పీకి బాహాటంగా మద్దతిచ్చింది. దాని వలన కాంగ్రెసు ఓట్లలో చీలిక వచ్చి అకాలీ-బిజెపి కూటమి లాభపడింది. ఈ సారి అరవింద్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ ఆ డేరాను సందర్శించి వారి మద్దతు కోరాడు. రాధాస్వామి డేరా బహిరంగంగా ఎవరికీ మద్దతు యివ్వకపోయినా కాంగ్రెసును సమర్థిస్తూ వచ్చింది. 2012 ఎన్నికలలో అది ఆకాలీ వైపు మొగ్గింది. దానికి కారణం ఆ డేరా అధినేత కూతురికి సుఖ్‌బీర్‌ బాదల్‌ బావమరిదికి పెళ్లి కావడమే అంటారు. ఈ సారి రామ్‌ రహీమ్‌ ఆధ్వర్యంలో నడిచే డేరా సచ్చా సౌదా అకాలీ వైపు మొగ్గు చూపడంతో దానికి కౌంటర్‌గా తక్కినవాళ్లు కాంగ్రెసుకు మద్దతు యిచ్చారట. 

ఎన్నికల రోజున ఓటర్లలో 78.6% మంది ఓటేశారు. కాంగ్రెస్‌కు 2012లో 40% ఓట్లు వచ్చినా 46 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 1.6% ఓట్లు తగ్గినా 77 వచ్చాయి. మధ్యలో 2014లో దానికి 33% ఓట్లు వచ్చి 37 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది.  అకాలీ దళ్‌ 2012లో 35% 56 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు 9.5% ఓట్లు తగ్గాయి కానీ సీట్లు 41 తగ్గాయి. నిజానికి 2014లో 26% ఓట్లతో 29 నియోజకవర్గాల్లో గెలిచింది. అంటే 2012కి 2014కి మధ్య తేడా వచ్చేసిందన్నమాట. ఈసారి చావుదెబ్బ తినేస్తుందనుకున్నారు కానీ మరీ అంత చేటుగా దెబ్బ తినలేదు. తండ్రీకొడుకులైన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి యిద్దరూ నెగ్గారు. అకాలీ ముఖ్యమంత్రి చేతిలో కాంగ్రెసు (కొత్త) ముఖ్యమంత్రి అమరీందర్‌ ఓడిపోయాడు. వేరే చోట గెలిచాడు కాబట్టి బతికి బట్టకట్టాడు. డ్రగ్‌ వ్యాపారానికి మూలస్తంభంగా పేరుపడిన మంత్రి బిక్రమ్‌ సింగ్‌ మజీతియా కూడా నెగ్గాడు. బిజెపికి ఓట్లు 1.8% తగ్గినా సీట్లు మాత్రం 9 తగ్గి 3 వచ్చాయి. 2014 లెక్క ప్రకారం అయితే 16 రావాలి. ఇతరులకు 2012తో పోలిస్తే 12% తగ్గి 6% వచ్చాయి. గతంలో 3 సీట్లు వస్తే యిప్పుడు ఏవీ రాలేదు. ఈ ఇతరులలో సిపిఐ, సిపిఎం, తృణమూల్‌, అప్నా పంజాబ్‌, బియస్పీ వున్నాయి. ఆప్‌కి 2014లో 24.4% ఓట్లు వస్తే యీసారి 23.8% తెచ్చుకుంది. అప్పుడు 33 నియోజకవర్గాల్లో గెలిస్తే యిప్పుడు 20  మాత్రమే గెలిచింది. అరవింద్‌ 95 సభల్లో పాల్గొన్నా అప్పుడు గెలుచుకున్న పార్లమెంటు పరిధిలో వున్న 34 సీట్లలో యిప్పుడు 9 మాత్రమే గెలిచింది. ఆప్‌ మిత్రపక్షం లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీకి 2 సీట్లు దక్కాయి. ఫైనల్‌గా చూస్తే అకాలీ-బిజెపి కూటమికి 30.6% ఓట్లు వస్తే ఆప్‌-ఇన్సాఫ్‌ పార్టీకి 24.8% మాత్రమే వచ్చాయి. ఆప్‌ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. తక్కిన రాష్ట్రాలన్నిటిలో ప్రముఖపాత్ర వహించిన బిజెపి పంజాబ్‌లో మాత్రం అకాలీదళ్‌ జూనియర్‌ భాగస్వామిగానే వుండిపోయింది. అవినీతి పేరు చెప్పి ఎన్నో ఏళ్లగా భాగస్వామిగా వున్న శివసేనను వదుల్చుకున్న బిజెపి పలురకాలుగా అప్రతిష్ఠ పాలైన అకాలీదళ్‌ను ఎందుకు వదులుకోలేదో అర్థం కాదు. అది యిప్పుడు అధికారపక్షంగానూ లేదు, ప్రధాన విపక్షంగానూ లేదు. కాంగ్రెసు, ఆప్‌లు తమ తమ పాత్రల్లో వైఫల్యం చెందితే, అకాలీదళ్‌ చురుగ్గా లేకపోతే అప్పుడు బిజెపి పంజాబ్‌లో వెలుగులోకి వస్తుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com