Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: ముకుల్‌ రాయ్‌ బిజెపిలోకి ఫిరాయిస్తాడా?

మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడు, పార్టీ సహచరుడు ఐన ముకుల్‌ రాయ్‌ మొన్న బుధవారం నాడు రాష్ట్రపతి కోవింద్‌ను కలవడంతో బిజెపిలోకి ఫిరాయిస్తాడన్న పుకార్లు మళ్లీ ఊపందుకున్నాయి. కొంతకాలంగా వారిద్దరి మధ్య సఖ్యత చెడింది. మమత అతనిపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూనే మళ్లీ వెనక్కి తగ్గుతోంది. బలంగా వున్న ప్రతిపక్షంలో ద్వితీయస్థానంలో వున్నవారికి ఆశలు చూపో, భయపెట్టో తమ వైపు తిప్పుకోవడం అధికారపక్షం చేసే పనే. ఆ విధంగా బిజెపి ముకుల్‌ పై వల విసిరిందని, అతనా వలలో పడ్డాడనీ మమత అనుమానం. కానీ అతను తనంతట తనే ఏదైనా అడుగు వేస్తే తప్ప చర్య తీసుకోకూడదని ఆగుతోంది. ఎందుకంటే తృణమూల్‌ పార్టీ నిర్మాణంలో, ఎన్నికల నిర్వహణలో అతనిది ప్రముఖపాత్ర. కేవలం అనుమానంతో ఏదైనా చర్య తీసుకుంటే, పార్టీ కార్యకర్తలు హర్షించరని ఆమె భయం. 

తృణమూల్‌కు హృదయం మమత అయితే, మెదడు ముకుల్‌ది అని పార్టీ నాయకులు అంటూ వుంటారు. అతను  తొలినుంచి రాజకీయాల్లో లేడు. 2002 నుంచి 2005 వరకు యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరక్టరుగా వున్నాడు. తర్వాత తృణమూల్‌లో చేరి, 2006 నుంచి రాజ్యసభ సభ్యుడిగా వున్నాడు. 2008లో పార్టీకి ఆల్‌ ఇండియా జనరల్‌ సెక్రటరీ అయ్యాడు. 2009లో కేంద్ర మంత్రివర్గంలో చేరి, షిప్పింగ్‌ శాఖలో సహాయమంత్రి అయ్యాడు.  2011 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమత లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి ఓడించడానికి ఆమెతో కలిసి ప్రణాళికలు రచించి విజయం సాధించాడు.

కమ్యూనిస్టు నాయకులు పోలింగ్‌ బూత్‌ మేనేజ్‌మెంటులో దిట్టలు. ఏ బూత్‌లో తమ పార్టీకి తక్కువ ఓట్లు పడతాయో వూహించి, దానికి తగ్గ ఏర్పాట్లు చేసేవారు. ముకుల్‌ ఆ కళలో నైపుణ్యం సంపాదించాడు. మమత గ్లామర్‌ను ఓట్లగా మార్చడానికి సాయపడ్డాడు. తర్వాతి రోజుల్లో నిధుల సేకరణలో, అధికారుల బదిలీలు, పదోన్నతులు పార్టీకి ఉపయోగపడే రీతిలో మలచడంలో ఆరితేరాడు. పశ్చిమ మేదినీపూర్‌ జిల్లాలో మావోయిస్టులను అదుపుచేయడం ముకుల్‌ వలననే సాధ్యపడిందంటారు. శారదా గ్రూపుకు సాయం చేస్తూ, వారి నుంచి పార్టీకి సాయం అందేట్లు చేయడంలో కీలకమైన పాత్ర అతనిదే. ఆ గ్రూపు అధినేత సుదీప్త సేన్‌ పారిపోవడానికి ముందు రోజు రాత్రి ముకుల్‌ యింటికి వచ్చాడట. తర్వాత 2013 ఏప్రిల్‌లో కశ్మీరులో పట్టుబడేవరకు అతనితో ఫోన్‌లో టచ్‌లో వున్నాడట. 

ముకుల్‌ కేంద్రమంత్రిగా వున్నపుడు కూడా మమత చెప్పినట్లే నడుచుకున్నాడు. మమత కూడా అతన్ని ఆదరంగా చూసింది. 2011లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గి ముఖ్యమంత్రి అయినపుడు, కేంద్రంలో తను నిర్వహిస్తున్న రైల్వే శాఖను ముకుల్‌కు అదనంగా అప్పగించమని ప్రధాని మన్‌మోహన్‌ను కోరింది. అయితే 2011 జులైలో గువాహతి-పూరీ రైలుకు అసాంలో ప్రమాదం జరిగినపుడు వెళ్లి చూడమని ప్రధాని కోరినా ముకుల్‌ వినలేదు. దాంతో అతన్ని ఆ శాఖ నుంచి తప్పించి దినేశ్‌ త్రివేదికి యిచ్చారు.

దినేశ్‌ 2012లో బజెట్‌ ప్రవేశపెడుతూ ప్రధాని కోరికపై రైల్వే చార్జిలు పెంచడంతో మమతకు కోపం వచ్చింది - తనను అడక్కుండా పెంచేడేమని. వెంటనే దినేశ్‌ను తీసేసి, ఆ శాఖను ముకుల్‌కు అప్పగించమని మన్‌మోహన్‌పై ఒత్తిడి తెచ్చింది. ఆ విధంగా 2012 మార్చి నుంచి ముకుల్‌ మళ్లీ రైల్వే మంత్రి అయ్యాడు. అయితే అది ఆర్నెల్ల ముచ్చట మాత్రమే అయింది. విమానయాన, రిటైల్‌ రంగాల్లో 51% ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు అనుమతించాలనే యుపిఏ విధానాన్ని వ్యతిరేకిస్తూ తృణమూల్‌ 2012 సెప్టెంబరులో కూటమి నుంచి వైదొలగింది. అప్పణ్నుంచి ముకుల్‌కు పార్టీలో తప్ప ప్రభుత్వంలో పదవులు ఏమీ లేవు. 

మమతకు, ముకుల్‌కు వున్న యింతటి సఖ్యతకు బీటలు పడడానికి కారణం ఉంది. ఎన్‌డిఏ ప్రభుత్వం వచ్చాక  శారదా స్కాముపై సిబిఐ విచారణ ఊపందుకుంది. 2015 జనవరిలో సిబిఐ వారు ముకుల్‌ను తమ ఆఫీసుకి పిలిచి ఐదు గంటలపాటు లోతుగా విచారించారు. బయటకు వచ్చి 'సిబిఐకు పూర్తి సహకారాన్ని అందిస్తాను. వారి విచారణపై నాకు నమ్మకం వుంది.' అన్నాడు. సిబిఐ విచారణ రాజకీయంగా కక్షసాధింపు చర్య అని ఆరోపిస్తున్న మమత, ముకుల్‌ ప్రకటనతో ఉలిక్కిపడింది. బిజెపి సిబిఐ ద్వారా అతన్ని అప్రూవర్‌గా మార్చి తన పార్టీ పెద్ద తలకాయలందరినీ ఊచల వెనక్కి పంపుతారా అని సందేహపడింది. వివరాలు తెలుసుకుందామని ముకుల్‌కు ఫోన్‌ చేసింది.

మళ్లీ కాల్‌ చేస్తా అంటూ ముకుల్‌ ఫోన్‌ పెట్టేశాడు. మమత అహం దెబ్బతింది. అనుమానం బలపడింది. వెంటనే పార్టీ జాతీయ జనరల్‌ సెక్రటరీ, వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, రాజ్యసభలో తృణమూల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పదవుల నుంచి అతనికి ఉద్వాసన చెప్పింది. అయినా ముకుల్‌ తిరగబడలేదు కానీ లోపాయికారీగా పార్టీని చీల్చాలని చూశాడు. అతని అనుచరుడు అమితాభ మజుందార్‌ చేత 'నేషనలిస్ట్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌' పేరుతో ఒక పార్టీని ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిస్టర్‌ చేయించాడు. 2016లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ పార్టీ తరఫున పోటీ చేసి, కొన్ని సీట్లు గెలుచుకుని బిజెపిలోకి వెళితే అక్కడ మంచి పోస్టు లభిస్తుందని అంచనా వేసి వుంటాడు.

కానీ అతని పార్టీలో ఎవరూ చేరలేదు. అతను తన అనుయాయులకే ఎన్నికలలో టిక్కెట్లు యిస్తూ వచ్చాడని కోపం వున్న నాయకులందరూ మమతకు మేనల్లుడు, కాబోయే వారసుడిగా అనుకుంటున్న అభిషేక్‌ బెనర్జీ పక్కకు చేరారు. పార్టీ యూత్‌ వింగ్‌ అధ్యక్షుడిగా వున్న శుభేందు అధికారిని ముకుల్‌ తొలగించి, అతని స్థానంలో తన కొడుకు శుభాంశును నియమించినప్పుడు చాలామందికి కోపం వచ్చింది. ఎప్పుడైతే మమత, ముకుల్‌ను పక్కకు పెట్టిందో వారు అతన్ని మూలకు నెట్టేశారు. ముకుల్‌ అనుయాయులు కూడా అతన్ని వీడి అభిషేక్‌ వైపు వచ్చేశారు. 2016 ఎన్నికలలో మమత మళ్లీ ఘనవిజయం సాధించడంతో ముకుల్‌ వెనక వుండి ప్రారంభించిన పార్టీ పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయింది. 

ఇది గ్రహించిన ముకుల్‌ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా పార్టీలో అణగి వున్నాడు. అతనికి పార్టీలో యింకా వున్న పట్టును, అతని నైపుణ్యాన్ని గుర్తించిన మమత తెగేదాకా లాగకుండా అతన్ని పార్టీ తరఫున త్రిపురలో పరిశీలకుడిగా నియమించింది. అయితే రాష్ట్రపతి ఎన్నికలో త్రిపుర తృణమూల్‌ కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఆరుగురు పార్టీని ధిక్కరించి ఎన్‌డిఏ అభ్యర్థి కోవింద్‌కు ఓటేశారు.  ఆ తర్వాత బిజెపికి ఫిరాయించారు. వెంటనే వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో 12 మంది ఎంపీలు పార్టీ విప్‌ ధిక్కరించి ఎన్‌డిఏ అభ్యర్థి వెంకయ్య నాయుడికి ఓటేశారు. వీరి వెనుక ముకుల్‌ ఉన్నాడని మమత సందేహించి అతన్ని పరిశీలకుడి పోస్టు నుంచి తీసివేసింది. ముకుల్‌ తరచుగా అరుణ్‌ జేట్లేని కలుస్తూండడంతో బిజెపిలో ఫిరాయిస్తాడని అందరూ అనుకుంటున్నారు.

అమిత్‌ షానూ కలుస్తూన్నాడని పుకార్లు వున్నాయి. కానీ అదేం లేదు అంటున్నాడు ముకుల్‌. తనంతట తను ఏ చర్య తీసుకోవడం యిష్టం లేని మమత, రాఖీ పండగనాడు అతన్ని యింటికి పిలిపించి రాఖీ కట్టింది. ముకుల్‌ అందరికీ దాన్ని చూపించి 'చూశారా, మా మధ్య విభేదాలు లేవు' అని చెప్పుకున్నాడు. రెండు రోజుల తర్వాత ఆగస్టు 9న మేదినీపూర్‌లో 'బిజెపి క్విట్‌ ఇండియా' కార్యక్రమం ప్రకటించినపుడు ఆమెతో వేదికను పంచుకున్నాడు. అయినా మమత ఆగస్టు నెలాఖరు వచ్చేసరికి ట్రాన్స్‌పోర్టు, టూరిజం పై పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి అతన్ని తీసివేయించి ఆ స్థానంలో డెరెక్‌ను వేయించింది.

ఈ పరిస్థితుల్లో బిజెపి ప్రభుత్వ ఏజన్సీల ద్వారా ముకుల్‌పై వేడి పెంచుతోంది. 'నారదా న్యూస్‌' సంస్థకు అధినేత మాత్యూ శామ్యూల్స్‌ అనే జర్నలిస్టు ఒక స్టింగ్‌ ఆపరేషన్‌ చేసి, అనేకమంది తృణమూల్‌ నాయకులను యిరికించాడు. ఆ కేసులో యిటీవల సిబిఐ ముకుల్‌ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ శుభేందు అధికారిని విచారించింది. ఈ పరిస్థితుల్లో బుధవారం నాడు కోవింద్‌ను ముకుల్‌ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముకుల్‌ త్రిపుర తృణమూల్‌ ఎమ్మెల్యేల చేత కోవింద్‌కు ఓట్లేయించాడనే అనుమానాలున్నాయన్నది మర్చిపోకూడదు. చూడబోతే తృణమూల్‌లో అతని రోజులు మాత్రం వేళ్లపై లెక్కించాల్సిందే అనిపిస్తోంది. అయితే ముకుల్‌ బిజెపిలో డైరక్టుగా చేరతాడా, విడిగా పార్టీ పెట్టి తృణమూల్‌ను చీల్చి బిజెపితో పొత్తు పెట్టుకుంటాడా అన్నది వేచి చూడాలి.  

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  
-mbsprasad@gmail.com