cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: బెదురు బాబు

ఎమ్బీయస్‌: బెదురు బాబు

చాలామంది దృష్టిలో చంద్రబాబు - అపర చాణక్యుడు. రాజకీయాల్లో తిమ్మిని బెమ్మి చేయగలవాడు. అందరి కంటె ముందుగా చాలా దీర్ఘ...దృష్టితో ప్రణాళికలు రచించి, ఓపిగ్గా అమలు చేస్తూ వచ్చి, విజయం సాధిస్తాడు. ప్రజలను నమ్మించడంలో ఘనపాఠి. తను నంది అంటే నంది, పంది అంటే పంది అని జనాల చేత అనిపించగలడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో నైనా గిరీశం భాషలో ఓ ఠస్సా వేసి నెగ్గుకు రాగలడు.

నిజంగా బాబు అంతటి సమర్థుడే అయితే 2004లో తన ఓటమిని ఊహించలేక పోయారేం? 2009లో మహా కూటమి కట్టినా ఓడిపోయారేం? 2014, 2018లో తెలంగాణలో ఓడిపోయారేం? ఒకప్పుడు పార్టీకి కంచుకోటలా ఉన్న తెలంగాణలో యీనాడు పార్టీని లుప్తం చేసేసుకున్నారేం? ఈ ప్రశ్నలు ఆ చాలామందికి తోచవు. తెలుగు మీడియా తోచనివ్వదు. బాబు ఓడినా, గెలిచినా అంతటి ఘనుడు, యింతటి మహానుభావుడు అని ఉబ్బేస్తూ ఆ యిమేజి నిలుపుతూ ఉంటుంది.

మీడియాలో ఎంత రాయించుకున్నా బాబుకి తన పరిమితుల గురించి కొంత అవగాహన ఉంది. లక్ష్మీపార్వతి రాక తర్వాత తెలుగుదేశంలో యిమడలేని పరిస్థితి వచ్చినపుడు ఆయన ఎదురుగా ఒక ఆప్షన్‌ ఉంది. సంఘ సంస్కర్త రామస్వామి నాయకర్‌ తన కంటె చాలా పిన్నవయస్కురాలిని పెళ్లి చేసుకున్నపుడు ఆయన శిష్యులైన అణ్నాదురై తదితరులు ఆయనతో విభేదించి ఆయన డికె సంస్థ నుంచి బయటకు వచ్చేసి డిఎంకె పేర పార్టీ పెట్టుకుని తమిళ రాజకీయాలను తిరగరాశారు. లక్ష్మీపార్వతి మోహంలో పడి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని ఎన్టీయార్‌ను నిందించి బయటకు వచ్చేసి బాబు డెమోక్రాటిక్‌ టిడిపి అనో మరో పేరుతోనో పార్టీ పెట్టి ఎమ్మెల్యేలను చీల్చుకుని రావచ్చు. కానీ అలా చేస్తే తన వెంట ఎక్కువమంది రారనే విషయం ఆయనకి తెలుసు.

ఎందుకంటే గతంలో నాదెండ్ల, రేణుకా చౌదరి అలాగే చేసి భంగపడినవారే! అందువలన పార్టీలోనే ఉంటూ గోతులు తీస్తూ, ఎమ్మేల్యేలను దువ్వుతూ, పోరాటం లక్ష్మీపార్వతి పెత్తనానికి వ్యతిరేకంగానే తప్ప పెద్దాయన పట్ల గౌరవం లేక కాదు, అని వాళ్లని బుజ్జగిస్తూ కథ నడుపుకుని వచ్చారు. చివరకు ఎన్టీయార్‌నే గద్దె దింపారు. తర్వాత ఎన్నికలు వచ్చేసరికి సొంతంగా పోటీ చేసే ధైర్యం లేక, బిజెపితో చేతులు కలిపారు. 2004 ఎన్నికల విషయంలో మాత్రం బాబు లెక్క తప్పారు. తను సృష్టించిన మీడియా జాలంలో తనే పడి, తన పాలన అంటే ప్రజలు పడి చచ్చిపోతున్నారని అపోహపడి, తనపై మావోయిస్టు దాడి జరిగితే ప్రజలంతా ఆవేశపడి, తనకు యిబ్బడిముబ్బడిగా ఓట్లేసి గెలిపిస్తారని భ్రమించి, ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. చివరకు తనూ, తన భాగస్వామి బిజెపి యిద్దరూ అధికారం పోగొట్టుకున్నారు.

2009 వచ్చేసరికి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసు అవినీతిలో కూరుకుపోయిందనే ప్రచారం తారస్థాయిలో ఉంది. జలయజ్ఞం పేరుతో వైయస్‌ ధనయజ్ఞం చేస్తున్నారని రాష్ట్రమంతా కోడై కూస్తోంది. ఆ పరిస్థితిలో  కూడా వైయస్‌ను ఒంటరిగా ఎదుర్కోగలనన్న నమ్మకం బాబుకి చిక్కలేదు. తెరాసను, లెఫ్ట్‌ను కలుపుకుని మహాకూటమి పేరుతో ఎదిరించారు. అయినా భంగపాటు తప్పలేదు.

చివరకు రాష్ట్రం విడిపోయింది. ఒట్టి ఆంధ్రలో మాత్రమే టిడిపికి ఆశ మిగిలింది. కానీ అది గట్టి ఆశే - బయట నుంచి చూస్తే! విభజనలో అన్యాయం జరిగిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెసు పట్ల కోపంతో రగులుతున్నారు. కొత్త రాష్ట్రాన్ని తెలంగాణకు దీటుగా తీర్చిదిద్దుకోవాలనే కసితో ఉన్నారు. అది చేయగల సామర్థ్యం అనుభవజ్ఞుడైన బాబుకే ఉందనే నమ్మకంతో ఉన్నారు. అందువలన ఆయన గెలుపు తథ్యం అనిపిస్తుంది.

అప్పట్లో బాబుకి ప్రత్యర్థులు ఎవరు? కాంగ్రెసు పూర్తిగా పరపతి పోగొట్టుకుని ఉంది. బిజెపి, లెఫ్ట్‌ యివేమీ పెద్దగా లెక్కలోకి రావు. ఉన్న ప్రత్యర్థి వైయస్‌ జగన్‌ మాత్రమే. అతను వైయస్‌ వంటి కాకలు తీరిన యోధుడు కాడు. ఇప్పటి లోకేశ్‌లా తండ్రి హయాంలో మంత్రిగా చేసి అనుభవం సంపాదించినవాడు కాడు. కాంగ్రెసు ఆఫర్‌ చేసిన కేంద్ర మంత్రి పదవి స్వీకరించి అక్కడి అనుభవమైనా సమకూర్చుకున్నవాడు కాడు. దేశంలో బలంగా ఉన్న కాంగ్రెసుతో పేచీ పెట్టుకుని బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టి 36 నెలలైంది. దానిలో 16 నెలలు జైలు నుంచే పార్టీ నడపవలసి వచ్చింది. సమైక్యభావన ఉన్న ఆంధ్రులను మెప్పించేలా సమైక్యమే నా నినాదం అనే పంథా చివరిలో కానీ తీసుకోలేదు. పైగా తండ్రి చాటున వేలాది కోట్లు గడించాడన్న అవినీతిపరుడైన ముద్ర ఉంది. తండ్రికి భిన్నంగా ఫ్యాక్షనిస్టు అనే యిమేజీ ఉంది. ప్రజాక్షేత్రంలో అతన్ని గుర్తు పెట్టుకునేది - ఓదార్పు వీరుడిగా మాత్రమే! !

ఇలాటి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి బాబు బిజెపి, జనసేనలను కలుపుకున్నారని గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఆయనకు తెలుసు - వాళ్లతో పొత్తు పెట్టుకోకపోతే ఓటమి ఖాయమని. పొత్తు పెట్టుకున్నా, ఎడాపెడా వాగ్దానాలు కురిపించినా ఓట్లశాతంలో తేడా అతి తక్కువగా ఉంది. ఒంటరిగా పోరుకు వెళ్లిన జగన్‌ బలం రాష్ట్రమంతా ఒకేలా ఉండకపోవడంతో బాబు గట్టెక్కేశారు కానీ లేకపోతే ఫలితం తేడాగా వచ్చేది. ఫలితాలు చూశాక అర్థమైంది - బాబు ఎందుకు చేతులు కలిపారో! తన బలాబలాల గురించి సరైన అంచనా బాబుకి ఉందని తేటతెల్లమైంది - మీడియా ఎంత ఊదరగొట్టినా! 2019 ఎన్నికల సమయం నాటికి బాబుకి మళ్లీ అంచనా వేసుకోవలసిన అవసరం పడింది. తన పాలన ఎంత అద్భుతంగా ఉందని ఊదరగొట్టినా, వైఫల్యాలన్నిటినీ మోదీపై నెట్టేస్తున్నా ప్రజలు నమ్మటం లేదని అర్థమైంది. జాతీయ సర్వేలన్నీ వైసిపికే ఎక్కువ పార్లమెంటు సీట్లు వస్తాయని చెపుతున్నాయి. సర్వేలన్నీ నిజం కాకపోయినా ప్రభుత్వవ్యతిరేకత బలంగా ఉందని బాబుకి అర్థమైంది.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాబుకి ఆత్మీయుడని అందరికీ తెలుసు. ఆయనే ''కొత్త పలుకు''లో రాశారు - '..ఇవన్నీ చూసి బాబు ఆలోచనలో పడ్డారు' అని. అంటే గెలుపు పట్ల ఆయన ధైర్యం సడలిన స్టేజి ఒకటి ఉందన్నమాట. దాన్ని సరిదిద్దడానికి పసుపు-కుంకుమ స్కీమును జనాల్లోకి బలంగా తీసుకెళ్లారని, అదే అల్టిమేట్‌గా టిడిపిని గట్టెక్కిస్తోందని టిడిపి నాయకులు, అభిమానులు నమ్ముతున్నారు. ఈవిఎంల యిబ్బందితో యిళ్లకు వెళ్లిన ఆడవారు, వృద్ధులు మళ్లీ వచ్చి ఓట్లు వేయడానికి పసుపు-కుంకుమ, పెన్షన్‌ స్కీములే కారణమని బాబు కూడా గట్టిగా చెపుతున్నారు. అంటే అమరావతి, పోలవరం, పట్టిసీమ, పారిశ్రామిక ప్రగతి (!) వగైరా ఫ్యాక్టర్లేవీ వర్కవుట్‌ కాలేదన్నమాట. తెలంగాణలో కెసియార్‌ విజయానికి కారణం సంక్షేమ పథకాలే అనే ప్రచారాన్ని అందరూ నమ్మడంతో యిక్కడా అవే తమను ఒడ్డున పడేశాయనే భావనకు వచ్చేశారు. ఎట్‌లీస్టు అలా వచ్చేశారని మనల్ని అనుకోమంటున్నారు.

ఎందుకంటే ఎన్నికల ప్రారంభానికి ముందు నుంచీ బాబు నెర్వస్‌గానే ఉన్నారు. గెలుస్తామనే ధీమా ఉన్నవాళ్లు హుందాగా, దర్జాగా ఉంటారు. కానీ తనకు వ్యతిరేకంగా జగన్‌, కెసియార్‌, మోదీ ఏకమయ్యారనే అభద్రతా భావానికి లోనైన బాబు వాళ్లపై విపరీతంగా విరుచుకు పడ్డారు. వైసిపిని దాని పేరుతో కాకుండా కోడికత్తి పార్టీ అని, జగన్‌ను ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సిన మనిషని... యిలా స్థాయి దిగి మాట్లాడారు. కెసియార్‌నూ బాగా తిట్టారు కానీ అందరి కంటె ఎక్కువగా తిట్టినది మోదీనే!

రాజకీయపరమైన విమర్శలు చేయడం సహజమే, దేశంలో అనేకమంది ఆ పని చేశారు. కానీ బాబు మోదీని వ్యక్తిగతంగా కూడా దూషించారు. తమ మధ్య ఏవో పాతకక్షలు ఉన్నట్లు వ్యవహరించారు. మోదీ పార్టీ ఆంధ్రలో ఉనికి కూడా లేని పార్టీ. వెంకయ్య నాయుడి పుణ్యమాని నాయకుడు మిగలని పార్టీ. మరి మోదీని తిట్టడం దేనికి? మోదీని బూచిగా చూపించి, జగన్‌ను తన తొత్తుగా చూపించి, తనొక్కడే ఆంధ్ర ప్రయోజనాలను కాపాడగలిగే వీరుడిగా చూపించుకోవడానికి! 

అది కాస్త అతి అయిపోయింది. ఆంధ్రులందరికీ అర్థమై పోయింది - మోదీకి బాబుకి ఉప్పునిప్పుగా ఉందని. మోదీ మళ్లీ ప్రధాని, బాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే కేంద్రం ఆంధ్రకు ఎంగిలి చెయ్యి కూడా విదల్చదని, పక్కన ఉన్న కర్ణాటకు అన్నీ తరలిస్తుందనీ! మోదీ పాలన పట్ల యిష్టాయిష్టాలు ఎలా ఉన్నా అతను మళ్లీ ప్రధాని అవుతాడనే అంచనా దేశమంతటా ఉంది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయన్న సంగతీ తేటతెల్లంగా తెలుస్తోంది. ఇవాళ్టి ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అవే చెపుతున్నాయి. వీటిని నమ్మనక్కరలేదని ఎంత మనం మనకు నచ్చచెప్పుకున్నా ఎన్‌డిఏకు 250 కి మించి వస్తాయని గట్టిగా అనుకోవచ్చు. యుపిఏ, యితరులు కలిపితే వచ్చే అంకె ఎన్‌డిఏ పొందవచ్చు.

యుపిఏ, యితరులు సమానంగా సీట్లు తెచ్చుకుంటే రాహుల్‌ ప్రధాని అవుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకం. రాహుల్‌ కాకపోతే కాంగ్రెసులో ఎవరు? ఇతర పార్టీల నుంచి ఎవరు? అని ఆలోచించడం మొదలుపెడితే తల బద్దలౌతుంది. అక్కడిదాకా వస్తే అప్పుడే ఆలోచించవచ్చని అనుకుని వాయిదా వేయడం మంచిది.

ఆంధ్ర ప్రజల మూడ్‌ యిలా ఉందని కూడా బాబు గ్రహించారు. అందుకే ఎన్‌డిఏ అధికారంలోకి రాదని, వచ్చినా బిజెపికి సొంతంగా సీట్లు తగ్గి మోదీ స్థానంలో నితిన్‌ గడ్కరీ ప్రధాని కావచ్చని బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టారు. మోదీ మళ్లీ ప్రధాని కావడం అసాధ్యమని, అందువలన అతన్ని చూసి భయపడి తనకు ఓటేయడం మానేయనక్కరలేదని నమ్మించడానికి బాబు శతథా ప్రయత్నిస్తూ వచ్చారు. నిజానికి ఆయనకు రాష్ట్ర ఎన్నికలు ముఖ్యం. పార్లమెంటు సీట్లలో మహా అయితే 15-20 రావచ్చు, వాటితో తిప్పబోయే చక్రమూ లేదు, చట్టుబండలూ లేదు. ప్రధానిగా ఎవరున్నా నియమం ప్రకారం రాష్ట్రానికి రావలసిన నిధులు ఎలాగూ వస్తాయి. అందువలన జాతీయ రాజకీయాల గురించి యీ ఎన్నికలలో చర్చ అంతగా ఉండనక్కరలేదు. కానీ బాబు తన ప్రచారంలో జాతీయ రాజకీయాలనే ఎక్కువగా ప్రస్తావించారు. మోదీని తిట్టడానికే ఎక్కువ సమయానికి వెచ్చించారు.

పక్కన ఉన్న ఒడిశా చూడండి. ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే అక్కడ బిజెపికి అత్యధిక పార్లమెంటు సీట్లు, బిజెడికి అత్యధిక ఎసెంబ్లీ సీట్లు వస్తాయట. నవీన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాట్ట. ఎందువలన అంటే ఒడిశా ప్రజలు ప్రధానిగా మోదీని, ముఖ్యమంత్రిగా నవీన్‌ను కోరుకుంటున్నట్లు! నవీన్‌ ప్రధాని అభ్యర్థి కాడు, అందువలన అతని పార్టీకి పార్లమెంటు సీట్లు ఎక్కువ అక్కరలేదు అనుకున్నారట. అదే పరిస్థితి ఆంధ్రలోనూ జరిగి వుండవచ్చు. కానీ బాబు తనకు ప్రధాని పదవి తను ప్రయారిటీ అన్నంత హంగామా చేశారు. అంటే ఆయనే ప్రధాని అవుతారని కాదు, తను చెప్పిన వ్యక్తి ప్రధాని కావాలనే పట్టుదలతో వ్యవహరించారు.

ఒడిశాలో బిజెపి, బిజెడి ముఖాముఖీ తలపడ్డాయి. అయినా నవీన్‌ మోదీ పట్ల బాబంత కటువైన భాష ప్రయోగించి ఉంటాడని అనుకోను. ఆంధ్రలో పరిస్థితి అలాటిది కాదు. బిజెపి సోదిలోకి లేకపోయినా, మోదీని వేదిక మీదకు లాక్కుని వచ్చి మాటలతో ఉరి వేశారు బాబు.

దీనివలన ఆయనకు ఒనగూడిన లాభమేమిటో తెలియదు కానీ మోదీ కత్తి కట్టి, కేంద్ర సంస్థల ద్వారా టిడిపికి ఎ్కడి కక్కడ ముకుతాళ్లు వేయించాడని వినికిడి. వాటిలో పైకి చెప్పుకోదగ్గ వాటిపై టిడిపి యాగీ చేయగలిగింది కానీ అది అరణ్యరోదనే అయింది. ఫలితంగా వైసిపికి మేలు కలిగిందట. ఏ మేరకు అనేది ఎప్పటికీ తెలియదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బాబుకి యిది బోధపడసాగింది. దాంతో ప్రజలను ఎమోషనల్‌గా ఎప్రోచ్‌ అవ్వాలని చూశారు. నేను యిచ్చినవన్నీ తీసుకుంటూ నాకు ఓటేయరా? అని అడగసాగారు. ఎంత అమాయకుడైన ఓటరుకైనా అది ఆయన సొంత డబ్బు కాదని తెలుసు. ఓటర్లలో అలాటి కృతజ్ఞత ఉంటే ఏ ప్రభుత్వమూ ఓడిపోకూడదు. చివరకు బాబు 'నన్ను డైరక్టుగా యివ్వనీయటం లేదు, అందువలన ప్రభుత్వఖజానా ద్వారా యిస్తున్నాను' అని చెప్పేసుకున్నారు. ఆయన వంటి సీనియర్‌ అనవలసిన మాట కాదది. 

ఎన్నికల రోజు పోలింగు ప్రారంభమైన కాస్సేపటికే ఓటింగు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళుతోందని ఆయనకు తోచింది. అందుకే 30% ఇవిఎంలు పనిచేయటం లేదు, నా ఓటు నాకు పడిందో లేదో తెలియదు వంటి స్టేటుమెంట్లు యిచ్చి విమర్శల పాలయ్యారు. ఇవిఎంలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమం చేపట్టి విఫలమయ్యారు. పేపర్‌లెస్‌ ప్రభుత్వం, డిజిటలైజేషన్‌, కంప్యూటరైజేషన్‌, జెన్‌-నెక్స్‌ట్‌ గవర్నెన్స్‌ అనే పలుకులను రెండు దశాబ్దాల క్రితమే వల్లించిన బాబేనా యీ రోజు ఆధునిక యంత్రాలకు అడ్డు చెపుతున్నది అని ఆశ్చర్యపడే తీరులో వ్యవహరించారు. యంత్రంలో తప్పులుంటే సవరించాలి తప్ప యంత్రాలే వద్దంటే ఎలా? బాలట్‌ బాక్సులున్నపుడు మాత్రం అక్రమాలు జరగలేదా? 

పోలింగు పూర్తయి, ఓటింగు సరళిపై అంతర్గత చర్చల తర్వాత కూడా బాబు కుదుట పడినట్లు లేదు. వైసిపికి గెలుపు దక్కినా దక్కకపోయినా తమతో సమాన స్థాయిలో సీట్లు వస్తాయనే శంక పట్టుకుంది. కష్టకాలంలో తమకు అండగా నిలుస్తుందని ఆశించిన జనసేనకు 3-4 సీట్లు మించి వచ్చేట్లు లేవు. హంగ్‌ ఎసెంబ్లీ వస్తే పెద్ద చిక్కేమిటంటే ఫిరాయింపులు! ఈ విద్యలో తను నిపుణడనని బాబు 2014లోనే చూపించుకున్నారు. ఫలితాలు వెలువడగానే వైసిపి నుంచి కొందర్ని తనవైపు లాక్కున్నారు. తర్వాతి రోజుల్లో ఎవరేమనుకున్నా, ఎంత ఎద్దేవా చేసినా లాక్కుంటూనే పోయారు. తన చేతిలో అధికారం ఉంది కాబట్టి అది సాధ్యపడింది. 

జగన్‌ కూడా ఫిరాయింపుల్లో తక్కువవాడు కాదు. తన పార్టీ ఏర్పడినదే కాంగ్రెసు ఫిరాయింపుదారులతో! ఇప్పుడు టిడిపితో సమాన స్థాయిలో సీట్లు సంపాదించుకుంటే కేంద్రంలోని మోదీ సహాయంతో గవర్నరు ద్వారా తనని పిలిపించుకుని, బలపరీక్ష లోపున టిడిపిని చీల్చగలడు. ఈ రోజుల్లో ఎవరికీ ఏ సిద్ధాంతాల సంకెళ్లూ లేవు కాబట్టి, ఏ రంగు కావాలంటే ఆ రంగు పూసుకోగలరు. హంగ్‌ వస్తే తన బృందం చెదిరిపోకుండా చూసుకోవడం మొట్టమొదటిగా చేయవలసిన పని. దానికి గాను వైసిపి తను యిప్పటికే అధికారంలోకి వచ్చేసిన బిల్డప్‌ యిచ్చేస్తోంది.

సర్వేలు చూసి, ఆ బిల్డప్పులు చూసి తన ఎమ్మెల్యేలు ఎక్కడ చెదిరిపోతారోనన్న భయం బాబుది. అందుకని 'సర్వేలు చూసి భయపడకండి, మనకు 110-130 ఖాయం' అని నాయకులను హుషారు చేస్తున్నారు. అలా చేయవలసిన అవసరం ఎందుకు పడిందంటే, టిడిపి నాయకుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. హంగ్‌ వస్తే మోదీ ద్వారా జగన్‌ లబ్ధి పొందుతాడనే భయం టిడిపిలో కూడా ఉంది కాబట్టి, 'కేంద్రంలో మోదీ రానే రాడు, నేను రానిస్తానా?' అని నమ్మించే ప్రయత్నంలో పడ్డారు బాబు. దాని కోసం దేశమంతా తిరుగుతున్నారు. ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు. 'మీరే పెద్దన్న పాత్ర వహించి యీ కూటమికి సారథ్యం వహించాలి' అని మాయావతి బాబుని కోరినట్లు తెలుగు పేపర్లలో రాయించుకుంటున్నారు. 

నిజానికి సూత్రధారి చుట్టూ పాత్రధారులు తిరగాలి. కానీ యిక్కడ పరిస్థితి రివర్స్‌లో ఉంది. బాబు వెళితే మేం కలవము అని చెప్పేటంత అమర్యాదస్తులు కారు ఎవరూ. కానీ ఆయన మాట కిచ్చే గౌరవం ఆయన తెచ్చుకునే పార్లమెంటు సీట్లపై ఆధారపడి ఉంటుంది. గత కొన్నాళ్లుగా జాతీయ సర్వేలన్నీ టిడిపికి 10 లోపునే యిస్తున్నాయి. వాళ్లు వాటిని పరిగణనలోకి తీసుకుని ఉంటే 'సర్లెండి, ఎన్నికల తర్వాత కలుద్దాం' అని సాగనంపి ఉంటారు. ఫలితాలు వెలువడగానే మనం సమావేశం కావాలని బాబు చేసిన ప్రతిపాదన కూడా మూలపడడానికి కారణమదే!

తన దేశాటన వలన మోదీని ప్రధాని కాకుండా ఆపగలుగుతానని అనుకునేటంత అమాయకులు కారు బాబు. ఆంధ్రలో హంగ్‌ ఏర్పడితే తన పార్టీ సభ్యులు గోడ దూకకుండా వారిలో స్థయిర్యం నింపడానికి చేస్తున్న కసరత్తుగానే చూడాలి దీన్ని. జాతీయ సర్వేలన్నీ తనకు వ్యతిరేకంగా వస్తాయనే సమాచారం ఆయనకు ముందుగానే అంది ఉంటుంది. అందువలన యివాళ రాజగోపాల్‌ను మళ్లీ లాక్కుని వచ్చారు. రాజగోపాల్‌ అంచనాలు తమిళనాడు అసెంబ్లీ, కర్ణాటక అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ విషయంలో తప్పాయి. అయినా ఆయన మాట మీద తెలుగు తమ్ముళ్లకు గురి మిగిలి ఉందని బాబు నమ్మకం కాబోలు. ఆయన చేత తమకు అనుకూలంగా జోస్యం చెప్పించారు. ఇదంతా ఆయన అభద్రతాభావాన్నే కనబరుస్తోంది. 

ఆ భావం సహేతుకమా, నిర్హేతుకమా అనేది త్వరలోనే తెలిసిపోతుంది. హంగ్‌ ఏర్పడుతుందని ఎవరూ అనటం లేదు. నెగ్గే పార్టీకి కనీసం 90 వస్తాయని, స్వింగ్‌ తోడైతే 110 దాకా వస్తాయని అంటున్నారు. అది ఏ పార్టీ అన్నది ఎవరి ఊహకు వారికే వదిలేద్దాం.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2019)
mbsprasad@gmail.com