Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: సూతులంటే శూద్రులా?

ఎమ్బీయస్‍: సూతులంటే శూద్రులా?

కులాల ప్రసక్తే నాకు అసహ్యం, పెద్ద కులం, చిన్న కులం అంటూ విడగొట్టిన పురాణాల గురించి తెలుసుకోవడం మరీ అసహ్యం అనుకునే వారు యీ వ్యాసాన్ని చదవనక్కరలేదు. ఇది భారతకాలం నాటి వ్యవస్థ గురించి ఎకడమిక్ డిస్కషన్ తప్ప, కులవ్యవస్థను సమర్థించే వ్యాసం కాదు. హిందూమతంలో అనేక కులాలున్నాయి. సూతకులస్తులు మన చుట్టూ ఎవరూ లేకపోయినా, సూతశబ్దం మనందరికీ కర్ణుడి కారణంగా పరిచితమే. వ్యాసుడి కొడుకైన రోమహర్షణుడి కొడుకు ఉగ్రశ్రవసుడు శౌనకాది ఋషులకు నైమిశారణ్యంలో పురాణగాథలు చెప్పాడు. ఉగ్రశ్రవసుడి మరో పేరు సూతుడు. అది అతని కులాన్ని సూచించదు. నేను చర్చిస్తున్నది సూతకులం గురించి.

ఎంతో ప్రతిభ కలిగి వుండి కూడా, సూతకులస్తుడనే కారణంగా కర్ణుడు వివక్షతకు గురయ్యాడని మనం చిన్నప్పటినుంచి వింటూ వచ్చాం, సినిమాల్లో చూస్తూ వచ్చాం. అందులో యింకో మెలోడ్రామా ఏమిటంటే అతను సూర్యుడికి, క్షత్రియకన్య ఐన కుంతికి పుట్టినా, ఆమె లోకాపవాదానికి వెఱచి, యితన్ని నదిలో వదిలిపెట్టేస్తే సూతకులస్తుల యింట పెరిగి, సూతుడిగానే గుర్తింపబడ్డాడు. క్షత్రియులతో సమానంగా ట్రీట్ చేయబడలేదు. అందువలన అండర్‌డాగ్ అయిపోయి మన సానుభూతిని ఆపారంగా పొందాడు. ఈ సానుభూతి శ్రుతి మించి కర్ణుడు యాంటీ-హీరో కాదు, హీరోయే అనే లెవెల్‌కు వెళ్లిపోయింది. నిజానికి అతనిలో సద్గుణాలున్నాయి, దుర్గుణాలూ వున్నాయి. (వాటి గురించి మరోసారి) కానీ దుర్గుణాలను కప్పిపెట్టి, సద్గుణాలనే హైలైట్ చేసి అతని ముందు అందరూ బలాదూర్ అనిపించేట్లా సినిమాలు తీశారు.

వినడానికి సూత శబ్దం, శూద్ర శబ్దం దగ్గరదగ్గరగా వుండడం చేత, సూతులంటే శూద్రులనుకునే ప్రమాదం వచ్చిపడింది. తమిళనాట అగ్రవర్ణాల వారికి వ్యతిరేకంగా వచ్చిన ద్రవిడోద్యమం ఊపులో వుండగా వచ్చిన తమిళ ‘‘కర్ణన్’’ (1964) సినిమా అంతా అతన్ని బాధించిన కులవివక్షత మీదనే నడిపారు. ‘గాలికి కులమేది?’ పాట గుర్తుండే వుంటుంది. కొంతకాలానికి 1977లో ఎన్టీయార్ తీసిన ‘‘కర్ణ’’ సినిమాలో కులం గురించిన డైలాగులే హైలైట్ అయ్యాయి. ఇంతకీ సూతులెవరు? ఆనాటి సమాజంలో వారి స్థానమేమిటి? శూద్రులెవరు? క్లుప్తంగా వివరించే ప్రయత్నమే యీ వ్యాసం.

ముందుగా శూద్రుల గురించి. హిందూ సమాజంలో నాలుగు వర్ణాలున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు విద్య నేర్చుకోవడం, నేర్పడం, లలిత కళలలో ప్రావీణ్యం, వైద్యం, వేదవిహితమైన కర్మలు చేయడం, ఉద్యోగాలు చేయడం, పోరాడడం, తక్కిన సమయాల్లో వ్యవసాయం చేయడం యివన్నీ చేసేవారు. కురుపాండవులకు విలువిద్య నేర్పిన ద్రోణుడు, కృపుడు, భీష్ముడికి విలువిద్య నేర్పిన పరశురాముడు – వీళ్లందరూ బ్రాహ్మణులే. ఇక క్షత్రియులు. యుద్ధవిద్యలో ఆరితేరినవారు. సైన్యంలో, రక్షకభట వ్యవస్థలో వీరొక్కరే కాదు, తక్కినవారూ వుండేవారు. వీరూ వ్యవసాయం చేసేవారు. తర్వాత వైశ్యులు. వీరు పశుపోషణ, వ్యవసాయం, వాణిజ్యవ్యాపారాలలో వుండేవారు. ఇక శూద్రులు. వ్యవసాయం, చేతిపనులు వీరి వృత్తి. ఈ కులాల వాళ్లందరూ సైనికులుగా, సేనాపతులుగా, మంత్రులుగా, రాజులుగా కూడా వున్నారు.

పంచమకులం అని తర్వాతి రోజుల్లో అన్నారు కానీ మొదట్లో యీ నాలుగే వుండేవి. సాధారణంగా ఏ కులంవారు ఆ కులంలోనే పెళ్లి చేసుకునేవారు. చేసుకోవాలని యింట్లో వాళ్లు, సమాజమే కాదు, ధర్మశాస్త్రాలు కూడా ఘోషించేవి. అయినా కులం దాటి పెళ్లి చేసుకునేవారు ఆ రోజుల్లోనూ వున్నారు. ఇక చేసేదేం లేక, కులాంతర వివాహాల ద్వారా పుట్టినవారికి ఒక్కో కులం పేరు పెట్టసాగారు. ఆ విధంగా మరిన్ని కులాలు పుట్టుకుని వచ్చాయి. ఈ కులాంతర వివాహాలను రెండు విధాలుగా చూశారు. అనులోమ, విలోమ (ప్రతిలోమ అని కూడా అంటారు) అని. కులవ్యవస్థ సోపానాలుగా వుండేది కాబట్టి పై మెట్టుమీద బ్రాహ్మణులను, రెండో మెట్టు మీద క్షత్రియులను, మూడో మెట్టు మీద వైశ్యులను, నాలుగో మెట్టు మీద శూద్రులను ఊహించారు. పైమెట్టు మీద ఉన్నవారు తన కంటె కింద మెట్టు మీద వున్నవారిని పెళ్లాడితే వాటిని అనులోమ వివాహాలు అన్నారు. కింద మెట్టు మీద ఉన్నవారు పై మెట్టు మీద వున్నవారిని పెళ్లాడితే వాటిని విలోమ వివాహాలు అన్నారు.

ఈ విధంగా ఒక్కో కాంబినేషన్‌కు ఒక్కో పేరు వచ్చింది. అనులోమ వివాహాల్లో చాలామందికి తండ్రి కులమే రావడం చూడవచ్చు. పరశురాముడి తండ్రి బ్రాహ్మణుడు, తల్లి క్షత్రియ స్త్రీ. అయినా బ్రాహ్మణుడిగానే గుర్తింపబడ్డాడు. అక్కడ బీజప్రాధాన్యం కనబడుతుంది. వ్యాసుడు-అంబిక కాంబినేషన్‌లో పుట్టిన ధృతరాష్ట్రుడు తల్లి కారణంగా క్షత్రియు డనిపించుకున్నాడు. కారణం లక్కయిల్లు వ్యాసంలో వివరించాను. అక్కడ వ్యాసుడి పని బీజనిక్షేపం చేసి వెళ్లిపోవడమే తప్ప తండ్రిలా సాకడం కాదు. స్పెర్మ్ డోనార్ అన్నమాట. ఈ కేసులో క్షేత్రప్రధానం కనబడుతోంది. ఇక విలోమ వివాహాలకు వస్తే క్షత్రియుడు బ్రాహ్మణస్త్రీని కూడితే పుట్టినవాడు సూతుడు. వైశ్యుడు బ్రాహ్మణస్త్రీని కూడితే పుట్టినవాడు మగధుడు. వైశ్యుడు క్షత్రియస్త్రీని కూడితే పుట్టినవాడు వైదేహికుడు. శూద్రుడు వైశ్యస్త్రీని కూడితే పుట్టినవాడు అయోగవుడు. శూద్రుడు క్షత్రియస్త్రీని కూడితే పుట్టినవాడు క్షత్రుడు.

శూద్రుడు బ్రాహ్మణస్త్రీని కూడితే చండాలుడు అంటారు. వీళ్లను సమాజంలో చాలా తక్కువగా చూసేవారు. కాటికాపరి వంటి పనులు అప్పచెప్పేవారు. ఎవరినైనా తిట్టడానికి కూడా చండాల శబ్దం వాడేవారు. ఈ కులాల పేర్లు మనకిప్పుడు వినబడవు. పంచమవర్ణం అనేది చండాలురలోంచే వచ్చి వుంటే వారు హాఫ్-బ్రాహ్మిన్స్ అని ఒప్పుకుని తీరాలి. కులాంతర వివాహాలే కాదు, భిన్నభిన్న జాతుల మధ్య కూడా వివాహాలు జరిగాయి. భీముడు రాక్షసకన్య ఐన హిడింబిని పెళ్లాడాడు. అర్జునుడు నాగకన్య ఐన ఉలూచిని పెళ్లాడాడు. పలురకాల వివాహాల గురించి యింకెప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం మన ఫోకస్ సూతుల మీద!

సో, సూతులు వేరెవరో కాదు, రెండు అగ్రవర్ణాల సమ్మేళనం కారణంగా పుట్టినవారు. ముఖ్యంగా రాజులైన క్షత్రియులకు వీరు అత్మీయులు. ఎందుకంటే క్షత్రియుడు బ్రాహ్మణస్త్రీతో సంగమిస్తే పుట్టినవారు కదా. అందువలన వాళ్లను మంత్రులుగా, రథసారథులుగా నియమించుకునేవారు. ఆంతరంగికులుగా చూసేవారు. రథసారథి అంటే డ్రైవరు ఉద్యోగం లాటిది అనుకోవద్దు. రాజు ప్రాణాలు వాళ్ల చేతిలో వుంటాయి. యుద్ధం క్లిష్టంగా మారినపుడు తెలివిగా దూరంగా తీసుకుని పోవాలి. అవతలివాళ్లు తనను ముందుగా చంపాలని చూస్తారు కాబట్టి, తను తెలివిగా తప్పించుకుంటూ వుండాలి. అర్జునుడు కృష్ణుణ్ని సారథిగా వుండమని కోరాడంటేనే, కర్ణుడు శల్యుణ్ని సారథిగా వుండమని అడిగాడంటేనే తెలుస్తుంది వాళ్ల ప్రాధాన్యత. అలాటి ఉద్యోగాల్లో వున్నవాళ్లను సమాజంలో తక్కువగా చూడడం అనేది వూహించుకోలేము.

రామాయణంలో దశరథుడికి సుమంతుడు మంత్రి, సారథి. అతను సూతుడే. కర్ణుడి తండ్రి అతిరథుడు భీష్ముడికి సారథిట. (నాకు స్పష్టంగా తెలియదు). సూతులు రాజులుగా కూడా వెలిగారు. యయాతి కథ వినేవుంటారు. క్షత్రియుడు, అతన్ని శుక్రుడి కుమార్తె దేవయాని పెళ్లాడగోరింది. విలోమ వివాహం కదా అని అతను జంకితే, శుక్రుడు ‘ఏం ఫర్వాలేదు’ అని ధైర్యం చెప్పి పెళ్లి చేసుకోమన్నాడు. వాళ్లకి పుట్టినవాళ్లు యదువు, తుర్వసుడు. వీరిలో యదువు కృష్ణుడి వంశానికి మూలపురుషుడు. విశ్వామిత్రుడికి, మేనకకు పుట్టి, బ్రాహ్మణుడైన కణ్వుడి ఆశ్రమంలో పెరిగిన శకుంతలను బ్రాహ్మణస్త్రీగా గణిస్తే, క్షత్రియుడైన దుష్యంతుడితో ఆమెకు కలిగిన సంతానమైన భరతుడు కూడా సూతుడే. వీళ్లెవరినీ సమాజంలో తక్కువగా చూడలేదు.

తక్కినవారి మాట ఎలా వున్నా, పాండవులు సూతుల్ని తక్కువగా చూశారా అనేది ప్రధానమైన ప్రశ్న. కర్ణుడు ద్రోణుడి వద్ద కొంతకాలం విలువిద్య అభ్యసించాడు. గురువు అర్జునుడి పట్ల పక్షపాతం చూపిస్తున్నాడని భావించి, అర్జునుడి పట్ల మత్సరం పెంచుకున్నాడు. నిజానికి కర్ణుడి కారెక్టరు మొత్తం అర్జునుడిపై అసూయతోనే నాశనమైంది. ఇది ద్రోణుడికి తెలుసు. రాకుమారుల విద్యాప్రదర్శనకు ఏర్పాటు చేసిన టూర్నమెంటుకి కర్ణుడు తనంతట తానుగా వచ్చి విలువిద్య ప్రదర్శిస్తానన్నాడు. నువ్వు సూతుడివి, యిక్కడకు రాకూడదు అని ఎవరూ అనలేదు. సరే చూపించు అన్నారు. అర్జునుడు చేసినవన్నీ కర్ణుడు చేసి చూపించి, శభాష్ అనిపించుకున్నాడు. అయితే అతను అంతటితో ఆగకుండా ద్వంద్వయుద్ధంలో అర్జునుణ్ని ఓడిస్తానన్నాడు.

అప్పుడు వచ్చింది కులప్రస్తావన. కృపుడు ‘ద్వంద్వయుద్ధం సరిసమానుల మధ్య జరగాలి, నువ్వు సూతుడివి కదా, క్షత్రియుడితో ఎలా పోరాడతావు?’ అని అడిగాడు. వెంటనే దుర్యోధనుడు అతన్ని అంగరాజ్యానికి రాజుని చేసి, క్షత్రియుడితో సమానం చేశాడు. అయితే అప్పటికే సూర్యాస్తమయం కావడంతో ద్వంద్వయుద్ధం జరగలేదు. కర్ణుడికి భీమార్జునుల పట్ల గల ఏహ్యభావమే దుర్యోధనుడికి ఆత్మీయుణ్ని చేసింది. అదే భీమార్జునులకు కోపకారణమైంది. అందుకనే భీముడు మాటిమాటికి ‘సూతపుత్ర’ అని ఎత్తిచూపేవారు, నువ్వు మాతో సమానం కాదు సుమా అని ఎత్తిపొడవడానికి.

కానీ పాండవులకు సూతులంటే చిన్నచూపు వుండి వుంటే, ఉత్తరను అభిమన్యుడికి యిచ్చి పెళ్లి చేసి వుండేవారే కాదు. ఎందుకంటే ఉత్తర తల్లి సుధేష్ణ, మేనమామ కీచకుడు సూతులే. పాండవులకు ఏకైక వారసుడిగా మిగిలిన పరీక్షిత్తులో సూతరక్తం కలిసినట్లేగా! పాండవులు దాన్ని ఎలా సహించారు? సూతుడైన కీచకుడు మత్స్యదేశాధిపతి. సేనాధిపతి ఐనా బావగారిని కీలుబొమ్మను చేసి రాజులా ఏలాడు. సూతుడైన కర్ణుడు అంగరాజ్యానికి రాజు.  మీకు పాలించే అధికారం లేదని ప్రజలెవరూ తిరగబడలేదు. తక్కిన రాజులు నిరసించనూ లేదు. అందువలన మహాభారత కాలంలో సూతుల్ని తక్కువగా చూశారనేది కర్ణుణ్ని ఆకాశానికి ఎత్తేయడానికి రచయితలు కల్పించినదే తప్ప వాస్తవం కాదని నా అభిప్రాయం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా