Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: హాశ్చర్యం! డబుల్ హాశ్చర్యం!!

ఎమ్బీయస్‍: హాశ్చర్యం! డబుల్ హాశ్చర్యం!!

తెలంగాణ ఫలితం వచ్చేసింది. ఒకటి కాదు, రెండు ఆశ్చర్యాలు కలిగాయి. భారాస ఓటమి, కాంగ్రెసు గెలుపు! ఒకటి గెలిస్తే మరొకటి ఓడాలి కదా, దీనిలో వింతేముంది? అనవచ్చు. అలా కాదు, ఇద్దరికీ సరిసమానంగా సీట్లు వస్తే అదో దారి. కాంగ్రెసుకు సొంతంగా క్లియర్‌ మెజారిటీ రావడం కూడా ఆశ్చర్యం వేసింది. ఫలితాలపై అందరి విశ్లేషణలూ చదివి, విని, మరొకటి విపులంగా ఎలాగూ రాస్తాను. ఈలోగా నా విస్మయాన్ని పాఠకులతో పంచుకుంటున్నాను. ఇలాటి ఆశ్చర్యాలు నాకు గతంలోనూ కలిగాయి. 2004లో చంద్రబాబు ఓటమి కూడా నేనూహించలేదు. ఇంటెలిజెన్సులో పని చేసే మా కజిన్ ఉత్తరాంధ్రలో కాంగ్రెసు గెలుస్తోందని ముందుగానే చెప్పినప్పుడు కొట్టి పారేశాను – ‘భారాసతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెసును ఆంధ్రులు ఎందుకు ఆదరిస్తారు? తప్పు చెప్తున్నావు.. ఎంతో చక్కగా, అద్భుతాలు సృష్టిస్తూ జాతీయంగానే కాక, అంతర్జాతీయంగా కూడా రాష్ట్రానికి గుర్తింపు తెస్తున్న చంద్రబాబును ఎందుకు ఓడిస్తారు?’ అని. ఫలితం వచ్చిన తర్వాత గుటకలేశాను.

అలాగే 2019లో చంద్రబాబు ఘోరమైన ఓటమి కూడా నన్ను దిగ్భ్రమకు గురి చేసింది. పరిపాలన బాగా లేదని తెలుస్తూనే ఉన్నా, 50-60కు తగ్గకుండా వస్తాయనుకున్నా. ఆయన 110-130 మధ్య వస్తాయని చెప్పుకున్నాడు. కానీ జాతీయ మీడియా టిడిపికి 10 పార్లమెంటు సీట్ల లోపే వస్తాయని చెప్పేవారు. అంటే 70 అసెంబ్లీ సీట్లన్నమాట. గెలిచే పార్టీకి 90-110 లోపున వస్తాయని నేను ఊహించాను. వైసిపి గెలిచినా దానికి 110, జనసేన, బిజెపి యిత్యాదులకు 5 పోయినా టిడిపికి 60 రావాలి. కానీ బొత్తిగా 23 రావడమేమిటి? అదీ మింగుడు పడలేదు. అలాగే 1983 ఎన్నికల్లో టిడిపికి 100 సీట్లు వచ్చి ఎన్టీయార్ ప్రతిపక్ష నాయకుడవుతా డనుకుంటే 202 సీట్లతో ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు. అప్పుడూ ఆశ్చర్యమే! అయితే వీటన్నిటిలోనూ ప్రతిపక్షంలో బలమైన నాయకుడు కనబడుతున్నాడు. 1983లో ఎన్టీయార్, 2004లో వైయస్సార్, 2019లో జగన్! కానీ యిప్పుడు కెసియార్‌కు దీటైన ప్రతిపక్ష నాయకుడే లేడు. అందుకు డబుల్ ఆశ్చర్యం!

కానీ ఆలోచిస్తే అలాటి సందర్భాలూ ఉన్నాయి. ఎమర్జన్సీ తర్వాత 1977లో కాంగ్రెసు పార్టీని జనతా పార్టీ ఓడించడం అలాటిదే! ఇందిర దేశమంతా తెలిసిన టాల్ లీడర్. మొరార్జీ, చరణ్ సింగ్, వాజపేయి, ఫెర్నాండెజ్.. వీళ్లంతా దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తెలిసిన నాయకులు. దక్షిణాదిన వీళ్లెవరికీ ఠికాణా లేదు. వీళ్లలో వీళ్లకి పడదు. అలాటి వాళ్లంతా కలిసి ఇందిరను ఓడించేశారు. ఎమర్జన్సీలో చాలా అత్యాచారాలు జరిగాయి. వాటితో పాట ప్రజలకు ఉపయోగపడే పనులు చాలా జరిగాయి. కానీ ఉత్తరాది జనాలు అవేమీ లెక్కలోకి తీసుకోలేదు. ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెసుకు ఒక్క సీటూ రాకుండా చేశారు. 1980లో దానికి పూర్తిగా రివర్స్‌లో చేశారు. జనతా పార్టీలో అంతఃకలహాల మాట నిజమే కానీ ఎన్నో మంచి పనులు జరిగాయి. ఎన్నో సంస్కరణలు తెచ్చారు. కానీ ప్రజలు వాళ్లను ఘోరంగా ఓడించి, మళ్లీ నియంతకు అధికారాన్ని కట్టబెట్టారు.

ఇలాటి వింతలు జరుగుతూంటాయి కాబట్టే యిది ప్రజాస్వామ్యమైంది. భారాస ఎన్నో తప్పులు చేసింది. ఎన్నో లోపాలున్నాయి. కానీ దాని హయాంలో ఎంతో ప్రగతీ జరిగింది. మంచి చూసి ఓటేస్తారా? చెడు చూసి మానేస్తారా? అనే సందేహం కలిగినప్పుడు ప్రత్యామ్నాయం ఎలా ఉందో చూసి నిర్ణయిస్తారు అనుకున్నాను. ప్రత్యామ్నాయం కాంగ్రెసు వంటి ఘోరమైన పార్టీ కాబట్టి గత్యంతరం లేక భారాసకు వేస్తారనుకున్నాను. నేను అలాగే వేశాను కాబట్టి అందరూ అదే చేస్తారని తర్కించుకున్నాను. అది తప్పింది. ఓటర్లు కెసియార్ యాటిట్యూడ్‌ను లెక్కలోకి తీసుకున్నారు. ప్రభుత్వం పెర్‌ఫామెన్స్ కంటె కెసియార్ అహంభావానికి బుద్ధి చెప్పారనిపిస్తోంది. పూర్తి లెక్కలు వచ్చాక సరైన అవగాహన ఏర్పడుతుంది.

స్కూల్లో టిసి (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్)తో బాటు సిసి (కాండక్ట్ సర్టిఫికెట్) కూడా యిస్తారు. సిసి బాగో లేకపోతే వేరే ఏ స్కూలులోనూ సీటివ్వరు. అలాగే ఉద్యోగాల్లో కూడా ఏటేటా స్టాఫ్‌పై యిచ్చే కాన్ఫిడెన్షియల్ రిపోర్టులో పని సామర్థ్యంతో పాటు, బిహేవియర్ కూడా లెక్కలోకి తీసుకుంటారు. రెండూ బాగుంటేనే ప్రమోషన్‌లో స్కోరింగు వస్తుంది. థియరీ, ప్రాక్టికల్ రెండిట్లోనూ మినిమమ్ మార్కులు వస్తేనే పరీక్ష ప్యాసవుతాం. కెసియార్‌కు ఓ దానిలో బాగానే మార్కులు పడినా, రెండో దాంట్లో తక్కువై పరీక్ష పోయిందనుకోవాలి. కెసియార్ యాటిట్యూడ్‌పై ప్రజలకు యింత ఆగ్రహం ఎప్పుడు వచ్చిందాని నాకు మరో ఆశ్చర్యం.

ఎందుకంటే ఉద్యమకాలం నుంచి కెసియార్ ప్రవర్తన ఏమీ బాగా ఉండేది కాదు. యుపిఏలో కేంద్రమంత్రిగా పదవి యిస్తే ఆ హోదాలో తెలంగాణకు ఏమీ మేలు చేయకుండా పదవి వదిలేశాడు. ఏళ్ల తరబడి దిల్లీలో ఉంటూ కాలక్షేపం చేసేవాడు. ఏమైనా అంటే దేశంలోని యితర పార్టీలతో లాబీయింగు చేస్తున్నా అనేవాడు. పార్టీలో ఎవర్నీ సంప్రదించకుండా రాజీనామాలు చేయించి మళ్లీ మళ్లీ ఎన్నికలకు వెళ్లేవాడు. వెళ్లిన ప్రతీసారీ బలం సగం తగ్గిపోయినా, అదే పని చేసేవాడు. ఇతన్ని నమ్ముకుని తెలంగాణ ఉద్యమంలో చేరిన అన్ని వర్గాల వారూ యితని ధోరణితో హతాశులై విసిగిపోయేవారు. పార్టీ విడిచి వెళ్లిపోయేవారు.

తన అహంభావంతో, మొండి వైఖరితో తెలంగాణ ఉద్యమాన్ని క్షీణదశకు తీసుకుని వచ్చాడు. వైయస్ అనంతరం కాంగ్రెసులో జరిగిన పరిణామాల వలన మాత్రమే తెలంగాణ వచ్చింది. తెలంగాణను అటకెక్కించిన కాంగ్రెసు హఠాత్తుగా కిందకు దింపి ఎన్నికలకు ముందు తెలంగాణ యివ్వడం కూడా నన్ను షాక్‌కు గురి చేసింది. తెలంగాణ వస్తుందని నేనస్సలు అనుకోలేదు. కాంగ్రెసు అంత బుద్ధిహీనంగా వ్యవహరిస్తుందని అనుకోలేదు. ఇప్పుడీసారి కాంగ్రెసు గెలుపు కూడా తెలంగాణ యిచ్చినందుకు అని నేను అనుకోవటం లేదు. కెసియార్ వ్యవహారశైలికి జనాలు గుణపాఠం చెప్పడం చేతనే కాంగ్రెసు లాభపడింది. బిజెపి బలంగా ఉండి ఉంటే బిజెపికి అధికారం యిచ్చేవారేమో!

ఉద్యమకాలంలో కూడా కెసియార్ ఎవర్ని పడితే వాళ్లను ఏ మాట పడితే ఆ మాట అనేవాడు. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయనే లేదు. ఆంధ్రవాళ్లను తరిమివేసి, ఆ ఉద్యోగాలన్నీ యిప్పిస్తానని యువతకు హామీలిచ్చాడు. ఇంటింటికో ఉద్యోగం అన్నాడు. చివరకు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే తెలంగాణ వస్తే ఆంధ్రావాళ్లను తరిమివేసి ఆ యిళ్లన్నీ తెలంగాణ వాళ్లకు పంచిపెడతాడని శ్రామిక వర్గాలు నమ్మేవారు. ఆంధ్ర ప్రయివేటు విద్యాసంస్థలన్నీ మూయించేస్తా నన్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్నాడు. ఉద్యమకాలంలో ఉండగా మా పిల్లలెవరూ రాజకీయాల్లోకి రారన్నాడు. ఇలా ఎన్నో, ఎన్నెన్నో వాగ్దానభంగాలు. నెగ్గాక సెక్రటేరియట్‌కు రాలేదు. దాని వాస్తు నాకు పడదన్నాడు. ఎమ్మెల్యేలను కలిసేవాడు కాదు. ఎంతటివాళ్లకూ ఓ పట్టాన ఎపాయింట్‌మెంట్ యిచ్చేవాడు కాదు.

ఉద్యమంలో తనకు అండగా నిలిచిన ప్రజాస్వామ్య వాదులందరినీ అణచి వేశాడు. మీడియాను నోరెత్త నీయకుండా చేశాడు. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుదారులను తీసుకుని స్పీకరు ద్వారా మేనేజ్ చేసి, డిస్‌క్వాలిఫై చేయనీయకుండా, మళ్లీ ఎన్నికలకు వెళ్లకుండా, మంత్రి పదవులిచ్చాడు. తన సహచరులను హీనంగా చూశాడు. చిత్తమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకున్నాడు... ఒకటా? రెండా? యిలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజలు యివేమీ పట్టించుకోలేదు. అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేసి 2018లో ముందస్తు ఎన్నికలకు వెళితే ఏమీ అనలేదు సరి కదా 2014లో 63 సీట్లు యిస్తే, 2018లో 25 అదనంగా, 88 యిచ్చారు. అందువలన కెసియార్ అహంకారాన్ని ప్రజలు ఒక బిట్టర్ ట్రూత్‌గా యాక్సెప్ట్ చేశారని అనుకున్నాను. దాన్ని పక్కకు పెట్టి పారిశ్రామికంగా, వ్యావసాయికంగా చేసిన ప్రగతినే లెక్కలోకి తీసుకుంటా రనుకున్నాను. కానీ దానికి తక్కువ మార్కులు వేసినట్లున్నారు. 40 మంది ఎమ్మెల్యేలపై కోపమే భారాసను దెబ్బ తీసిందని కొందరు అంటే, అబ్బే పెద్ద సారు మీద కూడా కోపం ఉంది, తనకీ బుద్ధి చెప్పారు. అందుకే కామారెడ్డిలో ఓడించారు అంటున్నారు. పాలకుడి అహంభావాన్ని పెద్ద అంశంగా తీసుకున్నారని అర్థమయ్యి ఆశ్చర్యానికి లోనవుతున్నాను.

ఇదే నిజమైతే మనం హర్షించాలి. ప్రజలను ప్రశంసించాలి. ఫిరాయింపుదారులను మట్టి కరిపించిన ఓటర్లకు మొక్కాలి. ఫలితాలు వచ్చాక ‘64 మాత్రమే వచ్చాయి కదా, తక్కిన పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటారా?’ అని డికె శివకుమార్‌ను ఇండియా టుడే వాళ్లు అడిగితే ‘..నాట్ ఇమ్మీడియట్లీ’ అన్నాడట. అంటే వీళ్లకీ బుద్ధి రాలేదన్నమాట. ఫిరాయింపుదారుల ఓటమి చూశాకైనా ‘నెవర్’ అని ఉంటే బాగుండేది. 1978లో 294 సీట్లలో ఇందిరా కాంగ్రెసు అనూహ్యంగా 175 సీట్లు గెలిచి అధికారాన్ని పొందింది. జనతా పార్టీకి 60, రెడ్డి కాంగ్రెసుకు 30 వచ్చాయి. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయి, ఎడాపెడా ఆ పార్టీల ఎమ్మెల్యేలను తీసుకోసాగాడు. 205 మంది పోగడ్డారు. 1983 వచ్చేసరికి ఎన్టీయార్ ప్రభంజనంలో కొట్టుకుపోయి 60 మంది మిగిలారు.

2014లో కెసియార్‌కు 63 సీట్లు వచ్చాయి. మెజారిటీ ఉందిగా, అయినా యితర పార్టీలను తుడిచి పెట్టేద్దామని ఫిరాయింపులు చేసుకున్నాడు. ప్రజలు చూసీ చూడనట్లు ఊరుకున్నారు. 2018లో 88 వచ్చినా ఆశ తీరక, మళ్లీ ఫిరాయింపులకు పాల్పడ్డాడు. 104కి చేరాడు. ఇప్పుడు దాన్ని జనాలు 39కి దింపారు. అంటే మూడో వంతు కంటె కాస్త ఎక్కువన్నమాట. ఇది చూసైనా యితర పార్టీలు జాగ్రత్తపడాలి. ప్రజలు ఆలస్యంగానైనా మేల్కొంటారని గ్రహించాలి. ఇలా మేల్కొంటారని నేను ఊహించలేదు. ఆర్థిక ప్రగతి చూసి సహిస్తారనుకున్నాను.

ముఖ్యంగా కాంగ్రెసు పార్టీపై నాకున్న తేలిక భావం చేత దాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారని అనుకోలేదు. నా వ్యాసంలో నేను కాంగ్రెసుపై వెలిబుచ్చిన అభిప్రాయాలు మార్చుకోను. దాని సామర్థ్యంపై, నాకు నమ్మకం లేదు. తెలంగాణతో పాటు వచ్చిన తక్కిన మూడు రాష్ట్రాల ఫలితాలు చూడండి, రెండిటిలో అధికారాన్ని పోగొట్టుకుంది. ఇక్కడ కూడా అలవి కాని హామీలిచ్చింది. 2014లో కెసియార్ మాటలను నమ్మినట్లే, యిప్పుడు కాంగ్రెసు మాటలనూ నమ్మారేమో తెలంగాణ ప్రజలు! ఆర్నెల్లలో రెండు లక్షల ఉద్యోగాలు యివ్వకపోతే ఏమంటారో తెలియదు. బుద్ధి చెప్పడానికి తొమ్మిదిన్నరేళ్లు ఆగుతారో, ఐదేళ్లకే స్పందిస్తారో చూడాలి.

ఉద్యమకాలం నుంచి భారాసకు పెట్టని కోట ఉత్తర తెలంగాణ. అక్కడే భారాస కారును డంప్‌యార్డ్‌లో పడేశారంటే చూసుకోండి, ప్రజల నిరాశానిస్పృహలు ఎలా ఉన్నాయో! నిజానికి తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో కంటె యిబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఆంధ్ర నుంచే కాదు, ఒడిశా, బిహార్, దూరాన ఉన్న ఈశాన్య యితర రాష్ట్రాల నుంచి కూడా యువత వచ్చి పని చేసుకుంటూ ఆర్జించుకుంటున్నారు. కానీ తెలంగాణ యువతకు అది చాలదు. కెసియార్ యింటింటికీ ప్రభుత్వోద్యోగాలు యిస్తానన్నాడు, యివ్వలేదు. నెట్టేయ్! కాంగ్రెసు యిది గ్రహించాలి.

కాంగ్రెసే కాదు, హామీలిచ్చేటప్పుడు కెసియారూ గ్రహించాలి. దానితో పాటు తన పరిమితులూ తెలుసుకోవాలి. తెలంగాణకై అంటూ పార్టీ పెట్టి, తెలంగాణ తన జేబులో శాశ్వతంగా ఉందనుకుంటూ పొరుగు రాష్ట్రానికి పెత్తనానికి వెళ్లకూడదు. నెగ్గి ఉంటే ముఖ్యమంత్రి కుర్చీ కొడుక్కి అప్పగించి, జాతీయ రాజకీయాలంటూ దిల్లీలో కాపురం పెట్టేవాడేమో! కుర్చీ అప్పగింతలు లేకపోయినా యిప్పుడూ ఆ పని చేయవచ్చు. బోల్డంత తీరిక! అసలు భారాస పేరు మార్చడమే దెబ్బ కొట్టింది. సత్యం పేరు ఉన్నంతకాలం రామలింగ రాజు బాగున్నారు. దాన్ని తిరగేసి మేటాస్ పెట్టి, మేత మేయబోయేసరికి కంపెనీ మూతపడింది. తెరాస భారాస కావడంతో అసలుకి మోసం వచ్చింది.

ఒక సీనియర్ జర్నలిస్టు మిత్రుడు ‘మీ తెలంగాణ వ్యాసాలు భావావేశాని లోనై రాసినట్లున్నాయి’ అన్నారు. ‘కాంగ్రెసు గెలుస్తుందంటూ వచ్చి పడుతున్న బోగస్ సర్వేలు చూసి చికాకేసి, వాటిని ఖండిస్తూ రాశానండీ’ అన్నాను. నిజంగానే యీసారి సర్వేలు వెర్రిగా వచ్చిపడ్డాయి. శాంపుల్ ఎంత తీసుకున్నారో ఎవడూ చెప్పడు. సందుకో సర్వే సంస్థ అన్నట్లు తయారై, డిస్కషన్స్, యూట్యూబు వీడియోలు. కొందరు ఎన్‌డిటివి సర్వే, ఎబిపి సర్వే అంటూ ఫేక్ సర్వేను కూడా వ్యాప్తి చేశారు. కాంగ్రెసు హవా నడుస్తోంది అనే ఓరల్ టాక్ స్ప్రెడ్ చేయడానికి యివన్నీ చేశారు. నేను వాటిని నమ్మను అంటూ నేను వ్యాసాలు రాశాను. ఇప్పటికీ అవి శాస్త్రీయంగా చేసిన సర్వేలని నేను నమ్మను. వాటిలో కరక్టయినవి కూడా మిడతంబొట్లు జోస్యం లాటివే అని నా ఉద్దేశం. డిసెంబరు 1 రాత్రి ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే చూసినప్పుడు మాత్రమే ఓహో కాంగ్రెసు నిజంగా గెలిచేట్లు ఉందన్నమాట అనుకున్నాను.

కానీ ఒకటి గమనించండి, 98శాతం యాక్యురసీ ఉన్న ఆ సర్వే కూడా యీసారి తప్పింది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెసు 45, బిజెపికి 41 వస్తాయని ప్రదీప్ గుప్తా చెప్తే, 35, 54 వచ్చాయి. రాజస్థాన్‌లో కాంగ్రెసుకు 96, బిజెపికి 90 వస్తాయని చెప్తే, 70, 115 వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెసుకు 74, బిజెపికి 151 వస్తాయని చెప్తే 66, 163 వచ్చాయి. మధ్యప్రదేశ్ ఒక్కటే ఫర్వాలేదు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అంచనాలు రెండూ పూర్తిగా తప్పాయి. తెలంగాణ విషయంలో మాత్రమే ఆయన కరక్టయ్యాడు. కాంగ్రెసుకు 68, భారాసకు 39, బిజెపికి 6, మజ్లిస్‌కు 6 అంటే 64, 39, 8, 7 వచ్చాయి. ఎంతో శాస్త్రీయంగా చేసిన ఆయన సర్వేనే అలా అఘోరిస్తే ఉప్పూపత్రీ లేని అనేక సర్వే సంస్థలు ఏవేవో చెప్పి పబ్లిసిటీ తెచ్చేసుకుంటూ ఉంటే, వాటిని వేదంగా భావించి చర్చలు జరుగుతూంటే ఒళ్లు మండి, ఖండిస్తూ రాశాను. నేను ఊహించినది జరగలేదు నిజమే కానీ, దానిలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలలో మార్పు లేదు. భారాసలో చెడూ ఉంది, మంచీ ఉంది.

ముక్తాయింపుగా చెప్పాలంటే – మనకు బాగా తెలిసున్న రెండు పద్యాలు కెసియార్‌కు వర్తిస్తాయి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు... అన్నట్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని 23 జిల్లాల వాళ్లు కూడబెట్టి పెంచి పోషించిన హైదరాబాదును ఆక్రమించి, యిదంతా నా ప్రతాపమే అని విర్రవీగి, అందర్నీ ఎద్దేవా చేశాడు కెసియార్. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలికాడు. అందుకే చలిచీమల వంటి ప్రజలు ఛోటామోటా కాంగ్రెసు నాయకుల సహాయంతో కెసియార్‌ను నిర్జించారు. ఓటమి తర్వాత కూడా కెసియార్ ఏమాత్రం హుందాగా ప్రవర్తించలేదు. ఒక ప్రకటన లేదు, అభినందన లేదు, గవర్నరు దగ్గరకు వెళ్లి స్వయంగా రాజీనామా లేఖ యివ్వడం లేదు. 39 సీట్లు యిచ్చినందుకైనా ప్రజలకు దణ్ణాలు పెట్టాలి. అలిగితే చెడేది ఆయనే!

తెలంగాణ ఫలితం వలన మనకు జరిగే మేలు ఏమిటంటే నియంతృత్వం తగ్గుతుందనే ఆశ. ప్రాంతీయ పార్టీలలో నియంతృత్వం ఉంటుంది. జాతీయ పార్టీలో, అందునా క్రమశిక్షణ వర్ణక్రమం తెలియని కాంగ్రెసులో బహునాయకత్వం కాబట్టి కెసియార్ వంటి నియంత తలెత్తడు. ఇన్నాళ్లూ కెసియార్ మీడియాను భయపెట్టి తొక్కి పెట్టాడు కాబట్టి, పాలనలో లోపాలు బయటకు రాలేదు. ఎంతసేపూ ఆంధ్ర గురించే, బాబైనా, జగనైనా సరే, న్యూస్ వచ్చేది. టీవీలో చర్చలు జరిగేవి. ఇప్పుడు ధారాళంగా తెలంగాణపై కూడా సమాచారం లభ్యమౌతుంది. ఇక ప్రగతి భవన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని రేవంత్ అన్నాడు. అంత పెద్ద భవనాన్ని ముఖ్యమంత్రి నివాసంగా వాడడం కంటె తెలంగాణ సంస్కృతిని చూపే మ్యూజియంగా మారిస్తే మంచిది.

కెసియార్ అహంకారానికి, మూర్ఖత్వానికి పరాకాష్ట - చక్కగా ఉన్న సెక్రటేరియట్‌ను పడగొట్టి, 700 కోట్లతో యింకోటి కట్టడం. వాస్తు బాగుంటే తనూ, తన తర్వాత కొడుకూ ఎల్లకాలం పాలిస్తారని ఎవరో చెప్పారని చేశాడు. అలాగే ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడని జాతీయ పార్టీ చేశాడట. ఉన్నదీ పోయింది, దాచుకున్నదీ పోయిందని తెలిసి వచ్చింది. తెలంగాణలో మొహం చూపించడం యిష్టం లేకపోతే, మహారాష్ట్ర కెళ్లి (ఎంత అట్టహాసంగా వెళ్లాడో గుర్తు చేసుకోండి), అక్కణ్నుంచి గుజరాత్ వెళ్లి ప్రచారం చేసుకుంటూ వుండవచ్చు. దీనివలన పాఠం ఏమిటంటే జ్యోతిష్యం, వాస్తు వగైరా విషయాలపై ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు. ముఖ్యంగా ప్రజాధనం వెచ్చించేటప్పుడు!

యాదగిరి నరసింహ స్వామికి తన యింటి పేరును యాదాద్రిగా మార్చడం నచ్చలేదు. ప్రజాధనం వెచ్చించి, తన యిమేజి కోసం తన గుడిని విస్తరించడమూ నచ్చలేదు. రేవంత్ ఎలాగూ కెసియార్ కిట్స్ వగైరా పేర్లు మారుస్తాడు. యాదాద్రిని యాదగిరిగా కూడా మారిస్తే మంచిది. ఇప్పటికైనా ఏదైనా ట్రస్టు ఫ్లోట్ చేసి భక్తుల విరాళంతో గుడి పనులు చేస్తే మంచిది. కెసియార్ దొంగ నిరాహార దీక్ష గురించి యిన్నేళ్లకు కాంగ్రెసు నాయకులు నోరు విప్పారు. అప్పట్లో గోనె ప్రకాశరావు తప్ప తక్కినవాళ్లందరూ కెసియార్‌ది నిజమైన దీక్ష అన్నవాళ్లే. వామపక్షవాది ఐన డాక్టరుగారు యిప్పుడు నిజాలు చెప్తున్నాడు. ఉద్యమసమయంలో వీళ్లంతా ఎందుకు గప్‌చుప్‌గా ఉన్నారో సంజాయిషీ చెప్పి, అప్పటి ఆస్పత్రి రికార్డులు బయటకు రిలీజ్ చేయాలి. కెసియార్ రాయించిన తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలను కాంగ్రెసు ప్రభుత్వం ఎలాగూ తిరగరాయిస్తుంది. ఈసారైనా నిజాలు రాస్తే మంచిది.

మనం సంతోషించాల్సిన విషయమేమిటంటే, అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం ఉంటుంది. కెసియార్ అసెంబ్లీకి రాకపోయినా, కెటియార్, హరీశ్ వంటి నాయకులు వచ్చి గట్టిగా మాట్లాడగలరు. పెద్దపెద్ద విగ్రహాలు కట్టినా ఓట్లు రాలవని కొత్త ప్రభుత్వం గ్రహించి ప్రజాధనాన్ని ఆ విధంగా వృథా చేయకపోవచ్చు. కెసియార్‌కు మూడోసారి పట్టం కట్టి ఉంటే అహంకారం యింకా పెరిగేది. దాక్షారం భీమేశ్వరుడి నెత్తి మీద మేకులా మేకు కొట్టి ప్రజలు ఆపారని గ్రహించి, కాంగ్రెసు నాయకులందరూ వినయంగా ఉంటే మంచిదని గ్రహించవచ్చు. వ్యక్తిగతంగా నాకు తృప్తి ఏమిటంటే కష్టపడి పనిచేసిన మా ఎమ్మెల్యే నెగ్గాడు. దానికి నా వంతుగా నా అభినందనను ఓటు రూపేణా తెలుపగలిగాను. ఇక భయపడాల్సింది ఏమిటంటే రాష్ట్ర ప్రగతి ఆగుతుందని, పనులకు బ్రేకులు పడతాయని. ఆర్‌ఆర్‌ఆర్ వంటి పనుల్లో కాంట్రాక్టర్లతో మళ్లీ బేరాలు ఆడవచ్చు. కెసియార్ మెట్రో ఆలస్యం చేసినట్లు. వీళ్లూ యివన్నీ ఆలస్యం చేయవచ్చు. అభివృద్ధి చేసినా ఓట్లు రాలవని అనుకుని, ఉచితాల మీదనే ఫోకస్ పెడతారేమో! ఇప్పటికే తెలంగాణకు బిజెపి సహకరించటం లేదు. ఇప్పుడు కాంగ్రెసు వచ్చింది కాబట్టి యివ్వాల్సినది యివ్వక ముప్పుతిప్పలు పెడుతుందేమో! అన్నిటికన్నా పెద్ద భయం రేవంత్ అన్నమాట నిలబెట్టుకుని రాచకొండ దగ్గర మరో అమరావతిని నిర్మించ బూనుతాడేమో!

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?