Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: టిడిపి క్రైసిస్ మేనేజ్‌మెంట్

ఎమ్బీయస్‍: టిడిపి క్రైసిస్ మేనేజ్‌మెంట్

41 ఏళ్ల టిడిపి క్రైసిస్ సమయంలో యీ విధంగా వ్యవహరిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒక్క చంద్రబాబు సీనులో లేకపోతే, పార్టీ పరిస్థితి యిదా!? అని విస్తుపోయే సందర్భం యిది. ప్రజల ప్రతిస్పందనే కాదు, పార్టీ కార్యకర్తల ప్రతిఘటన కూడా అనుకున్న స్థాయిలో లేకపోవడం ఒకలా నిరాశ పరిస్తే, సీనియర్ నాయకులైన అశోక్ గజపతి రాజు, యనమల, అచ్చన్నాయుడు చురుకుగా ఉండకపోవడం మరోలా నిరాశపరిచింది. అరెస్టయినపుడు తోడుగా కనబడిన కేశినేని, గల్లా జయదేవ్, మామూలుగా హడావుడి చేసే బుద్ధా, బోండా చప్పుడు చేయటం లేదు. బాబు అరెస్టు కాగానే అభిమానులందరూ రోడ్లపైకి స్వచ్ఛందంగా వచ్చేసి నాదెండ్ల టైములో లాగ తిరుగుబాటు వచ్చేస్తుందేమోనని ఊహించిన వారు ఆశాభంగం చెందారు. అరెస్టు చేసి నంద్యాల నుంచి తీసుకుని వచ్చేటప్పుడు చిలకలూరి పేట చేరేవరకు ఏ ప్రతిఘటనా లేకపోవడం వారిని విస్మయ పరిచింది. రాష్ట్రం వెలుపల ప్రదర్శన చేసేవారు ఆంధ్రలో యీ తరహా నిరసనలు వెల్లువెత్తడం లేదేమిటి? అని ఆశ్చర్యపడుతున్నారు. వైసిపి దమనకాండకు దడిసి.. అని తమకు తాము జవాబు చెప్పుకున్నా, పెద్ద సంఖ్యలో ప్రజలు తిరగబడితే పరిమిత సంఖ్యలో ఉన్న పోలీసులు ఏమీ చేయలేరని అందరికీ తెలుసు.

తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, అమెరికా, అంటార్కిటికాలో కానీ నిరసన ప్రదర్శనలు జరిగినంత మాత్రాన ఆంధ్ర ప్రజలు యిన్‌స్పయిర్ అయిపోతారా? ఆంధ్రకు బయట ఒకటి రెండు సార్లు ప్రదర్శనలు జరపడం వరకు బాగానే ఉంటుంది. వారాల తరబడి చేస్తామంటే, మాటిమాటికీ బిజీ ఐటీ సెంటర్లలో చేస్తామంటే స్థానిక పోలీసులు ఒప్పుకోరు. ట్రాఫిక్ యిబ్బందులు వచ్చి, అక్కడున్న పరిశ్రమలు చికాకు పడతాయన్న కారణం చెప్పి అనుమతి నిరాకరిస్తారు. ధిక్కరిస్తే కేసులు పెడతారు. పరదేశంలో భారత వ్యతిరేక సంఘటన ఏదైనా జరిగితే దిల్లీలో వాళ్ల ఎంబసీల ముందు ప్రదర్శనలు చేస్తూంటాం. అలాగే పర రాష్ట్రాలలో, రోడ్ల మీద చేసే కన్నా అక్కడున్న ఆంధ్ర భవనం (ఆంధ్ర ప్రభుత్వంతో సంబంధం లేకపోయినా) లేదా ముందు ప్రదర్శన చేస్తే సింబాలిక్‌గా సరిపోతుందేమో! స్కిల్ స్కామ్ విషయంలో అరెస్టుకి వ్యతిరేకంగా యిన్ని ప్రదర్శనలు అనుమతించా రనుకుంటే, ఫైబర్‌నెట్, ఐఆర్ఆర్.. యిలా కేసు తర్వాత కేసు పెడుతూంటే కేసుకిన్ని నిరసన ప్రదర్శనలు అనుమతించాలని పోలీసులతో ఒక అండర్‌స్టాండింగ్‌కు రావడం మేలు.

ఆంధ్రలో ఫలానా ఊళ్లో టిడిపి ఆఫీసులో జరిగింది, ఫలానా ఊళ్లో ఓ పూట ఆమరణ నిరాహారదీక్ష చేశారు అని చెప్పుకుని మభ్యపెట్టుకోవడం అనవసరం. తూతూమంత్రంగా, మొక్కుబడిగా ప్రదర్శనలు అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ అవి చంద్రబాబు స్థాయి అయితే డెఫినెట్‌గా కాదు. చివరకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా పరోక్షంగా దాన్ని ఒప్పుకుంటూ తన కొత్త పలుకులో ‘చంద్రబాబును అరెస్టు చేసినా ప్రజలు బయటకు వచ్చి నిరసనలు తెలపడం లేదని జగన్ అండ్ కో ఆత్మవంచనకు పాల్పడుతుండవచ్చును గానీ భయం నీడలో బతుకుతున్న ప్రజల చేతిలో కూడా బటన్ (ఎన్నికల సమయంలో నొక్కే ఇవిఎం బటన్ అని ఆయన భావం) ఉంటుందన్న విషయం వారు గుర్తించాలి.’ అని రాశారు. టైము వచ్చినపుడు తమ తడాఖా చూపిస్తారు కానీ ప్రస్తుతం మాత్రం ఉగ్గబట్టుకుని ఉన్నారనేది ఆయన భావంగా తెలుస్తోంది.

ఎందుకిలా జరిగింది? ఈ అవినీతి ఆరోపణల కారణంగా చంద్రబాబుపై టిడిపి కార్యకర్తకు అభిమానం తగ్గిపోయిం దనుకోలేము. రేపు ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేస్తా కానీ యీ రోజు రోడ్డు మీదకు వచ్చి ప్రదర్శనలు చేస్తే నాకు ఒరిగేదేమిటి? అని ఆలోచిస్తున్నాడు. లేనిపోని కేసులు, బెయిళ్లు, కోర్టు చుట్టూ తిరగడాలు... అవసరమా నాకు? అనుకుంటున్నాడు. ప్రజల్లో పరుల కష్టాల పట్ల సానుభూతి అనేది క్రమేపీ తగ్గిపోతోందన్న విషయం తెలుస్తూనే ఉంది. ఇదివరలో రోడ్డు పక్కన ఎవరైనా గాయపడినట్లు కనబడితే ‘నాకు ఆఫీసు టైమైపోతోంది కాబట్టి వెళ్లిపోతున్నాను. వేరెవరైనా ఆసుపత్రికి తీసుకెళితే బాగుణ్ను’ అనుకుని వెళ్లిపోయేవారు. ఇప్పుడైతే కత్తితో పొడుస్తూంటే, బలాత్కారం చేస్తూంటే నిలబడి సెల్‌ఫోన్లో వీడియోలు తీస్తున్నారు.

సాటి మనుషుల పట్ల ప్రవర్తనే యిలా ఉంటే యిక రాజకీయ నాయకుల పట్ల ప్రేమ ఏముంటుంది? 30, 40 ఏళ్ల క్రితం దాకా రాజకీయ సిద్ధాంతాలతో కార్యకర్తలు పనిచేసేవారు. చివర్లో కాస్త టిఫెన్, టీ యిస్తే సరిపోయేది. ఇప్పుడు బిర్యానీ, మందుతో బాటు డబ్బులు కూడా యివ్వాల్సి వస్తోంది. పొలిటీషియన్లు అందరూ దొంగలే, ఎక్కువాతక్కువా తేడా అంతే అనే అభిప్రాయాన్ని సామాన్యుడు బాహాటంగా వ్యక్తపరుస్తున్నాడు. అందువలన పార్టీ కార్యకర్తలను మొబిలైజ్ చేయాలంటే ఆ పార్టీ నాయకులు ముందుండి, మీ ఖర్చులు మేం భరిస్తాం మీ కేసుల సంగతి, బెయిలు సంగతి మేం చూసుకుంటాం అంటూ ముందుకు రావాలి. టిడిపి విషయంలో అది జరుగుతున్నట్లు లేదు. పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు పర్సు తెరవటం లేదు. ప్రథమ శ్రేణి వాళ్లు లాయర్లకే చాలా కేటాయించాల్సి వస్తోంది.

ఎన్ని కేసులు పెట్టించుకుంటే, అన్ని పదవులు అని లోకేశ్ ఊరిస్తే కొందరు కేసులు పెట్టించుకోవడానికి ముందుకు వచ్చారట. బెయిలు వచ్చినా కట్టడానికి డబ్బు లేక కస్టడీలోనే ఉండిపోయారని విజయబాబు ఓ వీడియోలో అన్నారు. అది నిజమైతే టిడిపి అభిమానులు ఓ ట్రస్టు ఏర్పాటు చేసి వారికి లాయర్లను, బెయిలు మొత్తాన్ని ఏర్పాటు చేయడం భావ్యం. ‘బాబుకైతే ఒకరికి నలుగురు బడా లాయర్లున్నారు, మమ్మల్ని ఉసికొల్పి లోకేశ్ దిల్లీలో వెళ్లి కూర్చున్నారు. వైసిపి ప్రభుత్వం మమ్మల్ని కేసుల్లో యిరికిస్తే ఏళ్ల తరబడి తన్నుకులాడాలి, ఎందుకు వచ్చిన రొష్టు’ అనే భావన వారిలో పోవాలంటే యిలాటి చర్యలు చేపట్టాలి. టిడిపి అధికారంలో ఉండగా పదవులు అనుభవించినవారు, డబ్బులు వెనకేసుకున్నవారు గత నాలుగేళ్లగా అరుగు దిగటం లేదని, కార్యక్రమాలు చేపట్టటం లేదని, ఎంతసేపూ చంద్రబాబు కంఠశోష మాత్రమే వినిపిస్తోందని చాలా సార్లు రాశాను. ఇంతటి క్లిష్ట సమయంలో కూడా వారు కదిలి రాకపోతే ఎలా? అదే తలసాని శ్రీనివాస యాదవ్ కూడా అన్నారు.

పార్టీలో నెంబరు టూ ఐన లోకేశ్ దిల్లీ వెళ్లి కూర్చోవడం పార్టీ క్యాడర్‌కు రాంగ్ సిగ్నల్స్ యిచ్చిందని టిడిపి సానుభూతిపరుల దగ్గర్నుంచి అందరూ అంటున్నారు. జాతీయ నాయకులతో, జాతీయ మీడియాతో మాట్లాడ్డానికి వెళ్లారు, న్యాయనిపుణులతో చర్చించడానికి వెళ్లారు అంటే ఎవరు నమ్ముతారు? లండన్‌లో కూర్చుని హరీశ్ సాల్వే కోర్టులో వాదనలు వినిపించగా లేనిది లోకేశ్ రాజమండ్రి నుంచే జాతీయ మీడియాకి యింటర్వ్యూలు యివ్వలేరా? ఇక దిగ్గజాల వంటి లాయర్లకు మార్గదర్శనం చేయవలసిన అవసరం ఉంటుందా? అవసరం పడినా లోకేశ్‌కు లీగల్ విషయాల్లో అంత నైపుణ్యం ఉంటుందా? ఏమైనా సూచనలు కావాలన్నా, ఆత్మీయుడు ఎన్‌వి రమణ గారు యీ సమయంలో అక్కరకు రారా?

ఇక బిజెపి కేంద్ర నాయకుల ఎపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తూ అక్కడ ఉన్నారన్నా వింతే! అరెస్టు జరిగి నెల్లాళ్లు దాటాక అమిత్ షా యిచ్చారంటే దాన్ని బట్టే తెలుస్తోంది వాళ్ల ఏటిట్యూడ్! ఇప్పుడైనా తెలంగాణ ఎన్నికలలో ఆంధ్రమూలాల వారిలోని టిడిపి అభిమానులను మెప్పించడానికి పిలిచారని కొందరి వ్యాఖ్యానం. మెప్పించాలంటే విచారణ సాంతం ఆపించేయాలి. అది జరుగుతుందా!? గ్రహణం నాడు తనను పట్టుకున్న ఆటవికులను భయపెట్టడానికి విదేశీ అన్వేషి ‘‘నేను మంత్రం వేస్తున్నా, యివాళ రాత్రి మీరు కొలిచే చంద్రుడు మాయమై పోతాడు చూడండి.’’ అంటాడు చూడండి. అలా రేపోమాపో బెయిలు వచ్చి బాబు ఎలాగూ బయటకి వస్తారు కాబట్టి, మా వలననే అది జరిగిందని చెప్పుకోవడానికి యిన్నాళ్లకు పిలిచారేమో తెలియదు.

ఏది ఏమైనా లోకేశ్ తరఫున లాబీయింగ్ చేయడానికి టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన సుజనా చౌదరి వంటి వాళ్లు, వైసిపి రెబల్, టిడిపి ఫేవరబుల్ రఘురామ కృష్ణంరాజు ఉన్నారు. అపాయింట్‌మెంట్ ఫిక్సయిందని తెలిస్తే ఒక పూట వ్యవధిలో దిల్లీ వెళ్లవచ్చు. 11 రాత్రి ఎపాయింట్‌మెంట్ కోసం లోకేశ్ వారాల తరబడి దిల్లీలో ఉండడం అనవసరం. అమిత్ తెలంగాణకు వచ్చినప్పుడే యిచ్చి ఉండవచ్చు. ఏ సాకు చెప్పినా చాలామంది జనాలకు మాత్రం లోకేశ్ ఎస్కేపిస్టని, నాయకత్వ లక్షణాలు లేవనే భావం కలిగింది. ‘టిడిపిలో బాబు ప్రత్యామ్నాయం, లేదా వారసుడు యితనా?’ అనుకుంటే టిడిపి హితైషులకు గుండె గుభేలు మనేట్లు ఉంది.

ఈ సందర్భంలోనే యింకొకటి కూడా వినవస్తోంది. తొమ్మిదేళ్ల పాటు బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించారని, అందుకే ఏ కేసుల్లో యిరుక్కోకుండా నెగ్గుకు వచ్చారని, ఆంధ్రకు ముఖ్యమంత్రి ఐన ఐదేళ్లలో మాత్రం లోకేశ్‌ను పెత్తనం చలాయించనిచ్చి, యిప్పుడీ యిబ్బందుల్లో పడ్డారని అంటున్నారు. స్కాముల్లో ప్రధానపాత్ర వహించిన వారందరూ లోకేశ్ సర్కిల్ వాళ్లేనని, బాబు వద్దని వారిస్తే లోకేశ్ అలిగేవారని, భువనేశ్వరి కలగజేసుకుని భర్తను ఒప్పించేవారని కూడా విజయబాబు అన్నారు. ఇలాటి కబుర్లలో నిజానిజాలు ఎవరికీ తెలియవు. అంతా గ్యాస్ అని కొట్టి పారేయవచ్చు.

కానీ ప్రస్తుత కేసుల్లో కొన్ని సంగతులు చూస్తే ‘ఎంతో అనుభవజ్ఞులైన బాబు యిలా ఎలా చేశారు?’ అనే ఆశ్చర్యం కలగక మానదు. ‘సన్ స్ట్రోక్’ తగిలిన మహామహా భారతీయ రాజకీయ నేతలెందర్నో చూసి ఉన్నాం కాబట్టి లోకేశ్ వలననే బాబు కేసుల్లో యిరుక్కున్నారని అంటే కాబోలు అనుకోవడానికి ఆస్కారం ఉంది. చంద్రబాబు అభిమానులకు లోకేశ్ నచ్చకపోవడానికి యిదొక కారణమౌతోంది. లోకేశ్ తిరిగి వచ్చినా యింటరాగేషన్ అంటూ సిబిఐ ఆఫీసుకి వెళ్లి కూర్చుంటే, పాదయాత్ర ఎలా సాగుతుంది? పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఎలా చేయగలుగుతారు? ప్రతి జిల్లా యూనిట్‌తో సమన్వయం చేసుకుంటూ ఆర్గనైజ్‌డ్‌గా చేయవలసినది రాష్ట్ర అధ్యక్షుడు. ఆయనను డమ్మీ చేశారు.  

కేసులు ముంచుకు వస్తున్నాయని ఆర్నెల్ల క్రితమే ఊహించిన బాబు తను లేనప్పుడు ఎవరు ఏం చేయాలో ఒక కంటిజెన్సీ ప్లానును ముందుగానే సూచించి ఉంటే జైలుకి వెళ్లగానే పార్టీ యిలా అస్తవ్యస్తమయ్యేది కాదు. లోకేశ్ తడబడినా సరిదిద్దడానికి పార్టీ సీనియర్లు ఉండేవారు. దళాల వారీగా సత్యాగ్రహులను పంపడం వంటి కార్యక్రమాలు చేసేవారు. పార్టీకి నాయకుడంటూ లేకుండా పోయారు. బాలకృష్ణ వచ్చి బాబు కుర్చీలో కూర్చుంటే, ఆయనకు ప్రాధాన్యత లేకుండా చేసి, ఓదార్పు యాత్ర ప్రారంభించ నీయలేదు. లోకేశ్ హస్తినలో తిష్ట వేశారు. అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు వంటి లీడర్లు లీడ్ తీసుకోకుండా మాకు బ్రాహ్మణి ఉంది అంటూ తమను తాము పలుచన చేసుకున్నారు. భువనేశ్వరి కానీ, బ్రాహ్మణి కానీ పార్టీ కమిటీలలో లేరు. వారు కుటుంబ సభ్యులు మాత్రమే.

రాజకీయ సంక్షోభం వచ్చినపుడు రాజకీయంగానే ఫైట్ చేయాలి తప్ప, హఠాత్తుగా కుటుంబ సభ్యులను వీధుల్లోకి తీసుకు రావడం బ్యాడ్ ఐడియా. తమిళనాడులో కరుణానిధి పలుమార్లు అరెస్టయినా ఆయన భార్యలు బయటకు రాలేదు. కర్ణాటకలో డికె శివకుమార్ అరెస్టయితే ఆయన భార్య రాలేదు. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోదియా 8 నెలలుగా జైల్లో ఉన్నారు. ఆయన భార్య బయటకు రాలేదు. కుటుంబ సభ్యులు ముందు నుంచీ రాజకీయాల్లో ఉంటే (కరుణానిధికి స్టాలిన్ ఉన్నట్లు) వాళ్లు బయటకు వచ్చి ప్రదర్శనలు చేయవచ్చు. అప్పటికప్పుడు దింపితే పార్టీలో వేరే ఎవర్నీ నమ్మడన్నమాట అనే అర్థం వస్తుంది. జగన్ అదే చేశాడు. తల్లిని, చెల్లిని అప్పటికప్పుడు దింపాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా లోకేశ్ ఉండగానే భార్యను, కోడల్ని దింపుతున్నారు.

కుటుంబ సభ్యులు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు చేయవచ్చు. ఒకటి రెండు ప్రెస్ మీట్‌లు పెట్టి యిది అన్యాయం అనవచ్చు. ప్రదర్శనలు, బస్సు యాత్రలు చేద్దామనుకుంటే మాత్రం పార్టీలో పదవి తీసుకుంటేనే ఔచిత్యం ఉంటుంది. రాజకీయాలనేది సులభంగా పట్టుబడే విద్య కాదు. ఎప్పుడు ఏ మేరకు లౌక్యంగా మాట్లాడాలో తర్ఫీదు పొందాలి. బాబు అరెస్టు తర్వాత భువనేశ్వరి, బ్రహ్మణి గార్ల స్టేటుమెంట్లు చర్చలకు దారి తీశాయి. భువనేశ్వరి గారు జైల్లో దోమల గురించి, చన్నీళ్ల గురించి మాట్లాడడం ఒక గృహిణిగా నప్పుతుంది కానీ అది రాజకీయంగా బాబుకి యిబ్బంది తెచ్చిపెట్టి, వెక్కిరింతలకు గురి చేసింది. లోకేశ్ కూడా దోమల ద్వారా కుట్ర గురించి మాట్లాడారు. ఆ సందర్భంగా డెంగ్యూతో చనిపోయిన ఖైదీ గురించి విచారం వ్యక్తం చేయలేదని, జైల్లోని అనారోగ్య వాతావరణాన్ని సవరించవలసిన అవసరం గురించి మాట్లాడలేదని ఒక విశ్లేషకుడు ఎత్తి చూపించారు.

చంద్రబాబు బయట ఉండి లోకేశ్ లోపల ఉండి ఉంటే, బాబు యిలా మాట్లాడేవారు కాదు. తమ కుటుంబం త్యాగమూర్తుల కుటుంబమని, ప్రజల కోసం దోమల చేతే కాదు, తేళ్ల చేతైనా కుట్టించుకుంటామని, యిక చన్నీళ్ల మాట కొస్తే చైతన్యరథంపై వెళ్లినపుడు రోడ్డు పక్కన నూతి నీళ్లతో స్నానం చేసిన ఎన్టీయార్ స్థాపించిన పార్టీ మాదని... యిలాటివి చెప్పి ఉండేవారు. ఇదీ పొలిటికల్ రెటరిక్. కానీ బాబు కూడా అరెస్టుతో మతి పోగొట్టుకున్నారు. సిఐడి కోర్టు న్యాయమూర్తి మీరేమైనా చెప్పదలిచారా? అని అడిగితే యీయన ‘నేను రెండు తెలుగు రాష్ట్రాలనూ ఎంతో అభివృద్ధి చేశాను..’ అంటూ స్టాక్ స్పీచి మొదలుపెట్టారు. హర్షద్ మెహతా కేసులో యిరుక్కున్నవాటిలో మా బ్యాంకు కూడా ఒకటి. బ్యాంకుకు ఎండీగా చేసినాయన నిందితులలో ఒకడు. ఆయన కోర్టులో ‘నేను బ్యాంకు ఎండీగా ఉండగా తొలి ఓవర్సీస్ బ్రాంచ్ ఓపెన్ చేయించాను, బ్యాంకు టర్నోవర్ యిన్ని రెట్లు పెరగడానికి ప్లాన్లు వేశాను...’ అని చెపుతూంటే న్యాయమూర్తి మొహం చికాగ్గా పెట్టి ‘హూ యీజ్ ఆస్కింగ్ ఆల్ దిస్?’ అని తుంచి పారేశారు. ఈ కేసులో నీ ప్రమేయం గురించి చెప్పు చాలు అని మందలించారు. కోర్టులో విచారణ ప్రారంభమైనపుడు బాబుకి కూడా యిలాటి అనుభవం ఎదురు కావచ్చు. స్కాము గురించి మాట్లాడాలి తప్ప, సైబరాబాదు గురించి గొప్పలెందుకు?

370 కోట్ల కోసం అవినీతి చేయవలసిన అవసరం మాకేముంది అని ఊరుకోకుండా భువనేశ్వరి గారు ‘నేను నడుపుతున్న కంపెనీలో 2శాతం వాటాలు అమ్మితే 400 కోట్లు వస్తాయి.’ అనడం అనవసర ప్రస్తావన. ఏ రాజకీయ నాయకుడూ తను డబ్బున్నవాణ్నని చెప్పుకోడు. మధ్యతరగతి వాణ్ననే బిల్డప్ యిస్తాడు. పేదరికంలోంచి ఎదిగి వచ్చానని, అందుకే బీదవాడి కడుపు ఆకలి తనకు తెలుసునని చెప్పుకుంటాడు. చంద్రబాబు జగన్‌ను దేశంలోనే అత్యధిక ధనిక ముఖ్యమంత్రిగా మాటిమాటికీ అభివర్ణిస్తారు. ‘కూతుళ్లను చూడడానికి కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో వెళ్లాడు, మీరూ నేనూ అలా వెళ్లగలమా, తమ్ముళ్లూ....’ అంటూ యిటీవల మరీమరీ చెప్తున్నారు.

అంతేకానీ, నేను ధనికుడైన మాజీ ముఖ్యమంత్రిని అని చెప్పుకోరు. చెప్తే సామాన్యుడికి ఎలియనేట్ అయిపోతానని, మానసికంగా దూరమై పోతానని చెప్పరు. కానీ భువనేశ్వరి మేం డబ్బున్నవాళ్లం అని చాటుకున్నారు. దాంతో బాటు వైట్‌లో 400 కోట్లు చెక్కు రూపంలో.. అని కూడా అన్నారు. బ్లాక్ మనీ డీలింగు కూడా తెలుసు అనే అర్థం స్ఫురిస్తోంది. బాబు యిరుక్కున్నది యీ ఒక్క స్కామే కాదు, తక్కిన స్కాములన్నీ కలిపితే 370 కోట్ల అంకె దాటి పోతుంది. అప్పుడు ఎంత శాతం షేర్లు అమ్మాలో మళ్లీ చెప్పాల్సి వస్తుంది. ఒక కంపెనీలో వాళ్ల షేర్ల విలువ గురించే ఆవిడ మాట్లాడారు. ఇలాటివి ఎన్ని కంపెనీలున్నాయో పోనుపోను చెప్పేస్తారేమో!

ఇక బ్రాహ్మణికి అరెస్టుకి ముందు దాకా చాలా మంచి యిమేజి ఉంది. ఆమె వర్చస్సు, సౌందర్యం, ఉన్నత విద్య.. యివన్నీ ఆవిడ రంగంలోకి దిగితే లోకేశ్ వెలతెల పోతాడేమో అనిపించేట్లా ఉండేవి. అరెస్టు తర్వాత ఆవిడ మాటతీరు మెచ్చదగినదిగా తోచలేదు. మాటలో దర్పం సంగతి సరే, బాబు దేశానికే ఐటీ తెచ్చారనడం జోక్ అయిపోయింది. ఇక ‘దీనిలో ఏమీ లేదని మా 8 ఏళ్ల అబ్బాయి దేవాన్ష్‌కు కూడా అర్థమై పోయింది...’ అనడం మరీ జోక్ అయిపోయింది. తలపండిపోయిన న్యాయకోవిదులు నలుగురు నెల్లాళ్లగా అన్ని రకాల కోర్టుల్లోనూ న్యాయమూర్తులను కన్విన్స్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారని చూస్తూన్న మనకు యింత సింపుల్‌గా తేల్చేస్తే నవ్వు రాదూ!? మామూలుగా వాళ్ల పరిధిలో వాళ్లుంటే యిలాటి శల్యపరీక్షలు జరగవు. కానీ రాజకీయాల్లోకి వస్తే ప్రతీ మాటను ఈకకు ఈకా, తోకకు తోకా పీకి చూస్తారు. వీటన్నిటి బదులు మౌన ప్రదర్శనలు చేస్తే యింకా ఎఫెక్టివ్‌గా ఉండేది. పక్కవాళ్లు ఎంత అవాకులు, చెవాకులు మాట్లాడినా వీళ్ల ఖాతాలోకి రావు.

సాధ్యమైనంతవరకు కుటుంబాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయకూడదు. ఇంట్లో ఆడవాళ్లను వీధుల్లోకి తెస్తే సింపతీ వస్తుందనుకోవడం సరి కాదు. ఇంటి గడప దాటని యిల్లాళ్లను జగన్ రోడ్డున పడేశాడని కొందరు ఆడవాళ్లు టీవీల్లో శాపనార్థాలు పెడుతున్నారు. ఆంధ్రజ్యోతిలో కూడా యివాళ రాశారు. భువనేశ్వరి, బ్రాహ్మణి యిన్నాళ్లూ అంతఃపురంలో లేరు. పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్న దక్ష మహిళలు వారు. బ్రాహ్మణి అయితే విదేశాల్లో చదువుకుని వచ్చిన ఆధునిక మహిళ. (ఔను, ఒక సందేహం, యిద్దరూ వివాహిత మహిళలే ఐనా హరికృష్ణ కూతుర్ని కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని అంటున్నారు. బాలకృష్ణ కూతుర్ని అక్కడ నారా బ్రాహ్మణి అంటున్నారు. ఆంధ్రలో టిడిపి అంటే నారా వారిదే అని ఎస్టాబ్లిష్ చేయడానికా!?)

ఇక భువనేశ్వరి 1995లో ఎటున్నారో అందరికీ తెలుసు. ఈనాడు భర్తను దోమలు కుడితేనే విలవిల లాడుతున్న ఆమె ఆనాడు తండ్రి పక్షవాతానికి గురై, కనిపెట్టుకుని చూసేవాళ్లు లేక పరితపించినపుడు, సంతానం చేసిన నమ్మకద్రోహానికి హృదయవేదన అనుభవించినప్పుడు ఏం చేశారో అందరికీ గుర్తుంది. ఇన్నాళ్లూ ఆమె హుందాగా, పబ్లిక్‌కి దూరంగా ఉన్నారు కాబట్టి ఎవరూ ఏమీ అనలేదు. (వంశీ మాత్రమే అన్నాడు, క్షమాపణ చెప్పాడు). ఇప్పుడు పబ్లిక్‌లోకి వస్తే పాత విషయాలు తవ్వుతారు. ఎందుకొచ్చిన న్యూసెన్సు యిది?

బ్రాహ్మణికి యిప్పటిదాకా మంచి ఇమేజి ఉంది. ఆవిడ రాజకీయాల్లోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. యువతను ఆకర్షించగల సత్తా ఉన్నట్లే ఉందామెకు. పాలిటిక్స్‌లోకి రాదలచుకుంటే పూర్తి సమచారంతో, ప్రిపేరై రావాలి. జయలలిత పేరెన్నికగన్న హీరోయిన్. కానీ ఆమెను రాజకీయాల్లోకి తెద్దామనుకున్నపుడు ఎమ్జీయార్ ఆమెకు తర్ఫీదు యిప్పించారు. తన ఉపన్యాసాలు రాసే అతన్ని ఆమె వద్దకు పంపించి, ఎలా మాట్లాడాలో నేర్పించారు. బ్రాహ్మణి కూడా అలాటి ట్రైనింగు తీసుకుని రంగంలోకి దిగాలి. మీడియా ప్రశ్నలు వేసినపుడు సరైన జవాబులు చెప్పగలగాలి. ఎన్టీయార్ ఎంతో మేధావి. వాగ్ధాటి కల వ్యక్తి. ‘‘ఈనాడు’’ ఆయనకు ఎంతో యిన్‌పుట్స్ యిచ్చేది. అయినా రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయన ఒక పొరపాటు స్టేటుమెంటు యిచ్చారు. వెంటనే కాంగ్రెసు వాళ్లు ‘దుర్యోధనుడు మయసభలో ప్రవేశించి భంగపడినట్లు, ఎన్టీయార్ రాజకీయాల్లో భంగపడ్డారు’ అని గేలి చేశారు. ఎన్టీయార్‌కే అలా జరిగినపుడు వీళ్లెంత జాగ్రత్తగా ఉండాలి!

చంద్రబాబు అరెస్టు కాగానే వారం లోపున బెయిలు మీద బయటకు వచ్చేస్తారనే అనుకున్నాం. కానీ లాయర్ల స్ట్రాటజీ ఎలా అఘోరించిందంటే వాళ్లు ఎంతసేపూ టెక్నికల్ విషయాలపై మాత్రమే రాపాడిస్తున్నారు. గవర్నరు అనుమతి తీసుకుని ఉండాల్సిందా లేదా అన్న దానిమీదనే చర్చ సాగుతోంది. తీసుకుని ఉండాల్సింది అని చివరకు తేల్చేరనుకోండి. దానివలన ఏం ఒరుగుతుంది? ఇన్నాళ్లుగా బాబు పోగొట్టుకున్న స్వేచ్ఛ తిరిగి వస్తుందా? ప్రభుత్వం సారీ చెప్పి, విడుదల చేసి, అనుమతి తీసుకుని, మళ్లీ అరెస్టు చేస్తే..? అనుమతి తీసుకోవడం అనే ఫార్మాలిటీ పూర్తి చేయనంత మాత్రాన అవినీతి జరగలేదని ఎవరూ క్లెయిమ్ చేయలేరు కదా! అలాగే క్వాష్ పిటిషన్ గురించి కూడా, మొత్తం కేసు కొట్టేయండి అంటే ఏ కోర్టు కొట్టేస్తుంది? విచారణ జరగనీయండి అంటుంది. బెయిలు యిచ్చి, సిబిఐ పిలిచినప్పుడల్లా వెళ్లండి అంటుంది. గవర్నరు అనుమతి, క్వాష్ పిటిషన్ అంటూ లాయర్లు బాబును నెల్లాళ్లకు పైగా జైల్లో కూర్చోబెట్టారు, యిదేమి స్ట్రాటజీయో తెలియదు.

సింపతీ వస్తుందనే జైల్లో కొనసాగిస్తున్నారని చెప్పే కబుర్లు నమ్మడానికి లేదు. అలాటి నమ్మకమే ఉంటే బెయిలు అడిగేవారు కాదు. ప్రభుత్వం క్షమాపణ చెప్పి, కేసు ఎత్తేసి, తనంతట తానే విడుదల చేసే వరకూ జైల్లోనే ఉంటాను అని గాంధీ తరహాలో సత్యాగ్రహం చేసేవారు. కుటుంబం మొత్తం ఏదో కారణం చెప్పి జైల్లో బిచాణా వేసేవారు. బయటకు వచ్చి పరిస్థితి చక్కదిద్దాలని బాబు తపిస్తున్నారు కానీ యిప్పటిదాకా విఫలమయ్యారు. త్వరలోనే బయటకు వస్తారని ఆశిద్దాం. కానీ యీ లోపునే కావలసినంత డామేజి జరిగింది. బాబు లేకపోతే టిడిపిలో ఎవరూ క్రైసిస్‌ను మేనేజ్‌ చేయలేరని నిరూపితమైంది. దీనికి వైసిపి వారు సంతోషించడంలో ఆశ్చర్యం లేదు. బాబును మరింతకాలం ప్రజలకు అందుబాటులో లేకుండా జైల్లోనే ఉంచాలని శతథా ప్రయత్నిస్తారు.

కానీ యీ పరిస్థితిని మిత్రుడు, రాజకీయ భాగస్వామి పవన్ కూడా ఉపయోగించుకుందామని చూస్తున్నారని అనిపిస్తోంది. తెలిసో, తెలియకో తన ప్రసంగాలతో టిడిపి క్యాడర్ మొరేల్ దెబ్బ తీస్తున్నారు, ‘టిడిపికి అనుభవం ఉంది, జనసేనకు పోరాటపటిమ ఉంది’ అంటూ. జనసేనకు అనుభవం లేదన్న విషయం కఠోరవాస్తవం. దాన్ని టిడిపి పోరాటపటిమతో కలిపి చెప్పడంతో దానికి అది లేదన్న విషయం కూడా అంతే నిజం అని పవన్ ఎస్టాబ్లిష్ చేయబోయారు. ఇంత మాట అనే సాహసం చేయడానికి కారణం, బాబు అరెస్టు తర్వాత టిడిపిలో వచ్చిన స్తబ్దత! ఈ మాటలతోనైనా టిడిపి క్యాడర్‌లో ఉక్రోషం వచ్చి, రోడ్డెక్కుతారేమో ననుకుంటే అదీ జరగలేదు. వైసిపిని గద్దె దింపాలని తపించే ఓటర్లకు యిది నిరాశ కలిగించే సంగతి. జగన్‌ను ఢీకొనే మొనగాడు పవన్ మాత్రమే అని వారిలో కొందరైనా అనుకున్నారంటే ఆ మేరకు టిడిపి నష్టపోయినట్లే! బాబు బయటకు రాగానే చేయవలసిన మొదటి పని - బస్సు యాత్ర కాదు, పార్టీ క్రైసిస్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయడం!

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?