త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ వార్తల్లోకి ఎక్కుతున్నాడు – అవేమీ అతని ప్రతిష్ఠ పెంచేవి కావు. తలతిక్క వ్యాఖ్యలు చేయడం అతని అలవాటుగా మారింది. అతనికి ప్రస్తుతం త్రిపురకు బిజెపి ఇన్‌చార్జ్ అయిన సునీల్ దేవ్‌ధర్‌తో అస్సలు పడటం లేదు. మూణ్నెళ్లలోనే వాళ్లకి అంత చెడిందా అని అందరూ ఆశ్చర్యపడేలా తయారైంది వ్యవహారం. సునీల్‌కు విప్లవ్ వ్యవహార శైలి నచ్చటం లేదు. సాధారణ ప్రజల్లో అతను పేరు తెచ్చుకోవాలని, పార్టీ కార్యకర్తల ఆశలని అతను పట్టించుకోవాలనీ ఆశిస్తున్నాడు.
కానీ విప్లవ్ తనను తాను చాలా పెద్ద రాజకీయవేత్తగా అనుకుంటున్నాడు. విప్లవ్ మొదటినుంచి తనను తాను పెద్ద నాయకుడిగా ఫీలయ్యాడు. ముఖ్యమంత్రి కావడానికి ముందే తనకు సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ కల్పించాలని కోరాడు. సునీల్ గిరిజన ప్రాంతాల్లో తిరిగే రోజుల్లో కూడా ఎప్పుడు అలాటి కోరిక కోరలేదు. గద్దె కెక్కాక ఎవర్నీ పట్టించుకోవటం లేదు. సునీల్ తనకు పోటీగా ఎదుగుతాడన్న భయంతో విప్లవ్ ఎన్నికల పోస్టర్లలోంచి, బ్యానర్ల లోంచి సునీల్ ఫోటో తీసివేయమని అడిగాడట. అది జరగలేదు కానీ సునీల్ మాత్రం ఎన్నికలయ్యాక 'దేవ్ పార్టీకి పరిమితమై త్రిపుర రాజకుటుంబానికి చెందిన, గిరిజనులకు ఆత్మీయుడైన జిష్ణు దేవ్ బర్మన్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే మంచిది' అన్నాడు. విప్లవ్ ఒప్పుకోలేదు. చివరకు బర్మన్‌కు ఉపముఖ్యమంత్రి పదవి యిచ్చి రాజీ కుదిర్చారు.
కానీ ఉపముఖ్యమంత్రికి ఎక్కువ అధికారాలు యిస్తే తనకు పోటీగా ఎదుగుతాడన్న భయం విప్లవ్‌కుంది. అందువలన అతనికి ఫైనాన్సు, విద్యుత్ మంత్రిత్వ శాఖలు యిచ్చి సరిపెట్టాడు. తనకు యిష్టం లేకపోయినా తృణమూల్ నుంచి తీసుకు రాబడిన సుదీప్ బర్మన్‌కు ఆరోగ్యశాఖ యిచ్చాడు. హోం, పిడబ్ల్యుడి వంటి కీలకమైన శాఖలన్నీ తన వద్దే పెట్టుకున్నాడు. ఇవన్నీ సరే, తనేమి అవాకులు, చెవాకులు మాట్లాడినా ఎవరూ దాన్ని విమర్శించకూడదనే అభిప్రాయంలో ఉన్నాడు.
సంజయుడి స్కైప్ – పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కంప్యూటరైజేషన్ చేస్తున్న ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నాయన్నాడు. సంకుచిత బుద్ధి ఉన్నవాళ్లు మాత్రమే దాన్ని ఒప్పుకోరన్నాడు. అందరూ వెక్కిరించారు. ఆరెస్సెస్ భావజాలమున్న త్రిపుర గవర్నరు తథాగత రాయ్ విప్లవ్‌ను వెనకేసుకుని వచ్చి ఇంటర్నెట్, శాటిలైట్ లేకపోతే సంజయుడు కురుక్షేత్రంలో జరిగేది ధృతరాష్ట్రుడికి ఎలా చెప్పగలిగాడు? అని ప్రశ్నించాడు.
పూర్వకాలంలో కొందరు ఋషులకు దివ్యదృష్టి, క్షణాల్లో అనుకున్నచోటకి మనోవేగంతో వెళ్లగలిగే దివ్యశక్తి ఉండేదని పురాణాల్లో రాశారు. కానీ యీ రోజు ఏ దివ్యశక్తి లేకపోయినా అతి సామాన్యుడు కూడా యింటర్నెట్ వాడగలుగుతున్నాడు. దానికీ దీనికీ పోలికేమిటి? అప్పట్లో ఇంటర్నెట్టే ఉండేమాటైతే ధృతరాష్ట్రుడు సంజయుణ్నే ఎందుకు నియమించుకోవాలి? ఏ పనివాడినైనా 'నెట్‌లో ఏమొస్తోందో చూసి చెప్పరా' అనవచ్చుగా! 47 ఏళ్ల ఒక యువముఖ్యమంత్రి ఒక టెక్నాలజీ సమావేశంలో యిలా మాట్లాడితే నవ్వులపాలు కాడా?
ఠాగూర్‌నూ వదలలేదు – తర్వాత యింకో సందర్భంలో రచ్చబండ దగ్గర ఊసులాడే పద్ధతిలో 'మల్టీనేషనల్ మార్కెటింగ్ మాఫియా తమ సౌందర్య ఉత్పాదనల మార్కెట్ యిండియాలో పెంచుకోవడానికి మనవాళ్లకు వరుసగా మిస్ వ(ర)ల్డ్, మిస్ యూనివర్స్ బిరుదులు యిచ్చేశారు. లేకపోతే 1997లో డయానా హేడెన్ లాటి మామూలు అమ్మాయికి ఆ బిరుదు రావడమేమిటి? 1994లో ఐశ్వర్య రైకి యిచ్చారంటే అర్థముంది, ఆమె భారతీయ వనితాసౌందర్యానికి ప్రతీక.
ఇండియన్ బ్యూటీ అంటే లక్ష్మీ సరస్వతుల్లా ఉండాలి. కానీ హేడెన్ లాటిది ఆ బిరుదుకు తగదు. ఒక పథకంలో భాగంగా ఆమెకు వచ్చింది. మన ఇండియన్ మార్కెట్ శాచ్యురేట్ అయిపోయాక యిక యివ్వడం మానేశారు. అందుకే మళ్లీ ఏ ఎవార్డూ రాలేదు' అన్నాడు. కితం ఏడాదే మానుషి చిల్లర్‌కు వచ్చిందన్న సంగతి అతనికి ఎవరూ చెప్పలేదు పాపం. ఈ వ్యాఖ్యతో డయానా మండిపడింది. నాకు తెల్లతోలు లేకపోయినా నేనేమీ చింతించటం లేదు అని.
బిజెపి ఉత్తరాది నాయకులు దక్షిణాది వాళ్లను కించపరచడం రివాజు అయిపోయిందని అందరూ గుర్తు చేసుకున్నారు. డయానా విషయంలో ఆమె దక్షిణాదిది, క్రైస్తవురాలు, ఆంగ్లో-ఇండియన్. బిజెపిలో ఉంటూ ఆమె అందానికి వంకలు పెట్టడంలో ఉన్న ప్రమాదం అర్థమైనట్లుంది. క్షమాపణ చెప్పుకున్నాడు. రవీంద్ర నాథ్ ఠాగూరు తనకు వచ్చిన నోబెల్ బహుమతిని తిరిగి యిచ్చేశాడని మరోసారి వాక్రుచ్చాడు. ఇంగ్లీషు వాళ్లపై కోపంతో ఆయన తిరిగి యిచ్చినది వాళ్లిచ్చిన 'సర్' బిరుదాన్ని, స్వీడన్ వాళ్లిచ్చిన నోబెల్‌ను కాదు.
గొడ్లు కాసుకోండి – మరోసారి మాట్లాడుతూ తన జాగ్రఫీ పరిజ్ఞానాన్ని ప్రదర్శించాడు. గోమతి నది పక్కన ఉన్న ఛాబిమురా గుహలోని శిల్పాలను పర్యాటకకేంద్రంగా చేసి 'ఆఫ్రికా'లోని అమెజాన్ నదీ బేసిన్ స్థాయికి తీసుకెళతానన్నాడు! ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉపన్యాసాలు రాయించుకునేటప్పుడు సరైన వ్యక్తిని పెట్టుకోవాలి. వాళ్లేం రాసినా యితను సొంత తెలివితేటలు ఉపయోగిస్తాడు లాగుంది. ఈ మధ్య సివిల్ ఇంజనియర్ల కాన్ఫరెన్సులో మాట్లాడుతూ 'సివిల్ సర్వీసెస్‌ల్లోకి వెళ్లడానికి మెకానికల్ ఇంజనియర్ల కంటె సివిల్ యింజనియర్లకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి' అని మెచ్చుకున్నాడు.
త్రిపురలో కమ్యూనిస్టు ప్రభుత్వం కుప్పకూలడంలో యువత ముఖ్యభూమిక నిర్వహించారు. దేశంలోనే అత్యధికంగా త్రిపురలో 19.7% నిరుద్యోగ సమస్య ఉంది. తమకు ఉద్యోగాలు కల్పించడంలో కమ్యూనిస్టు పార్టీ ఛాందసంగా వ్యవహరిస్తోందని, కేంద్రంతో పేచీ పెట్టుకుని పారిశ్రామికవేత్తలెవరూ యిటు రాకుండా చేస్తోందని, అందుకే తాము బెంగుళూరు, హైదరాబాదు వంటి దూరప్రదేశాలకు ఉద్యోగాలకు వెళ్లవలసి వస్తోందని వారి ఆవేదన. వాళ్ల నాడి గ్రహించిన బిజెపి తాము అధికారంలోకి వస్తే ఐటీ దిగ్గజాలను రప్పించి, ఐటీ పార్కులు పెట్టించి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానాలు కురిపించి వాళ్లను ఆకట్టుకుంది.
అలాంటి తరుణంలో యీ ముఖ్యమంత్రి త్రిపుర వెటర్నరీ కౌన్సిల్ సమావేశంలో నిరుద్యోగ యువకులను ఉద్దేశించి 'మీరు ఉద్యోగాల గురించి వెతుక్కోవడం కంటె ఆవుల్ని పెంచండి. ప్రతీ యింట్లో ఒక ఆవు ఉండాలి. పాలు యిప్పుడు లీటరు రూ.50 అమ్ముతోంది. పట్టభద్రుడు పదేళ్లపాటు ఉద్యోగం కోసి వెతికి వేసారే కంటే పాలు అమ్ముకుంటే ఆ పదేళ్లలో రూ.10 లక్షలు వెనకేసుకోగలుగుతాడు. లేదా కిళ్లీ కొట్లు, పాన్ డబ్బాలు పెట్టుకోండి. అతి త్వరలో మీ బ్యాంకు బాలన్స్ రూ.5 లక్షలవుతుంది' అని సలహా యిచ్చాడు. ఇది వాళ్లను ఎంత మండిస్తుందో ఊహించండి.
హత్తెరీ, లైక్ కొడతావా? – సోషల్ మీడియా అతి చురుగ్గా ఉన్న యీ రోజుల్లో యిలాటివి వదిలిపెడతారా? ఏకిఏకి వదిలిపెడుతున్నారు. అలాటి వ్యాఖ్యలను సునీల్ దేవ్‌ధర్ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి లైక్‌లు కొట్టాడని, అతని అనుచరులే తన గురించి ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్నారనీ విప్లవ్ అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు – '…తోటికోడలు నవ్విందని..' అనే సామెత గుర్తుకు తెస్తూ! 'నేనీ మధ్య నా ఫేస్‌బుక్ ఎక్కవుంట్ చూడటమే లేదు.' అంటాడు సునీల్. 2016లో విప్లవ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా సిఫార్సు చేసినది సునీలే. ఎన్నికలయ్యాక 'బిజెపి నియమాల ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్ష పదవి నిర్వహించడానికి వీలు లేదు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న విప్లవ్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అతని స్థానంలో వేరేవారిని అధ్యక్షుణ్ని వేయండి' అన్నాడు సునీల్ అధిష్టానంతో. అయితే విప్లవ్ 'నేను చెప్పినవాణ్ని నియమిస్తేనే పదవి వదులుతా' అంటున్నాడు. సునీల్ యిప్పటికే తనకు వ్యతిరేక కూటమి నడుపుతున్నాడనీ, రాష్ట్ర అధ్యక్షుడు అతని మనిషైతే యిక పార్టీ తన చెప్పుచేతల్లో ఉండదనీ విప్లవ్ భయం. అధిష్టానం ఏమీ చేయకుండా కూర్చుంది. 'నేను చెప్పినట్లు సాగటం లేదు కాబట్టి నన్ను యిన్‌చార్జిగా తప్పించేయండి' అని సునీల్ వెళ్లి అమిత్ షాని కోరాడు. కర్ణాటక ఎన్నికల తర్వాత చూద్దాం అని అమిత్ వాయిదా వేశాడు. వీళ్లిద్దరి మధ్య తగాదా తీర్చమని మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా ఉన్న రామ్ మాధవ్‌ను అడుగుదామంటే అతను కర్ణాటక ఎన్నికలలో హైదరాబాదు-కర్ణాటక ప్రాంతానికి పరిశీలకుడిగా బిజీగా ఉన్నాడు. పైగా కశ్మీరు, ఆంధ్ర కూడా అతన్నే చూడమంటున్నారు.
మూర్తి చిన్నది, కీర్తి పెద్దది – బిజెపి అధిష్టానానికి యిదంతా యిబ్బందికరంగా ఉంది. ఎందుకంటే త్రిపురలో వాళ్లు సాధించినది అపూర్వ విజయం, చరిత్రలో నిలిచిపోయే గెలుపు, ముఖాముఖీ పోరాటంలో కమ్యూనిస్టులను మట్టి కరిపించిన విజయం. రైటాఫ్ చేసేసుకున్న ప్రాంతాల్లో సైతం అంకితభావంతో, అకుంఠిత దీక్షతో ఒక బృందం పనిచేస్తే చరిత్రను ఎలా తిరగరాయవచ్చో, అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేయవచ్చో అన్ని రాజకీయ పార్టీలకు సిలబస్‌గా ఉండదగిన ప్రయోగం. అక్కడి విజయానికి బిజెపి మూడేళ్లగా వ్యూహాలు రచించింది. 8 జిల్లాల చిన్న రాష్ట్రం. జనాభా 38 లక్షలు (హైదరాబాదులో సగం కంటె తక్కువన్నమాట), ఓటర్లు 23 లక్షలు.
హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ కంటె చిన్న వ్యవహారం. అయినా 20 ఏళ్లగా కమ్యూనిస్టులు పాలిస్తున్న కుటీరం కాబట్టి, వాళ్లకు ఆ కుటీరం కూడా లేకుండా చేయాలనే పట్టుదలతో విపరీతంగా శ్రమించి, మూడేళ్లలో 52 మంది కేంద్రమంత్రులు సందర్శించి, ఎట్టకేలకు బిజెపి ప్రభుత్వాన్ని అక్కడ కూర్చోబెట్టారు. దిగిపోయిన సిపిఎం ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌కు పెద్దమనిషిగా, వివాదరహితుడిగా అందరూ గౌరవమిస్తారు. అతని స్థానంలో వచ్చిన వ్యక్తి అంత హుందాగా లేకపోయినా, కాస్తయినా తెలివిగా, మర్యాదగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆశించడంలో తప్పు లేదు.
ఇతను అధికారంలోకి వస్తూనే రాష్ట్రంలో లెనిన్ విగ్రహాలు బద్దలయ్యాయి. వీధులకు పెట్టిన కమ్యూనిస్టు నాయకుల పేర్లు మార్చేస్తామన్నారు. దీనికి యితర రాష్ట్రాల్లో ప్రతిస్పందన వచ్చింది. ముఖ్యమంత్రి సంయమనంతో వ్యవహరించి యిటువంటివి అదుపు చేయకపోతే ఎలా? పైగా బొత్తిగా వచ్చిన రెండు నెలల్లోనే హేళనకు గురయ్యేలా ప్రవర్తిస్తే ఎలా అని అధిష్టానం బాధ. ముఖ్యంగా సునీల్‌తో సరిగ్గా వ్యవహరించకపోతే ఎలా అని వ్యథ.
సునీల్ దేవ్‌ధర్ గురించి, అతని త్రిపురావిజయం పూర్తిగా చెప్పకపోతే బిజెపి అధిష్టానం ఆవేదన అర్థం కాదు. అతను పుణెలో 1965లో పుట్టాడు. 20 ఏళ్ల వయసులో ఆరెస్సెస్ ప్రచారక్‌గా చేరాడు. 'మై హోమ్ ఇండియా' అనే పేర ఒక సామాజిక సంస్థ నిర్వహిస్తూ దేశాంతరాలు పట్టిపోయిన పిల్లలకు ఆశ్రయం కల్పిస్తాడు. 1990ల్లో 8 ఏళ్ల పాటు మేఘాలయలో పని చేశాడు. 2005లో బిజెపిలో చేరాడు. 2011లో నితిన్ గడ్కరీ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నపుడు ఈశాన్య రాష్ట్రాల బిజెపి ఇన్‌చార్జిగా ఉన్నాడు. 2013లో గుజరాత్‌లో దాహోద్ జిల్లాలో పార్టీ వీక్‌గా ఉంటే అమిత్ అతన్ని అక్కడ వినియోగించుకున్నాడు. 2014లో మోదీ వారణాశి నుంచి పోటీ చేసినపుడు ప్రచార బాధ్యత అప్పగించాడు. త్రిపురలోనూ పార్టీని గెలిపించు' అని అమిత్, మోదీ సునీల్‌కు ఆ పని అప్పచెప్పారు.
త్రిపుర నేపథ్యం – అప్పుడతను త్రిపుర వ్యవహారాలను పూర్తిగా అధ్యయనం చేశాడు. అది అతి చిన్న రాష్ట్రం. 10 వేల చ.కి.మీ. వైశాల్యం. ఉత్తరాన బంగ్లాదేశ్ ఉంది. శతాబ్దాలపాటు అది త్రిపురీ వంశీకుల పాలనలో ఉండేది. బ్రిటిషు పాలనలో అది ఒక సంస్థానం. 1949లో భారత యూనియన్‌లో చేరింది. ఈలోగా 1947లో దేశవిభజన సమయంలో దానికి ఉత్తరాన ఉన్న తూర్పు బెంగాల్ నుంచి బెంగాలీ హిందూ శరణార్థులు వచ్చిపడ్డారు. క్రమేపీ వారి జనాభా 69% అయింది.
వారి కారణంగా త్రిపుర అధికార భాష బెంగాలీ అయింది. వారి కారణంగా ఎప్పణ్నుంచో అక్కడే నివాసముంటున్న త్రిపురవాసుల జనాభా 31% అయింది. వారి భాష వేరే. దాంతో యిద్దరి మధ్య ఘర్షణ వచ్చింది. వాటిని నివారించడానికి గిరిజన కౌన్సిల్ ఏర్పరచి దానికి స్వయం ప్రతిపత్తి కలిగించారు. త్రిపురకు ఎటు చూసినా పర్వతాలే. సగం ప్రాంతం అరణ్యాలే. దానిలో వెదురు, పేము పొదలుంటాయి. దేశంతో కలపడానికి ఒకే ఒక్క నేషనల్ హైవే 8 ఉంది. వ్యవసాయం వర్షాధారం. పరిశ్రమలు రావడానికి అవకాశాలు లేవు. ఆహార ధాన్యాల కొరత ఉంది. ప్రజలు ఆర్థికంగా బలవంతులు కారు. వ్యాపారాలకు అవకాశాలు తక్కువ. ప్రయివేటు ఉద్యోగాలు కూడా తక్కువే. అందుకే జనాల్లో చాలామంది బీదవారే. కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వమూ త్రిపురకు అనుకూలంగా లేకపోవడం చేత నిధులు పెద్దగా రాలేదు. పర్వతాల కారణంగా కమ్యూనికేషన్స్, యిన్‌ఫ్రాస్ట్రక్చర్ యిబ్బందికరం. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]