తన వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, మరోసారి కర్నాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఇంట్లో వండిన ఆహారాన్ని, అవి తినడానికి కావాల్సిన పాత్రల్ని, చదువుకోవడానికి కొన్ని పుస్తకాల్ని జైలులోకి అనుమతించాలని కోరాడు.
నిజానికి ఇవి పొందే హక్కు దర్శన్ కు ఉంది. కోర్టు గతంలోనే ఈ వెసులుబాటు కల్పించింది. అయితే బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులు మాత్రం తనకు సౌకర్యాలు అందకుండా అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, దర్శన్ తన పిటిషన్ లో ఆరోపించాడు.
ఆహారం, పుస్తకాలతో పాటు.. నిద్రపోవడానికి బెడ్ రోల్ ను కూడా ఇంటి నుంచి తెప్పించుకునే సౌకర్యం కల్పించాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ పిటిషన్ ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు.
మరింత బిగుసుకున్న కేసు..
మరోవైపు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగళూరు పోలీసులు, అత్యంత వేగంగా సాక్ష్యాలు సేకరించారు. టెక్నికల్ ఆధారాలతో పాటు, ఫిజికల్ సాక్ష్యాల్ని సేకరించారు. దర్శన్ కు వ్యతిరేకంగా దాదాపు 200 సాక్ష్యాల్ని పోలీసులు సేకరించినట్టు వార్తలొస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే, దర్శన్ ఈ కేసులో పూర్తిస్థాయిలో కూరుకుపోయినట్టే.
మరోవైపు ఈ కేసులో అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ నివేదిక హైదరాబాద్ నుంచి బెంగళూరు పోలీసుల చేతికి చేరింది. హత్య జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన వేలిముద్రల్లో 10 మంది నిందితుల వేలిముద్రలు సరిపోలినట్టు నివేదిక వచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఆ వేలిముద్రల్లో దర్శన్, పవిత్ర వేలిముద్రలు ఉన్నాయా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఈ కేసుకు సంబంధించి దర్శన్, పవిత్రతో పాటు చాలామంది నిందితులు ఇతరుల పేర్ల మీద సిమ్ కార్డులు పొంది వాటిని ఉపయోగించారు. ఆ సిమ్ కార్డుల్ని కూడా పోలీసులు ఛేదించారు. అందరికీ నోటీసులిచ్చి వాళ్ల నుంచి స్టేట్ మెంట్స్ కూడా తీసుకున్నారు. దర్శన్ రిమాండ్ గడువు 18వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.