సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ వ్యవహారశైలి కాస్త భిన్నంగా ఉంటుంది. చెప్పిన తేదీ నుంచి వాయిదా వేయడం ఈ బ్యానర్ లో తరచుగా జరుగుతుంటుంది. అయితే తొలిసారి ఈ నిర్మాణ సంస్థ నుంచి చెప్పిన తేదీ కంటే ముందే సినిమా రిలీజ్ అవుతోంది. అదే లక్కీ భాస్కర్.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. లెక్కప్రకారం ఆ తేదీకి ఓజీ రావాలి. కానీ పవన్ సినిమా వాయిదా పడ్డంతో వెంటనే, ఆ తేదీని వీళ్లు ప్రకటించేసుకున్నారు.
అయితే ఇప్పుడా తేదీ కంటే ముందే లక్కీ భాస్కర్ సినిమా వస్తోంది. సెప్టెంబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. ఈ బ్యానర్ పై చెప్పిన తేదీ కంటే ముందొస్తున్న సినిమా బహుశా ఇదేనేమో.
ఆదికేశవ, టిల్లూ స్క్వేర్, గ్యాంగ్స్ ఆప్ గోదావరి.. ఇలా ఈమధ్య కాలంలో ‘సితార’ నుంచి వచ్చిన ప్రతి సినిమా వాయిదా పడింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయితే వాయిదాల్లో రికార్డులు సృష్టించింది. అలాంటి బ్యానర్ నుంచి లక్కీ భాస్కర్ సినిమా చెప్పిన తేదీ కంటే 3 వారాల ముందే థియేటర్లలోకి వస్తుండడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. న్యూమరాలజీ ప్రకారం డేట్ బాగుందని ఫిక్స్ అయ్యారా లేక తొందరగా కాపీ రెడీ అయిందని ఈ నిర్ణయం తీసుకున్నారా..?