Advertisement


Home > Movies - Interviews
ప్రేక్షకుడి ఊహకు అందని సినిమాలు తీయాలి

మారుతి..ఈ పేరు చిన్నపాటి సంచలనం..టాలీవుడ్ లో చిన్నగా సినిమాలు తీసి, పెద్దగా హిట్ లు కొట్టేయవచ్చని, ఎందరికో ఆశలు కల్పించిన పేరు. ఎవరు ఏమనుకుంటేనేం. వీలయినంత మంది కొత్తవాళ్లని ప్రోత్సహించాలనుకునే పేరు. నిన్న బూతులు వినిపిస్తేనేం, నేను నీట్ గా సినిమాలు తీయాలని తపన పడుతున్న పేరు. అలాంటి పేరు సాధించిన దర్శకుడి మారుతి తాజా చిత్రం..భలే భలే మగాడివోయ్..మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయనతో మాటా మంతీ.

దర్శకుడి మారుతి సినిమా అంటే ఇదీ..అని ప్రేక్షకులు విధంగా అయిడెంటిఫై చేసుకోవాలి?

అస్సలు చేసుకోకూడదు. సినిమా సినిమాకు జోనర్ మారిపోవాలి. రాజమౌళి చూడండి. ఈగ తీస్తాడనుకున్నారా..మర్యాదరామన్న చేస్తాడనుకున్నారా..అలా సినిమా సినిమాకు జనాల ఊహకు అందకుండా వెళ్లాలి. ఈడి సినిమా అంటే ఏదో చేస్తాడు..చూడాలి అనుకోవాలి. అప్పుడే హైప్ వస్తుంది. అదే నా ఆశ.

కొత్త జంట క్లీన్..భలే భలే మగాడివోయ్ క్లీన్ యు...ఈ రోజుల్లో, బస్ స్టాప్ చూపించిన మారుతి సినిమాలేనా? ఇలాగే ముందుకు వెళ్తారా..వెనక్కు వెళ్లే అవకాశం వుందా?

వెనక్క వెళ్లమన్నా వెళ్లను. సినిమాల్లోనే కాదు, జీవితంలో కూడా. క్లీన్, ఎంటర్ టైన్ మెంట్ సినిమాలే వస్తాయి నా నుంచి. చేస్తున్న బ్యానర్ లు కూడా అలాంటివే. దిల్ రాజు గారి బ్యానర్లో కొత్త హీరో చేతన్, నూకరాజు, కృతిక, తేజు లతో చేసే సినిమా కథ ఇస్తూ సంయుక్తంగా నిర్మిస్తున్నాం, గీతా ఆర్ట్స్ లో ఓ యంగ్ హీరోతో సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాం. అన్నీ ఆయా బ్యానర్ ల పేరు నిలబెట్టేవే. భలే భలే మగాడివోయ్ కూడా అంతే. యువి క్రియేషన్స్ బ్యానర్ పేరు నిలబెట్టే సినిమానే. 

మీ సినిమాల కన్నా మీ మారుతి ప్రెజెంట్స్ సినిమాలే మరీ ఇబ్బంది పెట్టాయేమో?

కావచ్చు..కాకపోవచ్చు..అయినా ఆ కమిట్ మెంట్లు అన్నీ అయిపోయాయి. ఇంక ఒక్క సినిమా మాత్రమే వుంది. దానికి నేనే కథ, స్క్రీన్ ప్లే ఇచ్చాను. సంపూతో పాటు ముగ్గురు కొత్త కుర్రాళ్లు నటించే సినిమా. ఆ తరువాత ఇంక ఎవరికీ మారుతి ప్రెజెంట్స్ అని ఇవ్వను. 

పెద్ద హీరోలతో సినిమా ప్రయత్నాలు చేసినట్లున్నారు?

పెద్ద హీరోలని కాదు, నా దగ్గరున్న కథలకు సూటయ్యే హీరోలు. అన్నీ ఒక్కొక్కటిగా మెటీరియలైజ్ అవుతాయి.

మంత్రి గంటా కొడుకుతో సినిమా చేస్తారని...?

చేయాలి. కానీ ఇంకా సబ్జెక్ట్ ఫైనల్ కావాలి. అతను రెడీ కావాలి. కాస్త టైమ్ పట్టొచ్చు.

నానితో సినిమా చేయడం ఎలా వుంది?

నానితో చేయడం..చాలా హ్యాపీ. చాలా బరువు తగ్గించాడు. అంతకు ముందు నేను అనుకున్నది అనుకన్నట్లు వస్తుందా రాదా అని తపన పడేవాడిని. కొత్త వాళ్ల దగ్గర నుంచి నటన రాబట్టడానికి చాలా కష్టం పడేవాడిని. ఇప్పుడు చాలా బరువు అంతా తగ్గింది. 

భలేభలే మగాడివోయ్ నానికి ఏవిధంగా స్పెషల్?

తెలుగు స్క్రీన్ పై ఏ హీరో కూడా మతిమరుపు అన్న క్యారెక్టర్ చేయలేదు. ప్రతి ఒక్కరికి మతిమరుపు అనే సమస్య చిన్నదో పెద్దతో వుంటుంది. కానీ  సినిమా కాబట్టి డోస్ ఎక్కువ. కథేమీ కాంప్లికేటెడ్ గా వుండదు. సింపుల్ గా వుంటుంది. సరదాగా సాగిపోతుంది. 

సినిమా లుక్ కలర్ ఫుల్ గా, కాంటెంపరరీగా కనిపిస్తోంది.

అదంతా కెమేరామెన్ చేసింది. కథ చెప్పగానే, దీనికి ఈ కలర్ స్కీమ్, ఈ టైపు పిక్చరైజేషన్ అంటూ తనే చాలా సలహాలు ఇచ్చి, సాయం చేసాడు. 

ఈ సినిమాకు పంపిణీ హక్కులు కూడా కొన్ని ఏరియాలకు తీసుకున్నట్లున్నారు..కాన్ఫిడెన్సా..కాంట్ బట్ నా?

నూటకి నూరు శాతం కాన్ఫిడెన్సే. ఎందుకంటే ఇక్కడ ముగ్గురున్నారు. అల్లు అరవింద్..యువి వంశీ, బన్నీ వాసు. వీరిని ఎక్సయిట్ మెంట్ కు గురిచేయడం చాలా కష్టం. మనం ఎంత గొప్పగా చెప్పినా. వీళ్లను నచ్చింపచేస్తే సగం సినిమా హిట్ కొట్టేసినట్లే. ఇప్పుడు ఈ సినిమా వీళ్లకు బాగా అంటే బాగా నచ్చేసింది. అందుకే ఆ కాన్ఫిడెంట్ గా ముందుకు అడుగేసా. 

మీరు చాలా వరకు బడ్జెట్ లో వెళ్తారు..కానీ ఈ సినిమా తీసింది రెండు పెద్ద సంస్థలు..ఏ రేంజ్ లో ఖర్చు చేసారు?

సంస్థలు పెద్దవి అన్న పాయింట్ కన్నా మంచి సినిమాలు తీసే సంస్థలు. ఈ సంస్థలు చిన్న, పెద్ద, మీడియం అన్ని సినిమాలు చేస్తున్నాయి. ఈ సబ్జెక్ట్ కు ఎంత కావాలో, ఎంత బిజినెస్ చేయగలమో, అంతా ఖర్చుచేసారు.

మీ నుంచి ఓ భారీ సినిమా ఎప్పుడు వస్తుంది?

అలాంటి కథ రాసుకోవాలి. దానికి తగ్గ స్టార్ కాస్ట్ ను చూసుకోవాలి. కానీ నా వరకు నేను సేఫ్ జోన్ లో ప్రయాణించడానికే ఇష్టపడతాను. 

ఆల్ ది బెస్ట్

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి