90 యేళ్ల వయసులోని ఒక వృద్ధ నటుడిని ప్రధాన పాత్రలో పెట్టి, అది కూడా యాక్టివ్ రోల్ లో చూపుతూ ఒక సినిమాను రూపొందించిన వైనం.. 'ది మ్యూల్' సినిమా చూస్తున్నప్పుడు, చూశాకా… ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. క్లింట్ ఈస్ట్ వుడ్ కు వయసుకు తగ్గ పాత్ర దొరికిందా, లేక ఆ పాత్రను చేయడానికే ఈస్ట్ వుడ్ వృద్ధుడయ్యాడా.. అనే సంభ్రమాశ్చర్యం కలుగుతుంది, ఆ మహానటుడి కార్యదక్షత కూడా ఈ సినిమాతో ఆదర్శవంతం అవుతుంది. ఈ నటుడు ప్రపంచ సినిమాపై ఎప్పుడో చెరగని ముద్రను వేశాడు. 90 యేళ్ల వయసులో ఆయన నటించినా, నటించకపోయినా ఆయన ముద్ర చెరిగిపోదు. చాలా మంది నటులు వయసు మీద పడ్డాకా కూడా తెర మీద కనిపిస్తూ విసిగిస్తుంటారు. అయితే 90 యేళ్ల వయసులో కూడా తెర మీద మ్యాజిక్ చేయగల అపూర్వమైన శక్తి తనకు ఉందని ఈస్ట్ వుడ్ 'ది మ్యూల్' తో చాటుకున్నాడు. ఈ వయసులో ఆయన చేసిన పాత్ర నేపథ్యమే.. బిగ్గెస్ట్ సర్ ప్రైజ్.
డ్రగ్స్ వ్యాపారులు 'మ్యూల్' గా వ్యహరించుకునే డ్రగ్స్ ట్రాన్స్ ఫార్మర్ పాత్రలో ఆ వృద్ధుడు కనిపించడం తిరుగులేని వినోదాన్ని అందిస్తుంది. ఆ వృద్ధుడు డ్రగ్స్ ను ముఠా చెప్పిన చోటకు చేరుస్తూ.. వాళ్లను ఎంత సంతోషపెడతాడో, మంచినీళ్ల ప్రాయంగా ఆ పాత్ర ఆ పని చేసే తీరు ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని ఇస్తుంది. అతడు చేస్తున్నది తప్పు, చీకటి వ్యాపారంలో భాగస్వామి అవుతున్నాడనే విషయం పదే పదే గుర్తుకు వస్తున్నా.. అతడు పోలీసులకు దొరకకూడదు, దొరకకుండానే సినిమా ముగిస్తే.. ఎంత బాగుంటుందో అనే ఫీలింగ్ సినిమా చూస్తున్నంత సేపూ కలుగుతుంది ప్రేక్షకుడికి. ఆ తరహా సానుభూతి అతడిపై వచ్చేలా కథాంశాన్ని రాసుకోవడం, సినిమా ఆసాంతం సరదా సరదాగా సాగిపోవడం.. 'ది మ్యూల్' ను మంచి ఎంటర్ టైనర్ గా నిలిపింది.
న్యూయార్ట్ టైమ్స్ లో ప్రచురితం అయిన ఒక క్రైమ్ ఆర్టికల్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. డ్రగ్ మ్యూల్ గా మారిన ఒక వృద్ధుడైన మాజీ సైనికుడి కథ ఇది. సెకెండ్ వరల్డ్ వార్ లో అమెరికా తరఫున పోరాడిన ఎర్ల్ స్టోన్ అనే వృద్ధుడు చాలా కాలం పాటు హార్టికల్చరిస్ట్ గా పని చేస్తాడు. పూల మొక్కలు పెంచుతూ, ఫంక్షన్లకు వాటిని సరఫరా చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. జీవితాన్ని తిరుగుతూ ఆస్వాధించాలనే తత్వం ఎర్ల్ ది. దీంతో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటాడు. ఆర్థిక అవసరాలను తీర్చక, అటు అవసరమైన సందర్భాల్లోనూ కుటుంబంతో ఉండక వారికి పూర్తిగా దూరం అయి ఉంటాడు ఎర్ల్. దీంతో భార్య ఎప్పుడో విడాకులు ఇచ్చి ఉంటుంది. కూతురు ఆయనతో మాట్లాడమే మానేసి ఉంటుంది. మనవరాలు మాత్రం తన తాతను అమితంగా ప్రేమిస్తూ ఉంటుంది.
మనవరాలికి మాత్రం వీలైనప్పుడు సమయాన్ని కేటాయిస్తూ ఆమెతో సన్నిహితంగా ఉంటాడు ఎర్ల్. మనవరాలి ఎంగేజ్ మెంట్ కు వెళితే.. అక్కడ మాజీ భార్య, కూతురు.. ఎర్ల్ తో గొడవ పెట్టుకుంటారు. దీంతో వారి తీరుతో విసిగిపోయి అక్కడ నుంచి వెళ్లిపోతున్న ఎర్ల్ ను ఫంక్షన్ కు వచ్చిన ఒక యువకుడు పలకరిస్తాడు. తను అమెరికాలో 49 రాష్ట్రాలనూ సందర్శించినట్టుగా ఎర్ల్ తన గురించి చెప్పుకుంటాడు. తనకు తెలిసిన వారికి ఒక డ్రైవర్ అవసరమని, కేవలం వారిచ్చే లగేజ్ ను డెలివరీ చేస్తే చాలని ఆ యువకుడు చెబుతాడు. వారి అడ్రస్ ఇస్తాడు. ఈ వయసులో ఎంతో కొంత సంపాదిస్తే.. మీ మనవరాలికి ఆ డబ్బు ఉపయోగపడుతుందని ఆ యువకుడు చెబుతాడు.
తన జీవితంలో టికెట్ కొనలేదని.. సొంతంగా డ్రైవింగ్ చేసుకోవడమే తనకు అమితాసక్తి అని చెప్పే ఆ వృద్ధుడు.. అలా ఒక డ్రగ్స్ దందాలోకి దిగుతాడు. తన వాహనాన్ని తీసుకెళ్లి ఒక గోడౌన్ లోకి వెళితే అక్కడ వారు డ్రగ్స్ లోడ్ చేస్తారు. వారు చెప్పిన చోటికి వాహనాన్ని తీసుకెళ్లి ఆపి, కీ కూడా అలాగే ఉంచి తను దిగిపోతే వారే అన్ లోడ్ చేసుకుని.. కీతో పాటు భారీ మొత్తం డబ్బును కూడా అక్కడ పెట్టి వెళ్లిపోతారు. అమెరికాలో ఇలా డ్రగ్స్ ను సరఫరా చేసే వారిని 'మ్యూల్' గా వ్యవహరిస్తారు. ఇలాంటి మ్యూల్స్ అనేక మంది ఉంటారు. ఈ డ్రగ్స్ వ్యవహారాల్లో అత్యంత వృద్ధుడైన మ్యూల్ గా ఎర్ల్ నిలుస్తాడు. కేవలం తాత్కాలిక అవసరాల కోసమని ఒక్కసారి ఆ పని చేయాలని ఎర్ల్ ఆ దందాలోకి దిగుతాడు. అయితే.. ఆ భూతం అతడిని తేలికగా వదలదు. తొలి సారి భారీ మొత్తం చూసే సరికి ఎర్ల్ కళ్లు చెదురుతాయి. రెండో రైడ్ కు వెళ్తాడు. మూడో రైడ్ చేస్తాడు. మంచినీళ్ల ప్రాయంగా అతడు డ్రగ్స్ ను సరఫరా చేస్తూ ఉంటాడు.
మరోవైపు ఈ డ్రగ్స్ దందాపై పోలీసుల సోదాలు కొనసాగుతూ ఉంటాయి. కొందరిని పట్టుకుని సమాచారం సేకరిస్తారు. భారీ స్థాయిలో డ్రగ్స్ ను సరఫరా చేసే ఈ మ్యూల్ గురించి వారికి తెలుస్తుంది. డ్రగ్స్ దందాలో ఎర్ల్ ను 'తాతా' గా వ్యవహరిస్తూ ఉంటారు. 'తాతా' అనే మ్యూల్ ప్రతి నెలా కొన్ని వందల కేజీల డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాడని పోలీసులకు తెలుస్తోంది. అయితే తాతా రూపు రేఖలేమిటో ఎవరికీ తెలియదు. అతడి వయసు కూడా!
దీంతో ఎర్ల్ పట్టుబడే అవకాశాలు ఉండవు. ఒకసారి పోలీసులు పక్కా సమాచారంతో దారి మధ్యలో మ్యూల్ స్టే చేసిన హోటల్ పై రైడ్స్ నిర్వహిస్తారు. అయితే.. అక్కడ ఈ వృద్ధుడిని చూసి అతడు డ్రగ్స్ సప్లయర్ అని పోలీసులు అస్సలు ఎక్స్ పెక్ట్ చేయకపోవడంతో ఎర్ల్ తప్పించుకోగలుగుతాడు. అంతే కాదు.. ఈ వృద్ధుడే వెళ్లి తనే పోలీసులను పలకరిస్తాడు. ఎంతసేపూ తనను పట్టుకోవడానికి సమయం కేటాయిస్తున్న పోలీసాధికారిని కలిసి.. కుటుంబానికి సమయం కేటాయించు అంటూ పెద్దమనిషి తరహాలో సలహా ఇస్తాడు ఎర్ల్. ఈ మ్యూల్ నే వేటాడుతున్న ఆ పోలీసు అధికారి.. తన టార్గెట్ అతడే అని తెలియక.. స్నేహితుడిలా మాట్లాడతాడు. పోలీసులకూ, మ్యూల్ కు మధ్యన సాగే సన్నివేశాలు చాలా సరదాగా, హ్యూమరస్ గా ఉంటాయి.
మరోవైపు భారీ స్థాయిలో, ఎవ్వరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ఈ మ్యూల్ పై మెక్సికోని ఆ డ్రగ్స్ దందా బాస్ కు కూడా చాలా ప్రేమ కలుగుతుంది. అతడిని ఒకసారి మెక్సికోకు తీసుకురమ్మని తన ఏజెంట్లను ఆదేశిస్తాడు. మెక్సికో వెళ్లిన ఎర్ల్ కు అక్కడ సకల సత్కారాలూ అందుతాయి. ఈ వృద్ధుడిని అలరించడానికి వేశ్యలను కూడా ఏర్పాటు చేసి.. ఆస్వాదించమంటాడు ఆ డ్రగ్స్ దందా బాస్. ఆ తరహా వినోదాన్ని ఆస్వాదిస్తూ మురిసిపోతాడు ఎర్ల్.
అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా సాగవు. మ్యూల్ పై అనూహ్యంగా డ్రగ్స్ గ్యాంగ్ ఒత్తిడి పెరుగుతుంది. పాత బాస్ స్థానంలో కొత్త వాడు వస్తాడు. తమ కోసం భారీ స్థాయిలో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నా.. ఎర్ల్ పై వారు కన్నేస్తారు. ఈ డ్రగ్స్ ట్రాన్స్ ఫార్మర్ గా మ్యూల్ రోడ్ల మీద సరదాగా ప్రయాణం చేస్తుంటాడు. తనకు కావాల్సిన చోట కారు ఆపుతుంటాడు. రోడ్ల మీద వాహనాలు ఆగిపోయిన వారికి సహాయం చేస్తుంటాడు. ఇలాంటి పనులు పెట్టుకోవద్దంటూ ఎర్ల్ పై డ్రగ్స్ గ్యాంగ్ ఒత్తిడి చేస్తూ ఉంటుంది. అయితే వారి మాటలను విన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉంటాడతను.
మరోవైపు ఎర్ల్ కు భారీగా డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది. గతంలో తను దివాళా తీసిన వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభిస్తాడు. మధ్యమధ్యలో కుటుంబాన్ని పలకరిస్తూ ఉంటాడు. వారి అవసరాలు తీరుస్తాడు. వారికి దగ్గరవుతాడు. ఇలాంటి నేపథ్యంలో ఒక సారి డ్రగ్స్ ను తీసుకెళ్తుండగా.. మనవరాలి నుంచి ఫోన్. అమ్మమ్మకు చాలా బాగోలేదని, ఆమె తుది గడియల్లో ఉందని మనవరాలు సమాచారం ఇస్తుంది. ఒకవైపు డ్రగ్స్ తీసుకెళ్తూ ఉంటాడు, అలాంటి సమయంలో తన భార్య తుది గడియల్లో ఉందని సమాచారం.. రాలేనంటూ మనవరాలికి చెబుతాడు. అయితే ఇప్పుడు గనుక రాకపోతే తను కూడా ఇక జీవితంలో మాట్లాడనంటూ ఆమె హెచ్చరిస్తుంది. అరిచి ఫోన్ పెట్టేసే ఎర్ల్.. కారును ఇంటికి తిప్పుతాడు!
బెడ్ పై ఉన్న భార్యతో మాట్లాడతాడు. తను చేసిన పొరపాట్లకు అతడు సారీ చెబుతాడు. ఆమె కూడా క్షమాపణలు కొరుతుంది. కూతురు కూడా ఎర్ల్ ను ఆ సమయంలో పలకరిస్తుంది. చివరకు భార్య తుదిశ్వాస విడిచే సరికి వారం గడుస్తుంది. ఈ సమయంలో డ్రగ్స్ గ్యాంగ్ ఎర్ల్ ఎక్కడకు వెళ్లాడో అర్థం కాక తలపట్టుకుంటుంది. ఈ మ్యూల్ భారీ సరకుతో వెళ్తున్నాడని తెలిసి.. ఆ రైడ్ లో ఇతడిని పట్టుకోవడానికి పోలీసులు కూడా భారీ కసరత్తు చేసి ఉంటాడు. ఉన్నట్టుండి మ్యూల్ ఇంటికి వెళ్లిపోయి ఉండటంతో.. అటు డ్రగ్స్ గ్యాంగ్, ఇటు పోలీసులు అతడి కోసం వెదుకుతూ ఉంటారు. చివరకు తన భార్య అంతక్రియలను పూర్తి చేసి డ్రగ్స్ డెలివరీ కోసమే మళ్లీ రోడ్డెక్కుతాడు ఎర్ల్. ఆ సమయంలో ముందుగా డ్రగ్స్ మాఫియా మ్యూల్ ను పట్టుకుంటుంది.
అతడు మళ్లీ రోడ్డెక్కాడని, ఏజెంట్లకు దొరికిపోయాడని ఇన్ఫార్మర్ల ద్వారా పోలీసులకు సమాచారం అందుతుంది. అయితే ఎర్ల్ ను చంపేయడానికి డ్రగ్స్ ముఠా ఏజెంట్లు రెడీ అవుతారు. అయితే ఆ వార్ వెటరన్ ఇద్దరు ఏజెంట్లను చంపేసి మళ్లీ రోడ్డెక్కుతాడు. ఇంతలో పోలీసులు చుట్టుముట్టి ఆపుతారు. గతంలో తనను పలకరించిన వృద్ధుడే ఈ మ్యూల్ అనే విషయం తెలిసి పోలీసాఫీసర్ ఆశ్చర్యపోతాడు. వారికి ఎదురుతిరగకుండే ఎర్ల్ లొంగిపోతాడు. ఇన్నాళ్లూ దొరకకుండా నీ సమయాన్ని నీ కుటుంబంతో గడపనీయకుండా చేశానంటూ పోలీసాఫీసర్ కు సారీ చెబుతాడు ఎర్ల్. కేసు విచారణకు వస్తుంది.
ఎర్ల్ మాజీ సైనికుడని, దేశం కోసం పోరాడడాని, డబ్బు కోసమే ఆ పని చేశాడంటూ… డిఫెన్స్ వాదన ప్రారంభం అవుతుంది. అయితే తను దోషినంటూ ఎర్ల్ కోర్టు ముందు స్పష్టం చేస్తాడు. తనపై నమోదైన అభియోగాలన్నీ నిజమేనంటాడు. దీంతో న్యాయస్థానం శిక్షకు రెడీ కమ్మని ఎర్ల్ కు చెబుతుంది. వీలైనప్పుడు జైల్లో మిమ్మల్ని చూడటానికి వస్తామంటూ ఎర్ల్ కూతురు కోర్టులోనే హామీ ఇచ్చి వెళ్తుంది. చివర్లో జైలు గోడల మధ్యన ఎర్ల్ పూల మొక్కలను పోషిస్తుండగా.. సినిమా ముగుస్తుంది.
సినిమా మేకింగ్ లో నిస్సందేహంగా కథా పరంగా ఒక భిన్నమైన ప్రయోగం 'ది మ్యూల్'. 90 యేళ్ల వృద్ధుడిని, యాక్టివ్ రోల్ లో, హీరోగా చూపుతూ కూడా ఒక ఫీచర్ ఫుల్ లెంగ్త్ సినిమాను రూపొందించవచ్చని, అది కూడా ఆద్యంతం వినోదభరితంగా సాగేలా తీయవచ్చని దీని రూపకర్తలు నిరూపించారు. 90 యేళ్ల వయసులో ఈ సినిమాలో నటించడమే గాక, చాన్నాళ్ల తర్వాత దర్శకత్వం వహించి కూడా క్లింట్ ఈస్ట్ వుడ్ అనితర సాధ్యమైన తన ఎనర్జీని చాటుకున్నారు. అలాగే మనసుంటే మార్గం ఉంటుందన్నట్టుగా.. 90 యేళ్ల వయసులోనూ ఈస్ట్ వుడ్ కు నటించడానికి, దర్శకత్వం వహించడానికి ఇలాంటి కథ దొరికింది.
ఈ వైనాన్ని గమనిస్తే.. 60 దాటిన తర్వాత కూడా కుర్రాళ్లలా కనిపించడానికి మేకప్ లు వేయించుకుని.. తమ వయసుకు పోలని పాత్రల్లో కనిపిస్తూ.. ముడతల చర్మంతో అవే మాస్ మసాలాల్లో నటించి..యంగ్రీ ఎంగ్ మెన్లుగా కనిపించడానికి తెగ తాపత్రయ పడే తెలుగు హీరోల ప్రయాసలు కూడా ప్రస్తావనకు వస్తాయి. వయసుకు తగ్గట్టుగా కూడా పాత్రలు చేయడానికి బోలెడన్ని కథలు ఉండనే ఉంటాయి, హీరోయిజానికి లోటు ఉండనే ఉండదు… నటులకు-క్రియేటర్లకు ఆ చూపు ఉండాలంతే! ఈ విషయాన్ని ఈస్ట్ వుడ్ వంటి వాళ్లు ఈ వయసులోనూ నిరూపిస్తూ ఉన్నారు.
-జీవన్ రెడ్డి.బి