Advertisement

Advertisement


Home > Movies - Reviews

Bubblegum Review: మూవీ రివ్యూ: బబుల్ గమ్

Bubblegum Review: మూవీ రివ్యూ: బబుల్ గమ్

చిత్రం: బబుల్ గమ్ 
రేటింగ్: 2/5
నటీనటులు:
రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, బిందు చంద్రమౌళి, చైతు జొన్నలగడ్డ తదితరులు 
కెమెరా: సురేష్ రగుతు 
ఎడిటింగ్: బాలకృష్ణా రెడ్డి, రవికాంత్ పెరెపు
సంగీతం: సాయిచరణ్ పాకాల
నిర్మాత: పి విమల
దర్మ‌క‌త్వం: రవికాంత్ పెరెపు
విడుదల తేదీ: 29 డిసెంబర్ 2023

సుమ-రాజీవ్ కనకాల తెలియని తెలుగు కుటుంబముండదు. ఇద్దరిదీ నటనారంగమే. రాజీవ్ కనకాల తల్లిదండ్రులు కీ.శే దేవదాసు కనకాల, కీ.శే లక్ష్మీ కనకాల ఇద్దరూ నటనలో ఒక స్థాయి చూసిన వాళ్లు, యాక్టింగ్ స్కూల్ నడిపినవాళ్లూ! ఆ కుటుంబం నుంచి వచ్చే మూడో తరం నటుడి నుంచి ఆశించేది కచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. "బబుల్ గమ్" అనే తన తొలి సినిమాతో నేడు ముందుకొచ్చాడు. ఎలా ఉందో చూద్దాం. 

ఆదిత్య (రోషన్ కనకాల) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. డీజే అవ్వాలని తన కోరిక. ఒక రోజు తన టేలెంట్ చూపించుకునే అవకాశం వస్తుంది. ఒక పార్టీలో డీజేగా ఉండగా జాన్వి (మానస చౌదరి) అనే రిచ్ అమ్మాయి అతనిని చూసి ఇష్టపడుతుంది. నెమ్మదిగా వాళ్ల పరిచయం ప్రేమగా మారిపోతుంది. ఆదిత్య ఆమెపై ఫీలింగ్స్ పెంచుకుంటాడు, పొసెసివ్ అవుతాడు. 

కానీ జాన్వి మరొక పార్టీలో ఒక కారణం చేత అతనిని అవమానపరిచి తనకు కొనిచ్చిన బట్టలన్నీ అక్కడే విప్పేసి అర్ధనగ్నంగా అండర్వేరుతో వెళ్లిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కథ! 

కొత్త హీరో రంగప్రవేశం అనగానే యూత్ ఫూల్‌ లవ్ స్టోరీయే సేఫ్ అనే అభిప్రాయం బలంగా ఉంది. అది కూడా తక్కువ బడ్జెట్టులో చేసెయ్యాలనేది ఇంకో లెక్క. దానివల్ల సినిమా చుట్టేసినట్టు అయిపోతుందనో, చీప్ లుక్ వస్తుందనో పెద్దగా ఆలోచించడంలేదు. ఒకటి రెండు హిట్టు సినిమాలు తీసిన దర్శకుడైతే సేఫే అనుకుని దిగిపోతున్నారు. ఇక్కడ ఇంచుమించి ఇదే జరిగింది. 

ఇది విలువలు గట్రా లేని ఫక్తు అర్బన్ జంక్ చిత్రం. ఇందులో హీరో ఒక డీజే.."డీజే టిల్లు"లో లాగ!...

ఆ హీరో ఓపెనింగ్ సీన్ అండర్వేర్ మాత్రమే వేసుకుని మోటార్ సైకిల్ మీద వెళ్తూ గట్టిగా ఏడుస్తూ అరవడం.."అర్జున్ రెడ్డి" టైప్ రఫ్ క్యారెక్టరైజేషన్ తో... 

డైలాగుల్లో "నీ జాబ్ నీ .....లో పెట్టుకో" లాంటి రాయడానికే అసహ్యమైన పదాలు..కనీసం మ్యూట్ కూడా చేయకుండా!.. 

కూతుర్ని స్వయంగా తండ్రే ఒక అబ్బాయితో డేటింగ్ చేసి నచ్చుతాడో లేదో చెక్ చేసుకోమని సలహా ఇవ్వడం...

లవర్ ని మరొకడు గట్టిగా కౌగిలించుకుని ఇంటిమేట్ గా ఉండడం చూసి తట్టుకోలేక ఆమెకి తర్వాత లిప్ కిస్ పెట్టే హీరో...అది చూసి "జెలసీయా" అని వంకర్లు పోయే హీరోయిన్. 

మాటిమాటికీ వైవా హర్ష పాత్ర షర్ట్ ఎత్తి చూపించడం..

"మనం టాయ్స్ తో ఆడుకోవాలి..టాయ్స్ అవ్వకూడదు" అంటూ ద్వంద్వార్థం ధ్వనించే హీరోయిన్ డైలాగ్..

ఇలా చెప్పుకుంటూ పోతే ఇదొక విలువల్లేని సో-కాల్డ్ యూత్ఫుల్ సినిమా. యూత్ కి నచ్చడమే మాకు కావాలి,వాళ్లే మా టార్గెట్ ఆడియన్స్, ఇలా తీస్తేనే వాళ్లు చూస్తారు అని వాదిస్తే ఈ సినిమాని ఆ యూత్ ఆడియన్స్ ఎంతవరకూ చూస్తారో వేచి చూడాలంతే!

ఏ బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లైతే ఏదో తెలిసీ తెలీక ప్రయత్నించారులే అనుకోవచ్చు. కానీ ఇన్నేళ్లు చిత్రరంగంలో ఉంటూ, మంచి పేరు సంపాదించుకున్న సుమ అయినా ఎటువంటి చిత్రంతో కొడుకుని లాంచ్ చేస్తున్నదీ చూసుకుని ఉంటే బాగుండేది. 

టెక్నికల్ గా చూస్తే అన్నీ యావరేజ్ గా ఉంటే మ్యూజిక్ మాత్రం డల్ గా ఉంది. పాటలు ఓకే అనుకున్నా, నేపథ్య సంగీతం మాత్రం చప్పగా ఉంది. 

రోషన్ కనకాల అద్భుతంగా ఏదో చేసేసాడని చెప్పడానికి లేదు. విజయ్ దేవరకొండని, సిద్ధూ జొన్నలగడ్డని చూసేసాక అదే పద్ధతిలో ఇంకో హీరో వస్తే ఇమిటేషన్ అంటారు తప్ప పాజిటివ్ గా చూడరు. కచ్చితంగా తనకంటూ ప్రత్యేకత ఏముందో తెలుసుకుని దానిని ప్రొజెక్ట్ చేయాలి. లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నించి ఉండాల్సింది. ఈ మాత్రం ఫైట్లు చేయడం, డైలాగులు చెప్పడం, డ్యాన్సులు చేయడం ఇవ్వాళ అందరూ చేస్తున్నారు. ఇప్పటి కాంపిటీషన్ లో నిలదొక్కుకోవాలంటే అవి సరిపోవు. 

హీరోయిన్ గా చేసిన మానస చౌదరి చూడడానికి చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. అయితే ఒక దశ,దిశ లేని పాత్ర ఆమెది. అంత రిచ్చయ్యుండి ఈ తాడూ బొంగరం లేని వాడిని ఎందుకు ప్రేమించిందో కారణం తెలియని పాత్ర. ఆ ప్రశ్న ఆమె తండ్రి పాత్ర అడిగినా కూడా తెలీదనే చెబుతుంది. సరైన కథలు ఎంచుకుంటే ఈ తెలుగింటి హీరోయిన్ కి కమెర్షియల్ యాక్ట్రస్ గా మంచి కెరీర్ ఉండే అవకాశముంది. 

ఈ సినిమాకి హైలైట్ నటుడెవరంటే చైతు జొన్నలగడ్డ. ఎక్కడా నటించినట్టు కనపడకుండా మంచి టైమింగుతో కనిపించిన ప్రతి సీన్లోనూ నవ్వించిన నటుడు. స్క్రిప్ట్ మొత్తం ఒకలాగుంటే ఇతని డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నట్టు అనిపించాయి. పాత్రని పూర్తిగా ఓన్ చేసుకోవడంవల్ల వచ్చే నేచురల్ ఫ్లో ఇతనిలో కనపడింది. సినిమా మొత్తానికి ఇతనే పెద్ద రిలీఫ్. కామెడీకి, క్యారెక్టర్ పాత్రలకి ఒక మంచి నటుడు దొరికాడని చెప్పొచ్చు. 

వైవాహర్ష పేరుకి కమెడియనే కానీ నవ్వించకపోగా విసిగించాడు. ప్రేమ గురించి తన ఫ్రెండ్స్ తో చెప్పే డైలాగ్ తనకైనా అర్ధమయ్యిందో లేదో!

హీరో పక్కన కనిపించిన మిగిలిన ఇద్దరు సైడ్ కిక్స్ ఓకే. 

బిందు చంద్రమౌళి సగటు మధ్యతరగతి తల్లి పాత్రలో సరిపోయింది.

హర్షవర్ధన్ ది న్యూ ఏజ్ తండ్రి పాత్ర. 

కథగా కొత్తదనం లేని, కథనంలో విషయం లేని, కంటెంట్ లో విలువల్లేని అర్బన్-జంక్ సినిమా ఇది. 

సంవత్సరాంతంలో ఇలాంటి వీక్ కంటెంట్ తో వచ్చినా, కొత్త ఏడాదిలో విషయమున్న కథల్ని ఎంచుకుని రోషన్ కనకాల తన ప్రత్యేకత చాటుకుంటాడని ఆశించడమొక్కటే ఇప్పుడు చేయగలిగింది. 

బాటం లైన్: అర్బన్ జంక్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?