Advertisement

Advertisement


Home > Movies - Reviews

Mangalavaaaram Review: మూవీ రివ్యూ: మంగళవారం

Mangalavaaaram Review: మూవీ రివ్యూ: మంగళవారం

చిత్రం: మంగళవారం
రేటింగ్: 2.75/5
నటీనటులు:
పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, కృష్ణచైతన్య, రవీంద్ర విజయ్, అజ్మల్ అమిర్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ తదితరులు
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫి: శివేంద్ర దాశరధి
ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి
నిర్మాత: స్వాతి గునుపాటి - సురేశ్ వర్మ- అజయ్ భూపతి 
దర్శకత్వం: అజయ్ భూపతి
విడుదల: 17 నవంబర్ 2023

"ఆరెక్స్ 100" లాంటి హిట్ తర్వాత "మహాసముద్రం" తీసినా కలిసిరాలేదు దర్శకుడు అజయ్ భూపతికి. మళ్లీ తన తొలి సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో మూడో సినిమాగా "మంగళవారం" తో ముందుకొచ్చాడు. ట్రైలర్ ఆకట్టుకోవడం, "కాంతార" ఫేం అజనీష్ సంగీతాన్ని అందించడం వంటి కారణాల వల్ల సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. పాయల్ రాజ్ పుత్ కి యూత్ ఆడియన్స్ లో ఎలాగూ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఏ పోటీ లేని సమయంలో విడుదలయ్యింది కాబట్టి ఈ వారం అన్ని కళ్లు ఈ చిత్రం మీదే ఉన్నాయి. ఇంతకీ అజయ్ భూపతికి లేడీలక్ కలిసొచ్చిందా? వివరాల్లోకి వెళదాం. 

1996 లో ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో ఇద్దరికి అక్రమ సందంధం ఉందంటూ గోడ మీద ఎవరో రాస్తారు. అది ఊరి జనమంతా చూసే సరికే ఆ జంట ఒక బావి దగ్గర చనిపోయి పడుంటారు. పరువు పోయి చేసుకున్న ఆత్మహత్య అనుకుంటారు ఊరి జనం. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై (నందిత శ్వేత) అవి హత్యలని చెబుతుంది. ఊరి పెద్ద (కృష్ణ చైతన్య) ఆ శవాల్ని పోస్ట్ మార్టెం కి ఒప్పుకోడు. అదే ఊరిలో ఇంకొన్ని విచిత్రమైన వ్యక్తులుంటారు.  

ఇదిలా ఉంటే మరో మంగళవారం నాడు మళ్లీ ఇలాగే అక్రమసంబంధమంటూ గోడ మీద ఇద్దరు పేర్లు రాయడం .. వాళ్లు చెట్టుకి వేలాడడం చూస్తారు జనం.

ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నదెవరో పట్టుకోవాలని ఆ ఊరి జనం, ఎస్సై నిర్ణయించుకుంటారు. వాళ్లకి ఎవరు దొరికారు? అవి హత్యలా ఆత్మ హత్యలా ఇంకేవైనానా? ఈ కథకి అసలు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పాత్రకి సంబంధమేంటి? అదే ఈ సినిమాలో హుక్ పాయింట్. 

కథగా కంటే కథనం మెరుగ్గా ఉందని చెప్పుకోవాల్సిన సినిమా ఇది. సాంకేతికంగా కూడా పైస్థాయిలో ఉంది.

కెమెరా వర్క్, లైటింగ్ ఎఫెక్ట్స్ తో పాటూ ఎంగేజ్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆయువుపట్లు. చూస్తున్నంతసేపూ ఎక్కడా బోర్ కొట్టకుండా కూర్చోబెట్టగలిగింది నేపథ్య సంగీతం. పాటలు ఓకే... యాంబియన్స్ కి, సందర్భానికి తగ్గట్టు ఉన్నాయి. అయితే పాపులరైన "అప్పడప్పడ తాండ్ర" సినిమాలో లేదు. లేదన్న కంప్లైంట్ కూడా అనవసరం. 

అక్రమసంబంధాల చుట్టూ తిరిగే కథ అయినప్పటికీ, హీరోయిన్ పాత్ర ఒక సెన్సిటివ్ అంశం చుట్టూ అల్లినప్పటికీ ఎక్కడా అశ్లీలం, అసభ్యం, జుగుప్స కలగకుండా నీట్ గా డీల్ చేసాడు దర్శకుడు. నిజానికి ఇలాంటి కథని కమర్షియల్ అంశాలకి లోబడి తెరకెక్కించేటప్పుడు ఎక్కడా గీతదాటకుండా తీయడం కష్టమైన పనే. 

సినిమా ప్రధమార్ధంలో పాత్రల పరిచయాలకే అరగంట పట్టింది. అయితే భోజనాల సీన్ దగ్గర కామెడీ ఫైట్ లాంటివి అనవసరమైన నిడివి పెంచాయి. పైగా అదంత కన్విన్సింగ్ గా కూడా లేదు.. ప్రధాన కథకి పనికొచ్చేది కూడా కాదు. సెకండాఫులో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ కథ డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే రివీల్ చేయకూడని రెండు పాత్రల చుట్టూ నడిచిన డ్రామా కూడా కనిన్విన్సింగ్ గా లేదు. ఆ పాత్రలు అలా ఎందుకు ప్రవర్తించాయి అన్నదానికి నమ్మశక్యమైన కారణం చూపలేకపోయాడు దర్శకుడు. 

అయితే సినిమా క్లైమాక్స్ పై మైనస్సుల్ని మరిచిపోయేలా చేస్తుంది. ఇన్నేసి ట్విస్టులు, రివీలింగ్స్ ఉన్న క్లైమాక్స్ కారణంగా ఎంత క్రిటికల్ గా చూసినా "పాసైపోతుందిలే" అన్న ఫీలింగొస్తుంది. 

ఇక నటీనటుల విషయానికి వస్తే పాయల్ రాజ్ పుత్ చాలా చాలెంజింగ్ గా నటించింది. ఇలాంటి పాత్రని చేయడానికి అందరు హీరోయిన్స్ అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు. "ఆరెక్స్100" లో ఔట్-ఆఫ్-ది-బాక్స్ పాత్రలో కనిపించి జనం దృష్టిని ఆకర్షిస్తే ఈ "మంగళవారం" ఆమె కెరీర్ లో ఒక ప్రత్యేకత గల పాత్రగా మిగులుతుంది. 

జమిందార్ పాత్రలో కృష్ణ చైతన్య మెప్పించాడు. మంచి స్క్రీన్ స్పేస్ తో కాస్త కామెడీ చేసిన జంట అజయ్ ఘోష్, లక్ష్మణ్. ఫొటోగ్రాఫర్ గా శ్రవణ్ రెడ్డి ఓకే. 

పోలీస్ పాత్రలో నందిత శ్వేత సరిపోయింది. అయితే "రక్తచరిత్ర"లో అశ్విని కల్సేకర్ బాడీ లాంగ్వేజ్ ని ఫాలో అయినట్టుగా అనిపించింది. ఈ పాత్రకి డబ్బింగ్ ఆమే చెప్పుకుందా లేక వేరే వాళ్లు చెప్పారో కానీ వాయిస్ పాత్రకి తగ్గట్టుగా ఉంది. 

ట్రైలర్ లో కనిపించినంత హారర్ ఎలిమెంట్ సినిమాలో లేదు. పాయల్ రాజ్ పుత్ పాత్రని కూడా డీసెంట్ గా డీల్ చేయడం జరిగింది. ఒక క్రైం థ్రిల్లర్ కి హారర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా ఉంది. ఆ జానర్ ఇష్టపడేవారికి, టెక్నికల్ యాస్పెక్ట్స్ ని ఎంజాయ్ చేసే వారికి ఈ చిత్రం అంతగా నిరాశపరచదు. 

బాటం లైన్: హారర్ పూసిన క్రైం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?