Advertisement

Advertisement


Home > Movies - Reviews

Manu Charitra Review: మూవీ రివ్యూ: మనుచరిత్ర

Manu Charitra Review: మూవీ రివ్యూ: మనుచరిత్ర

చిత్రం: మనుచరిత్ర
రేటింగ్: 1.75/5
తారాగణం: శివ కందుకూరి, మేఘ ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్, ప్రియ వడ్లమాని, సుహాస్, డాలి ధనుంజయ్, శ్రీకాంత్ అయ్యంగర్, మధునందన్, హర్షిత చౌదరి, గరిమ కౌషల్ తదితరులు
సంగీతం: గోపిసుందర్
కెమెరా: రాహుల్ శ్రీవాస్తవ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాత: నరాల శ్రీనివాస రెడ్డి
రచన- దర్శకత్వం: భరత్ పెదగాని
విడుదల: 23 జూన్ 2023

పెద్ద హీరోలు లేనిదే హాలుకొచ్చి సినిమాలు చూసే పరిస్థితి లేదు. ముందుగా వైరల్ అయిన పబ్లిసిటీ మెటీరియల్ తో కనెక్ట్ అవడం వల్లో, లేదా చాలా గొప్పగా ఉందన్న టాక్ వస్తేనో తప్ప చిన్న సినిమాలకి సినిమా హాల్స్ వద్ద నూకలు చెల్లడం లేదు. అయినప్పటికీ తీసేవాళ్లు ధైర్యంగా తీస్తున్నారు, నమ్మకంగా విడుదల చేస్తున్నారు. 

ఈ "మనుచరిత్ర" ట్రైలర్ కి రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది. అయితే అది ఓపెనింగ్స్ తీసుకురావడానికి సరిపోదు. అయినప్పటికీ సినిమాలో విషయముంటే ఓపెనింగ్ ఇచ్చిన కొద్ది మంది యొక్క మౌత్ టాక్ తో నడిచే అవకాశముంటుంది. కనుక నేరుగా విషయంలోకి వెళ్లిపోయి అసలిందులో ఏ విషయముందో చూద్దాం. 

వరంగల్లో మను (శివ కందుకూరి) రుద్ర (ధనుంజయ్) అనే గూండా దగ్గర పని చేస్తుంటాడు. ఏ అమ్మాయికి పడితే ఆ అమ్మాయికి లవ్ ప్రొపోజల్ చేస్తుంటాడు. ఆ అమ్మాయిలు ఒప్పుకోగానే బ్రేకప్ చెప్పి వదిలేస్తుంటాడు. అమ్మాయిలు అతన్ని చీటర్ అని వేలెత్తి చూపితే అతని ఫ్రెండ్ (సుహాస్) అతనలా ఎందుకు తయారయ్యాడో ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. గతంలో మను జెన్నిఫర్ (మేఘా ఆకాష్) ని ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఆమెతో ఎడబాటుకి గురౌతాడు. ఆమెను మరిచిపోవడానికి మందుకి బానిసౌతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు. కానీ అనుకోకుండా జాను (ప్రగతి) పరిచయం అతనిలో మార్పు తీసుకొస్తుంది. ఇంతకీ మను జానుతో స్థిరపడతాడా? లేక జెన్నిఫర్ మళ్లీ తన జీవితంలోకి వస్తుందా? ఈ రెండూ కాకుండా ఇంకేదైనా అవుతుందా? వీటికి సమాధానాలే ప్రధానకథ. మరో సమాంతర కథ కూడా నడుస్తుంటుంది. అదంతా మేయర్ హత్యతో ముడిపడి ఉన్న క్రైం-యాక్షన్ కహానీ. 

ఒక చీర ధరకి రెండు చీరలిస్తేనో, ఒక బిర్యాని బిల్ కి రెండో బిర్యాని ఫ్రీ అంటేనో జనం తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ ఒక టికెట్ మీద ఒక సినిమాలోనే రెండు సినిమాలు చూపిస్తామంటే తట్టుకోలేరు. అయితే ఇది ప్రేమ కథైనా అయ్యుండాల్సింది, లేక పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా అయినా తయారవ్వాల్సింది. రెండూ కలిపి కొట్టడం వల్ల ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరవుతారని రాసుకున్నప్పుడే గ్రహించి ఉండాల్సింది. 

ముగ్గురు నలుగురు హీరోయిన్స్ తోటి కథని సాగ తీస్తూ, మరో పక్క మధ్య మధ్యలో పసలేని ఒక సాదాసీదా యాక్షన్ ట్రాక్ ని నడిపిస్తూ అసలు దర్శకుడు ఏమనుకుని ఏం తీసాడో అని నిట్టూర్చే సినిమా ఇది. 

అర్జున్ రెడ్డి హిట్టైన దగ్గర్నుంచీ హీరోలకి, దర్శకులకి ఆ తరహా సినిమాలు చేసెయ్యాలన్న తహతహ మొదలైపోయింది. కారణమేదైనా మందు తాగడం, డ్రగ్స్ తీసుకోవడం నిత్యకృత్యాలుగా ఉండే హీరో పాత్రలు రాసుకుంటున్నారు. ఈ సీన్స్ వల్ల యూత్ కనెక్ట్ అవుతారనుకోవడం పొరపాటు. ఈ రకం సీన్లు ఓవర్డోస్ అయిపోయి చిరాకుపడతారు ప్రేక్షకులు. కథలోనూ, కథనంలోనూ కొత్తదనం కోరుకుంటారు తప్ప అదే రొట్టకొట్టుడు చూడడానికి ఎవరికీ ఓపికుండదు. 

చిన్నప్పటి నుంచీ చూసిన సినిమాల తాలూకు ప్రభావంతో అన్నీ కలిపేసి ఒక కిచిడీ వండేస్తే కొత్త సినిమా అయిపోతుందని అనుకున్నట్టున్నాడు దర్శకుడు. కథ ఎలా ఉన్నా కథనం మీద కసరత్తు చేయకుండా మైండుకొచ్చిందల్లా తీసేస్తే ప్రేక్షకుల మైండ్ పాడవడం తప్ప ఏముండదు. అవసరం లేనంత మంది హీరోయిన్స్ తో చాటభారతమంత కథ చెబుతూ, దానికి తోడు యాక్షన్ స్టోరీ కూడా పెడితే నిడివి పెరగక ఏమౌతుంది? దాదాపు రెండూ ముప్పావు గంటల సేపు రిపీట్ సీన్స్ లాగ అనిపించే లవ్ ట్రాక్ ని, కాలం చెల్లిన యాక్షన్ ఎపిసోడ్ ని భరించడం ఎంత కష్టం? ఆడియన్స్ ని ఎమోషనల్ గ్రిప్ లో పెట్టుకుని ఎంగేజింగ్ కథనాన్ని నడపడంలో పూర్తిగా విఫలమయ్యాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే ఈ కథకి ప్రధానమైన కుల్ప్రిట్. 

తెరంగేట్రం చేసిన ప్రతి హీరోకి రెండు మూడు సినిమాలు విడుదలైన వెంటనే యాక్షన్ హీరో అవ్వాలన్న కోరిక పుట్టేయడం సహజం. అలాంటి కథ ఒకటి వచ్చినప్పుడు ఇక మిగిలిన విషయాలు లెక్కేసుకోకుండా దూకేసినట్టున్నాడు శివ కందుకూరి. అయితే ఈ కథకి తగ్గ ఫిజిక్ అతనిలో లేదు. మాస్ హీరో కావాలన్న కోరిక తప్పు కాదు. కానీ డ్యాన్స్ లో ప్రావీణ్యత సంపాదించకుండా అది కుదరదు. ఇతనికి డ్యాన్స్ ట్రైనింగ్ తప్పనిసరి. ఇలా సూపర్ స్టార్ కృష్ణ లాంటి స్టెప్పులేస్తూ కానిస్తానంటే కుదరదు. 

సుహాస్ ఇందులో హీరోకి ఫ్రెండ్. ఎక్కడా ప్రాక్టికాలిటీ లేకుండా మిత్రప్రేమలో మునిగి చచ్చిపోయే కృతకంగా అనిపించే పాత్ర ఇతనిది. 

ఈ చిత్రంలో ప్రధానమైన రిలీఫ్ అందమైన హీరోయిన్స్. మేఘా ఆకాష్, హర్షిత చౌదరి, ప్రగతి శ్రీవాస్తవ్ చూడడానికి బాగుండి అవసరమైన ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నేపథ్యసంగీతం హైలైట్. ఈ సినిమాని భరించేలా చేసిన వాళ్లు హీరోయిన్స్, సంగీత దర్శకుడు మాత్రమే. పెద్దగా హాంట్ చేయకపోయినా ఒకటి రెండు పాటలు తెర మీద చూడడానికి, వినడానికి బాగున్నాయి. 

టెక్నికల్ గా కెమెరా కెమెరా వర్క్ బానే ఉంది. ఫైట్స్ బాగున్నాయి. 

ఎలా చూసుకున్నా నేటి తరం ప్రేక్షకజనాదరణ పొందగలిగే అంశాలు ఈ చిత్రంలో లేవు. జాలిపడుతూ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పడం తప్ప ఇంకేం చేసేది లేదు. అమ్మాయిల్ని ప్రేమించి బ్రేకప్ చెప్పే హీరోని అనుసరించి ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రేకప్ చెప్పేటట్టున్నారు. 

బాటం లైన్: బ్రేకప్ చరిత్ర

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?