రివ్యూ: రేయ్
రేటింగ్: 2/5
బ్యానర్: బొమ్మరిల్లు వారి
తారాగణం: సాయి ధరమ్ తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధా దాస్, అర్పిత్ రాంకా, తనికెళ్ల భరణి, నరేష్, అలీ, హేమ, బేబీ యుక్త తదితరులు
మాటలు: శ్రీధర్ సీపాన
సంగీతం: చక్రి
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: గుణశేఖరన్
కథ, కథనం, నిర్మాత, దర్శకత్వం: వై.వి.ఎస్. చౌదరి
విడుదల తేదీ: మార్చి 27, 2015
వై.వి.ఎస్. చౌదరి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ‘ఒక్క మగాడు’, ‘సలీమ్’లాంటి ఘోర పరాజయాల తర్వాత ఒక కొత్త హీరోతో తీస్తున్న సినిమాకి వై.వి.ఎస్. చౌదరి ఎలాంటి హద్దులు లేకుండా తను అనుకున్న కథకి తగ్గ హంగులతో తెరకెక్కించాడు. వెస్టిండీస్, అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘రేయ్’లో ఖర్చు పరమైన కాంప్రమైజ్ ఏ కోశాన కనిపించదు. కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలని కూడా విదేశాల్లో తీస్తున్నప్పుడు ‘చుట్టేయడానికి’ ప్రయత్నిస్తారు. కానీ చౌదరి ఎప్పుడూ అలా వెనకాడలేదు. కాకపోతే ఈసారి ఖర్చు మరీ ఎక్కువైపోవడంతో ‘రేయ్’ ఏళ్ల తరబడి పురిటి నొప్పులు పడాల్సి వచ్చింది.
చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి గ్రాండ్ డెబ్యూ కావాల్సిన ఈ చిత్రం అతని రెండో సినిమాగా రిలీజైంది. ఇక రేయ్ విశేషాల్లోకి వెళితే.. వై.వి.ఎస్. చౌదరికి యూత్ ఆటిట్యూడ్‌ని ప్రెజెంట్ చేయడంలో సెపరేట్ స్టయిల్ ఉంది. యారొగెన్స్‌ని అతను హద్దులు దాటి చూపించేస్తుంటాడు. ‘దేవదాసు’ సినిమాలో హీరో హీరోయిన్లిద్దరూ అతిగా మాట్లాడేస్తూ… నమ్మశక్యం కాని రీతిలో ప్రవర్తించేస్తూ ఉంటారు. ఇందులో కూడా ఆ అతి ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. మొదలవడమే హైట్స్‌లో మొదలైన అతి.. కథ ముందుకి సాగే కొద్దీ పీక్స్‌కి చేరిపోతుంది. సెన్సిబుల్ సినిమాలు లైక్ చేసేవాళ్లు ఈ సౌండ్ పొల్యూషన్‌ని, ఆ హైపర్ క్యారెక్టర్లనీ తట్టుకోవడం కష్టమే. అయితే ఇలాంటి లౌడ్‌నెస్‌ని కూడా ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఉంటారు. వారే ‘రేయ్’ సినిమా భవిష్యత్తుని నిర్దేశిస్తారు.
వరుసగా రెండు సార్లు ఇంటర్నేషనల్ డాన్స్ కాంపిటీషన్ గెలుచుకున్న పాప్ స్టార్ జెన్నా (శ్రద్ధాదాస్) మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని అనుకుంటుంది. కానీ ఈసారి తనకి టఫ్ కాంపిటీషన్ ఉంటుందని ఒకతన్ని చంపించేస్తుంది. అతని చెల్లెలు అమృత (సయామీ) అన్నయ్య లక్ష్యం సాధించాలని, ఆ కాంపిటీషన్‌లో పాల్గొనే అవకాశం కోసం జమైకాలోని మ్యూజిక్ కాలేజ్‌లో చేరుతుంది. అక్కడే ఆమెకి తారసపడతాడు రాక్ (తేజ్). అమృత, రాక్‌ల బృందం జెన్నాకి ఓటమి కలిగిస్తుంది. దాంతో వారిని ఎలాగైనా ఆ కాంపిటీషన్‌నుంచి తప్పించాలని చూస్తుంది. ఆ తర్వాత రాక్ ఏం చేస్తాడన్నదే ‘రేయ్’ కథ.
అన్నయ్య ఆశయం కోసం తాపత్రయ పడే చెల్లి, గెలుపు కోసం ఏమైనా చేసే యువతి, తను ప్రేమించిన అమ్మాయి ఆశయ సాధన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే యువకుడు… కాన్‌ఫ్లిక్ట్ బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఇంటర్నేషనల్ డాన్స్ కాంపిటీషన్ అనే బ్యాక్‌డ్రాప్‌తో పాటు జమైకా, అమెరికాలాంటి రిచ్ లొకేషన్స్ కూడా జత కలిసాయి. సరిగ్గా డెవలప్ చేసుకుంటే మంచి యూత్ సినిమా కావడానికి కావాల్సిన రా మెటీరియల్ మొత్తం సమకూరింది. అయితే వై.వి.ఎస్. చౌదరి జనం సెన్సిబులిటీస్ కంటే తన శాటిస్‌ఫాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. అందులో యూత్‌ఫుల్ సినిమాల జోలికి వెళ్లినప్పుడు అతను ‘సీతయ్య’ అయిపోతాడు. ‘ఇలా తీస్తే ఎంత మందికి నచ్చుతుంది?’ అనే క్వశ్చన్ రైజ్ అయితే మెజారిటీ ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉంటుంది. ‘నచ్చే వాళ్లకే నచ్చుతుంది’ అన్న ధోరణిలో పోతే కథాపరంగా ఉన్న బలం కూడా పలచనైపోతుంది.
వై.వి.ఎస్. చౌదరి ఈ చిత్రాన్ని డీల్ చేసిన విధానం చాలా మందికి నచ్చదు. తన సినిమాలో మసాలా ఉందా లేదా అన్నట్టే ప్రతి సీన్‌నీ ఆలోచించినట్టు అనిపిస్తుంది. ప్రతి సన్నివేశంలో హీరోయిన్లిద్దరూ రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తుంటారు. వారు కాకపోతే జూనియర్ యాక్టర్లు ఆ లోటు తీరుస్తుంటారు. ఎమోషనల్ సీన్ అయినా, సెంటిమెంటల్ సీన్ అయినా కానీ సమయం, సందర్భం అక్కర్లేదు… తన సినిమాపై ఆసక్తి లేకపోతే కనీసం వారి అందాలైనా ఆకర్షిస్తాయి అన్న పద్ధతిలో సాగిపోయింది చౌదరి తీత. ఆ మసాలా సంగతి అటుంచి సినిమాలోని అతిని కనీసం ఒక యాభై శాతం టోన్ డౌన్ చేసి ఉన్నా ‘రేయ్’ బెటర్ ఫిలిం అయి ఉండేది. ఇప్పటికీ చౌదరి గత రెండు చిత్రాలతో పోలిస్తే ఇది బెటర్ సినిమానే. బట్ తారాస్థాయిలో ఉన్న ఆ ఎమోషన్స్‌కి అడ్జస్ట్ అవడం అల్లాటప్పా ఆడియన్స్ వల్ల అయి పని కాదులే.
సాయి ధరమ్ తేజ్‌కి ఇదే మొదటి సినిమా అయి ఉన్నట్టయితే అతనిపై ఎలాంటి ఇంప్రెషన్ పడి ఉండేదో కానీ ‘పిల్లా నువ్వులేని జీవితం’తో వేసిన ఇంప్రెషన్ వల్ల ‘రేయ్’కే హెల్ప్ అయినట్టనిపించింది. ఫస్ట్ సినిమాకి ఖచ్చితంగా ఇది కాన్ఫిడెంట్ షోనే. లీడ్ యాక్టర్ అంత రెచ్చిపోతూ కూడా చీకాకు పెట్టకపోవడమంటే సాయి ధరమ్ తేజ్ పట్ల యాక్సప్టెన్స్ వచ్చేసినట్టే. డాన్సుల్లో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. క్లయిమాక్స్ డాన్స్ సీక్వెన్స్ తేజ్‌ని కూడా ఇప్పటి టాప్ డాన్సర్ల సరసన చేరుస్తుంది. శ్రద్ధాదాస్ విలన్ క్యారెక్టర్‌కి బాగా సెట్ అయింది. పర్‌ఫార్మెన్స్ పరంగా ఓవర్ బోర్డ్ అయిందంటే దానికి చౌదరినే నిందించాలి. సయామీ ఖేర్ బికినీల్లో తిరుగుతూ విలువల గురించి లెక్చర్లు దంచి కొడుతూ ఉంటుంది. క్యారెక్టర్ పరంగా అయినా ఆమెని పద్ధతిగా చూపించి ఉండాల్సింది. ఆమె నటన గురించి మాట్లాడుకోనవసరం లేదనుకోండి. లీడ్ యాక్టర్లే కంట్రోల్ తప్పినపుడు సైడ్ యాక్టర్లేం చేస్తారు. వాళ్లూ హద్దులు దాటేసారు. పాత్రల పరిచయానికి హీరో రామ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
‘రేయ్’ పూర్తిగా నిరాశ పరిచే సినిమా కాదు. అక్కడక్కడా కొంత చెప్పుకోతగ్గ, చూడదగ్గ స్టఫ్ ఉంది. అయితే దానిని లౌడ్ ట్రీట్‌మెంట్ డామినేట్ చేసి మొత్తంగా సినిమాపై ఇంప్రెషన్ తగ్గిపోయేట్టు చేసింది. క్లయిమాక్స్ సాంగ్‌లో సాయి ధరమ్ తేజ్ డాన్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. కానీ అందాకా వేచి చూసే సహనం ఎంత మందికి ఉంటుంది? అనవసరంగా సినిమాని దాదాపు మూడు గంటల పాటు సాగదీసారు. లెక్కకి మించి పాటలు పెట్టేసారు. మ్యూజిక్ బేస్డ్ సినిమా కాబట్టి పాటలు బాగున్నట్టయితే ఫర్వాలేదు. కానీ దురదృష్టవశాత్తూ లేట్ చక్రి నుంచి రేర్ ఫెయిల్యూర్ ఇది.
మసాలా అంశాలు, గ్లామర్ కలిసొచ్చి, మెగా ఫాన్స్ సపోర్ట్‌తో ‘రేయ్’ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గానే స్టార్ట్ అయింది. కానీ పెట్టిందంతా రికవర్ కావాలంటే మాత్రం మిరకిల్ జరగాలి. సినిమా చూడక తప్పదనుకుంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎంత అదుపులో పెట్టుకోగలిగితే అంత తగ్గించేసుకోండి. కాస్త కాటన్ పాకెట్‌లో పెట్టుకుని వెళితే అసౌకర్యాన్ని, శబ్ధ కాలుష్యాన్ని కాసింత నిలువరించే అవకాశముంటుంది.
బోటమ్ లైన్: లిమిట్స్ దాటేసిందిరోయ్!
-గణేష్ రావూరి