Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఎన్టీఆర్ రాజ్య‌మేనా...బాబు రాజ్యం వ‌ద్దా?

ఎన్టీఆర్ రాజ్య‌మేనా...బాబు రాజ్యం వ‌ద్దా?

అత్య‌ధిక కాలం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను పాలించిన ఘ‌న‌త త‌న‌ద‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్పుకుంటుంటారు. బాబు అంటే గిట్ట‌ని వాళ్లు సైతం ఆయ‌న ఎక్కువ కాలం ఏపీని పాలించార‌నే వాస్త‌వాన్ని అంగీక‌రిస్తారు. అయితే త‌న పాల‌న చూసి మ‌రోసారి ఆద‌రించాల‌ని చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లు, ఎల్లో మీడియా య‌జ‌మానులు ఎప్పుడూ చెప్ప‌రు. చెప్పుకోడానికి బ‌ల‌మైన ముద్ర వేసే ప‌థ‌కాలేవీ బాబు పాల‌న‌లో లేవ‌ని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

ఎంత‌సేపూ ఎన్టీఆర్ కాలంలో కిలో బియ్యం రూపాయికే ఇచ్చాం, ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే తీసుకెళ్లేందుకు మండ‌ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చాం, సామాన్యుల‌కు టికెట్లు ఇచ్చి ఆద‌రించామ‌ని చెబుతుంటారు. టీడీపీ పాల‌న అంటే ఎన్టీఆర్ కాలం నాటి గ‌తాన్ని త‌ప్పి, చంద్ర‌బాబును మ‌ర్యాద‌కైనా త‌ల‌చుకోరు. అంతెందుకు, ఇవాళ చంద్ర‌బాబు రాజ‌గురువు ప‌త్రిక "ఈనాడు"లో కార్టూన్‌ను చూస్తే ఏమైనా అర్థం చేసుకోవ‌చ్చు.

ఇవాళ ఎన్టీఆర్ శ‌త జ‌యంతి జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా వేసిన కార్టూన్. "అన్నా! మ‌ళ్లీ నీ రామ‌రాజ్యం కావాల‌న్నా...!" అని సామాన్యుడు ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తూ అంటున్న‌ట్టుగా కార్టూన్ సారాంశం. ఎన్టీఆర్‌ది సంక్షేమ పాల‌న అంటే ఎవ‌రూ కాద‌న‌లేరు. మ‌రి అంద‌రికంటే ఎక్కువ‌గా పాలించాన‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు వేసిన ముద్ర ఏంటి? ఆయ‌న పాల‌న‌లో గుర్తించుకోత‌గ్గ ప‌థ‌కాలు, తీసుకొచ్చిన సంస్క‌ర‌ణలు ఏంట‌నే ప్ర‌శ్న‌కు సమాధానం ఏంటి?

బాబు పాల‌న‌లో కార్పొరేట్ సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం త‌ప్ప‌, సామాన్యుల‌కు ఒరిగిందేమీ లేద‌న్న‌ది టీడీపీ శ్రేణులు సైతం అంగీక‌రించే స‌త్యం. ఎన్టీఆర్ త‌ర్వాత ప్ర‌జ‌లు ఆరాధన‌లు అందుకున్న నాయ‌కుడు దివంగ‌త వైఎస్సార్‌. వైఎస్సార్ అంటే ఆరోగ్య‌శ్రీ‌, విద్యార్థులు చ‌దువుకునేందుకు ఫీజురీఎంబ‌ర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్‌, చిన్నారుల‌కు గుండె ఆప‌రేష‌న్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, గూడులేని వారికి ఇందిర‌మ్మ గృహాలు త‌దిత‌ర ప‌థ‌కాలు గుర్తొస్తాయి.

చంద్ర‌బాబు అంటే బ‌షీర్‌బాగ్‌లో కాల్పులు- ఇద్ద‌రి మృతి, నిడదవోలు కాల్దరి గ్రామంలో రైలు పట్టాలపై ధర్నా చేస్తున్న రైతులపై కాల్పులు జరిపితే ఇద్దరు రైతుల మృతి, పార్టీ ఫిరాయింపులు, వైసీపీ ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం, కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తాన‌ని వంచించ‌డం, రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాన‌ని మోస‌గించ‌డం.... ఇలా ఎన్నైనా చెప్పుకోవ‌చ్చు. అందుకే టీడీపీ బాబు పాల‌న‌ను తీసుకొస్తామ‌ని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌దు కాక వెళ్ల‌దు.

ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటే త‌ప్ప‌, చంద్ర‌బాబుకు రాజ‌కీయ బ‌తుకు లేదు. ఇప్పుడూ , ఎప్పుడూ ఎన్టీఆర్ నామ‌స్మ‌ర‌ణ చేస్తే త‌ప్ప టీడీపీకి జ‌నం వ‌ద్ద‌కు వెళ్ల‌డానికి మొహం చెల్ల‌దు. బాబు రాజ్యం తీసుకొస్తామంటే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌నే భ‌యం టీడీపీని వెంటాడుతోంది. అందుకే రామ‌రాజ్యం తెస్తామంటూ ఎన్టీఆర్ ఫొటోతో షో చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?