Advertisement

Advertisement


Home > Politics - Andhra

విశాఖలో బీసీ వర్సెస్ కమ్మ!

విశాఖలో బీసీ వర్సెస్ కమ్మ!

విశాఖ ఎంపీ సీటులో రసవత్తరమైన పోరుకు తెర లేచింది. టీడీపీ తరఫున మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనవడు బాలయ్య అల్లుడు శ్రీభరత్ కి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయనతో పోటీ పడేందుకు వైసీపీ నుంచి సీనియర్ రాజకీయ నాయకురాలు బీసీ నేత మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి సిద్ధంగా ఉన్నారు.

ఆమె తాను విశాఖ అడపడుచుని అని క్లెయిం చేసుకుంటున్నారు. బీసీలకు విశాఖ ఎంపీ సీటు వైసీపీ ఇచ్చిందని వారిని గెలిపించాలని కోరుతున్నారు. విశాఖ ఎంపీ పరిధిలో బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారంతా వైసీపీ వైపు ఉంటారని ఆ పార్టీ నమ్ముతోంది.

విశాఖ నుంచి నాన్ లోకల్స్ ప్రతీసారీ గెలుస్తున్నారు అని ఈసారి లోకల్ గా ఉన్న బొత్స ఝాన్సీ ని గెలిపించాలని కోరుతున్నారు. విద్యావంతురాలిగా మహిళగా ఆమె ఎంపీగా విశాఖ నుంచి గెలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అంటున్నారు.

టీడీపీ 2019లో సైతం శ్రీభరత్ కే టికెట్ ఇచ్చింది. ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఈసారి గెలిచి చూపిస్తాను అని అంటున్నారు. టీడీపీకి కూటమి మద్దతు ఉంటుంది కాబట్టి ఈసారి పసుపు జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే బీసీ వర్సెస్ కమ్మగా పోటీ ఉందని అంటున్నారు. పార్టీలు వేరు అయినా గత పదిహేనేళ్ళుగా కమ్మలే ఎంపీలుగా గెలుస్తున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ తరఫున కె హరిబాబు గెలిచారు. 2019లో ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అన్నది అంతా గుర్తు చేస్తున్నారు

ఇదే కాకుండా గత నాలుగు దశాబ్దాలుగా ఓసీలే ఇక్కడ నుంచి ఎంపీగా అవుతున్నారు అని అంటున్నారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి, టి సుబ్బరామిరెడ్డి, ఉమా గజపతిరాజు, భాట్టం శ్రీరామమూర్తి ఓసీలుగానే విశాఖ నుంచి ఎంపీలుగా గెలిచారు.

బీసీలు గెలిచి దాదాపుగా అర్ధ శతాబ్దం అవుతోందని అది కూడా ఒక్కసారే అని అంటున్నారు. ఈసారి బీసీలకు చాన్స్ ఇవ్వాలని వైసీపీ అభ్యర్ధనగా ఉంటోంది. సామాజిక సమీకరణలో వైసీపీ ముందుంది. రాజకీయంగా పై చేయి సాధించాలని చూస్తోంది. కూటమి పొత్తులతో ఢీ కొడుతోంది. ఎవరు గెలుస్తారు అన్నదే ఉత్కంఠగా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?