Advertisement

Advertisement


Home > Politics - Andhra

బిజెపి తేల్చేసింది, పవన్‌కు ధైర్యం చాలలేదు!

బిజెపి తేల్చేసింది, పవన్‌కు ధైర్యం చాలలేదు!

పవన్ కళ్యాణ్ ఇష్ట ప్రకారం పొత్తుల గురించి ప్రకటనలు చేస్తే చెల్లుబాటు కాదని ఏపీ బీజేపీ తేల్చేసింది. అవసరమైతే పవన్ కళ్యాణ్‌తో, తుమ్మితే ఊడిపోయే ముక్కు లాగా ఉన్న నామమాత్రపు పొత్తు బంధాన్ని తెంచేసుకోవడానికి తాము సిద్ధమే అని కూడా బిజెపి సంకేతాలు ఇచ్చింది. 

బిజెపితో పవన్ తెగతెంపులు చేసుకుంటారని చాలా కాలంగా అందరూ ఊహిస్తున్నదే. అయినప్పటికీ ఆ విషయంపై ప్రకటన చేయడానికి పవన్ ధైర్యం చేయలేకపోయారు, కానీ బిజెపి ముందుకు వచ్చి సంకేతాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి, టీడీపీకి సమానదూరం పాటించాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం ద్వారా.. తమతో కలిసి ఉండాలో వీడిపోవాలో తేల్చుకోవడం గురించి.. బంతిని పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టేసింది బిజెపి.

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు పల్లకీ మోస్తూ.. ఆయనను అధికారపీఠం దరిజేర్చాలని పవన్ కల్యాణ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, తనతో పాటు బిజెపిని కూడా బోయీగా మార్చి పల్లకీ మోయించాలనేది పవన్ కల్యాణ్ కోరిక. తానుగా అడిగితే వారు బింకం చూపిస్తారేమోనని, పరిస్థితులే అటుదిశగా వస్తాయేమోనని ఆయన ఎదురుచూస్తూ ఉన్నారు. అవసరమైతే బిజెపితో తెగతెంపులు చేసుకుని అయినా.. తాను టీడీపీతో వెళ్లాలనేది ఆయన కోరిక. తన నోటినుంచి ముందుగా పొత్తుభంగం జరగకుండా, వ్యూహాత్మకంగా వెయిట్ చేస్తూ వచ్చారు. కానీ ఇలాంటి చిల్లర వ్యూహాల గురించి బిజెపి పట్టించుకోలేదు. 

ఏపీలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వైసీపీ, టీడీపీలకు సమానదూరం పాటించాలని నిర్ణయించారు. రాష్ట్ర కార్యవర్గ తీర్మానం మేరకే అధిష్ఠానం వ్యవహరించే సాంప్రదాయం బిజెపిలో ఉన్నదిగానీ, నిజానికి, అధిష్టానం ఆలోచనల మేరకే ఈ నిర్ణయం జరిగిందని అనుకోవచ్చు. ఈ నిర్ణయంతో పాటు.. జనసేనతో పొత్తు ఉన్నదని, ఈ విషయం పవన్ స్వయంగా చెప్పారని కూడా సోము వీర్రాజు వెల్లడించారు. ఇది కేవలం పవన్ ముందరికాళ్లకు బంధం వేయడం మాత్రమే. మేం జనసేనతో సఖ్యంగానే ఉన్నాం.. కానీ ఆయనే చంద్రబాబుకోసం మమ్మల్ని వదలుకున్నాడు అనే సంకేతాలను ప్రజల్లో పంపడానికి మాత్రమే ఇది వారికి ఉపయోగపడుతుంది.

భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక్కశాతం ఓటు బ్యాంకు నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని డిసైడ్ చేయడం సాధ్యం కాదు గానీ. పవన్ కల్యాణ్ అనే నిలకడలేని నాయకుడి స్నేహాన్ని వదిలించుకోడానికి వారికిది ఉపయోగపడుతుంది. తమ ఓటుశాతం సొంతంగా ఏమాత్రం పెరుగుతుందో చెక్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది. ఇలా తెగతెంపుల గురించి బిజెపి సంకేతాలు ఇచ్చేసింది.. పవన్ కల్యాణే ఇంకా ఏ సంగతీ తేల్చుకోలేకపోతున్నారు. 

ఇప్పటికీ.. పొత్తుల సంగతి ఎన్నికల వేళ నిర్ణయిస్తాం అంటున్నారు. పవన్ దృష్టిలో ఎన్నికల వేళ అంటే ఎప్పుడు? నామినేషన్ల పర్వం మొదలయ్యాకనా? పోలింగు రోజా? అని జనం నవ్వుకుంటున్నారు!!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?