పూర్తిగా రిటైర్మెంటా? సొంత గూటికి చేరుతారా?

కృష్ణా జిల్లా అవనిగడ్డ టీడీపీ నాయకుడు, మాజీ డిప్యూటీ స్పీకర్, గాంధేయవాదిగా పేరున్న మండలి బుద్ధప్రసాద్ ఏం చేయబోతున్నారు? ఆయన రాజకీయాలకు వీడ్కోలు పలుకుతారా? లేదా ఒకప్పటి తన సొంత గూడైన కాంగ్రెస్ పార్టీలో…

కృష్ణా జిల్లా అవనిగడ్డ టీడీపీ నాయకుడు, మాజీ డిప్యూటీ స్పీకర్, గాంధేయవాదిగా పేరున్న మండలి బుద్ధప్రసాద్ ఏం చేయబోతున్నారు? ఆయన రాజకీయాలకు వీడ్కోలు పలుకుతారా? లేదా ఒకప్పటి తన సొంత గూడైన కాంగ్రెస్ పార్టీలో తిరిగి ప్రవేశిస్తారా? టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో బుద్ధ ప్రసాద్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

బాబు ప్రకటించిన జాబితాలో  తన పేరు లేకపోవడంతో మండలి బుద్ధ ప్రసాద్ నిరాశ చెందారు. తన అసంతృప్తిని సెటైరికల్ గా వెళ్లగక్కారు. తొలి విడత జాబితాలో తన పేరు ప్రకటించనందుకు మహదానందంగా ఉన్నానని అన్నారు. పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛ పొందినట్లు ఉందని అన్నారు.

తన ఆలోచనలు, నమ్మిన సిద్ధాంతాలు ఎలాంటివో కార్యకర్తలు, నాయకులు, అనుచరులకు తెలుసునని అన్నారు. తాను పదవుల కోసం పుట్ట లేదని వ్యాఖ్యానించారు. పదవులు లభించినప్పుడు ప్రజలకు మేలు చేయడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి ప్రయత్నించాను తప్ప ఆ పదవులను అడ్డుపెట్టుకుని దోచుకోలేదు, దాచుకోలేదని పేర్కొన్నారు. 

రాజకీయాలు మన కళ్ల ముందే మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు డబ్బే ప్రధానమై పోయిందని అన్నారు. ఓటరును ఒక కొనుగోలు వస్తువుగా భావిస్తోన్న ప్రస్తుత తరుణంలో రాజకీయాల్లో కొనసాగదలచుకోలేదని అన్నారు.

ధనవంతుల కోసం పార్టీలు అన్వేషిస్తున్న పరిస్థితుల్లో నాబోటి వాడు ఎన్నికల్లో నిలబడాలని భావించడం కూడా సమంజసం కాదని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే కనబడుతోంది. 

కానీ మండలి బుద్ధప్రసాద్ 2016 లోనే కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాలనే ఆలోచన చేశారు. మళ్ళీ ఆ ఆలోచన మొగ్గ తొడుగుతుందా? బుద్ధ ప్రసాద్ టీడీపీలో ఇమడలేకపోయారు. మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆయన తొలి నుంచి కొంత అసంతృప్తిగానే ఉన్నారు.

క్రమంగా అది మరింత తీవ్రమైంది. అప్పుడే ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే ఆలోచనలోనూ ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నాయకులు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్‌ లోనే పెరిగి – వివిధ హోదాల్లో ప‌ద‌వులు నిర్వ‌హించిన మండ‌లి బుద్ద‌ప్ర‌సాద్ అనుకోని రీతిలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు.

ఆయన మంత్రి పదవి ఆశిస్తే డిప్యూటీ స్పీక‌ర్ హోదా దక్కింది. మంత్రి ప‌ద‌విని ఆశించిన‌ మండ‌లికి డిప్యూటీ స్పీక‌ర్‌ తో స‌రిపెట్ట‌డంతో ఆయ‌న ఆరంభం నుంచీ తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. అయితే ఇవేమీ బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త పడ్డారు.  

కాంగ్రెస్‌ లో ఉన్నంత స్వేచ్ఛ‌  తెలుగుదేశం పార్టీలో ఉండ‌వ‌ని ఆయ‌న‌కు స్వ‌ల్ప‌కాలంలోనే తెలిసి వ‌చ్చింది. కానీ ప్ర‌త్యామ్నాయం లేదు. పార్టీని వీడే ముందే అన్నీ ఆలోచించారు. కాంగ్రెస్‌ కు ఇప్ప‌ట్లో పుట్ట‌గ‌తులు ఉండవని అనుకున్నారు. వైసిపిలో చేరే పరిస్థితి లేదు, ఇక మిగిలింది తెలుగుదేశం మాత్ర‌మే. ఆ పార్టీ పిలిచి టిక్కెట్ ఇచ్చిందని, అందుకే వెళ్లాల్సి వచ్చిందని  మండ‌లి స‌న్నిహితుల‌ ద‌గ్గ‌ర ఎన్నోసార్లు పేర్కొన్నారు.

కానీ… కాంగ్రెస్ లోకి మళ్లీ వెళ్లడానికి ఉన్న దారులను ఆయన ఏమాత్రం క్లోజ్ చేసుకునే ఆలోచనతో లేరు. ప్ర‌తిప‌క్షాన్ని గానీ, మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌ ను కానీ ప‌న్నెత్తు మాట అనలేదు. అస‌లు రాజ‌కీయ వాస‌నే లేకుండా ఆయ‌న వ్యవహరించారు. 

భాషా – సాంస్కృతికాంశాలు -స‌న్మాన‌ – స‌త్కార స‌భ‌లకు వెళుతూ కాల‌క్షేపం చేశారు. టీడీపీలో ఆయన అన్యమనస్కంగా ఉండడంతో కాంగ్రెస్ వైపు నుంచి టచ్ లో ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ సంప్రదింపులు మొదలుపెడతారా?