జనసేనలోకి చంద్రబాబు నేతల్ని పంపుతున్నారా?

కోవర్టు రాజకీయాలు, అండర్ కవర్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన వారు ఇప్పటి రాజకీయాల్లో లేనే లేరు. ఇలాంటి తెలివితేటల్లో చంద్రబాబు విశ్వరూపాన్ని పొత్తులు కుదిరిన సమయాల్లో ఇంకా బాగా గమనించవచ్చు. Advertisement తాజాగా…

కోవర్టు రాజకీయాలు, అండర్ కవర్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన వారు ఇప్పటి రాజకీయాల్లో లేనే లేరు. ఇలాంటి తెలివితేటల్లో చంద్రబాబు విశ్వరూపాన్ని పొత్తులు కుదిరిన సమయాల్లో ఇంకా బాగా గమనించవచ్చు.

తాజాగా తెలుగుదేం పార్టీ హయాంలో మంత్రి పదవిని కూడా వెలగబెట్టిన నాయకుడు, తర్వాత వైసీపీలో కొనసాగిన కొత్తపల్లి సుబ్బరాయుడు జనసేనలో చేరడాన్ని గమనిస్తోంటే.. అదే అనిపిస్తోంది. చంద్రబాబునాయుడు సూచన మేరకే ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారనే అనుమానం పలువురికి కలుగుతోంది.

తనకు అత్యంత విశ్వసనీయులైన నాయకుల్ని ఇతర పార్టీల్లోకి పంపి.. ఆ పార్టీల్లో కూడా చక్రం తిప్పడానికి, ఆయా పార్టీల నిర్ణయాల్ని ప్రభావితం చేస్తుండడానికి చంద్రబాబునాయుడు చాలా ఎత్తుగడలు వేస్తుంటారు. అలాంటి ఉద్దేశంతోనే ఆయన 2019 ఎన్నికల తర్వాత.. భాజపాలోకి పలువురు తెలుగుదేశం నాయకుల్ని చొరబెట్టినట్టుగా ప్రచారం ఉంది.

సీఎం రమేష్, సుజనాచౌదరి వంటి నాయకులు బిజెపిలో ఉండడం వల్ల మాత్రమే.. ఆ పార్టీలో ఇప్పటికీ చంద్రబాబుతో పొత్తు సంగతి చర్చనీయాంశంగా ఉంది. పొత్తుకు సానుకూలంగా ఉండే ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. అక్కడ ఉండి చంద్రబాబు తరఫున కోవర్టు ఆపరేషన్లు చేస్తున్నారు. జనసేనలో కూడా అలాంటి కోవర్టు ఆపరేషన్ కోసమే అని చెప్పలేం గానీ.. మొత్తానికి తనకు విధిలేని పరిస్థితుల్లో ఆ పార్టీలోకి నాయకుల్ని ఆయనే పంపుతున్నారా? అని పలువరికి అనుమానం కలుగుతోంది.

కొత్తపల్లి సుబ్బరాయుడు, గతంలో చంద్రబాబు టీంలో కేబినెట్లో పనిచేశారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన హవా ఏమీ అంత గొప్పగా లేదు. అక్కడినుంచి బయటపడి టికెట్ దక్కించుకోవాలనేది ఆయన కోరిక. అయితే.. ఉభయగోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లను జనసేనకు ఇవ్వడానికి సుముఖంగా ఉన్న చంద్రబాబు.. కొత్తపల్లికి కూడా ఆ పార్టీలో చేరాల్సిందిగా డైరక్షన్ చేసినట్టు కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలుగుదేశంలో చేరితే సీటు సర్దుబాటు చేయడం కష్టం అవుతుందని, జనసేనలో చేరితే అక్కడ కూడా నాయకులకు కొరత ఉంది గనుక.. సీటు గ్యారంటీ ఉంటుందని అటు పంపినట్టు తెలుస్తోంది.

ఇలాంటి మాయోపాయాలు చంద్రబాబుకు తొలినుంచి అలవాటే. గతంలో 2014 ఎన్నికల్లో కామినేని శ్రీనివాస్, పవన్ కల్యాణ్ ద్వారా టికెట్ కోసం చంద్రబాబును ఆశ్రయిస్తే.. ఆయనను భాజపాలోకి పంపి, ఆయన కోరుతున్న సీటును భాజపాకు కేటాయించి.. ఆయన గెలిచి రాగానే మంత్రి పదవి కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడు కొత్తపల్లి విషయంలో కూడా జనసేనలో చేరిక వెనక చంద్రబాబు హస్తమున్నదని పలువురు భావిస్తున్నారు.