
తమకు గిట్టని రాజకీయ పార్టీలను బజారుకీడ్చే క్రమంలో ఆ రెండు పత్రికలే వీధిన పడ్డాయి. తమ విశ్వసనీయతను చేజేతులా పోగొట్టుకున్నాయి. పాత ఫొటోలను ప్రచురించి అభాసుపాలు కావడం చర్చనీయాంశమైంది. అది కూడా ముందూ, వెనుకా... తక్కువ రోజుల వ్యవధిలోనే ఈనాడు, సాక్షి పత్రికలు బజారునపడ్డాయి. ఈనాడు పత్రిక తన తప్పునకు కనీసం చింతిస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. తన పాఠకుల విషయంలో సాక్షి కనీసం ఆ విజ్ఞత కూడా ప్రదర్శించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. తప్పును ధైర్యంగా ఒప్పుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో సాక్షి చెప్పాల్సి వుంది.
ఆ మధ్య టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు చితక్కొట్టారు. కోర్టుకు హాజరయ్యే క్రమంలో పట్టాభి తనను పోలీసులు కొట్టారంటూ రెండు చేతులను మీడియా ప్రతినిధులకు, టీడీపీ కార్యకర్తలు, నేతలకు చూపారు. ఈ విషయంలో ఈనాడు పత్రిక అత్యుత్సాహ్యం ప్రదర్శించింది. ఎప్పుడో కొట్టిన దెబ్బలను, ఇప్పుడే జరిగినట్టు ఈనాడు ఫొటోలను ప్రచురించింది. ఆ ఫొటోలు పాతవని, కేవలం జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రచురించారని వైసీపీ గగ్గోలు పెట్టింది. దీంతో ఈనాడు తన పాఠకులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో తప్పు చేయడం సాక్షి పత్రిక వంతు వచ్చింది. ఈ నెల 20న అసెంబ్లీలో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు కొట్టుకున్నారు. అయితే బాధితులం తామంటే తామని వైసీపీ, టీడీపీ నేతలు విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి జగన్ పత్రిక సాక్షి...ఈ నెల 21న స్పీకర్‌పై వికృత చేష్టలు, దాడి... అసెంబ్లీకి బ్లాక్ డే అనే శీర్షికతో వార్త ప్రచురించింది. తమ్మినేని సీతారాంపై పేపర్లు విసురుతూ దాడి చేస్తున్న టీడీపీ సభ్యులంటూ ఒక ఫొటోను ప్రచురించారు.
ఇదే ఫొటోను సాక్షిలో 19వ తేదీ కూడా ప్రచురించడం గమనార్హం. అసెంబ్లీకే రాని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ...స్పీకర్‌పై దాడి చేసిన ఫొటోలో ఉండడమే రచ్చకు దారి తీసింది. ఈ విషయమై టీడీపీ తీవ్ర స్థాయిలో ఎదురు దాడికి దిగింది. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. దీనికి బాధ్యులెవరు? జగన్‌మోహన్‌రెడ్డా? భారతిరెడ్డా? అని ప్రశ్నించారు.
కనీసం ఒకట్రెండు రోజుల ముందునాటి ఫొటోలను కూడా గుర్తించకుండా ప్రచురించి.. సాక్షి పత్రిక అభాసుపాలైంది. ఈ విషయమై సాక్షి కిక్కురమనడం లేదు. రాజకీయ పక్షాల కంటే మీడియా సంస్థలకు పొలిటికల్ ఎజెండాలు ఉండడం వల్లే ఈ తప్పులు దొర్లుతున్నాయి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా