‘అన్నదాత’ మూసేసినా అక్కసు తీరలేదా?

ఈనాడు దినపత్రికకు జగన్మోహన్ రెడ్డి సర్కారు పట్ల అక్కసు తీరలేదు. పోలింగ్ ముందునాటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడిగా చిత్రీకరిస్తూ ఎన్నెన్ని అసహ్యకరమైన, అసత్యాలతో కూడిన కథనాలను వండివార్చారో లెక్కలేదు. చంద్రబాబునాయుడును తక్షణం…

ఈనాడు దినపత్రికకు జగన్మోహన్ రెడ్డి సర్కారు పట్ల అక్కసు తీరలేదు. పోలింగ్ ముందునాటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడిగా చిత్రీకరిస్తూ ఎన్నెన్ని అసహ్యకరమైన, అసత్యాలతో కూడిన కథనాలను వండివార్చారో లెక్కలేదు. చంద్రబాబునాయుడును తక్షణం ముఖ్యమంత్రిని చేసేయాలనే సంకుచితమైన లక్ష్యంతో, ప్రభుత్వం గురించి, విధానాల గురించి, పాలన తీరుతెన్నుల గురించి అసత్యాలను, అర్థసత్యాలను విచ్చలవిడిగా ప్రచారంలో పెట్టారు.

ఒక అబద్ధాన్ని ఈనాడు స్టోరీగా ప్రచురించడం, ఆ వెంటనే తెదేపా పచ్చదళాలన్నీ దాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వం మీద విమర్శలకు దిగడం అనేది ఒక రివాజుగా మారింది. అదేదో చంద్రబాబుకు దాస్యం చేసే బుద్ధి అని అనుకోవచ్చు. కానీ పోలింగ్ ముగిసిపోయిన తర్వాత కూడా వారి పద్ధతి మారడం లేదు. ‘నెలనెలా ప్రచార విజ్ఞానం’ పేరుతో ఒక వార్తను ప్రచురించారు. 
ఆ వార్తలోని సమాచారం ఏంటంటే.. 

వ్యవసాయ, ఉద్యానశాఖల ఆధ్వర్యంలో రైతుభరోసా, పశుసంవర్ధక, మత్స్యశాఖ ల ఆధ్వర్యంలో పశుమత్స్యదర్శిని పత్రికల్ని రూపొందిస్తున్నారు. రైతులతో చందాలు కట్టించుకుని వారికి ఈ పత్రికలు పంపడం అనేది ప్రభుత్వ ఆలోచన. ముద్రణ ఖర్చులకే పత్రిక ధర నిర్ణయించి లాభాపేక్ష లేకుండా వాటిని అమ్ముతున్నారు. రైతులను చందాదారులుగా చేర్పించే బాధ్యతను రైతు భరోసా కేంద్రాల్లోని సహాయకులపై పెడుతున్నారు.. ఆ రకంగా దోచుకుంటున్నారు. ఒత్తిడి చేసి మరీ చందాలు కట్టిస్తున్నారు. చందాదారులకు నేరుగా పంపకుండా మండలకార్యాలయాలకు కట్టలుగా పంపేస్తున్నారు. ఎప్పటికో అవి రైతులకు చేరుతున్నాయి. ఈ రకంగా ప్రభుత్వం దోచుకుంటోంది.. లాంటి రకరకాల ఆరోపణలను ఆ కథనంలో గుప్పించారు.

నిజానికి తాము ఒక ప్రెవేటు వ్యాపార సంస్థగా ఏ రకంగా అయితే ప్రభుత్వాన్ని దోచుకున్నారో.. అదే మోడల్ పనిని లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం చేస్తోంటే ఈనాడు దినపత్రిక సహించలేకపోతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

ఎందుకంటే.. ఇలా రైతులతో గంపగుత్తగా చందాలు కట్టించుకోవడం అనేది.. ఈనాడు గ్రూపు ప్రారంభించిన అయిడియానే. ఈనాడు గ్రూపు అన్నదాత అనే మాసపత్రికను రైతులకోసం నడిపేది. దీనిని తెలుగులో అత్యధిక సర్కులేషన్ ఉన్న మాసపత్రికగా ప్రచారం చేసుకునే వారు. కానీ.. ఆ ‘అత్యధిక’ అనే ట్యాగ్ లైన్ వారికి దక్కిందెలాగ?

జిల్లా వ్యవసాయాధికారుల కార్యాలయాలలోనే ప్రభుత్వం నుంచే జిల్లాలోని అన్ని రైతుసంఘాల పేరుతో చందాలను కట్టించుకునే వారు. ఆ కట్టలను జిల్లా కార్యాలయానికి పంపేసేవారు. ఈనాడు- తెలుగుదేశం ప్రభుత్వానికి ఆత్మీయమైనది గనుక.. జిల్లా అధికార్లు.. జిల్లాలోని అన్ని రైతుసంఘాల పేరిట.. ఒక్క చెక్కుతో వార్షిక చందాలను కట్టేసేవారు. ఆ వేల కాపీలు జిల్లా వ్యవసాయ కార్యాలయాల్లోనే మగ్గుతూ ఉండేవి. అన్నదాత పత్రికను ఇష్టపడి కొనే రైతులు కూడా ఉండేవారు. ఆ సంఖ్య పరిమితం.

ఇలా ప్రభుత్వ కార్యాలయాల్లో బెదిరింపులతో చేర్పించే చందాలే అధికం. ఆ పత్రికలు ఎప్పటికీ ఆ రైతు సంఘాలకు చేరేవే కాదు. ఇలా ఈనాడు గ్రూపు కొన్ని దశాబ్దాల పాటు అన్నదాత ముసుగులో దందా నడిపించింది.

తీరా వారు ఆ పత్రికను నడపడం చేతకాక మూసేశారు కూడా. తాము పత్రికను మూసేసినా సరే.. ప్రభుత్వం రైతులకోసం ఈ రనెండు పత్రికలు నడుపుతుండగా.. చూసి ఓర్వలేకపోతున్నారు. తెలుగుదేశం హయాంలో కూడా ఈ పత్రికలు నడిచినప్పటికీ.. అప్పట్లో అంతా సవ్యంగా నడిచిందిట. ఇప్పుడు మాత్రం దోచుకుంటున్నారట. తాము అన్నదాత నడపడం చేతకాక మూసేసినప్పటికీ.. రైతులకోసం ప్రభుత్వం పనిచేయడాన్ని కూడా సహించలేని ఈనాడు వైఖరిని ప్రజలు ఈసడించుకుంటున్నారు.