
కొందరు నేతలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తుంటారు. అధికారంలో ఉంటే తప్ప సొంత పార్టీని కూడా గుర్తించలేని పరిస్థితి. ఇలాంటి వారిలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చాలా గొప్ప పేరు వుంది. గంటా ఆటలు టీడీపీలో మాత్రమే చెల్లుబాటు అవుతున్నాయి. 2009లో ప్రజారాజ్యం తరపున గెలుపొందారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం పుణ్యమా అని ఆయన కీలక పోస్టు దక్కించుకున్నారు. 2014లో టీడీపీలో చేరారు.
టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి దక్కించుకున్నారు. వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతలపై రాజకీయంగా విరుచుకుపడేవారు. ఐదేళ్లు తిరిగే సరికి... రాజకీయం తలకిందులైంది. టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. అయితే విశాఖలో గంటా మాత్రం గెలుపొందారు. వైసీపీలో చేరాలనే ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదు. టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. తనకు టీడీపీతో ఏ మాత్రం సంబంధం లేదన్నట్టు ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
వైసీపీలో చేరుతారని అనేకసార్లు ముహూర్తాలు కూడా పెట్టారు. కానీ గంటా ఏ పార్టీలో చేరలేదు. ఇప్పుడు ఎన్నికలకు ఏడాది గడువు వుండడంతో మళ్లీ ఆయన యాక్టీవ్ అయ్యారు. టీడీపీ అంటే తానేనన్నట్టు బిల్డప్‌లు ఇస్తున్నారని సొంత పార్టీకి చెందిన నేతలే విమర్శిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు పట్టించుకోకుండా, తన స్వార్థం కోసం గంటా శ్రీనివాసరావు లాంటి స్వార్థపరులు మళ్లీ చంద్రబాబు పంచన చేరుతున్నారని ఇటీవల మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు వార్తల్లో వ్యక్తి అయ్యారు. గతంలో గంటా ఇచ్చిన రాజీనామాను ఆమోదించారని, దీంతో ఆ టీడీపీ ఒక ఓటు కోల్పోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు స్పందించారు. వైసీపీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తన రాజీనామా అంశాన్ని తెరపైకి తెస్తోందన్నారు.
ఓటరు లిస్టు వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించే పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ నామినేషన్ పత్రాలపై ప్రతిపాదిత సంతకం తానే చేశానని గంటా చెప్పుకొచ్చారు. తమ అభ్యర్థి అనురాధ గెలవబోతున్నారని గంటా ధీమా వ్యక్తం చేశారు. అనురాధ తమ అభ్యర్థి అని, ఇదే సందర్భంలో వైసీపీపై గంటా విమర్శలకు టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.
నిన్నమొన్నటి వరకూ టీడీపీతో సంబంధం లేని విధంగా వ్యవహరించిన గంటా ...ఇప్పుడు ఎంతలా మారిపోయాడో అని టీడీపీ నేతలు వెటకరిస్తున్నారు. ఇంతకూ పంచుమర్తి అనురాధ మీ అభ్యర్థి ఎప్పుడైంది సామి అని నెటిజన్లు వెటకరిస్తున్నారు. రాజకీయాల్లో గంటా లాంటి వాళ్లే చెలామణి అవుతున్నారని రాజకీయాలకు అతీతంగా నిరసన కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా