వేమిరెడ్డికి ఏం త‌క్కువ చేశా.. జ‌గ‌న్ ఆవేద‌న‌!

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి పార్టీ వీడాల‌నే నిర్ణ‌యంపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. వేమిరెడ్డికి పార్టీలో స‌ముచిత గౌర‌వం ఇచ్చామ‌ని జ‌గ‌న్…

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి పార్టీ వీడాల‌నే నిర్ణ‌యంపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. వేమిరెడ్డికి పార్టీలో స‌ముచిత గౌర‌వం ఇచ్చామ‌ని జ‌గ‌న్ అన్నార‌ని స‌మాచారం. నెల్లూరు సిటీ అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో అధిష్టానం వైఖ‌రిపై వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి తీవ్ర మ‌నస్తాపం చెందిన సంగతి తెలిసిందే. పార్టీలో త‌న‌కు క‌నీస విలువ కూడా ఇవ్వ‌లేదంటూ పార్టీ మారేందుకు ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు.

వేమిరెడ్డి పార్టీ మారాల‌నే నిర్ణ‌యంపై జ‌గ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది. వేమిరెడ్డికి రాజ్య‌స‌భ ప‌ద‌వి, అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చామ‌ని సీఎం జ‌గ‌న్ గుర్తు చేశారు. రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ముగుస్తుండ‌డంతో నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు నిర్ణ‌యించామ‌ని జ‌గ‌న్ త‌న స‌న్నిహితులతో అన్న‌ట్టు తెలిసింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్‌ను మార్చాల‌నే వేమిరెడ్డి కోరిక మేర‌కే, అక్క‌డి నుంచి త‌ప్పించి న‌ర‌సారావుపేట‌కు తీసుకొచ్చిన‌ట్టు జ‌గ‌న్ అన్నార‌ని స‌మాచారం.

నెల్లూరు సిటీ అభ్య‌ర్థిగా ఎవ‌రినైనా పెట్టుకోండ‌ని వేమిరెడ్డి సూచ‌న మేర‌కే, డిప్యూటీ మేయ‌ర్ ఖ‌లీల్‌ను ఎంపిక చేసిన‌ట్టు సీఎం వెల్ల‌డించార‌ని ఆయ‌న స‌న్నిహితులు తెలిపారు. వేమిరెడ్డి భార్య ప్ర‌శాంతిరెడ్డికి రెండుసార్లు టీటీడీ బోర్డులో చోటు క‌ల్పించామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. అలాగే ఢిల్లీలో స్థానిక సలహా మండలి ఛైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నియ‌మించి స్వామి సేవ‌కు అవ‌కాశం క‌ల్పించామ‌ని జ‌గ‌న్ గుర్తు చేసిన‌ట్టు చెబుతున్నారు.

ఇన్ని చేసినా పార్టీ మారుతానంటే, ఎలా అర్థం చేసుకోవాల‌ని జ‌గ‌న్ ప్ర‌శ్న. వైసీపీకి వేమిరెడ్డి చేసిన సేవ కంటే ఎక్కువే ఆయ‌న‌తో పాటు ప్ర‌శాంతిరెడ్డికి ప‌ద‌వులు ఇచ్చిన విష‌యాన్ని పార్టీ పెద్ద‌లు గుర్తు చేస్తున్నారు. వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు చంద్ర‌బాబుతో అన్నీ మాట్లాడుకుని, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నార‌ని వారు మండిప‌డుతున్నారు.