Advertisement

Advertisement


Home > Politics - Andhra

కుప్పంలో చంద్ర‌బాబు ఎదురీత‌!

కుప్పంలో చంద్ర‌బాబు ఎదురీత‌!

తెలుగుదేశం పార్టీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఎదురీదుతున్నార‌నే టాక్ వినిపిస్తూ ఉంది. త‌న రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఎర‌గ‌ని రీతిలో చంద్ర‌బాబు నాయుడు ఈ సారి క‌నీసం ఎమ్మెల్యేగా గెల‌వ‌డానికి పాట్లు పడుతున్నారు. ఇప్ప‌టికే కుప్పంలో ప‌రాజ‌య భ‌యంతో చంద్ర‌బాబు ఆ నియోజ‌క‌వ‌ర్గం చుట్టూరా తిరుగుతున్నారు. గ‌త రెండేళ్ల నుంచి చంద్ర‌బాబులో ఈ భ‌యం బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. కుప్పంలో చంద్ర‌బాబును ఓడించ‌డ‌మే ల‌క్ష్య‌మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టిచ‌డంతో చంద్ర‌బాబు న‌ష్ట‌నివార‌ణ‌కు దిగారు. గ‌త ఎన్నిక‌ల్లోనే చంద్ర‌బాబు కు కుప్పంలో చాలా వ‌ర‌కూ మెజారిటీ త‌గ్గింది. ముఖ్య‌మంత్రి హోదాలో ఎన్నిక‌ల‌కు వెళితేనే చంద్ర‌బాబుకు మెజారిటీ త‌గ్గిపోయింది.

పేరుకు త‌న‌ది నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం అని, త‌ను మూడు ప‌ర్యాయ‌ల సీఎం అని, మ‌రో మూడు ప‌ర్యాయాలు త‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌నంటూ చంద్ర‌బాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు. ఇక కుప్పం ఎమ్మెల్యేగా కూడా ఆయ‌న ద‌శాబ్దాల నుంచి వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నారు. అయితే కుప్పం గ‌తిని చంద్ర‌బాబు నాయుడు మార్చింది ఏమీ లేదు! ఇదే చంద్ర‌బాబు పాలిట శ‌ర‌ఘాతంగా మారుతోంది. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్క‌డ పాగా వేసింది. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థులు పోటీలో ఉన్నా కుప్పం ప‌రిధిలో టీడీపీ ప‌రువు ద‌క్క‌లేదు.

చంద్ర‌బాబును ఓడిస్తే తెలుగుదేశం పార్టీ ప‌త‌నం పూర్త‌వుతుంద‌నే రీతిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్క‌డ ప‌ని చేస్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు కుప్పానికి ప్ర‌చారానికి కూడా వెళ్లారు. త‌ను గ‌తంలో కుప్పంలో పోటీ చేసిన‌ప్పుడెప్పుడూ చంద్ర‌బాబు నాయుడు అక్క‌డ ప్ర‌చారానికి వెళ్ల‌లేదు. నామినేష‌న్ ప‌త్రాల‌ను కూడా చంద్ర‌బాబు త‌ర‌ఫున ఎవ‌రో ఒక‌రు ఇచ్చేసి ఆయ‌న‌ను గెలిపించే వారు. అయితే ఇప్ప‌డంత సీన్ లేద‌ని స్ప‌ష్టం అవుతోంది.

చంద్ర‌బాబు నాయుడు ఈ ఎన్నిక‌ల ప్ర‌చారాన్నే కుప్పం నుంచి ప్రారంభించారు! కుప్పంలో చంద్రబాబు గెలుపు కోసం నారా భువ‌నేశ్వరి ప్ర‌చారానికి దిగారు! చంద్ర‌బాబు కూడా కుప్పంలో మ‌ళ్లీమ‌ళ్లీ ప్ర‌చారానికి వెళ్లి త‌న గెలుపు కోసం ప్రయ‌త్నించ‌నున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇలా కుప్పం చంద్ర‌బాబును క‌ల‌వ‌ర‌పెట్ట‌డానికి కార‌ణం.. అక్క‌డ ఎదురుగాలి గ‌ట్టిగా ఉంద‌నే అనే టాక్ వ‌స్తోంది. చంద్ర‌బాబును కుప్పంలో ఓడిస్తామ‌నే ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. గ్రౌండ్ రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయి.

చంద్ర‌బాబు కుప్పం నుంచి పోటీ చేయర‌నే ప్ర‌చారం కూడా ఒక ద‌శ‌లో జ‌రిగింది. అయితే చంద్ర‌బాబు కుప్పంలో పోటీకి వెనుకాడితే అది రాష్ట్ర‌వ్యాప్తంగా టీడీపీని నిరాశ ప‌రుస్తుంద‌నే లెక్క‌ల‌తో మాత్ర‌మే చంద్ర‌బాబు అక్క‌డ పోటీకి దిగారు. త‌ను కుప్పం నుంచి నిల‌బ‌డ‌టం ఇదే చివ‌రి సారి అని, ఈ సారి త‌న గెలుపుకు స‌హ‌క‌రిస్తే నెక్ట్స్ టికెట్ మీకే అంటూ కూడా ఒక‌రిద్ద‌రు స్థానిక నేత‌ల‌ను చంద్ర‌బాబు నాయుడు ఈ ఎన్నిక‌ల బ‌రిలో ఉప‌యోగించుకుంటూ ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలా చంద్ర‌బాబు త‌న మార్కు తెలివితేట‌ల‌న్నింటినీ వాడుకుంటూ గ‌ట్టెక్కే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టున్నారు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?