Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌గ‌న్, చంద్ర‌బాబు.. ప్ర‌చారంలో ప్ర‌ధాన తేడా!

జ‌గ‌న్, చంద్ర‌బాబు.. ప్ర‌చారంలో ప్ర‌ధాన తేడా!

ముఖ్య‌మంత్రిగా వ‌ర‌స‌గా రెండోసారి అవ‌కాశం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్ మోహ‌న్ రెడ్డి ప్ర‌చారంలో ఉన్నారు. ముఖ్య‌మంత్రిగా త‌న‌కు ఇంకో అవ‌కాశం కావాలంటూ తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే మూడు ద‌ఫాలుగా ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు నాయుడు ఒక ద‌శ‌లో త‌న‌కు ఇవి చివ‌రి ఎన్నిక‌లంటూ ప్ర‌క‌ట‌న చేసి, ఆ త‌ర్వాత మాట మార్చారు! అయితే ఆయ‌న త‌న‌కు ఇవే చివ‌రి ఎన్నిక‌లు అని చెప్పుకున్నా, చెప్పుకోపోయినా ప్ర‌జలు దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌చ్చు కూడా!

మ‌రి ఇన్ని సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ప్ర‌చారం లో ఎక్క‌డా త‌న‌కు మ‌రోసారి అవ‌కాశం ఇస్తే త‌ను గ‌తంలో సాగించిన పాల‌నను తెస్తానంటూ చెప్ప‌లేక‌పోతూ ఉండ‌టం గ‌మ‌నార్హం. త‌న‌ది న‌ల‌భై యేళ్ల అనుభ‌వం అని నిత్యం చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడు త‌న పాత అనుభ‌వాల ఆధారంగా ఇంకోసారి ఏపీని పాలిస్తానంటూ చెప్ప‌డం లేదు!

జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను మ‌ళ్లీ తెస్తానంటూ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించ‌డం లేదు! నీరు చెట్టు పేరెత్త‌డం లేదు! తోఫాలు, పండ‌గ కానుక‌లు ఇస్తానంటూ చెప్ప‌డం లేదు.. ఇదంతా చంద్ర‌బాబు మార్కు పాల‌న‌! జ‌న్మ‌భూమి క‌మిటీలంటూ గ‌తంలో చంద్ర‌బాబు ప‌చ్చ చొక్కాల‌కు జేబులు నింపే ప‌ని చేప‌ట్టారు. ప్ర‌తిదానికీ జ‌న్మ‌భూమి క‌మిటీ ఆమోద‌ముద్ర ఉండాలంటూ ప్ర‌జ‌ల‌పై వారిని వ‌దిలాడు. వారేమో అయిన కాడికి ప్ర‌జ‌ల నుంచి వ‌సూళ్లు చేశారు. అర్హ‌త క‌లిగిన వారికి పెన్ష‌న్ ఇవ్వాలంటే ఒక రేటు, అర్హ‌త లేకున్నా పెన్షన్ కావాలంటే ఇంకో రేటు, రేష‌న్ కార్డుకు ఒక రేటు, ఇంకోదానికి ఇంకో రేటు.. ఇలా జన్మ‌భూమి క‌మిటీలు ఒక ర‌కంగా స‌మాంత‌ర పాల‌న చేశాయి. టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఆ క‌మిటీల్లో స‌భ్యుల‌యిపోయి అయిన కాడికి దోచుకున్నారు!

మ‌రి అలాంటి అవ‌కాశాన్ని వారికి మ‌రోసారి ఇస్తానంటూ చంద్ర‌బాబు నాయుడు చెప్ప‌డం లేదు. అయితే చంద్ర‌బాబు కొడుకు లోకేష్ మాత్రం.. మ‌న‌కు కావాల్సిన వాళ్ల‌కే వ‌లంటీర్లు ఏం ప‌ని అయినా చేసి పెడ‌తారంటూ బాహాటంగా ప్ర‌చారం చేస్తున్నారు! జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను తిరిగి తెచ్చి ప్ర‌జ‌ల‌ను కాల్చుకుతింటానంటూ చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు చెప్ప‌డం లేదు! అలాగే నీరు చెట్టు వంటి ప‌థ‌కాల‌ను పెట్టి ప‌చ్చ‌చొక్కాల జేబులు నింపే ప‌థ‌కాల‌నూ చెప్ప‌డం లేదు! ఇవ‌న్నీ చెప్ప‌కుండా జ‌గ‌న్ ప‌థ‌కాల‌నే త‌ను కొన‌సాగిస్తానంటూ చంద్ర‌బాబు చెప్పుకుంటున్నారు!

జ‌గ‌న్ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌నే కొన‌సాగిస్తామంటూ చెప్పుకుంటున్నారు. జ‌గ‌న్ సంక్షేమ ప‌థకాల‌కు మించి ఇస్తామంటూ ఆయ‌న చెప్పుకుంటూ తిరుగుతున్నారు. జ‌గ‌న్ ఐదు రూపాయ‌లు ఇస్తుంటే త‌ను 15 రూపాయ‌లు ఇస్తానంటూ చంద్ర‌బాబు చెప్పుకుంటున్నారు. జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల‌నే జ‌నాలు సోమ‌రులు అయిపోతున్నార‌ని, ఏపీ శ్రీలంక అయిపోతోదంటూ చంద్ర‌బాబు వీరాభిమానులు వాదిస్తుంటారు. అయితే జ‌గన్ ప‌థ‌కాల‌కు మూడు రెట్లు ఎక్కువ‌గా చంద్ర‌బాబు సంక్షేమ హామీలు ఇస్తున్నారు! మ‌రి వాటితో ఏపీ ప‌రిస్థితి ఏమ‌వుతుందో చంద్ర‌బాబు వీరాభిమానులే చెప్పాలి!

ఇక చంద్ర‌బాబు తీరులా కాకుండా.. జ‌గ‌న్ ప్ర‌చార భేరీలో ఒక‌టే మాట వినిపిస్తోంది. తన గ‌త ఐదేళ్ల పాల‌న‌లో మీకు మేలు జ‌రిగి ఉంటేనే త‌న‌కు ఓటేయాల‌ని, లేక‌పోతే వ‌ద్ద‌ని జ‌గ‌న్ సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నాడు. ఇలా ప్ర‌జ‌ల‌తో జ‌గ‌న్ డైరెక్టు క‌మ్యూనికేష‌న్ చేస్తున్నాడు. త‌న పాల‌న న‌చ్చి ఉంటేనే ఓటేయాలని, లేదంటే వ‌ద్ద‌ని ధీమాగా జ‌గ‌న్ చెప్ప‌గ‌లుగుతున్నాడు. చంద్ర‌బాబు ఏదో ప్ర‌జ‌ల‌ను మోస‌పుచ్చి అయినా అధికారం అందుకోవాల‌నే త‌న‌దైన న‌క్క తెలివితేట‌లు చూపిస్తుంటే జ‌గ‌న్ మాత్రం ప్ర‌జ‌ల విజ్ఞ‌త‌కు వ‌దిలేస్తున్నాడు. ఇదీ ఈ ఎన్నిక‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థుల ప్ర‌చారంలో ప్ర‌ధాన‌మైన తేడా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?