టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే!

అధికారం కోల్పోయిన వైసీపీని వీడేందుకు కొంద‌రు నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి వైఎస్సార్ జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున్‌రెడ్డి పార్టీని వీడ‌డానికి రెడీ అయ్యిన‌ట్టు స‌మాచారం.…

అధికారం కోల్పోయిన వైసీపీని వీడేందుకు కొంద‌రు నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి వైఎస్సార్ జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున్‌రెడ్డి పార్టీని వీడ‌డానికి రెడీ అయ్యిన‌ట్టు స‌మాచారం. సిటింగ్ ఎమ్మెల్యే అయిన మేడా మ‌ల్లికార్జున్‌రెడ్డికి వైఎస్ జ‌గ‌న్ టికెట్ ఇచ్చేందుకు నిరాక‌రించారు. మేడా త‌మ్ముడు ర‌ఘునాథ‌రెడ్డికి జ‌గ‌న్ రాజ్య‌స‌భ సీటు ఇచ్చారు. అందుకే మ‌ల్లికార్జున్‌రెడ్డికి టికెట్ ఇవ్వ‌కుండా , క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ ఆకేపాటి అమ‌ర్‌నాథ‌రెడ్డికి రాజంపేట టికెట్ ఇచ్చారు.

దీంతో మేడా మ‌ల్లికార్జున్‌రెడ్డి మ‌న‌స్తాపం చెందారు. ఎన్నిక‌ల్లో వైసీపీకి ఆయ‌న దూరంగా ఉన్నారు. టీడీపీకి మ‌ద్ద‌తు ప‌లికారు. ఎన్నికల్లో కూట‌మి అధికారాన్ని ద‌క్కించుకోవ‌డంతో మేడా మ‌ల్లికార్జున్‌రెడ్డిలో హుషారొచ్చింది. తాజాగా కాబోయే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, అలాగే జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ  మేడా మ‌ల్లికార్జున్‌రెడ్డి పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.  

దీంతో మేడా మ‌ల్లికార్జున్‌రెడ్డి త్వ‌ర‌లో టీడీపీలో చేరుతార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. 2014లో ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో టీడీపీ త‌ర‌పున  గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా మేడా మ‌ల్లికార్జున్‌రెడ్డి గుర్తింపు పొందారు. అయితే 2019 ఎన్నిక‌ల నాటికి వైసీపీలో మేడా బ్ర‌ద‌ర్స్ చేరారు. మ‌ళ్లీ ఐదేళ్లు తిరిగే స‌రికి 2024లో టీడీపీలో చేర‌డానికి మేడా సిద్ధ‌మ‌య్యారు. రానున్న రోజుల్లో ఇంకెంత మంది పార్టీ మారుతారో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది