Advertisement

Advertisement


Home > Politics - Andhra

ప‌శ్చిమ రాయ‌ల‌సీమలో ఏమ‌వుతోంది...వైసీపీ పెద్ద‌ల్లో టెన్ష‌న్‌!

ప‌శ్చిమ రాయ‌ల‌సీమలో ఏమ‌వుతోంది...వైసీపీ పెద్ద‌ల్లో టెన్ష‌న్‌!

ప‌శ్చిమ రాయ‌ల‌సీమ‌లో ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అనూహ్యమైన పోటీ ఇస్తోంది. ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ప‌రిధిలోకి క‌డ‌ప‌, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాలు వ‌స్తాయి. ఇక్క‌డి నుంచి టీడీపీ త‌ర‌పున పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి, వైసీపీ త‌ర‌పున వెన్న‌పూస ర‌వీంద్రారెడ్డి బ‌రిలో నిలిచారు. పీడీఎఫ్ అభ్య‌ర్థి పి.నాగ‌రాజు, ఇత‌రులు పోటీలో ఉన్న‌ప్ప‌టికీ పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మ‌ధ్యే.

అస‌లు త‌మ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అని వైసీపీ అతి విశ్వాసంతో ఉండింది. తీరా కౌంటింగ్ మొద‌లైన త‌ర్వాత ఓట‌ర్ల తీర్పుతో అధికార పార్టీకి ముచ్చెమ‌టలు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే తూర్పురాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థులు దూసుకుపోతున్నారు. ప‌శ్చిమ రాయ‌ల‌సీమ‌లో మాత్రం ఐదో రౌండ్ పూర్త‌య్యే స‌రికి మొత్తం 1,20,041 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. వీటిలో చెల్ల‌ని ఓట్లు 9,287. చెల్లిన ఓట్ల‌లో వైసీపీ అభ్య‌ర్థి వెన్న‌పూస ర‌వీంద్రారెడ్డికి 47,087, టీడీపీ అభ్య‌ర్థి రాంగోపాల్‌రెడ్డికి 45,111 ఓట్లు వ‌చ్చాయి. కేవ‌లం 1976 ఓట్ల ఆధిక్య‌త‌లో మాత్ర‌మే వైసీపీ అభ్య‌ర్థి కొన‌సాగుతున్నారు.  

ఈ ఫ‌లితాన్ని చూసి వైసీపీ పెద్ద‌లు షాక్‌కు గురి అవుతున్నారు. ఎందుకంటే క‌నీసం ఈ స్థానాన్ని గెలుచుకుంటే గౌర‌వంగా వుంటుంద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. ఎందుకంటే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సొంత జిల్లా క‌డ‌ప కూడా ఇందులోకే వ‌స్తుంది. ఈ మూడు జిల్లాల్లో గ‌మ‌నిస్తే... కేవ‌లం అనంత‌పురం జిల్లాలోని ఉర‌వ‌కొండ‌, హిందూపురంల‌లో మాత్ర‌మే టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన 36 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా వైసీపీకి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్య‌మంత్రి, న‌లుగురు మంత్రులు కూడా ప‌శ్చిమ రాయ‌ల‌సీమ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్నారు. అలాంటి చోట వైసీపీ ఓటర్ల‌కు ఎన్నో తాయిలాలు ఇచ్చిన‌ప్ప‌టికీ త‌గిన ఫ‌లితాన్ని రాబ‌ట్టుకోలేక‌పోవ‌డ‌మే గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి ఓట‌రు చాలా స్ప‌ష్టంగా సీఎం జ‌గ‌న్ వ్య‌తిరేక‌త వైపే నిల‌బ‌డేందుకు ప్ర‌య‌త్నించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొద‌టి ప్రాధాన్యంలో వైసీపీకి స్వ‌ల్ప ఆధిక్య‌త వ‌చ్చిన‌ప్ప‌టికీ, రెండో ప్రాధాన్యంలో త‌ప్ప‌క తాము గెలిచి తీరుతామ‌ని టీడీపీ నేత‌లు ధీమాగా చెబుతున్నారు.

రెండో ప్రాధాన్యం ఓట్లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అధికార పార్టీకి ప‌డే అవ‌కాశాలు లేవ‌ని వారు అంటున్నారు. ఇదిలా వుండ‌గా ఈ ఫ‌లితంపై వైసీపీ నేత‌లు లెక్క‌లు వేస్తున్నారు. గెలుపు అవ‌కాశాల‌పై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. సీఎం జ‌గ‌న్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఓడిపోతే, వాటి నెగెటివ్ సంకేతాలు ప్ర‌జ‌ల‌పై బ‌లంగా ప‌డుతాయ‌ని వైసీపీ పెద్ద‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అందుకే ఈ స్థానం ఫ‌లితంపై వైసీపీ ఎంతో ఆందోళ‌న చెందుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?