Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఫలితం తారుమారు కావాలంటే ఒక్కడు చాలు!

ఫలితం తారుమారు కావాలంటే ఒక్కడు చాలు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నెంబర్ గేమ్ 154-21 దగ్గర ఆగిపోయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నెంబర్ గేమ్ చాలా కీలకం కానుంది. అంకెల లెక్కలుచూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నట్టు లెక్క. కానీ.. ఫలితాలు తారుమారు కావడానికి ఒక్కడు చాలు! ఆ ఆశతోనే తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికను ఎదుర్కోబోతోంది. కానీ.. వాళ్ల ఆశ నెరవేరడం అంత ఈజీ కాదనేది పరిశీలకుల అభిప్రాయం.

వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్న 151కి తోడు, జనసేన, తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి వారికి అండగా నిలుస్తున్న అయిదుగురి బలం ఉంది. తమ సొంత ఎమ్మెల్యేలు ఇద్దరు మొహం చాటేస్తుండగా.. వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోకపోయినా సరే.. 154 ఎమ్మెల్యేల బలం అవుతుంది. ఖచ్చితంగా ఇది 7 గురు ఎమ్మెల్సీలను గెలిపించుకోవడానికి సరిపోయే బలం. అందుకే ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి 22 మంది వంతున కేటాయించేసి వారితో క్యాంపులు నిర్వహిస్తున్నారు. మాక్ పోలింగ్ తర్వాత వారిలో కొందరికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలా కాదు. వారికి బయటకు చెప్పుకోగలిగేలా ఉన్నది కేవలం 19 మంది బలం మాత్రమే. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరూ తమకు ఓటు వేసినా కూడా.. ఆ బలం 21 వరకు వెళుతుంది. వైసీపీ నుంచి మూడో వ్యక్తి ఒక్కడు రహస్యంగా తమకు మద్దతు ఇస్తే తప్ప వారు నెగ్గడం అసాధ్యం. కానీ.. అధికారంలో ఉన్న వైసీపీ ని కాదనుకుని.. తెలుగుదేశానికి ‘రహస్యంగా’ ఓటు వేసి, తన గోతిని తానే తవ్వుకునేంతటి మూర్ఖుడు ఎవరైనా ఉంటారా అనేది అనుమానం.  

రహస్య ఓటింగ్ గనుక.. ఏం చేసినా నడిచిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. వైసీపీ ఏడుగురిలో ఒక్కొక్కరికి 22 మంది వంతున కేటాయించిన తరువాత.. ఏ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఒక ఓటు తగ్గినా.. ఆ 22 పేర్లను స్కాన్ చేసి.. సొంత పార్టీకి ద్రోహం తలపెట్టింది ఎవరో చిటికెలో కనిపెట్టేయగలరు. ఆ సంగతి తెలిసి కూడా ప్రమాదం కొని తెచ్చుకునే వారు ఎవరుంటారు?

వైసీపీ పరువు పోవాలన్నా, తెలుగుదేశం మరోసారి కాలర్ ఎగరేసి వైసీపీ మీద పైచేయి సాధించేశాం అని సంబరపడిపోవాలన్నా.. ‘‘ఒక్కడు చాలు’’ అనే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ ఒక్కడిని సంపాదించుకోవడం సులువుకాదు. 

అయితే ఇక్కడ మరోసంగతి గమనించాలి. వైసీపీ ఎమ్మెల్యే తెలుగుదేశానికి ఓటు వేస్తే మాత్రమే ఫలితం తారుమారు అవుతుంది. అదే చెల్లని ఓటు వేసినంత మాత్రాన నష్టం లేదు. తెలుగుదేశానికి 21 ఓట్లు వచ్చిన తర్వాత.. ఒక్కటంటే ఒక్కటి కూడా సెకండ్ ప్రయారిటీ ఓటు వచ్చే చాన్స్ లేదు. 

అదే సమయంలో.. వైసీపీ వారిలో ఎవరైనా చెల్లని ఓటు వేయడం వల్ల.. ఎవరికైనా 21 ఓట్లు వస్తే.. మిగిలిన ఎమ్మెల్యేలు వేసే సెకండ్ ప్రయారిటీ ఓట్లు వారిని ఆదుకుంటాయి. ఆ రకంగా చూసినప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏడుస్థానాలను గెలుచుకునే అవకాశమేఎక్కువగా కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?