స‌స్పెన్స్‌కు తెర‌దించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

తాను పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎట్ట‌కేల‌కు తెర‌దించారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నుంచే మ‌రోసారి పోటీ చేస్తాన‌ని, స‌హ‌క‌రించాల‌ని టీడీపీ నేత‌ల‌కు ఆయ‌న విన్న‌వించడం విశేషం. ఇవాళ ఆయ‌న భీమ‌వ‌రానికి వెళ్లారు.…

తాను పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎట్ట‌కేల‌కు తెర‌దించారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నుంచే మ‌రోసారి పోటీ చేస్తాన‌ని, స‌హ‌క‌రించాల‌ని టీడీపీ నేత‌ల‌కు ఆయ‌న విన్న‌వించడం విశేషం. ఇవాళ ఆయ‌న భీమ‌వ‌రానికి వెళ్లారు. నేరుగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీ అధ్య‌క్షురాలు, భీమ‌వ‌రం ఇన్‌చార్జ్ అయిన తోట సీతారామ‌ల‌క్ష్మి నివాసానికి వెళ్లారు. అప్ప‌టికే పాల‌కొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు అక్క‌డ ఉన్నారు.

మ‌రోసారి భీమ‌వ‌రం నుంచి పోటీ చేయాల‌నే త‌న ఆలోచ‌న‌ను వారితో పంచుకున్నారు. స‌హ‌క‌రించాల‌ని అభ్య‌ర్థించారు. ఇందుకు వారంతా అంగీకారం తెలిపారు. అనంత‌రం ఆయ‌న టీడీపీ నాయ‌కుడు, గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన పులిప‌ర్తి ఆంజనేయులు అలియాస్ చిట్టిబాబు నివాసానికి వెళ్లారు. భీమ‌వ‌రంలో త‌న పోటీపై ఆయ‌న‌కు వివ‌రించి మ‌ద్ద‌తు కోరారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ భీమ‌వ‌రం నుంచి పోటీ చేసే విష‌య‌మై మీడియాకు టీడీపీ నేత‌లు స‌మాచారం ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ముక్కోణ‌పు పోటీలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను వైసీపీ అభ్య‌ర్థి గ్రంధి శ్రీ‌నివాస్ మ‌ట్టి క‌రిపించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి చేతిలో 8 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి రామాంజ‌నేయుల‌కు 54 వేల ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం. ఓట్ల చీలిక‌తోనే తాను ఓడిపోయాన‌ని ప‌వ‌న్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు.  

ఈ ద‌ఫా మాత్రం అలా జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఆయ‌న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. భీమ‌వ‌రంలో జ‌న‌సేన జెండా ఎగుర వేసేందుకు ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా వెళుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ఓట్ల బ‌దిలీకి ఇబ్బంది లేకుండా అంద‌రినీ క‌లుపుకుని వెళ్లేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు.

భీమ‌వ‌రంలో తాను పోటీ చేస్తాన‌ని, మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని చాలా కాలం క్రిత‌మే చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌ను కోరారు. వాళ్లిద్ద‌రి అంగీకారంతో భీమ‌వ‌రంలో టీడీపీ నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు ద‌క్కుతుంద‌ని ప‌వ‌న్ న‌మ్ముతున్నారు. భీమ‌వ‌రంలో మాత్ర‌మే త‌న గెలుపు గ్యారెంటీ అని ఆయ‌న విశ్వాసం. ప‌వ‌న్‌పై వైసీపీ ఎలాంటి వ్యూహం ర‌చిస్తుందో చూడాలి.