ప‌వ‌ర్‌లో ప‌వ‌న్‌కు షేర్‌.. హోంమంత్రి అయితేనే?

అధికారంలో భాగం కావాల‌ని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మొద‌టి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ముందు అధికారంలోకి వ‌స్తే, ఆ త‌ర్వాత భాగం గురించి ఆలోచించొచ్చ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెబుతూ వ‌చ్చారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే తాను త‌క్కువ…

అధికారంలో భాగం కావాల‌ని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మొద‌టి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ముందు అధికారంలోకి వ‌స్తే, ఆ త‌ర్వాత భాగం గురించి ఆలోచించొచ్చ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెబుతూ వ‌చ్చారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే తాను త‌క్కువ సీట్లు తీసుకుని, కాస్త త‌గ్గి, ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి ప్ర‌ధాన కార‌కుడ‌య్యాడ‌ని ప‌వ‌న్‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. అధికారం విష‌య‌మై త‌న‌కు వ్యామోహం లేద‌ని ప‌వ‌న్ మొద‌టి నుంచి చెబుతూ వ‌స్తున్నారు.

ఈ నేప‌థ్యంలో కూట‌మి ఘ‌న విజ‌యం సాధించ‌డం, మ‌రో రెండు రోజుల్లో ప్ర‌మాణ స్వీకారం చేస్తుండ‌డంతో స‌హ‌జంగానే ప‌ద‌వుల‌పై విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. అధికారాల‌న్నీ చంద్ర‌బాబు త‌న చేత‌ల్లోనే పెట్టుకుని, జ‌న‌సేన‌ను డ‌మ్మీ చేస్తార‌నే ప్ర‌చారం లేక‌పోలేదు. ఈ ప్ర‌చారం నిజ‌మ‌వుతుందా? లేక ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కు స్వేచ్ఛ ఇస్తారా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కొత్త‌గా ఏర్ప‌డ‌నున్న ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం అంటే కీల‌క ప‌ద‌వుల‌ను ద‌క్కించుకోవ‌డ‌మే అని జ‌న‌సేన నాయ‌కులు అంటున్నారు.

ప్ర‌ధానంగా హోంమంత్రిత్వ శాఖ‌ను ప‌వ‌న్‌కు ఇవ్వాల‌ని జ‌న‌సేన నాయ‌కులు కోరుకుంటున్నారు. అప్పుడే ప‌వ‌న్ శ్ర‌మకు గౌర‌వం ఇచ్చిన‌ట్టుగా జ‌న‌సేన భావిస్తుంది. త‌న‌కు ఇచ్చిన 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాల్లో జ‌న‌సేన గెలుపొంది, గ‌ర్వంగా త‌లెత్తుకుంది. తాము పోటీ చేసింది త‌క్కువ సీట్లే అయిన‌ప్ప‌టికీ, వంద శాతం స‌క్సెస్ సాధించామ‌ని, కావున తామేమీ త‌క్కువ కాద‌నే భావ‌న జ‌న‌సేన‌లో బ‌లంగా వుంది.

ఇప్పుడు అధికారంలో గౌర‌వ ప్ర‌ద‌మైన భాగ‌స్వామ్యం ఇస్తేనే, భ‌విష్య‌త్‌లో ఐక్యంగా ముందుకు సాగే ప‌రిస్థితులుంటాయ‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. ఒక‌వేళ ప‌వ‌న్‌ను లేదా జ‌న‌సేన‌ను త‌క్కువ చేసి చూస్తున్నార‌నే అభిప్రాయం క‌లిగితే, రాజ‌కీయంగా రానున్న రోజుల్లో న‌ష్టం వ‌స్తుంద‌ని జ‌న‌సేన నాయ‌కులు హెచ్చ‌రిస్తున్నారు.

కావున ప‌వ‌న్‌కు హోంశాఖ ఇస్తేనే, బాబుతో స‌మానంగా అధికారంలో భాగ‌స్వామ్యం క‌ల్పించిన‌ట్టు అవుతుంద‌నే జ‌న‌సేన కోరిక ఏ మేర‌కు నెర‌వేరుతుందో చూడాలి. అయితే జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌ను ఉన్న‌తంగా చూడాల‌నే వారి కోరిక‌ను త‌ప్పు ప‌ట్ట‌లేం. ఎందుకంటే, ఇవాళ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిందంటే… ప‌వ‌న్ చ‌లువే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.