ప్ర‌తీకారం తీర్చుకోడానికి ర‌ఘురామ త‌హ‌త‌హ‌

ప్ర‌తీకారం తీర్చుకోడానికి ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఈ స‌మ‌యం కోసం ఆయ‌న కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడాయ‌న మామూలు ప్ర‌జాప్ర‌తినిధి కాదు. అధికార పార్టీలో కీల‌క‌మైన వ్య‌క్తి. ర‌ఘురామ‌కు చాలా…

ప్ర‌తీకారం తీర్చుకోడానికి ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఈ స‌మ‌యం కోసం ఆయ‌న కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడాయ‌న మామూలు ప్ర‌జాప్ర‌తినిధి కాదు. అధికార పార్టీలో కీల‌క‌మైన వ్య‌క్తి. ర‌ఘురామ‌కు చాలా ప‌లుకుబ‌డి వుంది. ప్ర‌తీకారం తీర్చుకోడానికి ఇంత‌కంటే మంచి త‌రుణం రాద‌ని ఆయ‌న గ‌ట్టిగా అనుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌న‌ను హింసించిన కొంత మంది అధికారులు, రాజ‌కీయ నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ గుంటూరు ఎస్పీ తుషార్ డూడీకి ఫిర్యాదు చేయ‌డం విశేషం. గ‌తంలో త‌న‌పై సీఐడీ అధికారులు తీవ్ర‌స్థాయిలో భౌతిక‌దాడికి పాల్ప‌డ్డారంటూ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై దాడికి పాల్ప‌డిన సీఐడీ అధికారుల అంతు తేల్చాలంటూ గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ ఆయ‌న ఫిర్యాదులు చేసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.

ఇప్పుడు రాష్ట్రంలోనూ, అలాగే కేంద్రంలోనూ అధికారం ఆయ‌న‌దే. ఇప్పుడైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సీఐడీ కార్యాల‌యంలోని పోలీస్ క‌స్ట‌డీలో త‌న‌ను హింసించార‌ని, హ‌త్యాయ‌త్నం చేశార‌ని, ఇందుకు బాధ్యులైన సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌, ఐజీ సీతారామాంజ‌నేయులు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, నాటి సీఐడీ ఏఎస్పీ విజ‌య్‌పాల్‌, గుంటూరు జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ ప్ర‌భావ‌తిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గుంటూరు ఎస్పీకి మెయిల్‌లో చేసిన ఫిర్యాదులో కోరారు.  

ర‌ఘురామ‌కృష్ణంరాజు కోరిక మ‌న్నించి ప్ర‌భుత్వం వారిపై ఏ మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తీకారంపై దృష్టి సారిస్తే, ప్ర‌జ‌ల్లో సానుభూతి వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేదు. చంద్ర‌బాబు త‌న వ‌ర‌కూ క‌క్ష తీర్చుకోడానికే ప‌రిమితం అవుతారే త‌ప్ప‌, అంద‌రి ప్రతీకారాలు తీర్చుకోడానికి అనుమ‌తి ఇస్తారా? అనేదే ప్ర‌శ్న‌. అయితే తాను కోరుకున్న‌ట్టు జ‌ర‌గ‌క‌పోతే ర‌ఘురామ ఊరికే ఉండ‌ర‌నే అంశాన్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వుంటుంది.